ముసుగు దొంగ

funday crime story - Sakshi

క్రైమ్‌ స్టోరీ

‘‘వారం రోజుల్లో మూడో దాడి ఇది. మణికంఠ అపార్ట్‌మెంట్స్‌లో ఆ ముసుగుదొంగ ఆగడాలకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. మరిలా చేతులు ముడుచుకొని కూర్చుంటే వాడింకా రెచ్చిపోతాడు. వెంటనే ఇద్దరు కానిస్టేబుల్స్, ఇద్దరు హోంగార్డ్స్‌తో ఒక టీమ్‌ను ఏర్పాటు చేసి, షిఫ్ట్‌ డ్యూటీలు వేసి నాకు రిపోర్ట్‌ చేయండి’’ ఏదో చెప్పబోతున్న ఎస్సై రంజిత్‌ మాటలను కట్‌చేస్తూ ఫోన్‌ కాల్‌ ముగించాడు డీఎస్పీ సాబ్జాన్‌. ఎస్సై రంజిత్‌ బరువుగా నిట్టూర్చాడు. తమ స్టేషన్లో ఉండేదే ఎనిమిది మంది కానిస్టేబుళ్లూ, ఆరుగురు గార్డులు. ఇప్పటికే విచారణలో ఉన్న కేసుల దర్యాప్తునకు, వీఐపీల భద్రతకు, నైట్‌ పెట్రోలింగ్‌కు ఇప్పుడున్న సిబ్బందే సరిపోవడంలేదు. ఇప్పుడు నలుగురిని అపార్ట్‌మెంట్‌ గస్తీకి వినియోగిస్తే, తమ రోజువారీ పనులకు మిగిలిన సిబ్బంది ఏ మూలకూ చాలరు. రంజిత్‌ డ్రైవర్‌ రసూల్‌ను కేకేసి, జీపులో పార్థా హాస్పిటల్స్‌కు మరో కానిస్టేబుల్‌ను తీసుకొని బయలుదేరాడు. వారం క్రితం ముసుగుదొంగ మొదటిసారి రాత్రి పదిగంటలకు అపార్ట్‌మెంట్‌ థర్డ్‌ఫ్లోర్‌లో దాడి చేసింది లక్ష్మీదేవిపైనే. యాభై ఏళ్ల లక్ష్మీదేవిపై నిజానికి ముసుగుదొంగ దాడి చేయనే లేదు. కత్తితో తన మీదికి దురుసుగా ముసుగుదొంగ దాడి చేయబోతుండగా.. అసలే హైబీపీ పేషెంటైన లక్ష్మీదేవి విపరీతంగా భయపడి స్పృహ తప్పింది. అప్పటి నుంచి ఆమెను హాస్పిటల్‌లో ఉంచారు కుటుంబసభ్యులు. మొదట్లో ఆమెను కలుసుకోవడానికి వెళ్లిన ఎస్సై రంజిత్‌కు డాక్టర్ల అనుమతి లభించలేదు. ఆమెకింక బీపీ రీడింగ్‌ ఎక్కువగా ఉందనీ, ఈ సమయంలో ఆమెను విచారించడం మంచిది కాదని డాక్టర్లు చెప్పడంతో వెనుదిరిగాడు రంజిత్‌. లక్ష్మీదేవి మెడలోని అయిదు తులాల గొలుసు మాయమైంది.

కానీ లక్ష్మీదేవిని హాస్పిటల్లో చేర్పించే హడావుడిలో అసలు పోలీస్‌ కంప్లెయింటే ఇవ్వలేదామె ఫ్యామిలీ మెంబర్స్‌. ముసుగుదొంగ దాడుల గురించి రెండోసారి సాఫ్ట్‌వేర్‌ ఎంప్లాయ్‌ లావణ్యపై దాడి జరిగాకే, అపార్ట్‌మెంట్‌ సెక్రెటరీ, లావణ్య కొలీగ్‌ జాస్మిన్‌ పోలీస్‌ కంప్లెయింట్‌ ఇచ్చారు. సెకండ్‌ షిఫ్ట్‌లో పని చేసి, క్యాబ్‌లో రాత్రి ఒంటిగంటకు అపార్ట్‌మెంట్‌ చేరుకుంది లావణ్య. ఫోర్త్‌ ఫ్లోర్‌లోని అపార్ట్‌మెంట్‌కు లిఫ్ట్‌ పని చేయకపోవడంతో మెట్లెక్కి వెళ్తోంది. ఇంతలో నల్లటి ముసుగూ, చేతులకు గ్లౌజ్‌ ఉన్న ముసుగువ్యక్తి ఆమెపై కత్తితో దాడికి యత్నించి ఆమె హ్యాండ్‌బ్యాగ్‌ లాక్కొనే ప్రయత్నం చేశాడు. ఆమె ప్రతిఘటిస్తూ కేకలు పెట్టేసరికి ఆ దొంగ కత్తితో ఆమె పొట్టలో పొడిచాడు. ఆమె కేకలు విని, అపార్ట్‌మెంట్‌ వాచ్‌మన్‌ గంగులు పరుగెత్తుకొని వచ్చేసరికే హ్యాండ్‌బ్యాగ్‌తో ముసుగుదొంగ మాయమయ్యాడు. మరుసటిరోజు అపార్ట్‌మెంట్‌ పక్కన ఉన్న ముళ్లపొదల్లో లావణ్య బ్యాగ్‌ దొరికింది. కానీ అందులో ఉన్న ఆమె జీతం డబ్బు నలభైరెండు వేలు మాయమయ్యాయి. అదృష్టవశాత్తు ఆ గాయం బలంగా తగల్లేదు. హాస్పిటల్‌లో లావణ్య కోలుకుంటోంది.అపార్ట్‌మెంట్‌ సెక్రెటరీ రామకృష్ట, లావణ్య కొలీగ్‌ జాస్మిన్‌ పోలీస్‌ స్టేషన్లో కంప్లెయింట్‌ ఇచ్చినప్పుడు మినిస్టర్‌గారి బందోబస్తులో ఉన్న రంజిత్‌ ఊళ్లో లేకుండా అయింది. అతను ఊరికి తిరిగొచ్చేలోపు మూడో దాడి కూడా జరిగిపోయింది.

సెకండ్‌షో చూసొచ్చిన ఫస్ట్‌ఫ్లోర్‌లో ఉండే బ్యాంక్‌ ఉద్యోగి రవిచంద్ర తన బైక్‌ను పార్కింగ్‌ స్లాట్‌లో పార్క్‌ చేస్తూ ఉండగా ముసుగు వ్యక్తి దాడి చేశాడు. వాచ్‌మన్‌ గంగులు ఊళ్లో లేకపోవడం అతనికి కలిసొచ్చింది. ఏమరుపాటులో ఉన్న రవిచంద్ర ముసుగుదొంగ కత్తిపోటుకు గురయ్యాడు. రవిచంద్ర ఛాతీపై బలంగా కత్తిపోటు తగలడంతో పెద్దగా అరిచి స్పృహ కోల్పోయాడు. క్షణాల్లో అతని జేబులోని పర్సును తీసుకొని ముసుగు వ్యక్తి మాయమయ్యాడు. అతని అరుపులు విని జనం పోగయ్యేలోపే ముసుగుదొంగ చల్లగా జారుకున్నాడు. ముసుగు వ్యక్తి అపార్ట్‌మెంట్‌లోని వ్యక్తే. బయటి వ్యక్తి ఎవరూ క్షణాల్లో తప్పించుకునే అవకాశం లేదు. ఆ విషయంలో ఎవరికీ సందేహం లేదు. కానీ ఆ వ్యక్తి ఎవరు? దాదాపు అయిదున్నర అడుగుల ఎత్తున్న వ్యక్తులు నలభై ఫ్లాట్లు గల అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌లో చాలామందే ఉన్నారు. వారిలో ముసుగుదొంగ ఎవరన్నదే మిలియన్‌ డాలర్స్‌ క్వశ్చన్‌..! కేవలం చోరీల కోసమే ఈ దాడులు జరుగుతున్నాయా లేక మనుషుల ప్రాణాలు తీయడం ముసుగుదొంగ ఉద్దేశ్యమా? ఎందుకీ దాడులు జరుగుతున్నాయి? లావణ్యతో మాట్లాడాక రంజిత్‌కు ఓ అనుమానం వచ్చింది. కానీ అది ఎంత మాత్రం నిజం? ఎస్సై రంజిత్‌ ఆలోచిస్తూ పార్థా హాస్పిటల్‌కు చేరుకున్నాడు. హాస్పిటల్‌కు రమ్మని హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకటస్వామికి, కుర్ర కానిస్టేబుల్‌ ఆనంద్‌కు ఫోన్‌ చేశాడు. డాక్టర్ల అనుమతి తీసుకొని ట్రామావార్డులో చికిత్స తీసుకుంటున్న లక్ష్మీదేవి, ఇన్‌పేషెంట్‌గా ఉన్న ఏసీ గదిలోకి అడుగుపెట్టారు. కేవలం రెండు నిమిషాలు మాత్రమే పేషెంట్‌తో మాట్లాడడానికి అతనికి అనుమతినిచ్చారు డాక్టర్లు. నర్సు కూడా ఎస్సైతోపాటు వచ్చి, గదిలో లక్ష్మీదేవి కొడుకుతో పాటు ఉంది. రెండు నిమిషాలు ఆమెతో మాట్లాడి గది బయటకు వచ్చాడు రంజిత్‌. తనతో వచ్చిన కానిస్టేబుల్‌ కుమార్‌కు ఓ పని పురమాయించి పంపించేశాడు రంజిత్‌. అప్పుడే ఆనంద్‌ యాక్టివా బైక్‌లో వెంకటస్వామితోపాటు హాస్పిటల్‌కు చేరుకున్నాడు. తర్వాత జీపులో రంజిత్, బైక్‌పై వీరిద్దరూ మణికంఠ అపార్ట్‌మెంట్స్‌కు బయలుదేరారు.

రంజిత్‌ వచ్చే విషయం ముందే ఫోన్‌ చేసి చెప్పడంతో అపార్ట్‌మెంట్‌ సెక్రెటరీ రామకృష్ణ, రిటైర్డ్‌ ఉద్యోగులు శంకర్రావు, జాకబ్‌ గ్రౌండ్‌ఫ్లోర్‌లో వేచి ఉన్నారు. కాసేపు వారితో మాట్లాడి అపార్ట్‌మెంట్‌లోని వివిధ ఫ్లోర్లలోని ఇళ్లవారితో మాట్లాడి సమాచారం స్వీకరించమని రంజిత్‌ తన సిబ్బందికి చెప్పాడు. తానూ కొన్ని ఫ్లాట్స్‌లోని ఫ్యామిలీస్‌తో మాట్లాడాడు. కానీ రంజిత్‌కు ఎలాంటి క్లూ దొరకలేదు.ఒక గంట తర్వాత పార్కింగ్‌ పక్కనే ఉన్న షటిల్‌ కోర్టు వద్ద సమావేశమయ్యారు వారు. అప్పటికే అక్కడ మరొక ఏడెనిమిది మంది గుమిగూడి ఉన్నారు. అందరినీ దూరంగా ఉండమని కానిస్టేబుల్స్‌తో మాట్లాడాడు రంజిత్‌. ‘‘సార్, లక్ష్మీదేవికి, ఫోర్త్‌ఫ్లోర్‌లో ఉండే సువర్చలకు బొత్తిగా పడదంట. సువర్చల కొడుకు జీవన్‌ ఈ దాడులన్నీ చేస్తూ ఉండవచ్చని ఒకరిద్దరు చెప్పారు. జీవన్‌ ఇదివరకే కొన్నినెలలు ఆ లావణ్య వెంటపడి వేధించాడట. ఆమె పోలీసులకు కంప్లెయింట్‌ చేస్తానని బెదిరించడంతో ఆమెను వేధించడం మానుకున్నాడట. ఈ విషయం లావణ్యతో పాటు తన ఫ్లాట్‌లోనే ఉండే ఆమె కొలీగ్‌ జాస్మిన్‌ చెప్పింది’’ అన్నాడు ఆనంద్‌.

‘‘మరి రవిచంద్రపై దాడి ఎందుకు జరిగింది?’’ నవ్వుతూ అడిగాడు రంజిత్‌.‘‘డబ్బు కోసం అయ్యుండొచ్చు సార్‌. ఆ జీవన్‌ నిరుద్యోగట’’ అన్నాడు హెడ్‌కానిస్టేబుల్‌ వెంకటస్వామి.రంజిత్‌ తల విదిలించాడు. ఇదివరకే జాస్మిన్‌ ఈ విషయం అతనికి స్టేషన్లో కంప్లెయింట్‌ చేయడానికి వచ్చినప్పుడు చెప్పింది. వెంటనే జీవన్‌ను ఫాలో కమ్మని కొందరు కానిస్టేబుల్స్‌ను పురమాయించాడు రంజిత్‌. లావణ్య, లక్ష్మీదేవీలపై దాడులు జరిగినప్పుడు అసలు జీవన్‌ ఊళ్లోనే లేడు. బ్యాంక్‌ కోచింగ్‌ కోసం నంద్యాలకు వెళ్లాడట. అతని ఫ్రెండ్స్‌ ఎవరికీ ఈ దాడులకు సంబంధం ఉందని తేలలేదు.అపార్ట్‌మెంట్‌ సెక్రెటరీ రామకృష్ణను పిలిపించి మాట్లాడాడు రంజిత్‌ క్యాజువల్‌గా.‘‘సార్, కొందరు పనీపాటా లేనివారు అన్ని ఫ్లాట్లూ తిరిగి కబుర్లు చెప్పి వస్తుంటారు. వారిలో రిటైర్డ్‌ మేజర్‌ రాందాసు ఒకడు. రోజంతా అందరిళ్లూ తిరిగి హస్కు కొట్టడం, సాయంత్రం అయిదింటి నుంచి క్లబ్‌లో పేకాట, క్యారమ్స్‌ ఆడటం, రాత్రి ఎనిమిదింటి నుంచి అదేపనిగా మందుకొట్టి, ఏ అర్ధరాత్రో పడుకోవడం అతనికి అలవాటు. అతనికీ దాడికేమైనా సంబంధముందేమో’’ అన్నాడు రామకృష్ణ.రాందాసును పిలిపించి మాట్లాడాడు. ఎప్పుడూ అతనితో పాటు తోకలా ఉండే సెకండ్‌ఫ్లోర్‌లోని వినయ్‌ కూడా వచ్చాడు. డిగ్రీ ఫెయిలై బామ్మకు తోడుగా అపార్ట్‌మెంట్లో ఉంటున్నాడతను. రాందాసు మాటతీరు రంజిత్‌కు అనుమానాస్పదంగా లేదు.

రంజిత్‌ తల విదిలించాడు. ‘‘ఈ దర్యాప్తులో తల తిరిగిపోతోంది. కాసేపు షటిల్‌ ఆడుదాం’’ అన్నాడు. వెంటనే వినయ్‌ పరుగున క్లబ్‌రూంలోకి వెళ్లి షటిల్‌ బ్యాట్లు, కాక్‌ తీసుకొచ్చాడు. కాసేపు షటిల్‌ ఆడారు.
ముఖానికి పట్టిన చెమటను కర్చీఫ్‌తో తుడుచుకున్నాడు రంజిత్‌. గేమ్‌ బాగా ఆడిన వినయ్‌కు అదే హ్యాండ్‌తో షేక్‌హ్యాండిచ్చి బయలుదేరాడు జీపులో. అతను స్టేషన్‌కు చేరుకున్న గంట తర్వాత కానిస్టేబుల్‌ కుమార్‌ స్టేషన్‌కు చేరుకొని తాను కనుగొన్న విషయాన్ని చెప్పాడు రంజిత్‌కు. వెంటనే జీపులో కుమార్‌తోపాటు బయలుదేరి మణికంఠ అపార్ట్‌మెంట్స్‌కు చేరుకొని వినయ్‌ని అరెస్ట్‌ చేశాడు రంజిత్‌. రామకృష్ణ, రాందాసుతో పాటు మిగిలిన వారంతా ఆ ముసుగుదొంగ వినయే అని తెలుసుకొని షాక్‌కు గురయ్యారు. పోలీసు విచారణలో వినయ్‌ తానే ముసుగుదొంగనని ఒప్పుకున్నాడు. ‘‘రోజూ రాందాసుతోపాటు తిరుగుతూ పేకాట, తాగుడుకు అలవాటు పడ్డాడు వినయ్‌. రాందాసు కట్టడి చేయడంతో మందు దొరకలేదు అతనికి. దాంతో బామ్మ గొలుసును చమన్‌లాల్‌ కొట్టులో తాకట్టు పెట్టి లక్షరూపాయలు తీసుకొని పేకాటకు, బార్లకు ఖర్చుపెట్టేశాడు. బామ్మ తన గొలుసు విషయంలో నిలదీసి, వాళ్ల నాన్నకు చెబుతాననడంతో భయపడిపోయాడు. బామ్మ రాత్రి తొమ్మిదింటికి నిద్రపోగానే, ఫ్లాట్‌కు తాళం వేసి ముసుగుదొంగ అవతారమెత్తేవాడు. అలా దోపిడీ చేసి సంపాదించిన సొమ్ముతో గొలుసును తాకట్టు నుంచి విడిపించాడు. చేతులకు గ్లౌజ్‌ వేసుకోవడంతో వేలిముద్రలు ఎక్కడా దొరకలేదు. కానీ పొదల్లో దొరికిన లావణ్య బ్యాగ్‌పై ఫింగర్‌ప్రింట్స్, నేను షేక్‌హ్యాండ్‌ ఇచ్చినప్పుడు నా కర్చీఫ్‌పై పడ్డ వేలిముద్రలు మ్యాచ్‌ అయ్యాయి. అలాగే లక్ష్మీదేవి ముసుగుదొంగ తన కత్తిని ఎడమ చేత్తో పట్టుకున్నాడని చెప్పింది. లావణ్యకు, రవిచంద్రకు కుడివైపే గాయాలయ్యాయి. షటిల్‌ ఆడడానికి కూడా వినయ్‌ తన ఎడమచేతినే వాడాడు’’ చెప్పాడు రంజిత్‌.
రాచపూటి రమేష్‌ 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top