నిజమైన ఆస్తి

funday childrens story - Sakshi

పిల్లల కథ

పమిడిపాడులో వెంకటనారాయణ మోతుబరి రైతు. ఆయనకి చాలా పొలం ఉంది. పండ్ల తోటలు, ఎద్దులు, గేదెలు ఉన్నాయి. ఓ ట్రాక్టర్‌ కూడా ఉంది. పెద్ద భవంతి, అందులో ఎంతోమంది పనివాళ్లు.ఆయన మంచివ్యక్తి కూడా. గర్వం లేదు. ఎవరికైనా సహాయపడే స్వభావం ఆయనది. ఆయనకి ఒక్కడే కొడుకు. పేరు అజయ్‌. ఊళ్లో ఉన్న ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు.తండ్రి అందరితో ఎంత మంచిగా ఉంటాడో.. కొడుకు అందుకు విరుద్ధం. విపరీతమైన పొగరు, అహంకారం. బాగా స్థితిమంతులమనీ, ఊళ్లో తన తండ్రి పెద్ద మోతుబరి అనీ అతనికి మహాగర్వం. సుధీర్‌ కూడాఅతనితో పాటే చదువుతున్నాడు. సుధీర్‌ నాన్న సుబ్బన్న. ఆయన వెంకటనారాయణ దగ్గర పాలేరుగా పనిచేస్తున్నాడు. చిన్నతనం నుంచే వెంకటనారాయణ వాళ్ల ఇంట్లో పాలేరుగా చేరాడు. సుబ్బన్న భార్య కూడా వెంకటనారాయణ పొలంలో పనికి పోతుంది.అజయ్, సుధీర్‌ ఒకే తరగతి అయినా ఇద్దరి మధ్య స్నేహం తక్కువ. అజయ్‌ చదువులో సగటు విద్యార్థి. సుధీర్‌ మంచి తెలివితేటలు గలవాడు. చదువులో అద్భుతమైన ప్రతిభ కనబరిచేవాడు. అతని తెలివికీ, చురుకుదనానికీ, చదువు మీద చూపే శ్రద్ధకీ ఉపాధ్యాయులు సైతం విస్మయం చెందేవాళ్లు. సుధీర్‌కి చదువు మీద గల ఆసక్తినీ. తపననీ గమనించి ప్రోత్సహించడంతో పాటు ప్రత్యేకంగా ప్రశంసించే వాళ్లు.సుధీర్‌ కేవలం చదువులోనేకాదు, ఆటపాటల్లోనూ చురుకే! పైగా స్నేహశీలి. దాంతో తరగతిలో పిల్లలు సుధీర్‌ అంటే ఇష్టంగాను, అభిమానంగాను ఉండేవాళ్లు. అతనికి అందరూ స్నేహితులే.

ఇది అజయ్‌ సహించలేకపోయాడు. ఉపాధ్యాయులు మెచ్చుకోవడం, పిల్లలు కూడా సుధీర్‌తో స్నేహంగా ఉండటం అజయ్‌కి నచ్చేది కాదు. సుధీర్‌ మీద బాగా ద్వేషం ఏర్పరచుకున్నాడు. సుధీర్‌ని అవమానించడానికి, కించపరచడానికి ప్రయత్నించేవాడు. ‘‘నువ్వు మా పాలేరు కొడుకువి. మేం కూలీ ఇస్తేనే మీరు బతుకుతున్నారు. మీ కుటుంబాన్ని పోషించేది మేమే! ఏదో పెద్ద చదువుతున్నానని మిడిసిపడుతున్నావు! పోజు కొడుతున్నావు! ఆఫ్ట్రాల్‌.. నువ్వెంత? మా జెర్సీ ఆవుదూడ ఖరీదు చేయవు! గుర్తుపెట్టుకో. నువ్వు ఎంత చదివినా నాతో ఎప్పటికీ సమంకాలేవు!’’ అంటూ మాట్లాడేవాడు.సుధీర్‌ క్షణం బాధపడినా, అతని మాటలు పట్టించుకునేవాడు కాదు. అది అజయ్‌ని ఇంకా రెచ్చగొట్టేటట్లు చేసేది. ఇంకా హేళన చేయడం ఎక్కువ చేశాడు. ఒకరోజు సుధీర్‌ అమ్మకీ, నాన్నకీ అజయ్‌ అంటున్న మాటలు చెప్పాడు.‘‘పోనీలే నాన్నా..! ఆ అబ్బాయి పెద్దవాడు ఏం కాదు. తెలిసీ తెలియని పిల్లవాడు. నువ్వు పట్టించుకోవద్దు. మనం పేదోళ్లం! వాళ్లు మన ఆసాములు! మనకి రెక్కాడితే కానీ డొక్కాడదు. నాకు తెలివొచ్చిన దగ్గరి నుంచి వాళ్లింట్లోనే పని చేస్తున్నాను. వాళ్ల అమ్మానాన్న ఎంతో మంచివాళ్లు. మాట పడ్డవాడెప్పుడూ చెడ్డవాడు కాదు. నోరు జారినోడే చెడ్డవాడవుతాడు. నీ పాటికి నువ్వు శ్రద్ధగా చదువుకో!’’ అని తల్లిదండ్రులిద్దరూ సుధీర్‌ను సముదాయించారు.

సుధీర్‌ ఎప్పుడైనా నాన్న కోసం వాళ్లింటికి వెళ్తే, అజయ్‌ అమ్మానాన్న తనని ఎంతో ఆదరంగా పలకరించేవారు. ఆప్యాయంగా, ప్రేమగా మాట్లాడేవారు. తినడానికి వద్దనే కొద్దీ ఏవో పెట్టేవారు.అజయ్‌ మాత్రం సుధీర్‌ని తిడుతూనే ఉండేవాడు.ఇద్దరూ పదో తరగతి పరీక్షలు రాశారు. 582 మార్కులతో సుధీర్‌ జిల్లాలో ద్వితీయ స్థానం సాధించాడు. అజయ్‌కి 420 మార్కులు వచ్చాయి.జిల్లా మొత్తం మీద ద్వితీయ స్థానం సాధించి స్కూల్‌కీ, ఊరుకీ మంచిపేరు తెచ్చినందుకు సుధీర్‌ని ఉపాధ్యాయులు, ఊళ్లోవాళ్లు అభినందనలతో ముంచెత్తారు.అజయ్‌ నాన్న వెంకటనారాయణ టౌన్‌కి వెళ్లి, తన కొడుకుతోపాటు సుధీర్‌కి కూడా మంచి బట్టలు కొనుక్కొచ్చి బహుమతిగా ఇచ్చాడు.పెద్ద కార్పొరేట్‌ కాలేజీ వాళ్లు సుధీర్‌ ఇంటికి వచ్చారు. హాస్టల్‌ వసతి కల్పించి, ఇంటర్‌ పూర్తిగా ఉచితంగా చెబుతామని సుధీర్‌ని తీసుకుపోయారు.ఇంటర్‌లో కూడా సుధీర్‌ మంచి ప్రతిభ కనబరిచాడు. మంచి మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు.అజయ్‌ సగటు మార్కులతో ఇంటర్‌ పాసయ్యాడు. సుధీర్‌ ఐఐటీలో మంచి ర్యాంక్‌ రావడంతో దేశంలో ఉన్న ప్రతిష్టాత్మక సంస్థలో ఇంజనీరింగ్‌ పూర్తి చేశాడు. గ్రూప్స్‌వైపుకు మనసు మళ్లడంతో గ్రూప్స్‌కి ప్రిపేరయ్యాడు. ఆ తర్వాత గ్రూప్స్‌ రాసి, ఆర్డీవోగా ఎంపికయ్యాడు.

అజయ్‌ డిగ్రీ పూర్తి చేశాడు. ఉద్యోగంపై ఆసక్తి లేక వ్యవసాయ రంగంలోకి దిగాడు.ముందు వేరే జిల్లాల్లో ఆర్డీవోగా చేసిన సుధీర్, కొంత కాలానికే స్వంత జిల్లాకి సబ్‌ కలెక్టర్‌గా వచ్చాడు.అజయ్‌కి వ్యవసాయంలో అనుభవం లేక, వాతావరణం అనుకూలించక, పంటలు సరిగా పండక కష్టాలపాలయ్యాడు. సుధీర్‌ ఉన్నతస్థాయికి చేరుకోగా, ఆస్తి చూసుకొని హేళనగా మాట్లాడిన అజయ్‌ పరిస్థితి ఇప్పుడంతగా బాగోలేదు.తమ ఊరి సుబ్బన్న కొడుకు సబ్‌ కలెక్టర్‌గా రావడంతో ఊరిజనం ఆనందించారు.సర్పంచ్, ఊరి పెద్దలు, అజయ్‌ అందరూ సుధీర్‌ దగ్గరికి వెళ్లారు.ఊళ్లో సన్మానం చేస్తామని ఎందరు ముందుకొచ్చినా.. సుధీర్‌ తనకలాంటివి ఇష్టం ఉండవని సున్నితంగా తిరస్కరించాడు.తను ఇంటికి విందుకు రావాల్సిందిగా సుధీర్‌ని ఆహ్వానించాడు అజయ్‌. సుధీర్‌ అంగీకరించాడు.‘‘చిన్నతనంలో నేను నిన్ను ఏమైనా బాధపెట్టి ఉంటే, నన్ను క్షమించు సుధీర్‌’’ అని హృదయపూర్వకంగా అన్నాడు అజయ్‌.‘‘చిన్నతనంలో ఎన్నో అనుకుంటాం. ఎన్నో జరుగుతుంటాయి. అది తెలియనితనం. అలాంటివన్నీ గుర్తుపెట్టుకుంటామా? మీ అమ్మానాన్న నా మీద చూపెట్టిన ఆదరణ, ఆప్యాయత, అభిమానం మాత్రమే నాకు గుర్తున్నాయి. మిగతావేమీ గుర్తులేవు!’’ అన్నాడు సుధీర్‌.తమకు ఎంత ఆస్తి ఉన్నా సుధీర్‌ ముందు అంతా తీసికట్టు అనిపించింది అజయ్‌కి.డబ్బూ, పొలాలు ఆస్తి కావనీ, చదువు మాత్రమే నిజమైన ఆస్తి అని బోధపడింది.
- మొలకలపల్లి కోటేశ్వరరావు 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top