అసలైన ప్రేమకు ఆది దంపతులు
పురానీతి
పిలవని పేరంటానికి పుట్టినింటికి వెళ్లి, పరాభవాన్ని పొందిన సతీదేవి, యోగాగ్నిలో తనను తాను దహించుకుని పోయి, మరుజన్మలో పర్వతరాజుకు పార్వతిగా పుట్టింది. పరమేశ్వరుని గురించి విని, పెళ్లంటూ చేసుకుంటే ఆయన్నే చేసుకుంటానని పట్టుబట్టింది. ఆయన తపస్సు చేసుకుంటున్నాడని తెలుసుకుని, ఆయన దినచర్యను గమనించింది. ఆయనను అనుక్షణం కనిపెట్టుకుని ఉండి ఆయనకు ఎప్పుడు ఏది అవసరమో, ఆ సమయానికి వాటన్నింటినీ సమకూర్చడం ఆరంభించింది.
పార్వతీ పరమేశ్వరులకు కల్యాణం కావడమే లక్ష్యంగా గల మన్మథుడు అది గమనించాడు. అదను చూసి తన పూలబాణాలను శంకరుని మీద సంధించాడు. శివునికి తపోభంగమైంది. మన్మథుణ్ణి చూసి ఆగ్రహంతో మూడోకన్ను తెరిచాడు. ఆగ్రహంతో చూశాడు. అంతే! మన్మథుడు మాడి మసి అయాడు. ఆ తర్వాత తనకు సేవలు చేస్తున్న పార్వతిని ప్రసన్నంగా చూసి, వరం కోరుకోమన్నాడు. తనను వివాహం చేసుకోమంది పార్వతి. ఎన్నో పరీక్షల తర్వాత ఎట్టకేలకు పార్వతీ పాణిగ్రహణం చేశాడు. కల్యాణం జరగడంతోటే తలనుంచి కాలివరకు భాగాన్ని ఆమెకు ఇచ్చి తాను అర్ధనారీశ్వరుడయ్యాడు పరమేశ్వరుడు. ఆయన ఒంటినిండా బూడిద పూసుకుంటే, ఈమె సుగంధభరితమైన మైపూతలు పూసుకుంటుంది. ఈమె పట్టుచీరలు ధరిస్తే, ఆయనేమో నారచీరలో, గజచర్మాన్నో చుట్టుకుంటాడు. ఆయన తలలో చంద్రవంక ఉంటే, ఈమె తలలో చేమంతి బిళ్లను దాలుస్తుంది. ఈమె మెడలో విలువైన రత్నాభరణాలను ధరిస్తే, ఆయనేమో మెడనిండా పాములు వేలాడేసుకుంటాడు. ఆవిడ గారు సింహాన్ని వాహనంగా చేసుకుంటే, ఆయనేమో ముసలి ఎద్దును అధిరోహిస్తాడు. ఎన్ని భేదాలుంటే ఏం ... ఆయన వాక్కు అయితే ఆమె ఆ వాక్కుకు అర్థం. ఆయన అదిభిక్షువయితే, ఈమె అన్నపూర్ణ. ఆయన మహాకాళేశ్వరుడయితే, ఈమె మహా కాళి. ఇలా పార్వతీ పరమేశ్వరులు ఒకరి ప్రేమకు మరొకరు ప్రతిరూపంగా, ఆది దంపతులుగా అచ్చమైన ప్రేమకు ప్రతీకలుగా... ప్రణయ మూర్తులుగా... ప్రణవంగా... ప్రాణంగా లోకాలను అనుగ్రహిస్తున్నారు. ప్రేమ అంటే అది. ఎన్నెన్ని పరీక్షలు... ఎంతెంత నిరీక్షణలు..? అన్నింటినీ తట్టుకున్నారు. అన్నింటినీ కట్టుకున్నారు. అందరినీ ఆకట్టుకున్నారు.
– డి.వి.ఆర్. భాస్కర్
మరిన్ని వార్తలు