డ్రగ్స్‌ వల్ల తలెత్తే అనర్థాలు

Drugs And Health Tips In Sakshi

డ్రగ్స్‌ ప్రధానంగా నేరుగా మెదడుపైన, కేంద్ర నాడీ వ్యవస్థపైన ప్రభావం చూపుతాయి. ఇది డ్రగ్స్‌ వల్ల తలెత్తే తక్షణ దుష్ప్రభావం. వీటిని వాడుతుండే కొద్దీ శరీరంలోని ఇతర వ్యవస్థలపైనా దారుణమైన దుష్ప్రభావాలు చూపుతాయి. చివరకు అకాల మరణాలకు కారణమవుతాయి. డ్రగ్స్‌ వల్ల శరీరానికి వాటిల్లే ప్రధానమైన అనర్థాలు ఇవి:

  • రోగనిరోధక వ్యవస్థ బాగా దెబ్బతింటుంది.
  • జీర్ణవ్యవస్థ పనితీరు దెబ్బతిని, శరీరం శుష్కించిపోతుంది.
  • లివర్‌పై విపరీతమైన ఒత్తిడి ఏర్పడి, చివరకు అది పూర్తిగా పనిచేయని స్థితి ఏర్పడుతుంది.
  • ఊపిరితిత్తుల పనితీరు మందగిస్తుంది.
  • గుండె వేగంలో అవాంఛనీయమైన మార్పులు తలెత్తుతాయి.
  • రక్తనాళాలు కుంచించుకుపోయి, రక్తప్రసరణకు ఆటంకాలు ఏర్పడతాయి.
  •  గుండె పనితీరు దెబ్బతిని, అకస్మాత్తుగా ఆగిపోయే పరిస్థితి తలెత్తుతుంది.
  • జ్ఞాపకశక్తి క్షీణించడంతో పాటు ఏకాగ్రత లోపిస్తుంది.
  • మెదడు దెబ్బతిని మూర్ఛ, పక్షవాతం వంటి పరిస్థితులు తలెత్తుతాయి.
  • ఎదురుగా ఏం జరుగుతోందో అర్థంచేసుకోలేని గందరగోళం ఏర్పడుతుంది.
  • పరిస్థితులను గ్రహించి వాటికి అనుగుణంగా స్పందించే శక్తి నశిస్తుంది.

డ్రగ్స్‌ ఎప్పటి నుంచి ఉన్నాయంటే..?
డ్రగ్స్‌– ఇవి మాదకద్రవ్యాలు. మాదకద్రవ్యాల వాడకం వేలాది సంవత్సరాలుగా మనుషులకు తెలుసు. ఆదిమ మతాలకు చెందిన వారు మాదకతను కలిగించే గంజాయి వంటి ఆకులను, ఆకుల పసర్లను, కొన్ని రకాల మొక్కల నుంచి దొరికే గింజలను వాడేవాళ్లు. వీటిని వాడితే విచిత్రమైన తన్మయావస్థ, లేనిపోని భ్రాంతులు కలుగుతాయి. ఆదిమ మతాలకు చెందిన వారు ఇలాంటి అనుభూతినే దివ్యానుభూతిగా, ఇదంతా దైవానికి సన్నిహితం చేసే ప్రక్రియగా అపోహపడేవారు.
పాతరాతి యుగంలోనే– అంటే, దాదాపు అరవైవేల ఏళ్ల కిందటే మనుషులు మత్తును మరిగినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్ది నాటికి ఈజిప్టు, భారత్‌ ప్రాంతాల్లో మత్తునిచ్చే సోమరసం, దాదాపు అలాంటిదే అయిన ‘హవోమా’వంటి మాదక పానీయాలను మతపరమైన వేడుకల్లో ‘దివ్యానుభూతి’ కోసం విరివిగా వాడేవారు.

క్రీస్తుపూర్వం 2700 నాటికి మనుషులు గంజాయిని కనుగొన్నారు. ఇది దాదాపు ప్రపంచవ్యాప్తంగా దొరికేది. గంజాయి ఆకులను ఎండబెట్టి, మట్టితో తయారు చేసిన చిలుంలో వేసి, వాటిని కాల్చి, దాని పొగను పీల్చేవారు. ఈజిప్టు, పర్షియా, ఆఫ్రికా, భారత ఉపఖండం, దక్షిణ అమెరికా ప్రాంతాల్లో ఆ కాలంలోనే గంజాయి వాడకం ఉండేది. భారత ఉపఖండంలోనైతే, గంజాయి పొగ పీల్చడంతో పాటు, పచ్చి గంజాయి ఆకులను నూరి  తయారు చేసిన‘భంగు’ను పానీయాల్లో కలిపి సేవించే పద్ధతి కూడా ఉంది. గంజాయిని కనుగొన్న కాలంలోనే ఉమ్మెత్తమొక్కల వేర్లను, ‘రుబార్బ్‌’ మొక్కల వేర్లను కూడా మాదకద్రవ్యాలు వాడటం మొదలైంది. క్రీస్తుపూర్వం మూడో శతాబ్ది నాటికి నల్లమందు వాడకం మొదలైంది. క్రీస్తుశకం పదహారో శతాబ్దిలో కోకా ఆకులను మాదకద్రవ్యంగా కనుగొన్నారు. కోకా ఆకుల నుంచే ‘కొకైన్‌’ తయారు చేస్తారు. చాలావరకు ఆధునిక మాదకద్రవ్యాలకు ప్రాచీన కాలంలోనే కనుగొన్న గంజాయి, నల్లమందు, ఉమ్మెత్త వంటి మొక్కలే మూలం.

డ్రగ్స్‌లో కొన్నింటిని ముక్కుతో పీలుస్తారు. కొన్నింటిని సిగరెట్‌ లేదా చిలుంలో చింపుకుని పొగ తాగుతారు. కొన్నింటిని శీతలపానీయాలు లేదా మద్యంలో చల్లుకుని, తాగుతారు. ఇవి కాకుండా మాత్రల రూపంలో, ఇంజెక్షన్ల రూపంలో దొరికే మాదకద్రవ్యాలూ ఉన్నాయి. వైద్యచికిత్స ప్రయోజనాల కోసం ఉపయోగించే కొన్ని మాత్రలు, ఇంజెక్షన్లను కొందరు మత్తులో మునిగితేలడం కోసం యథేచ్ఛగా దుర్వినియోగం చేస్తున్నారు. గంజాయి, నల్లమందుతో పాటు కొకైన్, మార్ఫిన్, హెరాయిన్, ఎల్‌ఎస్‌డీ (లైసెర్జిక్‌ యాసిడ్‌ డైఈథాలమైడ్‌), బ్రౌన్‌సుగర్, ఎండీఎంఏ (మీథైల్‌ఎనడయాక్సీ–మెథాంఫెటామైన్‌) వంటి డ్రగ్స్‌ ప్రపంచవ్యాప్తంగా విరివిగా వాడుకలో ఉన్నాయి. వీటిపై ఎన్ని ఆంక్షలు, నిషేధాలు ఉన్నా ఇవి అంతకంతకూ విస్తరిస్తూనే ఉన్నాయి. మనదేశంలోనూ ఇవి తరచుగా పోలీసు దాడుల్లో పట్టుబడుతూనే ఉన్నాయి. 

నొప్పినివారిణులుగా మాదకద్రవ్యాలు
వైద్యశాస్త్రం ఆధునికతను సంతరించుకున్న తొలినాళ్లలో మార్ఫిన్, కొకైన్, హెరాయిన్‌ వంటి మాదకద్రవ్యాలను నొప్పినివారిణులుగా వాడేవారు. వీటిని వైద్యులే రోగులకు సూచించేవారు. అప్పటి పత్రికల్లో హెరాయిన్, కొకైన్‌ల ప్రకటనలు కూడా వచ్చేవి. శస్త్రచికిత్సలు జరిగిన రోగులకు, తీవ్రమైన గాయాలకు లోనై ఇన్ఫెక్షన్లు, నొప్పులతో బాధపడేవారికి మార్ఫిన్‌ ఇచ్చేవారు. మార్ఫిన్‌ ఎంతటి నొప్పినైనా మరిపిస్తుంది గాని, నొప్పులు తగ్గినా మార్ఫిన్‌ మాదకతకు రోగులు బానిసైపోతారు. మొదటి ప్రపంచయుద్ధకాలంలో గాయపడిన సైనికులకు మార్ఫిన్‌ ఇచ్చేవారు. హెరాయిన్, కొకైన్‌లూ దాదాపు ఇదే తీరులో పనిచేస్తాయి. కొన్నాళ్లు వీటిని వాడిన వారు వీటికి బానిసలు కావాల్సిందే. ఆ తర్వాత వాటి నుంచి బయటపడటం దుస్సాధ్యం. పంతొమ్మిదో శతాబ్ది తొలినాళ్లలో వైద్యులు చిన్నపాటి పంటి నొప్పుల మొదలుకొని నానా రకాల జబ్బులకు కొకైన్‌ను ఎడాపెడా సూచించేవారు. హెరాయిన్‌ను దగ్గుమందుగా వాడేవారు. అమెరికాలాంటి అగ్రరాజ్యంలో సైతం ఆనాటి వైద్యులు విచక్షణారహితంగా వీటిని సూచిస్తూ పోవడంతో లక్షలాదిమంది వీటికి బానిసలుగా మారారు. దాదాపు శతాబ్దకాలం తర్వాత వైద్యులు వీటి దుష్ప్రభావాలను గుర్తించడంతో ప్రభుత్వాలు వీటిపై నిషేధం విధించాయి. నిషేధం తర్వాత పత్రికల్లో వీటి ప్రకటనలైతే నిలిచిపోయాయి గాని, వీటి ఉత్పత్తి మాత్రం నిలిచిపోలేదు. అక్రమమార్గాల్లో వీటి ఉత్పత్తి, రవాణా, సరఫరా జరుగుతూనే ఉన్నాయి.

నిషేధాలూ పర్యవసానాలూ
మాదకద్రవ్యాలపై నిషేధాజ్ఞలు జారీ చేసిన తొలి దేశం చైనా. అక్కడ నల్లమందు వాడకం విపరీతంగా ఉండేది. జనాలంతా నల్లమందుభాయీలుగా మారడంతో ఆందోళన చెందిన చైనా ప్రభుత్వం 1729లో తొలిసారిగా నల్లమందుపై నిషేధం విధించింది. అది పెద్దగా ఫలించలేదు. అయినా పట్టువదలని చైనా ప్రభుత్వం 1796, 1800 సంవత్సరాల్లో కూడా మరో రెండుసార్లు నల్లమందుపై నిషేధాజ్ఞలు జారీ చేసింది. అయినా, ఇవేవీ ఫలించలేదు. ప్రభుత్వం నిషేధం విధించినా, నల్లమందు మరిగిన చైనా జనాలు సొంతగానే దొంగచాటుగా గసగసాల సాగు చేస్తూ, సొంత వాడకానికి కావలసిన నల్లమందు తయారు చేసుకోవడం మొదలు పెట్టారు. సొంత సాగుకు వీలు కుదరని వారు విదేశాల నుంచి దొంగచాటుగా నల్లమందును దిగుమతి చేసుకునేవారు. ఫలితంగా నిషేధాజ్ఞలకు ముందు 40 లక్షలుగా ఉన్న నల్లమందుభాయీల సంఖ్య 1836 నాటికి ఏకంగా 1.20 కోట్లకు చేరుకుంది. ఇది గమనించిన చైనా ప్రభుత్వం నల్లమందు దిగుమతిపై నిషేధాన్ని మరింత కట్టుదిట్టం చేసే చర్యలు ప్రారంభించడంతో అవి వికటించి, బ్రిటన్‌తో మొదటి నల్లమందు యుద్ధానికి దారితీసింది. ఈ యుద్ధం 1839లో ప్రారంభమై నాలుగేళ్లు కొనసాగింది. ఆ తర్వాత 1856లో రెండో నల్లమందు యుద్ధం జరిగింది. రెండో యుద్ధంలో బ్రిటిష్‌ సేనలతో ఫ్రెంచి సేనలు కూడా జతకలసి చైనాతో తలపడ్డాయి. రెండు యుద్ధాలూ చైనాకు ఆర్థిక నష్టాన్ని, సైనిక నష్టాన్ని మిగిల్చాయి.

ఇరవయ్యో శతాబ్ది నాటికి ప్రపంచ దేశాన్నీ కాస్త తెలివి తెచ్చుకుని మాదక ద్రవ్యాలపై నిషేధాజ్ఞలు విధించాయి. నిషేధాజ్ఞల ఫలితంగా మాదక ద్రవ్యాల ఉత్పాదన విరివిగా జరిగే దేశాల్లో మాఫియా ముఠాలు తయారయ్యాయి. అంతర్జాతీయ స్థాయిలో మాదక ద్రవ్యాలను అక్రమంగా సరఫరా చేయడమే కాకుండా, దారుణమైన నేరాలకు పాల్పడుతూ దేశ దేశాల్లో వేళ్లూనుకున్నాయి. ఈ మాఫియా ముఠాలు సమాంతర ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్నాయి. మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపారం ఏ స్థాయిలో సాగుతోందో, దానిపై వచ్చే లాభాలు ఏమేరకు ఉండవచ్చో కచ్చితమైన అంచనాలేవీ లేవు. అయితే, ఐక్యరాజ్య సమితి 1997లో విడుదల చేసిన ‘వరల్డ్‌ డ్రగ్‌ రిపోర్ట్‌’ నివేదిక మాదక ద్రవ్యాల ఆక్రమ వ్యాపార లాభాలు దాదాపు 4 లక్షల కోట్ల డాలర్ల (రూ.278 లక్షల కోట్లు) వరకు ఉండవచ్చని అంచనా వేసింది. ఈ అంచనా ఇరవైరెండేళ్ల కిందటిది. ఆ తర్వాత దీనిపై అధికారిక లెక్కలేవీ అందుబాటులో లేవు. ఇప్పటి పరిస్థితి ఎలా ఉంటుందో ఇక ఊహించుకోవాల్సిందే! మాదకద్రవ్యాల నిషేధానికి ఎన్ని దేశాలు ఎన్ని చట్టాలను తెచ్చినా, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడానికి ఎంత భారీ యంత్రంగాన్ని ఏర్పాటు చేసుకున్నా, మాఫియా ముఠాల ప్రాబల్యం అంతకంతకూ పెరుగుతూనే ఉంది తప్ప తగ్గుతున్న దాఖలాల్లేవు. 

ఆంక్షలున్నా ఆగని అక్రమ రవాణా
మాదకద్రవ్యాల ఉత్పత్తి అత్యధికంగా జరుగుతున్న దేశాల్లో భారత్‌ కూడా ఒకటి. భారత్‌తో పాటు అఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్, మయన్మార్, టర్కీ, లావోస్, తదితర దేశాల్లో గసగసాల సాగు భారీ స్థాయిలో సాగుతోంది. దీని ద్వారా తయారయ్యే నల్లమందు, దాని నుంచి ఏటా ఉత్పత్తి చేసే మాదకద్రవ్యాలు ప్రపంచవ్యాప్తంగా సరఫరా అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 27.5 కోట్ల మంది నిషిద్ధ మాదకద్రవ్యాలకు బానిసలుగా ఉన్నారని సాక్షాత్తు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) విడుదల చేసిన తాజా గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో గంజాయి వాడేవారి సంఖ్య అత్యధికంగా 19.2 కోట్ల వరకు ఉంటుందని, ఇంజెక్షన్ల ద్వారా డ్రగ్స్‌ పుచ్చుకునేవారి సంఖ్య 1.10 కోట్ల వరకు ఉంటుందని ఈ గణాంకాలు చెబుతున్నాయి. మాదకద్రవ్యాల దుర్వినియోగం కారణంగా సంభవించే మరణాల సంఖ్య నానాటికీ పెరుగుతుండటం మరో ఆందోళనకరమైన పరిణామం. యునైటెడ్‌ నేషన్స్‌ ఆఫీన్‌ ఆన్‌ డ్రగ్స్‌ అండ్‌ క్రైమ్‌ (యూఎన్‌ఓడీసీ) వెల్లడించిన వివరాల ప్రకారం 2000 సంవత్సరంలో డ్రగ్స్‌ కారణంగా 1.05 లక్షల మంది మరణిస్తే, 2015 నాటికి ఈ సంఖ్య 1.68 లక్షలకు చేరుకుంది.

మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు కొన్ని దేశాలు కీలక స్థావరాలుగా ఉంటున్నాయి. మెక్సికో, కొలంబియా, పెరు, బొలీవియా, వెనిజులా వంటి దేశాల నుంచి భారీ స్థాయిలో మాదక ద్రవ్యాలు అమెరికా, కెనడా, యూరోప్‌ దేశాలకు చేరుతున్నాయి. ఇరాన్, అఫ్ఘానిస్తాన్, మయన్మార్‌ తదితర దేశాల నుంచి భారత్‌ సహా దక్షిణాసియా దేశాలకు మాదకద్రవ్యాల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. సరిహద్దుల వద్ద ఎంతటి కట్టుదిట్టమైనా భద్రత ఏర్పాట్లు ఉన్నా, ఏటా వివిధ దేశాల సరిహద్దు భద్రతా దళాలకు టన్నుల కొద్దీ మాదక ద్రవ్యాలు పట్టబడుతూనే ఉన్నా, మాఫియా ముఠాలు మాత్రం ఏదో ఒక రీతిలో భద్రతా బలగాల కళ్లుగప్పి వీటిని తాము చేరవేయదలచుకున్న ప్రాంతాలకు చేరవేస్తూనే ఉన్నారు. డ్రగ్స్‌ను విక్రయించే స్థానిక దళారులు యువతకు వీటి మత్తును మప్పి, వీటికి బానిసలుగా తయారు చేస్తున్నారు. మన దేశంలో పెద్ద నగరాలే కాకుండా చిన్న చిన్న పట్టణాల్లోనూ మాదకద్రవ్యాల అక్రమ వ్యాపారం విస్తరిస్తోంది. పంజాబ్‌ ఉదంతాన్ని తీసుకుంటే, అక్కడి యువత మత్తులో మునిగి తేలే పరిస్థితులు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించాయి. అక్కడి పరిస్థితులపై రూపొందించిన ‘ఉడ్‌తా పంజాబ్‌’ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది.
– పన్యాల జగన్నాథదాసు 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top