నేరం దాగదు

Crime Story:The crime is not good - Sakshi

క్రైమ్‌ స్టోరీ

మణి జ్యుయెలర్స్‌ షాప్‌ యజమాని మణి, మేము వెళ్లే సరికి ఇంట్లోనే ఉన్నాడు. మమ్మల్ని ఆశ్చర్యంగా చూసి కళ్లతోనే ఏమిటీ విషయమని ప్రశ్నించాడు.‘‘నిన్న రాత్రి తొమ్మిదీ పదిగంటల మధ్య చేతన అనే అమ్మాయి హత్య చేయబడింది. ఆ హత్య కేసు దర్యాప్తు చేస్తూ.. మన రాజేష్‌ ఎలిబీని చెక్‌ చెయ్యడానికి ఇప్పుడు మీ దగ్గరకు వచ్చాం’’ చెప్పాను.‘‘నా దగ్గరకు ఎందుకు?’’ అడిగాడు మణి.‘‘నిన్న రాత్రి తొమ్మిది గంటల నుంచి పది గంటల దాకా రాజేష్‌ మీ ఇంట్లో మీతో కలిసి పేకాడినట్లు చెప్పాడు.’’   రాజేష్‌ ఆయన వంక ఆందోళనగా చూశాడు.‘‘క్లియర్‌గా చెప్పండి’’ అన్నాడు పోలీస్‌ ఇన్స్‌పెక్టర్‌.‘‘నిన్న రాత్రి నాకు హెల్త్‌ బాగాలేదు. మందులు వేసుకునిముసుగు పెట్టి పడుకొని తెల్లారి లేచాను. రాత్రి ఎనిమిదిన్నరకే నిద్రపోయాను.’’ఇన్స్‌పెక్టర్‌ రాజేష్‌ను చూశాడు. అతని ముఖం వివర్ణమైంది.‘‘రాజేష్‌కు, ఈ హత్యకు సంబంధమేమిటీ?’’ మణి అడిగాడు.‘‘ముందుగా చేతన గదిలో శవాన్ని చూసింది అతనే. ఇద్దరూ ఎమ్మెస్సీలో క్లాస్‌మేట్స్‌. ఒకే ఊరివాళ్లు. అతను తరుచూ చేతన గదికి వెళ్తూ ఉంటాడు.’’ చెప్పాను.

‘‘అయితే ఇద్దరికీ బెడిసికొట్టి ఉంటుంది.’’ అని చిన్నగా నవ్వాడు మణి. రాజేష్‌ ఏదో అనబోతున్నప్పుడు అతన్ని బయటికి తీసుకొచ్చాం. ‘‘మణి కావాలనే నా విషయంలో ఎందుకో అబద్ధం చెప్పాడు. రాత్రి ఇద్దరం గంటసేపు పేకాడాము.’’ అన్నాడు రాజేష్‌. పోలీస్‌ జీప్‌లో స్టేషన్‌కు బయలుదేరాం. మెయిన్‌ రోడ్‌ మీద శోభ స్టూడియో ముందు నాంచారయ్య నిలబడి మమ్మల్ని ఆపి స్టూడియోలోకి తీసుకువెళ్లాడు. అతడు నా స్నేహితుడు. ముగ్గురికీ ఒక ఫొటో తీస్తాను అన్నాడు. నా స్నేహితుడు సత్యనారాయణ కూడా పోలీస్‌ ఇన్స్‌పెక్టర్‌గా సెలెక్ట్‌ అయినాడనీ, పోస్టింగ్‌ కోసం ఎదురుచూస్తున్నాడని అతనితో చెప్పాను. ఫొటో దిగాక షోకేసులో ఉన్న ఫొటోలను చూస్తున్నప్పుడు నా కళ్లు చేతన మరో యువకుడితో కలిసి తీయించుకున్న ఫొటో మీద పడింది. ఆ యువకుడి గురించి నాంచారయ్యను అడిగాను. అతడి పేరు కేసరినాథ్‌. మణి జ్యుయెలర్స్‌ యజమాని మణి కొడుకు. చేతనను ప్రేమించాడట. త్వరలో తనను పెళ్లి చేసుకుంటాడని చేతన చెప్పిందట. నాంచారయ్యను అడిగి ఆ ఫొటోను తీసుకువచ్చాను.దారిలో చేతన ఇంటి ముందు జీప్‌ ఆపించాను. చేతన ఇంటికి ఎదురుగా ఒక పాన్‌షాప్‌ ఉంది. ఆ పాన్‌షాప్‌లో ఓ కుర్రాడున్నాడు. జీప్‌ దిగి అతని దగ్గరకు వెళ్లాము. మా దగ్గరున్న ఫొటోను ఆ కుర్రాడికి చూపించి ఇతను తెలుసా? అని అడిగాను.

‘‘తెలీదు.. అప్పుడప్పుడూ నా దగ్గర సిగరెట్లు కొంటాడు.’’ ‘‘రాత్రి ఇతడిని చూశావా?’’ ‘‘చూశాను. రాత్రి నా దగ్గర సిగరెట్లు కొని ఆ ఎదురింట్లోకి వెళ్లాడు.’’ అని చెప్పాడు. ‘‘ అప్పుడు టైమ్‌ ఎంత అయ్యిందో గుర్తుందా?’’ ‘‘గుర్తుంది. పావు తక్కువ పది. అప్పుడే షాప్‌ క్లోజ్‌ చెయ్యబోతున్నాను.’’ చెప్పాడు. వెనక్కి తిరిగి స్టేషన్‌కి వెళ్లిపోయాం.స్టేషన్‌లో కూర్చుని ఇన్స్‌పెక్టర్, నేను ఆలోచనలో పడ్డాం. ఏం జరిగి ఉంటుందో ఊహించాం. కేసరినాథ్‌ పెళ్లి పేరుతో చేతనను మోసం చేసి ఉంటాడు. చేతన పెళ్లి గురించి ఒత్తిడి చేసే సరికి ఆమెను చంపి అడ్డు తొలగించుకొని ఉంటాడు. ఇన్స్‌పెక్టర్‌ కూడా ఇదే అనుకున్నాడు. ఈ దిశగా ప్రయత్నం ప్రారంభించాం. ఇన్స్‌పెక్టర్‌ రామసూరి చాలా తెలివైనవాడు. కేసరినాథ్‌ చేత నేరాన్ని ఒప్పించడానికి ఇంటికి వెళ్లి చేతన రాసినట్లుగా కేసరినాథ్‌ తనని పెళ్లి చేసుకుంటానని మోసం చేసినట్లుగా తన భార్య చేత ఒక ఉత్తరాన్ని రాయించి తీసుకొచ్చాడు. తరువాత రాజేష్‌ చేత కేసరినాథ్‌కి ఫోన్‌ చేసి స్టేషన్‌కి పిలిపించాము. సత్యనారాయణ కేసరినాథ్‌కు ఆ ఉత్తరాన్ని చూపించి అతడు దొరికిపోయాడని చెప్పాడు. పాన్‌ షాప్‌ కుర్రాడు... చేతన ఇంట్లోకి కేసరినాథ్‌ వెళ్తున్నప్పుడు చూశానని కూడా చెప్పాడు. ఇప్పుడెలా? అన్నాడు సత్యనారాయణ. కేసరినాథ్‌ భయపడ్డాడు.

‘‘భయపడకు డబ్బుకు లొంగనివాడెవడు? రెండు లక్షల రూపాయలను ఇన్స్‌పెక్టర్‌కు ఇస్తే సరిపోతుంది. అతడు నా స్నేహితుడే. నేను మేనేజ్‌ చేస్తాను. అతడి ముందు ఏం జరిగిందో వివరంగా చెప్పు.’’ అన్నాడు సత్యనారాయణ. సత్యనారాయణ మాటలతో కేసరినాథ్‌కు ధైర్యం వచ్చి.. అప్పటికప్పుడు తండ్రి మణికి రెండు లక్షల గురించి ఫోన్‌లో చెప్పాడు. ఆయన ఒప్పుకున్నట్టున్నాడు. ‘‘మా నాన్న రెండు లక్షలు ఇస్తానన్నాడు. పదండి ఇన్స్‌పెక్టర్‌తో మాట్లాడదాం.’’ అని ముందుకు నడిచాడు.సత్యనారాయణ ఇన్స్‌పెక్టర్‌ గదిలోకి తీసుకెళ్లాడు. తరువాత రాజేష్, నేను లోపలికి వెళ్లాం. ఇన్స్‌పెక్టర్‌కి ఎదురుగా కూర్చుని కేసరినాథ్‌ చెప్పడం మొదలుపెట్టాడు.‘‘చిన్న చిన్న నగలు కొనడానికి మా నగల షాపుకు వచ్చే చేతనతో పరిచయం పెంచుకున్నాను. ఆమె అందం నన్ను ఆకర్షించింది. తరువాత ఆమె గదికి వెళ్లి ఆమెతో ప్రేమించానని, త్వరలో పెళ్లి చేసుకుంటానని చెప్పి లోబరుచుకున్నాను. నా మాటలు నమ్మి తన సర్వస్వాన్నీ అర్పించింది. ఆ తరువాత పెళ్లి విషయం అడిగింది. కాలం గడుపుతూ వచ్చాను. చివరికి ఒక రోజు నెల తప్పాననీ, గర్భవతినని, వెంటనే పెళ్లి చేసుకోమని అడిగింది. ఆ మాటల్ని నేను పట్టించుకోలేదు. నేను పెళ్లి చేసుకోనేమోనని అనుమానం వచ్చి, ఈ విషయం అందరికీ చెబుతానని బెదిరించింది. అప్పుడిక భయపడి చేతన గురించి మా నాన్నకు చెప్పాను.

చేతనను పెళ్లి చేసుకుంటే నాకొచ్చే కట్నం రాకుండా పోతుందని... ఏదో రకంగా చేతనని వదిలించుకోమని... ఏదైనా అయితే తాను చూసుకుంటానని అన్నాడు. ఆ ధైర్యంతో రాత్రి చేతన గదికి వెళ్లి దిండుతో ఊపిరాడకుండా చేసి చంపాను.’’‘‘ఇందుకేనా మీ నాన్న రాత్రి నాతో పేకాడలేదని అబద్ధం చెప్పాడు..’’ అన్నాడు రాజేష్‌.‘‘అవును రాజేష్‌... ఏ తండ్రైనా తన కొడుకుని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు కదా..’’ అన్నాడు కేసరినాథ్‌.‘‘కానీ, ఏం లాభం? హత్యానేరానికి ఇప్పుడు నువ్వు శిక్ష అనుభవించక తప్పదు కదా...’’ అన్నాడు సత్యనారాయణ నవ్వి.‘‘అదేమిటీ? భయం లేదన్నావుగా... ఇన్స్‌పెక్టర్‌.. రెండు లక్షలు.. నువ్వే చెప్పావుగా’’ అన్నాడు వణుకుతూ...‘‘అదంతా నాటకం.. నీ చేత నేరాన్ని ఒప్పించడానికి మేమంతా కలిసి ఆడిన నాటకమే ఇది. నీకు తెలీదు.. ఆయన డబ్బుకు అమ్ముడుపోడు.. ఇన్స్‌పెక్టర్‌ రామసూరి నిజాయతీపరుడు’’ అన్నాను.
- ప్రతాప రవిశంకర్‌

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top