విడ్డూరం: బాడీ స్ప్రే కాదు... కాఫీ స్ప్రే!


గంటల తరబడి పని చేసేవారికి కాఫీ ఓ రిలాక్సేషన్. అయితే ఒత్తిడిని తగ్గించుకోవడానికి మాటిమాటికీ కాఫీ తాగితే తద్వారా ఎన్నో శారీరక ఇబ్బందులు తలెత్తుతాయి. అలాగని తాగకపోతే ఒత్తిడితో సతమతమైపోయేవారి పరిస్థితేంటి? ఈ ఆలోచన బెన్ యూ (21)ని కుదురుగా ఉండనివ్వలేదు. కాఫీ ఎక్కువ తాగకుండా, తాగినట్టుగానే రిలాక్స్‌డ్‌గా ఉండే మార్గం కనిపెట్టాలనుకున్నాడు. తన స్నేహితుడు డెవెన్ సోనీతో కలిసి తాగే కాఫీకి బదులుగా స్ప్రే చేసుకునే కాఫీని కనిపెట్టాడు. దాని పేరు... ‘స్ప్రేయబుల్ ఎనర్జీ’!

 

 చూడటానికి డియోడరెంట్‌లా ఉండే స్ప్రేయబుల్ ఎనర్జీని ఒక్కసారి ఒంటి మీద స్ప్రే చేసుకుంటే చాలు... కాఫీ తాగిన కిక్కు మెల్లమెల్లగా ఒళ్లంతా పాకుతుంది. కాసేపటికి ఎంతో హాయిగా, రిలాక్స్‌డ్‌గా అనిపిస్తుంది. దానికి కారణం... ఇందులో ఉండే ద్రావకం కెఫీన్‌ని కలిగి ఉండడమే. నోటి ద్వారా తాగే కెఫీన్ శరీరంలోని కొన్ని భాగాలకు చేరి, వాటి మీద తీవ్ర ప్రభావం చూపడం వల్ల సమస్యలు వస్తాయి కదా! కానీ ఇలా చర్మం ద్వారా వెళ్లే కెఫీన్ ఏ ఒక్క భాగం మీదో కాక ఒళ్లంతా సమానంగా విస్తరిస్తుందట. దానివల్ల అవయవాలు పాడైపోవడమనేది ఉండదు అంటున్నారు ఈ బయో కెమిస్ట్రీ విద్యార్థులు. పైగా ఒక్కసారి స్ప్రే చేసుకుంటే కొన్ని గంటలపాటు రిలాక్సేషన్ ఉంటుందట. అమెరికన్ మార్కెట్లో ఇప్పటికే అవి హల్‌చల్ చేస్తున్నాయి. మన వరకూ రావడానికి మాత్రం కాస్త టైమ్ పడుతుందేమో!

 

 చూపు లేకున్నా...  చేసి చూపించాడు!

 అవయవాలు లేనివాడు కాదు, ఆత్మవిశ్వాసం లేనివాడే నిజమైన వికలాంగుడు అన్న మాట ఎంత నిజమో... స్టువర్ట్ గన్‌ని చూస్తే అర్థమవుతుంది. స్కాట్లాండుకు చెందిన ఈ యువకుడు మహా హుషారుగా ఉండేవాడు. బైకు మీద జామ్ జామ్ అంటూ దూసుకుపోయేవాడు. 2002లో ఓ రోజు ఎప్పటిలానే బైకు మీద వెళ్తుంటే... పెద్ద యాక్సిడెంట్ అయ్యింది. చనిపోవాల్సిన వాడు బతికాడు. కానీ జీవచ్ఛవంలా మిగిలాడు. నడుం కింది భాగమంతా చచ్చుబడిపోయింది. ఇక జన్మలో నడవలేడన్నారు డాక్టర్లు. నువ్విది చేయలేవు అని ఎవరైనా అంటే కోపం వచ్చేస్తుంది స్టువర్ట్‌కి. అందుకే నడిచి చూపిస్తానన్నాడు. నానా తంటాలూ పడి మళ్లీ సత్తువ తెచ్చుకున్నాడు. నడవడం మొదలుపెట్టాడు.

 

 కానీ దురదృష్టం స్టువర్ట్‌ను వెంటాడింది. ఆరేళ్ల తర్వాత, అంటే 2008లో స్టువర్ట్ కంటిచూపు పోయింది. యాక్సిడెంట్‌లో తలకు దెబ్బ తగిలినప్పుడు కంటి నరాలు దెబ్బతిన్న విషయాన్ని డాక్టర్లు గమనించలేదు. ఫలితంగా మెల్లగా చూపు పోయింది. పైగా శరీరంలోని కుడివైపు మళ్లీ చచ్చుబడిపోయింది. అయినా బెదరలేదు స్టువర్ట్. మళ్లీ కష్టపడి శరీరాన్ని తన అదుపులోకి తెచ్చుకున్నాడు. ఇప్పటికీ పూర్తిగా బాగుడపడలేదు కానీ ఆ అవకరం, అసౌకర్యం అతడిని ఆపలేకపోయాయి. మళ్లీ బైకు ఎక్కాడు. రేసుల్లో పాల్గొనడం మొదలుపెట్టాడు. అందరినీ ఆశ్చర్యపరిచాడు. అంతేనా... అత్యంత వేగంగా బైకు నడిపే వ్యక్తిగా ఇటీవలే రికార్డు సృష్టించాడు. ఒకప్పుడు అయ్యోపాపం అన్న ప్రపంచం... ఇప్పుడు అమ్మో స్టువర్ట్ అంటోంది!

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top