ఆ సమస్య ఉంటే... గర్భం దాల్చవచ్చా?

Clarification Of Some Doubts About Pregnancy - Sakshi

సం‘దేహం’

నాకు ఈమధ్య కొత్తగా పెళ్లయింది. అయితే నాకు ఫిట్స్‌ సమస్య ఉంది. ఫిట్స్‌ సమస్య ఉన్నవాళ్లు గర్భం దాల్చవచ్చా? ప్రసవ సమయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయా?
– బి.సంగీత, రామగుండం
ఫిట్స్‌ సమస్య ఉన్నవాళ్లు గర్భందాల్చక ముందే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. వారు ఫిట్స్‌ మందులను, మోతాదును గర్భందాల్చాక బిడ్డ మీద అతి తక్కువ దుష్ఫలితాలు ఉండేలా మార్చి ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు గర్భం దాల్చక ముందు నుంచే ఫోలిక్‌ యాసిడ్‌–5ఎంజీ మాత్ర రోజుకొకటి చొప్పున వేసుకోవడం తప్పనిసరి. ఫిట్స్‌కు వాడే చాలామందుల వల్ల పుట్టబోయే బిడ్డలో నాడీవ్యవస్థ, మెదడు, వెన్నుపూసకు సంబంధించిన అవయవ లోపాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి గర్భం దాల్చిన తర్వాత మందులు సక్రమంగా వాడుతూ మూడో నెలలో ఎన్‌టీ స్కాన్, ఐదో నెలలో టిఫ్ఫా స్కాన్‌ వంటి పరీక్షలు చేయించుకుని, అవయవ లోపాలు ఏమైనా ఉన్నాయో లేదో తెలుసుకోవడం మంచిది.

కొందరిలో గర్భందాల్చిన తర్వాత హార్మోన్లలో మార్పులు, ఒత్తిడి వంటి కారణాల వల్ల ఫిట్స్‌ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫిట్స్‌ ఎక్కువసార్లు రావడం వల్ల బిడ్డకు ఆక్సిజన్‌ సరఫరా సరిగా అందకపోవడం, బిడ్డ బరువు సరిగా పెరగకపోవడం వంటి సమస్యలు ఏర్పడవచ్చు. కాన్పు సమయంలో మానసిక, శారీరక ఒత్తిడి వల్ల ఫిట్స్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాన్పు సమయంలో ఫిట్స్‌ రాకుండా ఇంజెక్షన్స్‌ ఇవ్వడం జరుగుతుంది. అయినా కూడా ఒక్కోసారి ప్రాణాపాయ స్థితి ఏర్పడవచ్చు. ఫిట్స్‌ సమస్య ఉన్నవాళ్లు అన్ని వసతులూ ఉన్న హాస్పిటల్‌లో కాన్పు చేయించుకోవడం మంచిది.

ఈమధ్య ‘బేబీ మిల్క్‌ స్టోరేజీ బ్యాగు’ల గురించి విన్నాను. వీటి గురించి తెలియజేయగలరు. ఇలా స్టోరేజీ మిల్క్‌ను పిల్లలకు ఇవ్వడం మంచిదేనా? జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా? తల్లికి జలుబు చేసినప్పుడు పిల్లలకు పాలు ఇవ్వవచ్చా?
– ఆర్‌. సులోచన, హైదరాబాద్‌
ఆధునిక కాలంలో ఎక్కువగా తల్లులు ఉద్యోగాలు చేస్తూ ఉండటం వల్ల కాన్పు తర్వాత తిరిగి ఉద్యోగానికి వెళ్లవలసిన పరిస్థితుల్లో బిడ్డకు పాలు పట్టించలేని పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఇలాంటప్పుడు రోజూ ఉద్యోగానికి వెళ్లేటప్పుడు తల్లిపాలను పిండి బయటకు తీసి, జాగ్రత్తపరచి మళ్లీ ఇంటికి తిరిగి వచ్చే వరకు వాటిని బిడ్డకు పట్టవచ్చు. కాకపోతే ఈ పాలను సరైన విధానంలో భద్రపరచవలసి ఉంటుంది. దీనికి అనుగుణంగానే బేబీ మిల్క్‌ స్టోరేజీ బ్యాగులు తయారు చేయబడ్డాయి. ఇవి ‘బీపీఏ ఫ్రీ’ ఉండి, ఇన్ఫెక్షన్లు లేకుండా స్టెరైల్‌గా ఉండి, ఫ్రిజ్‌లో నిల్వ ఉంచడానికి వీలుగా, పగలకుండా, ఫ్రిజ్‌ నుంచి తియ్యగానే తొందరగా సాధారణ టెంపరేచర్‌లోకి రావడానికి వీలుగా, అలాగే కొద్దిగా వేడిని తట్టుకునేలా దృఢంగా ఉంటాయి.

తప్పనిసరి పరిస్థితుల్లో బిడ్డకు నేరుగా తల్లిపాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఫార్ములా పాల బదులు తగిన జాగ్రత్తలతో స్టోరేజీ బ్యాగులో నిల్వచేసిన రొమ్ముపాలను ఇవ్వవచ్చు. పాలను స్టోరేజీ బ్యాగు నుంచి బాటిల్‌లోకి తీసుకునేటప్పుడు, వాటిని సాధారణ టెంపరేచర్‌కు తీసుకొచ్చేటప్పుడు, వాటిని రీఫ్రీజ్‌ చేసేటప్పుడు శుభ్రమైన పరిస్థితుల్లో చెయ్యవలసి ఉంటుంది. కంపెనీని బట్టి కొన్ని బ్యాగులు ఒక్కసారి వాడటానికి మాత్రమే పనికొస్తాయి. 

మరికొన్ని జాగ్రత్తగా శుభ్రం చేసుకుని, తిరిగి వాడుకోవడానికి పనికొస్తాయి. వాటి మీద రాసిన సూచనలను చూసుకుని, జాగ్రత్తగా వాడుకుంటే మంచిది. తల్లికి జలుబు చేసినప్పుడు బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల బిడ్డకు జలుబు రాదు. తల్లిపాల వల్ల జలుబు వైరస్‌ బిడ్డకు సోకదు. తల్లి పాలలో బిడ్డకు రోగనిరోధక శక్తిని పెంచే యాంటీబాడీస్‌ ఉంటాయి కాబట్టి అవి బిడ్డకు చాలా వరకు జలుబు, విరోచనాలు కలిగించే క్రిముల నుంచి దూరంగా ఉంచుతాయి. గాలి ద్వారా బ్యాక్టీరియా, వైరస్‌ క్రిములు చేరడం ద్వారా బిడ్డకు జలుబు వస్తుంది గాని, తల్లిపాల ద్వారా కాదు. తల్లికి జలుబు ఉంటే ముక్కుకు, నోటికి టిష్యూ లేదా కర్చీఫ్‌ అడ్డుపెట్టుకుని పాలు ఇవ్వవచ్చు.

ప్రెగ్నెన్సీ సమయంలో ‘విటమిన్‌–డి’ అవసరమని చెబుతారు కదా... దీనివల్ల ఉపయోగాలు ఏమిటి? నేను యోగా చేస్తుంటాను. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు చేయవచ్చా? ఎలాంటి ఆసనాలకు దూరంగా ఉండాలి?
– కె.రమ్య, కాజీపేట్‌

విటమిన్‌–డి ప్రెగ్నెన్సీ సమయంలో తల్లికే కాకుండా, బిడ్డ ఎదుగుదలకు కూడా చాలా అవసరం. విటమిన్‌–డి వల్ల తీసుకునే ఆహారం నుంచి ఎక్కువగా క్యాల్షియం రక్తంలోకి, ఎముకల్లోకి చేరుతుంది. దీనివల్ల తల్లిలో క్యాల్షియం నిల్వలు పెరుగుతాయి. తద్వారా తల్లిలో జరిగే శారీరక మార్పులకు, రక్తంలో జరిగే మార్పులకు, అవయవాల పనితీరుకు దోహదపడుతుంది. తద్వారా తల్లిలో ఒంటినొప్పులు, నడుంనొప్పి, కీళ్లనొప్పులు ఎక్కువగా లేకుండా ఉంటాయి. అలాగే కాన్పు సమయంలో పెల్విక్‌ ఎముకలు, కండరాలు సాగడానికి ఉపయోగపడుతుంది. బిడ్డకు తల్లి నుంచి క్యాల్షియం అందుతుంది.

తద్వారా బిడ్డలోని అవయవాలు ఏర్పడటానికి, ఎముకలు దృఢంగా ఆరోగ్యంగా తయారవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి సరైన పాళ్లలో విటమిన్‌–డి తీసుకుంటే బిడ్డ, తల్లి ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారు. గర్భవతిగా ఉన్నప్పుడు డాక్టర్‌ సలహా మేరకు గర్భం సరిగా ఉండి, బిడ్డ, మాయ పొజిషన్‌ పైకి ఉండి, గర్భాశయ ముఖద్వారం లూజుగా లేకపోతే మూడు నెలల తర్వాతి నుంచి మెల్లగా యోగాసనాలు చేసుకోవచ్చు. ఐదో నెల పూర్తయినప్పటినుంచి  సక్రమంగా యోగాసనాలు చేసుకోవచ్చు. అయితే పొట్టమీద బరువు పడకుండా, ఆయాసం లేకుండా ఉండే యోగాసనాలు చేసుకోవచ్చు.
- డా.వేనాటి శోభ, బర్త్‌రైట్‌ బై రెయిన్‌బో, హైదర్‌నగర్‌, హైదరాబాద్‌

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top