ఆసక్తికరంగా తీర్చిదిద్దడం ఎలా?

ఆసక్తికరంగా తీర్చిదిద్దడం ఎలా?


ఈస్తటిక్ సెన్స్

 కిచెన్ గార్డెన్‌కు ఉన్న గొప్ప వెసులుబాటు ఏమిటంటే.. మన ఆసక్తికి తగినట్లు కుండీలు, మడులను డిజైన్ చేసుకోవచ్చు. సృజనాత్మకత, కళాదృష్టికి అనుగుణంగా మడుల రూపాన్ని, పరిమాణాన్ని పంట పంటకూ మార్చుకోవచ్చు. ఏళ్ల తరబడి మడి, కుండీలు ఒకేలా ఉండాల్సిన అవసరం లేదు. ఇటుకలు పేర్చి పెట్టుకునే మడి పొడవుగానే ఉండాలనేమీ లేదు, గుండ్రంగానూ ఉండొచ్చు. సెల్ఫ్ వాటరింగ్ కుండీలను ఏర్పాటు చేసుకుంటే రోజూ నీళ్లు పోయాల్సిన అవసరం ఉండదు. కుండీలే కాదు మడులను కూడా ఇలా ఏర్పాటు చేసుకోవచ్చు. సెల్ఫ్‌వాటరింగ్ కుండీలను విడిగానే కాకుండా.. కొన్నిటికి కలిపి అడుగున పీవీసీ పైపును అమర్చవచ్చు. పొడవాటి పీవీసీ పైపు పైన కుండీలను అమర్చి, పైపులో నీరు పోస్తే అన్ని కుండీలకు నీరు అందేవిధంగా అనుసంధానం చేయవచ్చు.

 

 రెండు లీటర్ల కూల్‌డ్రింక్ బాటిల్‌ను సగానికి కట్ చేసి సెల్ఫ్ వాటరింగ్ కుండీగా మార్చొచ్చు. మూత ఉండే భాగాన్ని, బాటిల్ అడుగు భాగంలోకి చొప్పించడం ద్వారా.. నీటిని మొక్కకు అవసరం మేరకు అందేలా ఏర్పాటు చేయవచ్చు. మడి ఏర్పాటుకు ఇటుకలో, చెక్కలో వాడాల్సిన పని లేదు. ఇనుప ఊచలతో ఫ్రేమ్‌ను తయారుచేసి, దానికి సిల్పాలిన్ షీట్‌ను అమర్చి కూడా మడిని సిద్ధం చేసుకోవచ్చు. వెదురు కర్రలతో కూడా మడిని తయారు చేసుకోవచ్చు.

 

 కిచెన్ గార్డెన్ రొటీన్‌గా ఉందనిపించినప్పుడు కొత్తగా ఏం చేద్దాం? అని ఆలోచించే వారికి ఐడియాలకు కొదవేమీ ఉండదు. కొత్తదనం కోసం వెతుక్కునే వారి కిచెన్ గార్డెన్ ఎప్పుడూ ఆసక్తిదాయకంగా ముచ్చటగొలుపుతూనే ఉంటుంది. అందుబాటులో ఉండే వనరులతో వినూత్నంగా ప్రయత్నించగలిగితే.. తక్కువ ఖర్చుతోనే కిచెన్ గార్డెన్‌ను ఆసక్తి దాయకంగా మార్చుకోవడానికి అవకాశం ఉంది.

 

 అయితే, అన్ని కూరగాయల మొక్కలూ కలిసి పెరగలేవు. మడులు, పెద్ద కుండీలు, పొడవాటి సిమెంటు తొట్టెల్లో, పెరటి నేలలో కూరగాయలు, ఆకుకూరలు పెంచుకునేటప్పుడు ఈ విషయాన్ని కూడా గ్రహించడం మంచిది. కొన్ని రకాల కూరగాయల మొక్కలు పక్కపక్కన పరస్పరం సహకరించు కుంటూ పెరుగుతాయి. కొన్ని రకాల మొక్కలు ఒకే మడిలోనో, ఒకే కుండీలోనో పక్కపక్కనే ఉన్నప్పుడు భూమిలోని పోషకాల కోసం, ఎండ కోసం పరస్పరం పోటీ పడుతూ ఉంటాయి. దుంప జాతి మొక్కలకు కొన్ని ఇతర పంటల వేళ్ల వల్ల ఇబ్బంది కలుగుతుంది. మడులు, కుండీల్లో ఎలా ఉంటే బాగుంటుందో.. ఏ యే జాతుల కూరగాయ మొక్కలు కలిపి పెంచుకోవాలో అవగాహన పెంచుకుంటే.. మంచి దిగుబడి రావడంతోపాటు మానసికోల్లాసం కూడా కలుగుతుంది.    

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top