రచయిత జానకీశ్రీరమణీయం...

రచయిత జానకీశ్రీరమణీయం...

రచయిత ఎవర్నీ దగ్గరకు రానీయడు. లోపల పెద్ద ప్రపంచమే ఉంటుంది. 

 అక్కడ అందరితో కలివిడిగానే ఉంటాడు. లోపలి వాళ్లు బయటికొస్తే మాత్రం

 ఎవరో తనకు తెలియనట్లే ఉంటాడు!  చేరదీయడు, చెంతకు వెళ్లడు! మౌనం.

 శ్రీరమణ మౌనాన్ని ఇన్నేళ్లలోనూ జానకి... ఎలా అర్థం చేసుకుని ఉంటారు?

 గిన్నెలోని సన్నజాజుల్ని దీక్షగా గుచ్చినట్లు  ఏవో భాష్యాలు చెప్పుకుని ఉంటారా?

 జానకి సహచర్యం శ్రీరమణలో... ఏ లోకపు ద్వారాలను తెరిచి ఉంటుంది?

 లోపలివా? బయటివా?  నలభైకి చేరువైన జానకీశ్రీరమణల 

 దాంపత్యబంధంలోని  అనుభూతులు, ఆదర్శాల మిథునమే

 ఈవారం... ‘మనసే జతగా...’

 

 ముందీసంగతి చెప్పండి. చూపులు ఎలా కలిశాయి?

 శ్రీరమణ: మాది పెద్దలు కుదిర్చిన పూర్వపరిచయ వివాహం. ఎలాగంటే మా వదినగారు (అన్నభార్య) తన చెల్లెల్ని నాకు చేయాలనుకున్నారు. తెలిసినవారే అయినప్పటికీ మళ్లీ పెళ్లిచూపులు ఏర్పాటుచేశారు. అప్పుడు కూడా నేను జానకిని సరిగ్గా చూడలేదు. మా పెళ్లిలో చూడ్డమే.జానకి: మా అక్కయ్య అప్పటికి ఏడేళ్ల క్రితమే వారింటి కోడలిగా వెళ్లింది. అక్కడి వాతావరణం నచ్చో, మరే కారణమో తెలియదు కానీ, నన్ను తన తోడికోడలిగా చేసుకోవాలనుకుంది. అలా మా అక్కయ్య ప్రోద్బలంతో మా వివాహం 1976లో జరిగింది. సొంత అక్కే కావడంతో అత్తవారింట్లో కూడా నాకు పుట్టింట్లో ఉన్నట్లే అనిపించేది. మా అత్తగారు మమ్మల్ని కూతుళ్లలాగ చూసుకోవడంతో, నాకసలు కొత్తనిపించలేదు. అక్కచెల్లెళ్లు కావడం వల్లే మా కుటుంబం పొరపచ్చాలు లేకుండా ఉందని మా బంధువులు అంటుంటారు. 

 

 అన్నట్లు మా పెళ్లి మా ఇంట్లో కాకుండా అత్తవారింట్లో జరిగింది. 

 అత్తవారింట్లోనా?!

 శ్రీరమణ: అవును. మా పెళ్లినాటికే నేను కొద్దోగొప్పో నలుగురికీ తెలిసిన రచయితని. ప్రముఖ రచయితలతో, పెద్దపెద్ద వారితో పరిచయాలు ఏర్పడటం సహజం కదా! వారంతా పెళ్లికి వస్తారు. వచ్చినప్పుడు, గుమ్మంలోకి ఎదురెళ్లి ‘మీరూ....?’ అని సంశయంగా అడిగితే బావుండదు కదా! అందుకని మా ఇంట్లోనే చేద్దామని చెప్పాం. అందుకు మా అత్తింటివారు అంగీకరించారు.

 

 జానకి: ఆడపిల్లను తీసుకువెళ్లి మగపెళ్లి వారింట్లో పెళ్లి చేస్తే, నలుగురిలో చులకనవుతామేమోనని మా అమ్మానాన్న కొద్దిగా జంకారు. అంతేకాకుండా అన్నీ అబ్బాయి ఇంట్లోనే జరుగుతుంటే, పెళ్లయ్యాక నన్ను చిన్నచూపు చూస్తారేమోనని కూడా భయపడ్డారు. అందుకే ముందర అభ్యంతరం చెప్పారు. కానీ విషయం తెలుసుకున్నాక ఒప్పుకున్నారు. అలా మా వివాహం తెనాలి సమీపంలోని వరాహపురంలో జరిగింది.

 శ్రీరమణ: నాకు ఒక అన్నయ్య, ఒక అక్కయ్య ఉన్నారు. నేను, అన్నయ్య తోడల్లుళ్లం అయ్యాం. 

 

 పెళ్లి చూపులకు ముందే చదువుల్ని, స్థాయిల్ని సరిచూసుకున్నారా?

 శ్రీరమణ: అలాంటిదేం లేదు. నేను పియుసి. బాపట్ల కాలేజీ. మా జానకి ఇంటర్ వరకు చదివింది. చదువులో తను ఫస్ట్.

 

 పిల్లలు, వాళ్ల చదువులు...

 జానకి: ఇద్దరు అబ్బాయిలు. పెద్దవాడు చైత్ర, రెండోవాడు వంశీకృష్ణ. తెలుగు మాసాలలో మొదటిది చైత్రం కదా! అందుకని మా పెద్దవాడికి ఆ పేరు పెట్టాం. రెండోవాడి పేరు బాపుగారి అమ్మాయి పెట్టారు. ఆవిడకి వంశీకృష్ణ అనే పేరంటే చాలా ఇష్టం. మా పిల్లల బాల్యం అంతా బాపు గారింట్లోనే గడిచింది. పెద్దవాడు బీటెక్ పూర్తిచేసి ఒక మల్టీ నేషనల్ కంపెనీలో పని చేస్తున్నాడు. కోడలు శాలిని, ఎంబిఏ చదివింది. మనవడు ఆదిత్య. వంశీకృష్ణ కెమికల్ ఇంజినీరింగ్‌లో పి.హెచ్‌డి. పూర్తిచేసి ఫెలోషిప్‌లో ఉన్నాడు. ప్రస్తుతం కంపెనీ తరఫున స్విట్జర్లాండ్ వెళుతున్నాడు.

 

 ైగెడైన్స్ మీదా? మీ శ్రీమతిదా?

 శ్రీరమణ: పిల్లల చదువుల గురించి మనం తీసుకునే నిర్ణయాలేవీ ఉండవు. మా రోజుల్లో తల్లిదండ్రులే నిర్ణయించేవారు. ఇప్పుడు అలా కాదు. పిల్లలు ఏది చదువుకుంటామంటే అది చదివించడమే. అందువల్ల మా ఇద్దరిలో ఏ ఒక్కరి నిర్ణయం మీదా వాళ్ల చదువు ఆధారపడలేదు. ఇద్దరూ బీటెక్ చేస్తామన్నారు. చెయ్యమన్నాం. ఇప్పుడు చదువులు వరదలా వస్తున్నాయి. పిల్లలు ఆ ప్రవాహంలో కొట్టుకుపోవలసిందే.

 

 కోపతాపాల గురించి...

 జానకి: ప్రతి కుటుంబంలోనూ భార్యాభర్తల మధ్య కోపతాపాలు సహజమే. అలా ఉన్నప్పుడు కొంతసేపు మాట్లాడుకోం... అంతే కదా!

 శ్రీరమణ: జానకి నేను చెప్పినదాన్ని వినడం తప్ప, చెప్పని విషయం గురించి సతాయించదు కనుక (నవ్వుతూ) మా మధ్య వాదనలు, గొడవలు తక్కువే. నేను లో ప్రొఫైల్ మెయిన్‌టెయిన్ చేయడానికే ఇష్టపడతాను. ఎప్పుడైనా నా గురించి పత్రికలలో వస్తే, ‘‘మీ పేరు పడిందేంటి’’ అని జానకి అడుగుతుంది. నా గురించి నేను ఇంట్లో కాని, బయట కాని చెప్పుకోను. అలా ఉండడం నాకు సంతోషం కలిగిస్తుంది. ఏ విషయాలూ ఎవ్వరికీ తెలియాలనుకోను. చాలారోజులు నేను ఏ ఉద్యోగం చేస్తున్నానో కూడా జానకికి తెలియదు. ఒకసారి మా అమ్మ ‘‘ఏరా అబ్బాయీ! నువ్వేం ఉద్యోగం చేస్తున్నావో జానకికి చెప్పరా. నన్ను అడుగుతోంది’’ అంది. ‘‘ఏదో ఒకటి చేస్తున్నాను కదా!’’ అని మాట దాటేసేవాడిని.

 

 ఒకరి మాటకు ఒకరు అడ్డుచెప్పిన సందర్భాలున్నాయా?

 జానకి: ఆయన మనసు తెలిసినదానిని కాబట్టి, ఆయన అడ్డు చెప్తారనుకునే విషయాలను ఆయన దగ్గర ప్రస్తావించను.

 శ్రీరమణ:  మా జానకికి నేను ఏదీ అడ్డు చెప్పలేదు. ఆవిడకు అన్ని విషయాలలోనూ పూర్తి స్వేచ్ఛ ఉంది. ఒక కుటుంబంలో ఎలా మసలుకోవాలో మొదట్నుంచీ జానకికి తెలుసు కాబట్టి, ‘అవును’ ‘కాదు’ లాంటి ఇబ్బందులు రాలేదు. మా ఇంట్లో నేను చూసిన రెండు మూడు తరాలు ఇలాగే ఉంది.

 

 ‘మిథునం’ కథ మీ ఇద్దరి ఆలోచనల కలబోత అనుకోవచ్చా? 

 జానకి: అది అవును, కాదు అని చెప్పలేం. పెళ్లికాగానే వయసును బట్టిన సరదాలు ఉంటాయి. పెళ్లయిన కొత్తలో ఆనందాలు, థ్రిల్స్ ఉంటాయి. ఆ తరవాత పిల్లల్ని కనడం, వాళ్లని పెంచడం వంటి బాధ్యతలలో తలమునకలయి ఉంటారు. పిల్లలు ఎక్కడివాళ్లు అక్కడ సెటిల్ అయ్యాక, ఏదో శూన్యం ఆవరించినట్లు అనిపిస్తుంది. ఈ లోపుగా శారీరకంగా ఎన్నో మార్పులు. 

 

 శ్రీరమణ: చరమాంకం సాఫీగా నడవాలంటే భార్యాభర్తల మధ్య గట్టి అనురాగబంధం ఏర్పడి ఉండాలి. చివరిదశ ఒకరిమీద ఒకరు ఎమోషనల్‌గా ఆధారపడడం మీదే నడుస్తుంది. మనసు నుంచి మనసు, హృదయం నుంచి హృదయం మాట్లాడుకోవడమే మిగులుతుంది. నేను అటువంటి కుటుంబాలు ఎన్నింటినో చూశాను. మిథునం వెనుక కథ ఇదే. మిథునం కథ (1997) రాసేటప్పటికి నా వయసు 45. అప్పటికి రెండు సంవత్సరాల క్రితం నుంచే ఆ కథ నా మనసులో నడుస్తోంది. అందువల్ల నా జీవితానికి, ఈ కథకు పోలిక లేదు. శంకరాచార్యుడి అద్వైతవాదం చిన్నప్పటినుంచి నా మదిలో నాటుకుంది. ఆ భావన నుంచి వచ్చినదే మిథునం కథ.

 

 కథల గురించి ఒకరితో ఒకరు చర్చించుకుంటారా!

 శ్రీరమణ: నేను ఏ కథనూ ఎవరితోనూ చర్చించను. మా జానకి నా కథలు అచ్చయ్యాకే చదువుతుంది. నచ్చితే బాగున్నాయంటుంది. నచ్చకపోతే లేదంటుంది. 

 

 జానకి: కథ అచ్చయ్యేవరకూ ఆయన ఎవ్వరికీ చూపించరు. 

 చాలామంది రచయితలు తాము రచించే కథలలో ఒకలాగ, జీవితంలో మరోలాగ ఉంటారు. జీవితంలోనూ, కథలలోనూ ఒకేలా ఉండే అరుదైన వ్యక్తులలో శ్రీరమణ ఒకరు. ఆయనకు అనుగుణంగా నడుచుకునే ముచ్చటైన ఇల్లాలు జానకి. హైదరాబాద్ లంగర్‌హౌస్‌లోని ఓంనగర్‌లో సొంత కుటీరంలో ఈ జంట మనసే జతగా గృహస్థాశ్రమాన్ని ఆచరిస్తోంది. వీరి దాంపత్యం ప్రతి జంటకూ ఆదర్శమే!   

 

 ఆలోచనలకు అక్షరరూపం 

 సాహితీప్రపంచానికి సుపరిచితులైన శ్రీరమణ అనేక ప్రముఖ పత్రికలలో పేరడీలు, శ్రీకాలమ్, శ్రీచానెల్, చిలకల పందిరి, హాస్యజ్యోతి, మొగలిరేకులు వంటి ఎన్నో శీర్షికలు నిర్వహించారు. మిథునం కథ చూసి ముచ్చటపడిన బాపు స్వీయదస్తూరిలో ఆ కథను రాసి శ్రీరమణకు పంపారు. జంపాల చౌదరిగారు (సాహితీప్రియులు, అమెరికాలో చైల్డ్ సైకియాట్రిస్ట్) ఆ దస్తూరితోనే కథను ప్రచురించి ఇప్పటికి నాలుగులక్షల మందికి అందచేశారు. మిథునం శ్రీరమణ మనసులో బాల్యం నుంచి నాటుకున్న ఆలోచనలకు అక్షరరూపం. ఇది ఎన్నో సంప్రదాయ కుటుంబాల కథ అని శ్రీరమణ చెబుతుంటారు. 

 

 ఇరవయ్యేళ్లకు పైగా ఒక ఇంట్లో తల్లిదండ్రుల చాటుగా పెరిగిన అమ్మాయి పెళ్లయ్యి కొత్త ఇంటికి వెళ్లి అక్కడివారిని తనవారిగా చేసుకోవడం కష్టం. వారితో సర్దుకుపోవడమంటే, ఆమెకు పునర్జన్మలాంటిదే. సక్సెస్‌ఫుల్ ఫ్యామిలీ లైఫ్ అనేది ఒక వరం. మా జానకి ఆ విషయంలో పూర్తిగా విజయం సాధించినట్లే.

 - శ్రీరమణస

 

 వివాహబంధం లో ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. భరించాలి, సహించాలి. మంచిచెడులు ఇద్దరిలోనూ ఉంటాయి. స్త్రీకి సహనం అనేది తెలియకుండానే అలవడుతుంది. ఎలాంటి తొందరపాటు పరిస్థితులలోనైనా భార్యాభర్తల్ని కలిపి ఉంచడానికి అది ఎంతగానో ఉపయోగపడుతుంది.

 - జానకి

  - డా.పురాణపండ వైజయంతి

 
Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top