సమాజానికి చికిత్స చేసిన వైద్యుడు

సమాజానికి చికిత్స చేసిన వైద్యుడు

  • హైదరాబాదీ - డాక్టర్ రాజబహదూర్ గౌర్

  • సమానతలు లేని సమాజానికి చికిత్స చేసిన వైద్యుడాయన. అంతేకాదు, ఆయన విప్లవకారుడు, సాహితీ ప్రియుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, కార్మిక నాయకుడు కూడా. హైదరాబాద్ పాతబస్తీలోని గౌలిపురాలో పుట్టి పెరిగిన రాజ్‌బహదూర్ గౌర్ ఇక్కడి ఉస్మానియా మెడికల్ కాలేజీ నుంచి పట్టభద్రుడైన తొలితరం వైద్యుల్లో ఒకరు. చదువుకున్నది వైద్యశాస్త్రమే అయినా, రోగులకు చికిత్స చేయడం కంటే సమాజానికే చికిత్స చేయాల్సిన అవసరం ఎక్కువగా ఉందని భావించి, ఉద్యమ కార్యాచరణలోకి దూకారాయన.



    నిజాం రాజ్యంలో అప్పట్లో అందరి మాదిరిగానే తప్పనిసరిగానే ఉర్దూ మీడియంలో చదువుకున్న గౌర్, ఉర్దూ సాహిత్యాభిమానిగా మారారు. నిజాం సర్కారు దాష్టీకాలను సహించలేక తిరగబడ్డ యువకులతో చేయి చేయి కలిపి ముందుకు నడిచారు. మగ్దూం మొహియుద్దీన్, జావేద్ రిజ్వీ తదితరులతో కలసి కామ్రేడ్స్ అసోసియేషన్ స్థాపించారు. నిజాం సర్కారు ఆ సంస్థను నిషేధించింది. హైదరాబాద్‌లో కమ్యూనిస్టు పార్టీ వేళ్లూనుకోవడంలో కామ్రేడ్స్ అసోసియేషన్ కీలక పాత్ర పోషించింది.



    నిబద్ధత గల కమ్యూనిస్టు కార్యకర్తగా గౌర్, తెలంగాణ సాయుధ పోరాటం సహా పలు ఉద్యమాల్లో పాల్గొన్నారు. మగ్దూంతో కలసి పలు కార్మిక సంఘాలను స్థాపించారు. అవన్నీ సంఘటితమై శక్తిమంతమైన ఆల్ హైదరాబాద్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్‌గా రూపుదిద్దుకున్నాయి. ఆల్ హైదరాబాద్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్‌లో దాదాపు 70 వేల మంది సభ్యులు ఉండేవారు. అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది ఏఐటీయూసీలో విలీనమైంది.

     

    జైలు నుంచి పెద్దల సభకు



    నిజాం సర్కారుకు వ్యతిరేకంగా పోరాడిన రాజ్ బహదూర్ గౌర్, నిజాం పోలీసుల చేతిలో నానా యాతన అనుభవించారు. పోలీసుల చేతికి చిక్కిన సందర్భాల్లో గౌర్, రెండుసార్లు తప్పించుకుని, అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. రాచకొండ అడవుల్లో తలదాచుకున్న సమయంలో పట్టుబడ్డ గౌర్‌ను నిజాం పోలీసులు జైలుకు తరలించారు.



    హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనమైన తర్వాత కూడా ఆయన జైలులోనే మగ్గాల్సి వచ్చింది. కమ్యూనిస్టు పార్టీ తొలి రాజ్యసభ ఎన్నికల్లో తమ అభ్యర్థిగా గౌర్‌ను నిలపగా, ఆయన గెలుపొందారు. రాజ్యసభకు ఎన్నికైన తర్వాతనే ఆయన ప్రభుత్వ ఆదేశాలతో 1951లో జైలు నుంచి విడుదల కాగలిగారు. గౌర్ రెండో పర్యాయం కూడా రాజ్యసభకు ఎన్నికయ్యారు.



    ఆ తర్వాత ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శిగా, సీపీఐ హైదరాబాద్ నగర శాఖ కార్యదర్శిగా సేవలందించారు. మూడోసారి కూడా తనను రాజ్యసభకు పంపాలని పార్టీ నేతలు ప్రతిపాదనను ముందుకు తెస్తే, కొత్తవారికి అవకాశం ఇవ్వాలంటూ గౌర్ ఆ ప్రతిపాదనను తోసిపుచ్చారు.

     

    ఉర్దూతో అనుబంధం

    అంజుమన్ తరక్కీ-ఏ-ఉర్దూ సాహితీ సంస్థతో నాలుగు దశాబ్దాలకు పైగా అనుబంధం కొనసాగించిన గౌర్, ఆ సంస్థకు అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. మాజీ ఎంపీగా తనకు లభించిన పింఛను బకాయిల మొత్తం మూడు లక్షల రూపాయాలను ఆ సంస్థకు విరాళంగా ఇచ్చారు. తన జీవితకాలంలో సేకరించిన విలువైన పుస్తకాలను ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్‌కు, తన బ్యాంకు బ్యాలెన్స్‌ను పార్టీకి ఇచ్చేశారు. తన తొంబైమూడో ఏట 2011 అక్టోబర్ 7న తుదిశ్వాస విడిచిన గౌర్, తన కళ్లను ఎల్‌వీ ప్రసాద్ ఆస్పత్రికి, భౌతికకాయాన్ని వైద్య పరిశోధనల కోసం ఉస్మానియా ఆస్పత్రికి చెందేలా వీలునామా రాశారు



    - పన్యాల జగన్నాథదాసు

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top