కొలువు వేటలో కొత్తదనం చూపండి!

కొలువు వేటలో కొత్తదనం చూపండి! - Sakshi


జాబ్ స్కిల్స్: ఉద్యోగం కావాలంటే.. సంస్థ విడుదల చేసే నోటిఫికేషన్ చూసి, కాగితంపై దరఖాస్తు రాసి, పోస్టులో పంపే పాత పద్ధతికి ఇప్పుడు కాలం చెల్లింది. అంతర్జాలంలో, సామాజిక మాధ్యమాల్లో ఉద్యోగ ప్రకటనలు వెలువడుతున్నాయి. కంపెనీలు అభ్యర్థుల దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరిస్తున్నాయి. తమకు తగిన అభ్యర్థి అవునో కాదో తేల్చేసి, ఆన్‌లైన్‌లోనే సమాచారం ఇస్తున్నాయి. అభ్యర్థులు ఉద్యోగాల వేటలో కొత్తదనం చూపితేనే విజయం సాధించగలు గుతున్నారు. ఇందుకు ఐదు మార్గాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. అవేమిటో తెలుసుకుందాం..

 

 స్నేహితులను పెంచుకోండి


 ఉద్యోగాల భర్తీకి ఖాళీల సంఖ్యను, దరఖాస్తు విధానాన్ని పేర్కొంటూ నోటిఫికేషన్‌ను విడుదల చేసే విధానాన్ని కంపెనీలు అమలు చేయడం లేదు. ప్రధానంగా కొత్తగా ఏర్పాటైన సంస్థలు, స్టార్ట్‌అప్‌లు రిఫరెన్స్ బేస్డ్ హైరింగ్ విధానానికి శ్రీకారం చుట్టాయి. అంటే.. తమకు తెలిసినవారి ద్వారా ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. వారు సిఫార్సు చేసిన అభ్యర్థులను చేర్చుకుంటున్నాయి. కాబట్టి ప్రముఖ కంపెనీల్లో పనిచేస్తున్న వారితో స్నేహ సంబంధాలను ఏర్పరచుకోవాలి. స్నేహితుల సంఖ్యను పెంచుకోవాలి. సంస్థల్లో ఏవైనా ఖాళీలు ఏర్పడినప్పుడు వారు మీకు తెలియజేస్తారు. మీ పేరును సిఫార్సు చేస్తారు.

 

 మీ రెజ్యుమె సక్రమమేనా?

 ఉద్యోగ సాధనలో కీలకపాత్ర పోషించేది ఆకర్షణీయమైన రెజ్యుమె. ప్రస్తుతం ఉన్నవాటిలో 80-90 శాతం రెజ్యుమెలు సదరు అభ్యర్థిని సక్రమంగా మార్కెట్ చేయడం లేదని ఓ అధ్యయనంలో తేలింది. అంటే.. అభ్యర్థిని ఉద్యోగిగా మార్చే లక్షణాలు వాటిలో లేవని వెల్లడైంది. రెజ్యుమె అనేది అభ్యర్థి అర్హతలను, గుణగణాలను సరిగ్గా ప్రతిబింబించాలి. అప్పుడే అనుకున్న ఫలితం వస్తుంది. మంచి రెజ్యుమెను తయారు చేసుకోవడం రాకపోతే రెజ్యుమె రైటర్‌ను సంప్రదించడంలో తప్పులేదు. రెజ్యుమె రచనపై ఇంటర్‌నెట్‌లో చాలా సమాచారం అందుబాటులో ఉంది. అది చదివి, మీ రెజ్యుమెను తీర్చిదిద్దుకోండి. రెజ్యుమెపై మీ ఫోటోను అతికించడం మర్చిపోకండి. ఎందుకంటే.. ఫోటోతో కూడిన రెజ్యుమె సంస్థల యాజమాన్యాలను అధికంగా ఆకట్టుకుంటున్నట్లు సర్వేలో స్పష్టమైంది.

 

 హోం వర్క్ చేయండి

దరఖాస్తును పంపించడాని కంటే ముందే సదరు సంస్థ, యాజమాన్యం గురించి తెలుసుకోవాలి. దానిపై కొంత హోంవర్క్ తప్పనిసరిగా చేయాలి. లేకపోతే ఇంటర్వ్యూలో సంస్థ గురించి చెప్పమంటే తెల్లమొహం వేస్తారు. ఆశించిన ఉద్యోగం దక్కక నిరాశ చెందాల్సి వస్తుంది. కాబట్టి కంపెనీ అవసరాల గురించి అవగాహన పెంచుకోవాలి. ఆయా అవసరాలను తీర్చే అర్హతలు, లక్షణాలు, అనుభవం మీలో ఉన్నాయో లేదో సమీక్షించుకోవాలి. ఉంటే.. దరఖాస్తును నిరభ్యంతరంగా సంస్థకు పంపించొచ్చు.   

 

 మీరేం చేయగలరు?

  మీ బలాలు, బలహీనతలు మీకు తెలిసి ఉండాలి. మీలోని ప్రత్యేక నైపుణ్యాలపై మీకు అవగాహన ఉండాలి. అందుకు నిజాయతీగా సమీక్ష చేసుకోవాలి. మీకు ఉద్యోగం ఇస్తున్న సంస్థకు బదులుగా మీరేం ఇవ్వగలరో తెలుసుకోవాలి. మీ నుంచి సంస్థ ఆశిస్తున్న ప్రతిఫలం మీరు ఇచ్చేలా ముందే సర్వ సన్నద్ధం కావాలి.

 

 సోషల్ మీడియాను ఫాలో కావాలి

 చాలా సంస్థలు లింక్డ్‌ఇన్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో కంపెనీ పేజీని నిర్వహిస్తున్నారు. సంస్థలో ఖాళీల సమాచారాన్ని వాటిలో ఎప్పటికప్పుడు పొందుపరుస్తున్నాయి. సోషల్ మీడియాను ఫాలో అయితే ఈ సమాచారం సులువుగా తెలుస్తుంది.

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top