షహర్ కీ షాన్ దప్పిక తీర్చే తొట్టె

షహర్ కీ షాన్ దప్పిక తీర్చే తొట్టె


ఈ రాతి తొట్టెని చూశారా.. నగరంలోనిపురావస్తు విభాగం సంచాలకుల కార్యాలయ ఆవరణలో ఉన్న శ్రీశైలం పెవిలియన్ మ్యూజియం ముందు అనామకంగా ఉంది. 24 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పుతో అఖండ రాయిపై దీన్ని చెక్కారు. ఒకప్పుడు దీన్ని చూస్తే మూగజీవాలకు ప్రాణం లేచొచ్చేది. వేసవిలో వాటి దప్పిక తీర్చి ‘జీవకారుణ్యా’న్ని చాటింది. పశుపక్ష్యాదులపై నాటి పాలకులు చాటుకున్న ప్రేమకు ప్రతిరూపం. మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ ప్రాంతంలో లభించిందీ రాతి తొట్టె.

 

 అప్పటి వరకు చెరువు నీటితో గొంతు తడుపుకున్న జంతువులు మండు వేసవిలో నీటి కోసం అల్లాడేవి. నీళ్లు దొరక్క నోరు పిడచకట్టుకుపోయి ప్రాణం వదిలే సందర్భాలెన్నో. వాటికా దుస్థితి రానీయకుండా కాకతీయుల కాలంలో ఇలాంటి భారీ రాతి తొట్టెలను రూపొందించి అటవీ మార్గంలో ఏర్పాటు చేసేవారు. జంతువులు, పాదచారుల దప్పికను తీర్చేవి.



కాకతీయుల కాలం తర్వాత దక్కన్ పీఠభూమిని పాలించిన రాచకొండ రాజుల కాలంలోనూ ఇలాంటి ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం భాగ్యనగరం విస్తరించిన ప్రాంతం చుట్టుపక్కల ఇన్ని చెరువులు విలసిల్లటానికి కూడా నాటి ప్రణాళికే కారణం. వేసవిలో చెరువులు వట్టిపోతుండటంతో ఇలాంటి రాతి తొట్టెలను ప్రధాన అటవీ మార్గాలు, ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసి రెండుమూడు రోజులకోమారు వాటిని నీటితో నింపేవారు. కృష్ణదేవరాయ కాలంలో కూడా ఇలాంటి వ్యవస్థ ఉండేదని చరిత్ర చెబుతోంది.  

 

దీన్ని ఈ మహానగరాన్ని నిర్మించిన కుతుబ్‌షాహీలు ఆనవాయితీగా మార్చుకున్నారు. ఇప్పుడు ఎండాకాలంలో వాడవాడలా వెలిసే చలివేంద్రాలు అప్పట్లో విరివిగా ఉండేవి. దప్పికను తీర్చటమే కాకుండా పరమత సహనానికీ అది ప్రతీకగా నిలిచేది. పట్టణ ప్రజల కోసం చలివేంద్రాలతో పాటు పక్షుల కోసం ప్రత్యేక నీటి తొట్టెలను ఏర్పాటు చేయించారు.



ఇప్పుడు ఇతర పక్షులు దాదాపు కనుమరుగు కాగా పావురాలు మాత్రం గుంపులుగా తిరగటం చూస్తున్నాం. అప్పట్లో పావురాలకు ప్రత్యేక స్థానం ఉండేది. వాటికి గింజలు వేసి ఆకలి తీర్చినా, నీళ్లు పోసి దప్పిక దూరం చేసినా మేలు జరుగుతుందనే నమ్మకం ఉండటమే కారణం. ఇందు కోసం నగరంలో పావురాల కోసం నీటి తొట్టెలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు నాంపల్లి రైల్వే స్టేషన్ ముందు కనిపించే ఏర్పాటు అనాదిగా వస్తున్నదే.

 

 

మొఘల్ కాలంలో...

సంపదకు నెలవైన దక్కన్ పీఠభూమిపై జెండా ఎగరేయాలని ఉబలాటపడి ఈ ప్రాంతంపై దండెత్తిన మొఘల్ చక్రవర్తుల కాలంలో మంచినీటి కోసం ఏర్పాట్లు గొప్పగా ఉండేవి. అయితే ఇది స్థానిక ప్రజలపై ప్రేమతో కాక... తమ సైనిక పటాలాలు ఇబ్బంది పడకుండా చేసిన ఏర్పాట్లు మాత్రమే. దక్కన్ పీఠభూమిలో గజం స్థలం కూడా వదలొద్దన్న పట్టుదలతో ఊరూవాడా సైనికులు చేరుకునే ప్రయత్నం జరిగింది.



ఏ సమయంలో ఏ ప్రాంతం మీదుగా వారు వెళ్లాల్సి ఉంటుందో తెలియని పరిస్థితిలో... పట్టణాలు, గ్రామాలు, అడవులు అన్న తేడా లేకుండా తన సైనిక పటాలం సంచరించే అన్ని ప్రాంతాల్లో రాతి తొట్లను ఏర్పాటు చేసి వాటి నిండా నీళ్లు నింపి పెట్టేవారు. ఆ ప్రాంతం గుండా వెళ్లే సైనికులు, గుర్రాల దాహాన్ని అవి తీర్చేవి. కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీలు కూడా దాన్ని కొనసాగించారు.

 

ధార్మిక కార్యక్రమాలప్పుడు...

మొఘల్ చక్రవర్తులు స్థానికుల అవసరాలకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదు. కానీ కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీల హయాంలో ప్రజల కోసం ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి. హిందూ ముస్లింల మధ్య సఖ్యత అంతంతమాత్రంగానే ఉన్నా... కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం ఇది పరమత సహనానికి దోహదం చేసింది. ముఖ్యంగా ధార్మిక వేడుకల్లో పాల్గొనేవారి దాహార్తి తీర్చేందుకు ప్రత్యేక చలువ పందిళ్లు, వాటిల్లో మంచినీటి కుండలు, మజ్జిగ జాడీలను ఏర్పాటు చేసేవారు. మతాలతీతంగా ఇవి సేవలందించాయి.

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top