నిరుద్యోగ భారతం!


సంపాదకీయం



యువత కోసం ఎంతో చేశామని, మళ్లీ అధికారమిస్తే ఇంతకింతా చేస్తామని హామీ ఇస్తున్న యూపీఏ సర్కారు వంచనను జాతీయ నమూనా సంస్థ(ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) తాజా గణాంకాలు బయటపెట్టాయి. దేశవ్యాప్తంగా ఆ సంస్థ చేసిన సర్వేలోని ఫలితాలు చూస్తే అధికార పక్షానికి ఎటూ కళ్లు తిరుగుతాయి. ఆ పీఠాన్ని అందుకోవాలని ఆశిస్తున్న పార్టీలకు సైతం ఆ సమస్య పరిష్కారం పెను సవాల్‌గా మారనున్నదని అర్ధమవుతుంది. యువతలో నానాటికీ పెరుగుతున్న నిరుద్యోగితను మాత్రమే ఈ సర్వే చెప్పి ఊరుకోలేదు. చదువులు పెరుగుతున్నకొద్దీ ఆ నిరుద్యోగం పెనుభూతమవుతున్న తీరును వెల్లడించింది.



యువతీ యువకులిద్దరిలోనూ ఈ ధోరణి కనబడుతున్నదని ఎన్‌ఎస్‌ఎస్‌ఓ నివేదిక చెబుతోంది. పట్టణ ప్రాంతాల్లో పట్టా పొందిన 29 ఏళ్ల లోపు యువకుల్లో 16.3 శాతంమంది నిరుద్యోగులని సర్వే వివరించింది. గత దశాబ్దకాలంలో ఈ గ్రూపులోని యువకుల్లో నిరుద్యోగిత ప్రమాదకర స్థాయికి చేరిందని అంటున్నది. వీరికి డిప్లొమోలు, ఇతర సర్టిఫికెట్లు పొందిన వారిని జతచేస్తే ఈ శాతం 38.8కి చేరుతుందని చెబుతోంది. మరో రకంగా చెప్పాలంటే కళాశాలలో పట్టానో, వృత్తి విద్యలో నైపుణ్యాన్నో పొందిన ప్రతి నలుగురు యువకుల్లోనూ ఒకరు నిరుద్యో గులుగా మిగులుతున్నారు. ఇక పట్టభద్రులైన యువతుల విషయానికొస్తే గ్రామీణ ప్రాంతాల్లో 29.6 శాతంమంది, పట్టణ ప్రాంతాల్లో 23.4 శాతం మంది నిరుద్యోగులుగా ఉంటున్నారు. ఈ గణాంకాలన్నీ 2011-12 సంవత్సరంలో సేకరించినవి. చక్కగా చదువుకుంటే, పట్టా సంపాదిస్తే ఉద్యోగం వస్తుందని, జీవితంలో స్థిరపడవచ్చునని ఆశించడం ఎండ మావిని నమ్ముకుని పరుగు తీయడమేనని గణాంకాలు చెబుతున్నాయి.



పల్లెపట్టుల్లోని నిరక్షరాస్యులైన యువకుల్లో నిరుద్యోగిత 2.3 శాతం ఉండగా, పట్టణ ప్రాంతాల్లో ఇది 2.5 శాతంగా ఉంది. పై చదువులకు వెళ్లేకొద్దీ ఈ నిరుద్యోగిత పెరుగుతూ పోతున్నది. గత నెలలో అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్‌ఓ) ఆసియా-పసిఫిక్ విభాగం విడు దల చేసిన నివేదిక సైతం దీన్నే ధ్రువప రుస్తోంది. అక్షరాస్యత పెరిగి చదువుకునే వారి సంఖ్య క్రమేపీ పెరుగుతున్నదని అనుకుంటున్నా ఆ చదువులు నిరుద్యోగుల్ని పెంచినంతగా ఉపాధి అవకాశాలను చూపలేకపోతున్నాయి. తయారీ, సేవల రంగాలకు అవసరమైన నైపుణ్యాన్ని వారు చదివే చదువులు అందించలేకపోతు న్నాయి. కళాశాలల్లో సరైన ల్యాబ్ వసతులు లేకపోవడం, బోధనా ప్రమాణాలు అంతంతమాత్రంగా ఉండటంవల్లే వీరు నిరుద్యోగులు గానో, తమ అర్హతకు సంబంధమేలేని చిరు ఉద్యోగాల్లోనో కాలక్షేపం చేయాల్సివస్తోంది. పదో తరగతి అర్హత సరిపోయే ఉద్యోగాలకు సైతం ఎంబీయే, ఎంటెక్ వంటి కోర్సులు పూర్తిచేసినవారు క్యూ కడుతున్నారు.



  ఒకప్పుడు సర్కారీ ఉద్యోగాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న ఉపాధి కల్పనా కేంద్రాలు నేడు పనీపాటాలేని కేంద్రాలయ్యాయి. ఉపాధి కల్పన శాఖ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చాకే ప్రభుత్వోద్యోగాలను భర్తీ చేయాలన్న నిబంధనను పదహారేళ్లనాడు సుప్రీంకోర్టు  సవరించడంతో ఈ స్థితి ఏర్పడింది. అటు మీదట ప్రభుత్వోద్యోగాలన్నీ సర్వీస్ కమిషన్ల ద్వారా, డీఎస్సీవంటివాటిద్వారా భర్తీ చేయడం మొదలుపెట్టారు. పర్యవసానంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పనా కేంద్రాలతో పనిలేకుండా పోయింది. ఇప్పుడు కూడా ఆ కేంద్రాల్లో పేర్లు నమోదు చేయించుకుంటున్నవారు లేకపోలేదుగానీ రిజిస్టర్ చేయించుకోనివారి సంఖ్య అంతకు నాలుగైదు రెట్లు ఉంటున్నది.  వ్యవసాయ రంగంలో ఏర్పడిన పెను సంక్షోభం ఈ నిరుద్యోగ భారతాన్ని మరింతగా పెంచుతోంది.



విత్తనాలు మొదలుకొని ఎరువులు, పురుగుమందులు వగైరా ధరలన్నీ కొండెక్కి కూర్చుని సాగు చేయడం పెను భారంగా మారిన నేపథ్యంలో ఆ రంగంనుంచి తప్పుకుంటున్నవారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. రోజుకు 2,000మంది సాగు రంగంనుంచి తప్పుకుంటున్నారని ఆమధ్య ఒక సర్వే వెల్లడించింది. అయితే, వెలుపల కూడా పరిస్థితులు సవ్యంగా లేని కారణంగా ఇలాంటివారంతా ఎంతో అస్థిరంగా ఉండే నిర్మాణరంగం, చిల్లరవర్తకం, వ్యక్తిగత సేవారంగంవంటిచోట సర్దుకోవాల్సి వస్తోంది. నామమాత్రపు వేతనాలతో రోజులు వెళ్లదీయాల్సివస్తోంది. దేశంలో పుష్కలంగా ఉన్న మానవ వనరులను వినియోగించుకోవడంలో మన వైఫల్యాన్ని ఈ గణాంకాలు పట్టిచూపుతున్నాయి.

 

ఈసారి దేశంలోని ఓటర్లలో సగంమంది అంటే...39 కోట్లమంది యువతే. అందులో 8 కోట్లమంది మొదటిసారి ఓటర్లు. ప్రతి లోక్‌సభ స్థానంలోనూ సగటున 90,000మంది యువ ఓటర్లున్నారు. అందువల్లే ప్రధాన పార్టీలన్నీ యువకులకు ఉపాధి అవకాశాల గురించి ఊదరగొడుతున్నాయి. పదేళ్ల పాలనాకాలంలో తన విధానాలద్వారా నిరుద్యోగితను ఎంతగానో పెంచిన యూపీఏ సర్కారు వందరోజుల్లో 10 కోట్ల ఉద్యోగాలకు ఎజెండా రూపొందిస్తానని చెబుతోంది. స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ) ఒక్క శాతం పెరిగితే దాదాపు పది లక్షల ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని అంటారు. ఈ పదేళ్లకాలంలో సగటున ఏటా 7.6శాతం జీడీపీ నమోదైనా అది ఎగుడుదిగుళ్ల ప్రయాణమే. గత ఆర్ధిక సంవత్సరానికి అది 4.9 శాతంవద్దే ఆగిపోయింది.



కనుక కొత్త ఉద్యోగావకాశాల మాట అటుంచి ఉన్న ఉపాధి అవకాశాలకే కోతపడింది. మౌలిక సదుపాయాలు కరువై పరిశ్రమలు మూతబడి లక్షలమంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఇక కొత్తగా చదువులు పూర్తయినవారికి ఉద్యోగాలెక్కడ? జీవన నైపుణ్యాన్ని పెంచేలా, భిన్న రంగాల్లో సమర్థులైన నిపుణులు తయారయ్యేలా విద్యారంగాన్ని రూపొందించడంతోపాటు వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, గ్రామీణ పరిశ్రమలకు చేయూతనిస్తేనే నిరుద్యోగాన్ని పారదోలడం సాధ్యమవుతుంది.

 

 

 

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top