ప్రతి పదం జనహితం కావాలి...

ప్రతి పదం జనహితం కావాలి...


 కళాత్మకం : ప్రఖ్యాత కవి డాక్టర్ సి.నారాయణరెడ్డి 83వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా వంశీ ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో సినారె నూతన కవితా సంపుటి ‘అలలెత్తే అడుగులు’ గ్రంథావిష్కరణ జరిగింది. దీంతో పాటు సినారె మునిమనుమరాలు వరేణ్యరెడ్డి రచించిన ‘బీమింగ్ రిఫ్లెక్షన్స్’ ఆంగ్ల కవితా సంపుటి ఆవిష్కరణ కార్యక్రమాన్ని రవీంద్రభారతి సమావేశ మందిరంలో నిర్వహించారు. ఆ సందర్భంగా సినారె కవిత్వ వారసురాలు వరేణ్యతో జరిపిన ఇంటర్వ్యూ... కవిత్వం రాయాలనుకోవడానికి ప్రేరణ ఏమిటి?

చుట్టూ చోటుచేసుకునే సంఘటనలు, చూసే ప్రదేశాలు ప్రత్యేకంగా కనిపిస్తే సహజంగానే నాకు నేనుగా ప్రేరణ పొందేదాన్ని. ఆ సమయంలో నాకు వచ్చిన ఆలోచనలకు అక్షరరూపం ఇచ్చేదాన్ని. అవి కవిత్వంగా రూపాంతరం చెందుతాయని తర్వాత తెలిసింది.  సినారె సాహిత్యం చదివారా?

సాహిత్యానికి సంబంధించిన మంచిమంచి పుస్తకాలు చదివాను. అందులో మా తాత సినారె గారివి కూడా ఉన్నాయి. ఒక్కటనేమిటి కర్పూరవసంతరాయలు, ప్రపంచపదులు, గజల్స్ చదివాను. ఎప్పటికప్పుడు కొత్తగా వస్తున్న కవిత్వం కూడా చదువుతాను.  కవిత్వం రాయడంలో తాతగారి ప్రభావం ఉందా?

నాకు నేనుగా రాస్తున్నాను. నేను ఫస్ట్ క్లాసులో ఉన్నప్పుడు అమెరికాలో చిన్నచిన్న కథనాలు రాసేదాన్ని. మూడవ తరగతిలో ఇండియాకు వచ్చినప్పుడు కూడా స్కూల్‌లో జరిగే కాంపిటీషన్స్‌లో పాల్గొని రాసేదాన్ని. ఆంగ్ల సాహిత్యంలో ఎలాంటి రచనలంటే ఇష్టం?

ప్రకృతిని కేంద్రంగా చేసుకొని రాసిన రచనలు, రకరకాల మనుషుల మనస్తత్వాన్ని ఆవిష్కరించే పుస్తకాలు ఎక్కువగా చదువుతాను. ఓల్గా రచనలతో పరిచయం ఉందా? మీరు రాసిన ‘బీమింగ్ రిఫ్లెక్షన్స్’ ఆంగ్ల కవితా సంపుటికి ఓల్గా ముందుమాట రాశారు కదా?

ఓల్గా రచనల గురించి పెద్దలు చెప్పగా విన్నాను. అంతకుమించి పరిచయం లేదు. నేను రాసిన కవిత్వాన్ని ఓల్గాకు చూపించాను. ఆమె ప్రశంసించారు. స్త్రీవాద సాహిత్యం లోతుల్లోకి వెళ్లలేదు. ‘బీమింగ్ రిఫ్లెక్షన్స్’ గురించి చెప్పండి...

‘బీమింగ్ రిఫ్లెక్షన్స్’ నా మూడవ కవితా సంపుటి. మొదటి రెండింటికి మంచి స్పందన వచ్చింది. మూడవదానిలో కూడా ఆలోచనలు రేకెత్తించే కవిత్వం రాశాను. ప్రతి మనిషికి సమస్యలుంటాయి. వాటిని చూసి భయపడకూడదు. వాటిని చిన్నవిగా చేసి చూసుకుంటే, వెంటనే పరిష్కారానికితగ్గ ఆలోచనలు స్ఫురిస్తాయి. సమస్య పరిష్కారం అవుతుంది.

  మీ చదువు గురించి...

కొండాపూర్‌లోని చిరేక్ పబ్లిక్ స్కూల్‌లో ఎనిమిదవ తరగతి చదువుతున్నాను. ఒకటి, రెండు తరగతులు అమెరికాలో చదివాను. మూడవ తరగతికి మా ఫ్యామిలీ హైదరాబాద్‌కు వచ్చేసింది. భవిష్యత్ లక్ష్యం ఏమిటి?

ప్రతి పదం జనహితం లాంటి కవిత్వాన్ని రాస్తూనే.. మెడిసిన్ చదివి, మనస్తత్వ శాస్త్రవేత్త కావాలని నా కోరిక. ఆ శాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించి ప్రజలకు సేవ చేస్తాను. తాతయ్య అభిరుచి, ఆశయాలను నిలబెడతాను.

 - కోన సుధాకర్ రెడ్డి- వరేణ్యరెడ్డి,  కవయిత్రి

 

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top