చప్పట్లు కొట్టండి.. సాధించండి: నితీష్

చప్పట్లు కొట్టండి.. సాధించండి: నితీష్ - Sakshi


మహేష్బాబు హీరోగా నటించిన అతడు సినిమా చూశారా, ఆ సినిమా ప్రారంభంలో భారీ బహిరంగ సభ జరుగుతుంటుంది. ప్రతిపక్ష నేత(సొయాజీ షిండే)గా ఉన్న తన తండ్రి  ఏం కావాలని కోరుకుంటున్నారని అతడి కుమారుడు అజయ్ (సినిమాలో ప్రతాప్ రెడ్డి పాత్ర) సభకు వచ్చిన ప్రజలను ప్రశ్నిస్తే సీఎం కావాలనుకుంటున్నారని అక్కడనున్న వారంతా నిదానంగా అంటారు. అందుకు అజయ్ ప్రతిస్పందిస్తూ గట్టిగా అసెంబ్లీకి వినపడాలని సభకు వచ్చిన కోరతాడు. షిండే సీఎం కావాలని అప్పుడు గట్టిగా నినదిస్తారు.



ఇక అసలు విషయానికి వస్తే బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా ఇదే తరహాలో తమ రాష్ట్ర ప్రజలకు ఒక విజ్ఞప్తి చేశారు. జనమంతా వీధుల్లోకి వచ్చి ఐదు నిమిషాల పాటు గట్టిగా చప్పట్లు కొట్టాలని కోరారు. తమ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ మార్చి 2న బీహార్ బంద్కు నితీష్ కుమార్ పిలుపునిచ్చారు. బంద్లో పాల్గొని చప్పట్లు కొట్టాలని బీహార్ ప్రజలకు ఆయన సూచించారు. చప్పట్ల శబ్దానికి ఢిల్లీ పెద్దలు అదరిపడి బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రసాదించాలన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది బీహార్ ప్రజల ప్రాధమిక హక్కు అని నితీష్ పేర్కొన్నారు. ఆర్థికంగా వెనకబడిన బీహార్ ప్రత్యేక హోదాతో త్వరిత గతిన అభివృద్ధి సాధిస్తుందని ఆయన ఆకాంక్షిస్తున్నారు.



బీహార్కు ప్రత్యేక హోదా కల్పించాలని చాలా కాలం నుంచి కేంద్రాన్ని నితీష్ కోరుతున్నారు. ఆయన విజ్ఞప్తులను కేంద్రం పెడచెవిన పెట్టింది. నిన్నగాక మొన్న ఆంధ్రప్రదేశ్లోని సీమాంధ్రకు ప్రత్యేక హోదా ఇస్తున్నట్టు ప్రధాని రాజ్యసభలో ప్రకటించడంతో పుండు మీద కారం చల్లినట్టియింది. ఎప్పటి నుంచో అడుగుతున్న తమను కాదని సీమాంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వడంతో బీహార్ సీఎం అగ్గిమీద గుగ్గిలమైయ్యారు. ముఖ్యమంత్రి హోదాలో బంద్కు పిలుపు నివ్వడమే కాకుండా చప్పట్ల నిరసన చేపట్టాలని తమ రాష్ట్ర ప్రజలకు సూచించారు. బీహారీల చప్పట్ల సౌండ్ యూపీఏ పాలకులకు విన్పిస్తోందో, లేదో చూడాలి.

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top