మహిళాభ్యున్నతికి ‘సాక్షి’ సంతకం.. నేను శక్తి

YS Bharathi message on Nenu Sakthi, 'Sakshi' sign for women Progression

తూటాలకు గాయపడిన వ్యక్తిగా నన్ను గుర్తించాలని అనుకోవడం లేదు.. ఆ తూటాలకు ఎదురొడ్డిన శక్తిగా గుర్తించాలని కోరుకుంటున్నా – మలాలా యూసఫ్‌ జాయ్‌

ప్రతి మహిళా ఓ శక్తి స్వరూపిణి! అనేకానేక ఘర్షణల మధ్య, అసమానతల మధ్య తనను తాను నిరూపించుకుంటూ ముందుకు సాగుతున్న మహిళలెందరో. ఈ అణచివేతలు.. అసమానతలు ఛేదించుకొని మహిళలు ఓ మహోజ్వల శక్తిగా వెలగాలన్నది ‘సాక్షి’ సంకల్పం.

ఈ క్రమంలో మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా  మహిళల చుట్టూ అల్లుకున్న సమస్యలను, పరిష్కారాలను పాఠకుల ముందుంచేందుకు మా తరఫు ప్రయత్నమే ‘నేను శక్తి’.

ఈ విషయాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని మా సంస్థలోని మహిళా ఉద్యోగులం, ఇతర ఎడిటోరియల్‌ సభ్యులతో కూర్చొని చర్చించాం. ప్రతీ మహిళా ఉద్యోగి తన అనుభవాలను పంచుకున్నారు. సలహాలు, సూచనలు ఇచ్చారు. వీటన్నింటినీ చర్చించి, సమీక్షించి, ఏవి పాఠకుల ముందు ఉంచాలో ఆలోచించాం. చివరికి నాలుగు అంశాలపై దృష్టి పెట్టాలని సంకల్పించాం. అవి
లింగ వివక్ష
గృహ హింస
వేధింపులు
సాధికారత

మనలో ఎందరో పై సమస్యలతో సతమత మవుతున్నారు. వారికి వారి హక్కులేమిటో, ఇప్పుడున్న క్లిష్టపరిస్థితి నుంచి ఏవిధంగా బయటపడవచ్చో తెలపాలని అనుకున్నాం. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నవారు వాటి నుంచి ఎలా గట్టెక్కగలిగారో తెలియజేయాలని భావించాం.

అలాగే మనలో కొంతమందికి ఇంత పెద్ద సమస్యలు అనుభవంలోకి రాకపోవచ్చు, కనబడకపోవచ్చు. అటువంటి వారికి విజ్ఞప్తి ఒక్కటే. మాకు సంబంధం లేదంటూ దూరంగా ఉండకండి. సాటి స్త్రీలపైన జరుగుతున్న నేరాలను నిరోధించేందుకు మీరు ఏమి చేయగలరో ఆలోచించండి. గృహ హింస నిరోధించడానికి కాలింగ్‌బెల్‌ నొక్కి ‘లోపల ఏమి జరుగుతోంది?’ అని గట్టిగా ప్రశ్నించడం వంటి చిన్న చొరవ సైతం మహోపకారమే అవుతుంది. సమాజంలోని ప్రతి ఒక్కరం మనం చేయగలిగింది చేస్తేనే.. అఘాయిత్యాలను, అసమానతలను ఆపగలుగుతాం.

కొంతమంది పురుషులకు ఇవేవీ వారికి సంబంధించిన విషయంగా అన్పించకపోవచ్చు. కానీ ప్రతి పురుషుడి జీవితం తనను ప్రేమించే తల్లి, తాను ప్రేమించే చెల్లి, కూతురు, భార్య, స్నేహితురాలు.. వీరందరి చుట్టూనే పెనవేసుకుపోయింది. వీరందరిపట్లా పురుషుడికి బాధ్యత కూడా ఉంటుంది.

ఈ మాటలు రాస్తున్న సమయంలో ‘మహిళలు చేస్తున్న నేరాల మాటేమిటి?’ అంటూ ప్రశ్నించేవారుంటారని తెలుసు. తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లాలో స్వాతి అనే మహిళ పథకం ప్రకారం భర్తను హత్య చేసిన ఘటన వంటి దురంతాలను గుర్తించకుండా ఎట్లా ఉండగలం?  అవును. అటువంటి దారుణాలు జరుగుతున్న మాట నిజమే. వాటినీ నివారించవలసిన అవసరం ఉంది. కానీ మనం ప్రస్తుతం పరిశీలిస్తున్న అంశాలు వేరు.

చివరిగా నా తోటి మహిళలకు చిన్న నివేదన.. ఏ హక్కు కూడా తిరుగులేనిదీ, షరతులు లేనిదీ కాదు. హక్కులతోనే బాధ్యతలూ పెనవేసుకొని ఉంటాయి. భార్యాభర్తల మధ్య కావచ్చు, తల్లిదండ్రులూ, కుమార్తెల మధ్య కావచ్చు, అత్తమామలూ, కోడళ్ల మధ్య కావచ్చు. బాధ్యతలు లేని హక్కులను మేము సమర్థించం. ఎప్పుడూ అవధులూ, అడ్డుగోడలూ లేకుండా హక్కులూ, బాధ్యతలూ సమపాళ్లతో కలసి సంసారసాగరంలో మన జీవననౌకలను ఒడిదుడుకులు లేకుండా హాయిగా నడిపిస్తాయో అప్పుడే ఆరోగ్యవంతమైన కుటుంబ వ్యవస్థ సాధ్యం. భద్రమైన, న్యాయమైన సమాజానికి ఆరోగ్యవంతమైన కుటుంబమే పునాది. అసమానతలు లేని ఆదర్శవంతమైన సమాజం సాధ్యమా అన్న ప్రశ్నకు సమాధానం.. చాలా వరకూ సాధ్యమే. ఈ ఆదర్శాన్ని సుసాధ్యం చేయడం మన చేతుల్లో పని.
రండి.. కలసి ఉద్యమిద్దాం. లక్ష్యాలను సాధిద్దాం.


- వై.ఎస్‌.భారతి

 చైర్‌పర్సన్‌.

నేటి నుంచి ఫ్యామిలీలో ప్రత్యేక కథనాలు
నేటి ఉదయం గం‘‘ 10.30 ని‘‘లకు సాక్షి టీవీలో ప్రత్యేక కార్యక్రమం

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top