ఈ వారం యూట్యూబ్ హిట్స్‌

YouTube hits this week

దగ్గరికి రారా మొద్దు మొహం!
అలెస్సో అండ్‌ అనీటా – ఈజ్‌ దట్‌ ఫర్‌ మీ

నిడివి 2 ని. 52 సె. , హిట్స్‌ 77,53,865
బ్రెజీలియన్‌ దేవత అనీటా అంటుంది.. ‘అది నా కోసమేనా?’ అని! ఆమె పక్కనే ఉన్న స్పానిష్‌ డీజే అలెస్సో మొద్దు మొహం వేస్కొని అలా కూచోవడమో, నించోవడమో చేస్తుంటాడు! ఈ వీడియోలో ఆడేదీ, పాడేదీ అంతా అనీటానే. ఇద్దరూ అమెజాన్‌ అడవిలో విహారానికి వస్తారు. బహుశా ఆమే అతడిని బలవంతంగా లాక్కొచ్చి ఉండాలి. అడవిలోకి ప్రవేశించాక 24 ఏళ్ల అనీటా కొమ్మలో కొమ్మై ఊగిపోతుంటుంది.

అతడేమో మానులో మానులా బిగుసుకుపోతాడు. పచ్చటి ఆకులు ఉపరితలం అంతా పరుచుకుని ఉన్న చల్లటి కొలనులోకి నడుము వరకు దిగి, ‘కమ్‌ ఎ లిటిల్‌ బిట్‌ క్లోజర్‌’ అంటుంది. ‘ప్రేమలో మునుగుదాం రారా నా బంగారు కొండా’ అని ఆడపిల్ల అంటుంటే.. వీడిక్కడ ప్యాంటూ, పొడవాడి కోటూ వేసుకుని ఎటువైపో చూస్తుంటాడు. అనీటాకన్నా అతడు రెండేళ్లే పెద్ద.

ఆ మాత్రానికే పెద్దరికం తెచ్చేసుకోవాలా?! వలపు జల్లులతో తడిపేస్తాను కమ్‌ కమ్‌.. అని వెల్‌కమ్‌ చెబుతుంటే బట్టలు వెట్‌ అయిపోతాయని కంగారు పడేవాడు... దేశానికి ఒక్కడైనా ఉంటాడేమో ఇలాంటివాడు! నెక్స్‌›్ట సీన్‌లో చిరుతపులి స్కిన్‌ ప్రింటెడ్‌ బాడీ సూట్‌ వేసుకుని పడవలో డాన్స్‌ చేస్తుంటుంది అనీటా. ఆ డీజే కుర్రాడు పడవలోనే ఆమె వెనుక కూర్చొని ఉంటాడు, ఒక చెక్క బల్ల మీద! ఆ చెక్కలాగే అతడి ముఖం కూడా ఎక్స్‌ప్రెషన్‌లెస్‌గా ఉంటుంది.

‘ఈ రాత్రికి మన మధ్య జరగబోయే దాని గురించి నేను ఆలోచిస్తుంటే... నువ్వలా దూరదూరంగా ఉండిపోతావే, దగ్గరగా రా’ అని మాటిమాటికీ అడుగుతుంటుంది. ఒక అందమైన అమ్మాయి అలా నోరు తెరిచి అడిగేలా చేశాడంటే వాడెంత మగ దురహంకారి అనుకోవాలి! అనీటాకు పెద్ద ఎలివేషన్‌ ఈ లేటెస్ట్‌ సాంగ్‌. 2013లో ‘అనీటా’ అనే సెల్ఫ్‌ టైటిల్‌ ఆల్బమ్‌తో ఆమె పాప్‌ కెరీర్‌ మొదలైంది. ఆమె ఒరిజినల్‌ నేమ్‌ ‘లారిస్సా’.

గెలాక్సీలో...కత్తిలాంటి అమ్మాయి
స్టార్‌ వార్స్‌ : ది లాస్ట్‌ జెడాయ్‌
నిడివి 2 ని. 34 సె. , హిట్స్‌ 2,92,62,157
ఎ లాంగ్‌ టైమ్‌ ఎగో.. ఇన్‌ ఎ గెలాక్సీ ఫార్, ఫార్‌ అవే.. సాహసాలు చేస్తుండే స్టార్‌వార్‌ పాత్రల్ని సృష్టించినవాడు జార్జి లూకాస్‌. ఈ 73 ఏళ్ల హాలీవుడ్‌ డైరెక్టర్‌ ఆలోచనల్లోంచి దశాబ్దాల క్రితం పుట్టిన క్యారెక్టర్లతో ఇప్పటి వరకు ఏడు స్టార్‌ వార్‌ చిత్రాలు వచ్చాయి. ఎనిమిదో చిత్రం ‘స్టార్‌ వార్స్‌: ది లాస్ట్‌ జెడాయ్‌’ డిసెంబర్‌ 15న విడుదల అవుతోంది.

ఆ చిత్రం రెండో ట్రైలరే ఇది. స్టార్స్‌ వార్స్‌ సీరీస్‌లో మొత్తం మూడు ట్రయాలజీలు ఉన్నాయి. ఒరిజినల్‌ ట్రయాలజీ, ప్రీక్వెల్‌ ట్రయాలజీ, సీక్వెల్‌ ట్రయాలజీ. ఒక్కో ట్రయాలజీలో మూడు చిత్రాలు ఉంటాయి. ఒరిజినల్‌ ట్రయాలజీలో మొదటి సినిమా 1977లో రిలీజ్‌ అయిన ‘స్టార్‌ వార్స్‌ :ఎ న్యూ హోప్‌’. ఇప్పుడు రిలీజ్‌ కాబోతున్న ‘స్టార్‌ వార్స్‌ : ది లాస్ట్‌ జెడాయ్‌’ సీక్వెల్‌ ట్రయాలజీలోని రెండో చిత్రం.

మూడోది 2019లో విడుదల అవుతోంది. దాని పేరు ‘స్టార్‌ వార్స్‌: ఎపిసోడ్‌ 9’. ట్రయాలజీలు అన్నిటిలోనూ ఒకటే స్టోరీ. టేకింగ్, థీమ్‌ ఆఫ్‌ థాట్‌ మాత్రం వేర్వేరు. గెలాక్సీలో క్రూరుడైన ఒక చక్రవర్తి ఉంటాడు. సామ్రాజ్య విస్తరణ కాంక్షతో అతడు చేయకూడని పనులు చేస్తుంటాడు. పాలపుంతలోని ఒక గ్రహాన్ని ఆక్రమించుకుని అక్కడి రాకుమారిని బందీగా తెచ్చుకుంటాడు. ఆమెను విడిపించుకుని వెళ్లడానికి ఇద్దరు యోధులు బయల్దేరుతారు. రెండు గ్రహాల మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ అందాల రాకుమారికి విముక్తి లభిస్తుంది.

కాఫీ విత్‌ జూహీ
షాదీ మే జరూర్‌ ఆనా : ట్రైలర్‌
నిడివి 2 ని. 43 సె. , హిట్స్‌ 39,07,701
‘ప్రేమలో, యుద్ధంలో ఏదైనా కరెక్టే. ప్రేమ ముగిసింది. ఇప్పుడు యుద్ధం మొదలైంది’ అంటాడు గుండె బద్ధలైన రాజ్‌కుమార్‌ రావ్‌ ఈ ట్రైలర్‌లో. ‘న్యూటన్‌’ చిత్రంతో క్రిటిక్స్‌ కళ్లలో ఆనందం చూసిన రాజ్‌కుమార్‌... నవంబర్‌ 10న విడుదలవుతున్న ‘షాదీ మే జరూర్‌ ఆనా’ మూవీలో ఆగ్రహపు జ్వాలల్లో రగిలిపోబోతున్నాడు. ఫస్ట్‌ హాఫ్‌ లవ్, సెకండ్‌ హాఫ్‌ వార్‌ ఉండొచ్చని అనిపిస్తోంది.

రాజ్‌కుమార్‌ లవర్‌గా  కృతీ ఖర్బందా నటించారు. అయితే అది అరేంజ్డ్‌ లవ్‌! పెద్దవాళ్లు పరిచయం చేశాక, వీళ్లు లవ్‌లో పడి పోతారు.‘‘పింక్‌ డ్రెస్‌లో జూïß చావ్లాలా’’ ఉన్నారు అంటాడు రాజ్‌ ఆమెతో. ‘‘మీరు షారుక్‌ ఖాన్‌లా ఉన్నారు’’ అంటుంది కృతి అతడితో. అతడు ఆమె ఎంగిలి కాఫీ అడుగుతాడు.

ఆమె అతడి స్కూటర్‌ వెనుక కూర్చొని రాజ్‌ పొట్టను రెండు చేతులతో చుట్టేస్తుంది. అయితే పెళ్లవబోతుండగా సినిమా మలుపు తిరుగుతుంది. రాజ్‌ హార్ట్‌ బ్రేక్‌ అవుతుంది. ఒక అమాయకపు ప్రేమ కథ ప్రతీకార జ్వాల గాథగా మారిపోతుంది.

అడ్రస్‌ దొరక్క వెళ్లిపోయింది
యు.ఎస్‌. పి.ఎస్‌ పోస్ట్‌మాన్‌ డెలివర్స్‌ మెయిల్‌
నిడివి 1 ని. 39 సె., హిట్స్‌ 9,53,584
ఈ వీడియో చూశాక మీకు యు.ఎస్‌. పోస్టల్‌ సర్వీసు మీద, డగ్లాస్‌ థార్న్‌ మీద గౌరవభావం కలుగుతుంది. థార్న్‌ అక్కడి తపాల శాఖ ఉద్యోగి కాదు. ఏరియల్‌ సినిమాటోగ్రాఫర్‌. డ్రోన్‌లో గగనతలంలోకి వెళ్లిపోయి, ఏరియల్‌ వీడియోలు తీస్తుంటాడు. కాలిఫోర్నియాలో గతవారం అడవులు అంటుకుని, మంటలు వ్యాపించి  శాంటా రోసా అనే ప్రాంతంలో పాతికమందికి పైగా చనిపోయారు.

ఇళ్లన్నీ కాలి బూడిదైపోయాయి. దాదాపు మూడు వేల మందికి గూడు కోల్పోయారు. ఈ అత్యంత దయనీయమైన స్థితిని డగ్లాస్‌ థార్న్‌ పైనుంచి వీడియో తీశాడు. ఈ వీడియోను కనుక చూస్తే మీరెంత గట్టి మనుషులైనా సరే, మీ కళ్లలో నీరు తిరుగుతుంది. ఉత్తరాలను బట్వాడా చెయ్యడం కోసం ఓ తపాలా వాహనం ఆ బూడిదలోనే అడ్రస్‌లను వెతుక్కుంటున్న దృశ్యం మనసును కలిచివేస్తుంది.

ఆ వెంటనే తపాలాశాఖకు నమస్కరించాలనిపిస్తుంది. యు.ఎస్‌.పి.ఎస్‌. (యునైటెడ్‌ స్టేట్స్‌ పోస్టల్‌ సర్వీస్‌) 1775లో వాష్టింగ్టన్‌లో ప్రారంభం అయింది. టెక్నాలజీ పెరిగి ఇవాళ మనం పోస్టాఫీసులకు దూరం అయ్యాం. పోస్టాఫీసులు మాత్రం వృత్తి నిబద్ధతతో మనకు ఎప్పుడూ చేరువగానే ఉంటున్నాయి. ధన్యవాదాలు డగ్లాస్‌ థార్న్‌... ఒక మానవీయ దృశ్యకోణాన్ని యూట్యూబ్‌లో మాకు బట్వాడా చేసినందుకు.
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top