ఈ వారం యూట్యూబ్ హిట్స్‌

ఈ వారం యూట్యూబ్ హిట్స్‌


క్యుపిడ్‌ ఫెలో.. నెట్టేస్తాడు లవ్‌లోకి

జెన్నిఫర్‌ లోపెజ్‌ – ని తూ ని యో

నిడివి : 4 ని .16 సె.; హిట్స్‌ : 88,25,675


సింగర్, యాక్ట్రెస్, డాన్సర్, ఫ్యాషన్‌ డిజైనర్, ఆథర్, ప్రొడ్యూజర్, టీవీ పర్సనాలిటీ... ఉఫ్‌.. ఇవన్నీ జెన్నీఫర్‌ లోపెజ్‌. ఇప్పుడు కొత్తగా ఈ నలభై ఏడేళ్ల అమెరికన్‌ ‘ని తూ ని యో’ అంటూ ఓ పురాణకాల కథాంశపు మ్యూజిక్‌ వీడియోను విడుదల చేసి, యూత్‌ని సమ్మోహన పరుస్తోంది. ఆమెతో పాటు క్యూబన్‌ పాప్‌ బ్యాండు ‘జెంటె డి జోనా’లోని హిప్‌ హాప్‌ గాయకులు అలెగ్జాండర్, ర్యాండీ మాల్కమ్‌ జెన్నీని ఉత్తేజపరుస్తూ కనిపిస్తారు.వీడియోలోని 1970ల నాటి దక్షిణ ఫ్లారిడా వస్త్రధారణలు ఈ కొత్త కాలానికి దక్కిన పాత మణులు, మాణిక్యాల్లా మీకు అనిపిస్తున్నాయంటే జెన్నిఫర్‌ లోపెజ్‌ను ఆసాంతం మీరు ఇష్టపడిపోతున్నారన్న మాటే. ‘..ఏమీ లేని దాని నుంచి పుట్టి, అన్నీ తనే అయిపోతుంది ప్రేమ. నేనిలా ప్రేమలో పడిపోతానని ఎప్పుడూ అనుకోలేదు. నీకేమో ప్రేమను అనుభూతి చెందాలన్న ఆలోచనే ఉండదు.. అని జెన్నీ బడబడా పాడేస్తుంది. ఆ పక్కన ఉన్నవాళ్లు కూడా ఆమెతో పాటు ఆడుతూ, పాడుతూ.. ప్రేమ జీవితాన్ని ఎలా వెలిగిస్తుందో, ప్రేమ లేని జీవితం ఎలా అంధకారం అయిపోతుందో చెబుతుంటారు. అక్కడితో ఆగుతారా! ఊహు. ‘మన తప్పేం లేదు.. అంతా ఆ క్యుపిడ్‌ ఫెలో చేస్తుంటాడు’ అని నిందను ఆకాశంలోకి ఎగరేస్తుంటారు. ఇలాంటి ఫ్రెండ్స్‌ ఉండాలి బాస్‌.దీపికా.. పాట నచ్చిందా?

సఫర్‌ – జబ్‌ హ్యారీ మెట్‌ సెజల్‌

నిడివి : 4 ని. 53 సె.; హిట్స్‌ : 47,86,191


షారుక్‌ ఖాన్, అనుష్కా శర్మ నటిస్తున్న ‘జబ్‌ హ్యారీ మెట్‌ సెజల్‌’ చిత్రంలోని మూడో పాటగా ‘సఫర్‌’ రిలీజ్‌ అయింది. మొదటి పాట ‘రాధా’ ను సునిధీ చౌహాన్, షాహిద్‌ మాల్యా; రెండో పాట ‘బీచ్‌ బీచ్‌ మే’ ను అరిజిత్‌ సింగ్, షల్మాలి ఖోల్గేడ్, షెఫాలీ అల్వేర్‌ పాడారు. మూడో పాట ‘సఫర్‌’ని కూడా అరిజిత్‌ సింగే పాడినప్పటికీ సోనీ మ్యూజిక్‌ ఇండియా యూట్యూబ్‌లోకి అప్‌లోడ్‌ చేసిన సఫర్‌ వీడియోలో షారుక్‌ ఖాన్, ఇతర సాంగ్‌ టెక్నీషియన్‌లు కనిపిస్తారు. షారుక్‌ను పాడనిచ్చి, ఆఖర్లో.. ‘ఇక మీరు పక్కకు వెళ్లండి సర్‌.. అరిజిత్‌ వచ్చి పాడతారు అని టెక్నీషియన్‌లు చెప్పడం సరదాగా ఉంటుంది.అప్పుడు షారుక్‌.. ‘మరి నేనూ’ అని ఆశ్చర్యంగా అడుగుతాడు. ‘మీకు రోడ్డే’ అంటారు వాళ్లు. విషయం ఏంటంటే.. ఇది ట్రావెల్‌ సాంగ్‌. రెండో సాంగ్‌ ‘బీచ్‌ బీచ్‌ మే’ విడుదలైన ప్పుడు దీపికా పడుకోన్‌ ఆ పాట తనకెంతో నచ్చిందని ట్వీట్‌లో పెట్టడం చూసిన షారుక్‌... నెక్స్‌›్ట సాంగ్‌ ‘సఫర్‌’ కూడా మీకు నచ్చుతుంది అని రీట్వీట్‌ చేశారు. దాంతో సఫర్‌.. విడుదలకు ముందే పాపులర్‌ అయింది. రికార్డింగ్‌ రూమ్‌లో షారుక్‌ని సింగర్‌గా చూడదలచిన ఆయన అభిమానులకు కూడా సఫర్‌ నచ్చుతుంది. సినిమా ఆగస్టు 4న సినిమా రిలీజ్‌ అవుతోంది.ఎవడబ్బా వీడు!

బాబూమోషాయ్‌ బందూక్‌బాజ్‌ : ట్రైలర్‌

నిడివి : 3 ని.; హిట్స్‌ : 47,00,323


బెంగాలీలో బాబూమోషాయ్‌ అంటే.. చంటబ్బాయ్‌ అని. ఈ మూవీలో నవాజ్‌ సిద్ధిక్కీ చంటబ్బాయ్‌ లాంటి వాడు. బట్‌.. జీవితం మలుపు తిరిగి చేతిలోకి గన్‌ వచ్చేస్తుంది. అంతే! బందూక్‌బాజ్‌ (కిల్లర్‌) అయిపోతాడు. మామూలు కిల్లర్‌ కాదు. నంబర్‌ వన్‌ కాంట్రాక్ట్‌ కిల్లర్‌! అప్పుడొస్తాడు ‘బంకే’ అనేవాడు.. నువ్వొక్కడివే పిస్తావి కాదు. నేనూ గన్‌ని గిర్రున తిప్పి పేల్చిపడేయగలను గురూ’ అని! ఇద్దరూ నువ్వా? నేనా అన్నట్లు ఉంటారు. ఓసారి ఓ ముగ్గురు వ్యక్తుల్ని చంపడానికి నవాజ్‌కి కాంట్రాక్ట్‌ వస్తుంది. అదే కాంట్రాక్ట్‌ ఆ ‘బంకే’ అనేవాడికీ వస్తుంది. ఇద్దరూ కలిసి ఓ చావు ఆట ఆడతారు.కాంట్రాక్టుకు దొరికిన ముగ్గురు మనుషుల్లో ఎక్కువ మందిని (ఇద్దర్ని గానీ, లేదా మొత్తం ముగ్గుర్ని గానీ) ఎవరు చంపితే వారే ఈ ఫీల్డులో నెంబర్‌ వన్‌ అనేది ఆ ఆట! అయితే ఈ మధ్యలో తనను చంపడం కోసం ఇంకో గేమ్‌ నడుస్తుంటుందని నవాజ్‌ కనిపెడతాడు. ఇక అక్కడి నుంచి నవాజ్‌ థ్రిల్లింగ్‌ వరల్డ్‌లోకి ఎంటర్‌ అవుతాడు. వీళ్లాడే గేమ్‌ డ్రా అవుతుంది. ముగ్గుర్ని ఇద్దరు చంపినప్పుడు గేమ్‌ ఎలా డ్రా అవుతుంది? ఎలా అవుతుందో ట్రైలర్‌ చూడండి. ట్రైలర్‌లో మిమ్మల్ని ఆకట్టుకునే ఇంకో గన్‌.. బిబిత బాగ్‌. గన్‌ అంటే గన్‌ కాదు. గన్‌లాంటి అమ్మాయి! మూవీ ఆగస్టు 25న రిలీజ్‌ అవుతోంది.పదిమైళ్లు ఈది ఒడ్డెక్కించారు

నేవీ రెస్క్యూస్‌ ఏన్‌ ఎలిఫెంట్‌ ఎట్‌ సీ

నిడివి : 1 ని. 38 సె.; హిట్స్‌ : 2,02,127


శ్రీలంక అడవిలోంచి షికారుగా బయటికి వచ్చిన గజరాజు, అలల ధాటికి ఆ దాపుల్లోనే ఉన్న హిందూ మహా సముద్రంలోకి కొట్టుకుపోయింది. ఆ సంగతి శ్రీలంక నౌకా దళానికి తెలిసి, రెస్క్యూ స్క్వాడ్‌తో రంగంలోకి దిగింది. అబ్బే.. వారి శక్తి సరిపోలేదు. వైల్డ్‌లైఫ్‌ అఫీసర్లను రప్పించారు. అందరి ధ్యేయం ఒక్కటే. ఆ గజరాజును సురక్షితంగా ఒడ్డుకు తెప్పించడం. గజరాజు కాసేపు మునిగిపోతోంది. కాసేపు తేలుతూ కనిపిస్తోంది. అంతలోనే స్థానభ్రంశం చెందుతోంది.నీటిపైకి కనిపిస్తూ, మాయం అవుతున్న ఏనుగు తొండం ఆనవాలు ఆధారంగా.. మొత్తానికి రక్షణ దళాలు గజరాజుకు తాళ్లు కట్టారు. మెల్లిగా ఒడ్డుకు లాక్కొచ్చారు. ఇందుకు దాదాపు 12 గంటలుపట్టింది. ఈ ఆపరేషన్‌ మొత్తాన్ని చిత్రీకరించిన శ్రీలంక ఆర్మీ... ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో పెట్టింది. వీడియో యూట్యూబ్‌లోకి అప్‌లోడ్‌ అయింది. అన్నట్లు నేవీ ఈ గజరాజును ఎంత దూరం నుంచి భద్రంగా తీరానికి లాక్కోచ్చిందో తెలుసా? సముద్రంలో పది మైళ్ల లోపలి నుంచి!

Back to Top