యుట్యూబ్ హిట్స్
ఎ క్యూర్ ఫర్ వెల్నెస్ : ట్రైలర్
ఎ క్యూర్ ఫర్ వెల్నెస్ : ట్రైలర్; నిడివి : 2 ని. 44 సె. :: హిట్స్ : 44,72,599
ఈ ట్రైలర్‌ను చూస్తే మీరు సినిమా రిలీజ్ వరకు ఆగలేరు! అంత థ్రిల్లింగ్ ఉంది. చిత్రం పేరు ‘ఎ క్యూర్ ఫర్ వెల్నెస్’. ఫిబ్రవరి 17న థియేటర్స్‌లోకి వస్తోంది. గోర్ వెర్బిన్స్కీ ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌ను డైరెక్ట్ చేస్తున్నారు. ఓ యంగ్ ఎగ్జిక్యూటివ్ తన బాస్‌ను వెతుక్కుంటూ స్విస్ ఆల్ప్స్ పర్వతాల్లోని ఒక ‘వెల్నెస్ సెంటర్’కు వెళతాడు. ఆ బాస్ తన ‘మైండ్ అండ్ బాడీ’ మెడికల్ ట్రీట్మెంట్ కోసం అక్కడికి వెళ్లివుంటాడు. ఎంతకూ రాడు! అందుకే ఇతడు బయల్దేరుతాడు. అక్కడికి వెళ్లాక ఇతడికి భయంకరమైన నిజాలు తెలుస్తాయి. పైకి ఎంతో ఆహ్లాదంగా, మనోహరంగా, పంచభూతాలతో మమేకమై ఉన్నట్లుగా కనిపించే ఆ వెల్నెస్ సెంటర్ లోపల సాంత్వన కోసం వచ్చిన మనుషులపై, వాళ్లకే తెలియకుండా అమానుషమైన ప్రయోగాలు జరుగుతుంటాయి! ఆ ప్రయోగాలకు తన బాస్ బలై ఉంటాడన్న అనుమానం ఇతడికి వస్తుంది. అక్కడే ఉండి, రహస్యాలను ఛేదించడం మొదలు పెడతాడు. ఆ విషయాన్ని వెల్నెస్ సెంటర్ గ్యాంగ్ కనిపెడుతుంది. ఇతడిని ఫినిష్ చెయ్యడానికి చూస్తుంది. వారిని నుంచి ఈ యంగ్ ఎగ్జిక్యూటివ్ బయటపడ్డాడా? తన బాస్‌ని వెంట తెచ్చుకున్నాడా? ఇంతవరకే స్టోరీ కాదు. చాలా ఉంది.
హరామ్‌ఖోర్ : అఫిషియల్ ట్రైలర్
హరామ్‌ఖోర్ : అఫిషియల్ ట్రైలర్; నిడివి : 2 ని. 14 సె. :: హిట్స్ : 51,89,970
గాంగ్ ఆఫ్ వస్సీపూర్లో నవాజుద్దిన్ సిద్ధిఖీని చూశారు. లంచ్‌బాక్స్‌లో కూడా చూశారు. ఇప్పుడు ఈ అసమాన ప్రతిభా సంపన్నుడి నటన కోసం మీరు ‘హరామ్‌ఖోర్’ను తప్పక చూసి తీరాలి. జనవరి 13న విడుదల కాబోతున్న ఈ చిత్రం కొత్త ట్రైలర్ మూడు రోజుల క్రితమే విడుదలైంది. ప్రేక్షకులు సినిమాకోసం ఎగబడినట్లుగా, నెటిజెన్లు ఈ ట్రైలర్‌ను చూస్తున్నారు! ఒక ‘నమ్మకద్రోహి’ లవ్‌స్టోరీ ఇది. శ్వేతా తివారి ఆ లవ్‌కి కేంద్రబిందువు. చిత్ర దర్శకుడు శ్లోక్ శర్మ. షూటింగ్ కేవలం 16 రోజుల్లో పూర్తయింది! హరామ్‌ఖోర్ ఫస్ట్ లుక్ 2015 మార్చి 8న బయటికి వచ్చింది. వెంటనే శ్లోక్ శర్మ మీద ఎఫ్.ఐ.ఆర్ నమోదు అయింది! సినిమా ప్రమోషన్లోని సన్నివేశాలకు, తమ పాఠ్యాంశంలోని కొన్ని భాగాలకు బాగా దగ్గరి పోలికలు ఉన్నాయని మహారాష్ట్ర టెక్స్›్టబుక్ బ్యూరో ‘బాలభారతి’ ఆ కేసు పెట్టింది. అదలా ఉండగానే, హరామ్ఖోర్కు న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్లో, ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ లాస్ ఏంజిల్స్‌లో ప్రశంసలు లభించాయి.
ఏలియన్ : కవనెంట్ : అఫిషియల్ ట్రైలర్
నిడివి : 2 ని. 13 సె.; హిట్స్ : 1,23,25,106
ట్రైలర్ చూస్తేనే వెన్నులో వణుకు పుటేలా ఉన్న ‘ఏలియన్ : కవనెంట్’ హాలీవుడ్ మూవీ ఈ ఏడాది మే 19న తెర మీదకు వస్తోంది. డైరెక్టర్ రిడ్లే స్కాట్. 1979లో తొలిసారి ‘ఏలియన్’ చిత్రంతో భయభ్రాం తులను చేసిన స్కాట్.. ఆ తర్వాత బ్లేడ్ రన్నర్, థెల్మా అండ్ లూసీ, గ్లాడియేటర్, బ్లాక్‌హాక్ డౌన్, హ్యానీబాల్, అమెరికన్ గ్యాంగ్‌స్టర్, ప్రొమీథియస్, ది మార్టిన్ వంటి చిత్రాలతో తన పేరు వినపడగానే ఆసక్తి రేకెత్తేంతగా ఇమేజ్ సంపాదించుకున్నారు. తాజా చిత్రం ఏలియన్.. ప్రొమీథియస్కు సీక్వెల్‌గా వస్తోంది. కొంతమంది వ్యక్తులు ‘కవనెంట్’ అనే వ్యోమనౌకపై పాలపుంతలకు ఆవలి తీరాన, దూరంగా ఉండే ఓ గ్రహాన్ని చేరుకుంటారు! అదొక స్వర్గధామం అయి ఉండవచ్చునని భావిస్తారు. అయితే వాళ్లకు అక్కడ అతి ప్రమాదకరమైన, అంధకారబంధురమైన ప్రపంచం తారసిల్లుతుంది. ‘ప్రొమీథియస్’ సాహసయాత్రలో బతికి బట్టకట్టిన ఒకే ఒక వ్యక్తి అక్కడ ఉంటాడు. మిగతా అక్కడ ఉన్నవాళ్లంతా ఏలియన్స్. ఈ బృందం ఆ ఏలియన్స్‌తో ఎలా ఫైట్ చేసిందీ, ఎలా తప్పించుకుందీ, ఈ క్రమంలో వాళ్లకు ఎదురైన అనుభవాలు ఎంత భయానకమైనవి అన్నది ఈ చిత్రంలో చూడొచ్చు. ఈ ట్రైలర్ మొదలవడమే ఒళ్లు గగుర్పొడిచే ఒక సన్నివేశంతో స్టార్ట్ అవుతుంది. తర్వాత వ్యోమ నౌక ప్రయాణం, దాని లాండింగ్, అందులోంచి బృందం సభ్యులు దిగడం.. ఇంతవరకు మామూలే. చివర్లో మాత్రం మొదటి సన్నివేశాన్ని మించిన సీన్ కనిపిస్తుంది.