మీ సమస్య  బ్లాక్‌బెర్రీ సిండ్రోమ్‌ కావచ్చు!

Your problem may be blackberry syndrome! - Sakshi

ఫ్యామిలీ డాక్టర్‌

లైఫ్‌స్టైల్‌ కౌన్సెలింగ్‌

నేను స్మార్ట్‌ఫోన్‌ను చాలా ఎక్కువగా ఉపయోగిస్తున్నాను. ఇటీవల నా బొటనవేలు చాలా నొప్పిగా అనిపిస్తోంది. తగ్గడానికి మార్గాలు చెప్పండి.  – సీవీఎస్‌ కుమార్, విజయవాడ 
మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీరు బ్లాక్‌బెర్రీ థంబ్‌ లేదా గేమర్స్‌ థంబ్‌ అనే కండిషన్‌తో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. దీన్నే వైద్యపరిభాషలో డీ–క్వెర్‌వెయిన్‌ సిండ్రోమ్‌ అంటారు. మనం మన స్మార్ట్‌ ఫోన్‌ను ఉపయోగించే సమయంలో బొటనవేలిని మాటిమాటికీ ఉపయోగిస్తుంటాం. దాంతో బొటనవేలి వెనకభాగంలో ఉన్న టెండన్‌ ఇన్‌ఫ్లమేషన్‌కు గురై వాపు వస్తుంది. మళ్లీ అదేపనిగా దాన్ని ఉపయోగించడం వల్ల ఆ గాయం మానక మళ్లీ మళ్లీ గాయం తిరగబెడుతుంది. ఫలితంగా ఈ సమస్య వస్తుంది. ఇలాంటివాళ్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మేలు. అవి... 
∙టైపింగ్‌ లేదా టెక్ట్స్‌ మెటీరియల్‌ పంపడం కోసం ఒక బొటన వేలినే కాకుండా ఇతర వేళ్లను కూడా మార్చి మార్చి ఉపయోగిస్తూ బొటనవేలిపై పడే భారాన్ని తగ్గించడం. 
∙మణికట్టును చాలా రిలాక్స్‌గా ఉంచి వీలైనంత వరకు మణికట్టుపై భారం పడకుండా చూడటం. 
∙ఫోన్‌ను శరీరానికి ఏదో ఒక వైపున ఉంచకుండా మధ్యన ఉంచడం. దీని వల్ల శరీరం అసహజ భంగిమలో ఒంగకుండా బ్యాలెన్స్‌తో ఉంటుంది. 
∙ఫోన్‌ ఉపయోగించే సమయాన్ని సాధ్యమైనంతగా తగ్గించడం. 
∙పొడవు పొడవు వాక్యాలు కాకుండా అర్థమయ్యేరీతిలో షార్ట్‌కట్స్‌ వాడుతూ బొటనవేలి ఉపయోగాన్ని తగ్గించడం. దీనివల్ల మీ బొటనవేలు, ఇతర వేళ్లు, మణికట్టుపై భారం తగ్గుతుంది. 
∙‘ఐ యామ్‌ ఇన్‌ మీటింగ్‌’ లాంటి కొన్ని రెడీమేడ్‌ వాక్యాలు ఉంటాయి. వాటి సహాయం తీసుకుంటే టైపింగ్‌ బాధ తగ్గడంతో పాటు, సమయమూ ఆదా అవుతుంది. 
∙ఎవరిపేరునైనా కనుగొనాలంటే పూర్తిగా స్క్రీన్‌ స్క్రోల్‌ చేస్తుండే బదులు షార్ట్‌కట్స్‌ ఉపయోగించడం ద్వారా సమయాన్నీ, బొటనవేలి ఉపయోగాన్నీ తగ్గించవచ్చు. 
∙అదేపనిగా ఫోన్‌ ఉపయోగించేవారు... ప్రతి 15 నిమిషాల్లో కనీసం 2–3 నిమిషాల పాటు మీ బొటనవేలికి విశ్రాంతినివ్వాలి. అప్పటికీ  తగ్గకపోతే డాక్టర్‌ను సంప్రదించండి.

వ్యాయామంతో  మంచి నిద్రపడుతుందా? 
నేను కూర్చొని చేసే వృత్తిలో ఉన్నాను. రాత్రిపూట సరిగా నిద్రపట్టడం లేదు. ఒళ్లు అలిసేలా వ్యాయామం చేస్తే బాగా నిద్రపడుతుందని ఫ్రెండ్స్‌ చెబుతున్నారు. అయితే వ్యాయామం చేసేవాళ్లకు అంతగా నిద్రపట్టదని మరికొందరు చెబుతున్నారు. ఇందులో ఏది వాస్తవం 
–సుధాకర్‌రావు, వైజాగ్‌

మీరు చెప్పిన రెండు అంశాలూ నిజమే. నిద్రకు ఉపక్రమించబోయే మూడు గంటల ముందుగా వ్యాయామం అంత సరికాదు. అలా చేస్తే నిద్రపట్టడం కష్టమే. అయితే రోజూ ఉదయంగానీ లేదా ఎక్సర్‌సైజ్‌కూ, నిద్రకూ చాలా వ్యవధి ఉండేలా గానీ వ్యాయామం చేస్తే మంచి నిద్ర పడుతుంది. ఒళ్లు అలిసేలా చేసే వ్యాయామంతో ఒళ్లెరగని నిద్రపడుతుంది. ఉదయం వేళ పగటి వెలుగు వచ్చాక చేస్తే మరింత ప్రభావపూర్వకంగా ఉంటుంది. మీరు ఉదయం వేళలో వ్యాయామం చేయలేకపోతే అది సాయంత్రం వేళ అయితే మంచిది. మీ రోజువారీ పనుల వల్ల అప్పటికి మీ శరీర ఉష్ణోగ్రత కూడా కాస్త పెరిగి ఉంటుంది. ఇక నిద్రవేళకు మన శరీర ఉష్ణోగ్రత కాస్త తగ్గుతుంటుంది. కానీ వ్యాయామంతో మళ్లీ శరీరాన్ని ఉత్తేజపరచడం జరుగుతుంది. ఇక కార్డియోవాస్క్యులార్‌ వ్యాయామాల వల్ల గుండె స్పందనల వేగం, రేటు పెరుగుతాయి. శరీర ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. వీటన్నింటి ఉమ్మడి ప్రభావాల వల్ల నిద్ర తగ్గుతుంది. అంతేకాదు... వ్యాయామం ముగిసిన 20 నిమిషాల తర్వాత గానీ గుండె కండరాల రక్తం పంపింగ్‌ ప్రక్రియ సాధారణ స్థితికి రాదు. అందుకే వ్యాయామానికీ, నిద్రకూ మధ్య వ్యవధి ఉండేలా చూసుకోవాలన్న మాట. ఇక స్ట్రెచింగ్‌ వ్యాయామాలు, బలాన్ని పెంచుకునే స్ట్రెంగ్త్‌ ట్రెయినింగ్‌ తరహా వ్యాయామాలూ శరీరానికి మేలు చేసినా... అవేవీ కార్డియోవాస్క్యులార్‌ వ్యాయామాలకు సాటిరావు. దీర్ఘకాలిక నిద్రలేమికి వ్యాయామం విరుగుడు. అందుకే మరీ తీవ్రంగా లేదా మరీ తేలికగా కాకుండా... మాడరేట్‌ ఎక్సర్‌సైజ్‌ చేయండి. వాకింగ్, జాగింగ్, జంపింగ్, స్విమ్మింగ్, టెన్నిస్‌ ఆడటం, డాన్స్‌ చేయడం లాంటి ఏ ప్రక్రియ అయినా వ్యాయామానికి మంచిదే. వ్యాయామాలు మొదలుపెట్టే ముందు ఒకసారి డాక్టర్‌ను సంప్రదించి, మీకు తగిన వ్యాయామాలు సూచించమని అడగడం మేలు.

తీవ్రమైన అలసట ఒళ్లునొప్పులు... నివారణ ఎలా? 

నా వయసు 28 ఏళ్లు. నాకు చాలా ఎక్కువగా డబుల్‌షిఫ్ట్‌ పనిచేయాల్సిన అవసరం  వస్తుంటుంది. ఇటీవల నాకు ఒళ్లు నొప్పులు వస్తున్నాయి. దయచేసి పరిష్కారం చెప్పండి. 
– సతీష్‌చంద్ర, హైదరాబాద్‌
మీలా డబుల్‌ షిఫ్ట్‌ పనిచేసేవారిలో అలసటతోపాటు, తీవ్రమైన ఒత్తిడికి లోనైనట్లు అనిపించడం సాధారణం. కండరాల నొప్పులు, నడుమునొప్పితో పాటు చర్మ సమస్యలు, శ్వాసకోశ ఇబ్బందులు, ఇతర వృత్తిసంబంధ సమస్యలు సైతం రావచ్చు. అలాంటి వాటిని నివారించేందుకు ఈకింది సూచనలు పాటించడం మేలు చేస్తుంది. 
∙పొగతాగే అలవాటు ఉంటే వెంటనే మానేయండి. సిగరెట్‌ పొగలో కార్బన్‌మోనాక్సైడ్‌ ఎక్కువగా ఉంటుంది. అది రక్తకణాల్లోని ఆక్సిజన్‌ను తీసుకెళ్లే సామర్థ్యాన్ని తగ్గించి, వెంటనే అలసిపోయేలా చేస్తుంది. 
∙చాలాసేపు కూర్చొని పనిచేసేవారైతే, శరీరానికి కదలికలు ఉండేలా తప్పనిసరిగా వ్యాయామం చేయండి. అదేపనిగా కూర్చోవడం వల్ల కూడా అలసిపోతారు. 
∙మీ ఉద్యోగంలో ఏదైనా సమస్యలు, మీరు లక్ష్యాలను అధిగమించాల్సిన  (టార్గెట్స్‌ రీచ్‌ కావాల్సిన) వృత్తిలో ఉంటే తీవ్రమైన అలసటకు లోను కావడం చాలా సాధారణం. 
∙కంటి నిండా నిద్ర అవసరం. కనీసం రోజూ ఎనిమిదిగంటల పాటు నిద్రపోవాలి. 
∙కాఫీలు ఎక్కువగా తాగకండి. కెఫిన్‌ ఉండే ద్రవపదార్థాలను తీసుకునే అలవాటు ఉంటే, రోజూ రెండు కప్పులకు మించి వద్దు. రాత్రి డ్యూటీ ముగించుకొని ఇంటికివెళ్లే సమయంలో కాఫీ అస్సలు తాగవద్దు. 
∙రిలాక్సేషన్‌ టెక్నిక్స్‌ పాటించండి. ప్రతిరోజూ ప్రాణాయామం, యోగా, ధ్యానం వంటివి చేస్తూ ఒత్తిడిని అధిగమించండి. 
∙భోజనవేళలను కచ్చితంగా పాటించండి. భోజనం ఎగొట్టి పనిచేయకండి. ఇలా చేస్తే  రక్తంలో చక్కెరపాళ్లు తగ్గిపోయి త్వరగా, తేలిగ్గా అలసిపోతారు. 
∙ఎక్కువగా నీళ్లు తాగండి. దీనివల్ల మీరు డీ–హైడ్రేషన్‌కు లోనుకారు. ఫలితంగా అలసిపోకుండా పనిచేయగలుగుతారు. 
ఈ సూచనలు పాటించాక కూడా మీరు ఇంకా అలసటతోనూ, నడుంనొప్పితో బాధపడుతుంటే డాక్టర్‌ను సంప్రదించండి.
డాక్టర్‌ సుధీంద్ర ఊటూరి
లైఫ్‌స్టైల్‌ స్పెషలిస్ట్, కిమ్స్‌ హాస్పిటల్స్, సికింద్రాబాద్‌ 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top