పాపం ప్రేమ

Writer Mopasa Heart Tuching Story - Sakshi

కథాసారం

మార్గరెట్‌ మృత్యుశయ్య మీద వుంది. ఆమె వయస్సు 56 సంవత్సరాలే ఐనా, కనీసం డెబ్భై ఐదు సంవత్సరాల దానివలె కనిపిస్తోంది.
దగ్గుతెరల్తో మెలికలు తిరుగుతూ, వూపిరి పీల్చుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తోంది. ఆమె అక్క సుజన్నీ ఆమెకన్న 6 సంవత్సరాలు పెద్దది. పొంగిపొరలే దుఃఖంతో చెల్లెలి పక్కమీద కూర్చున్నది. పక్కనేవున్న టేబుల్‌ మీద రెండు మైనపువొత్తులు వెలుగుతూన్నవి. మందుసీసాలు గదిలో చెల్లాచెదురుగా పడివున్నవి. మృత్యుదేవత తన విశాల పక్షాలను గదినంతటనూ పరిచి, వేచివున్నట్లే తోస్తుంది. యీ అక్క చెల్లెళ్ల కథ హృదయ విదారకమైనది. పెద్దామె సుజన్నీ ఒక యువకుని తన నాశనాన్ని కూడా లెక్క చెయ్యకుండా ప్రేమించింది. కాని ఆ ప్రియుడు హఠాత్తుగా మరణించాడు. సుజన్నీ దుఃఖసముద్రంలో మునిగి, తను జీవితంలో వివాహమాడనని శపథం చేసింది. విధవ వలెనే దుస్తులు ధరించి, విధవరికాన్ని భరిస్తూన్నట్లే బతికింది. ఒకనాటి ఉదయం పన్నెండు వసంతాల్ని మాత్రం ఎరిగిన మార్గరెట్‌ వచ్చి, అక్కను కావలించుకుని ఇలా అంది: ‘అక్కా! నీవు సుఖపడటం లేదని నాకెంతో విచారంగా వుంది. నీకు తోడునీడగా జీవితమంతా వెళ్లబుచ్చుతాను. నేను కూడా జీవితంలో వివాహమాడను.’ చెల్లెలి శపథం మీద సుజన్నీకి నమ్మకం లేకపోయినా, ఆమె కనబరిచిన ఆపేక్షకు చెల్లెల్ని కావలించుకుంది. తల్లిదండ్రులూ, అక్కా ఎంతమంది ఎంతదూరం బతిమాలినా మార్గరెట్‌ తనకు వరులుగా వొచ్చినవారందర్నీ తిరస్కరించింది.
∙∙l
జీవితమంతా ఆ అక్కచెల్లెళ్లు కలిసే వున్నారు. మార్గరెట్‌ ఎప్పుడూ కుంగిపోయి ఉంటూండేది; తన కొరకై త్యాగం చేయటం వల్లనేమో సుజన్నీ చెల్లెలి కన్నా బాధపడుతున్నట్లు కనిపించేది. మార్గరెట్‌ మీద కాలం తన ప్రభావాన్ని ఘోరంగా చూపింది. అక్క కన్నా త్వరలోనే ముసలితనం ఆమెను ఆవరించింది. 30 సంవత్సరాలకే వెంట్రుకలు తెల్లబడినవి. ఏదో నిగూఢవ్యాధి ఆమెను తినేస్తోందనిపిస్తుంది. గత 24 గంటల్లో ఆమె మాట్లాడిన మాటలు ఇవి: ‘నా అంతం దగ్గర పడుతోంది; మతబోధకుని కోసం కబురంపు.’ ఆమె వెల్లకిలా పడుకుంది. దగ్గుతెరలతో గిలగిలలాడుతోంది. హృదయంలోని భయాన్ని దేన్నో తప్పించుకొని బైటపడేందుకు మాటలు పెదవుల దాకా వొచ్చి ఆగిపోతూన్నవి. ఆమె స్థితి జాలిని కలిగిస్తోంది. ఆమె అక్క ‘మార్గరెట్‌! తల్లీ’ అని వెక్కివెక్కి ఏడుస్తోంది. ఆమె మార్గరెట్‌ను ఎప్పుడూ ‘తల్లీ’ అని పిలిచేది; మార్గరెట్‌ మాత్రం ‘అక్కా!’ అనేది. మేడమెట్ల మీద అడుగుల చప్పుడు వినిపించింది; ముసలి మతబోధకుడు తలుపు తెరుచుకొని ప్రవేశించాడు. అతణ్ని చూడగానే మార్గరెట్‌ ఎలాగో లేచి కూర్చుని, ఏదో గొణుక్కుని, పక్కబట్టల్ని పిచ్చిగా మెలిపెట్ట సాగింది. మతబోధకుడు ఆమె ఫాలభాగం మీద ముద్దు పెట్టుకుంటూ ‘‘అమ్మాయీ! భగవానుడు నిన్ను తప్పక క్షమిస్తాడు.

ధైర్యంతో వుండు’’ అన్నాడు. ఆమె ఆపాదమస్తకమూ వొణికింది. ఇందుకు లయగా మంచమే వూగింది. పూడిపోయిన గొంతును బలవంతాన స్వాధీనంలోకి తెచ్చుకొని ‘‘అక్కా! కూర్చొని విను’’ అంది. మతబోధకుడు సుజన్నీని పక్కనేవున్న కుర్చీలో కూర్చోబెట్టాడు. మార్గరెట్‌ మాటలు ఒక్కొక్కటిగా దొళ్లసాగినవి. ‘‘అక్కా! నన్ను క్షమించు. నీ క్షమను వేడుకునేందుకు తగిన అవకాశం కోసం జీవితమంతా వేచివున్నాను. అది యీనాటికి లభించింది’’. సుజన్నీ కన్నీళ్ల మధ్య ‘‘నేను క్షమించటమేమిటి తల్లీ? నాకోసం నీవు సర్వస్వాన్నీ త్యాగం చేశావు. నీవు దేవకన్యవు’’ అంది. అక్క మాటలకు మార్గరెట్‌ అడ్డుపడుతూ, ‘‘కాదు... నన్ను మాట్లాడనీ. నిజం చెప్పనీ... హెన్రీ... హెన్రీ నీకు జ్ఞాపకమే కదూ? ‘‘యీ కథంతా వింటేనేకాని నీకు అర్థం కాదు. అప్పుడు నా వయస్సు 12 సంవత్సరాలే... నీకు గుర్తుంది కదూ? మనసుకు తోచిందల్లా చేసేదాన్ని. నేను ఎందుకు చెడిపోయినావని నీవు అడగొచ్చు... విను.

మొదటిసారి హెన్రీ మన ఇంటికి వొచ్చినప్పుడు గుర్రపుస్వారీకి ఉపయోగపడే బూట్సు వేసుకొచ్చాడు. మెట్ల దగ్గిర గుర్రం దిగి, తన దుస్తుల విషయం క్షమించమన్నాడు. నాన్నగారికి ఏవో వార్తల్ని అతను తీసుకొచ్చాడు. హెన్రీని చూడగానే నా హృదయం స్వాధీనం తప్పిపోయింది. నాన్నగారితో అతను మాట్లాడుతూన్నంతసేపూ, నేను గదిమూలలో నిలబడి అతణ్ని తదేకంగా చూడసాగాను. ఆనాటినుంచీ అతణ్ని గూర్చి ఎన్నో కలలు కంటూండేదాన్ని. అతను మళ్లీ మళ్లీ రాసాగాడు. చూపులదాహం తీర్చుకునేదాన్ని. ప్రణయం శరీరాన్ని మించి ఆత్మవరకూ వెళ్లింది. వయస్సుకు తక్కువైనా వూహలకు పెద్దదాన్నే. అందరూ అనుకున్నంత అమాయకురాల్ని కాదు; జిత్తులమారిదాన్ని కూడాను. ‘‘ఆ తరువాత అతను నిన్ను వివాహమాడుతాడని విన్నాను. అది నా హృదయాన్ని ముక్కలు చేసేసింది. మూడు రాత్రులవరకూ నిద్ర లేకుండా, తెల్లవార్లూ ఏడుస్తూనే వున్నాను. అతను ప్రతి మధ్యాహ్నమూ భోజనమయ్యాక వొస్తుండేవాడు... నీకు జ్ఞాపకం వుంది కదూ... ఉష్‌ మాట్లాడకు... అతని కోసం నీవు వెన్న పూసిన కేకుల్ని చేసేదానివి. యీనాడు మళ్లీ వాటిని చేయాలంటే నేను చేయగలను. కేకు కాస్త కొరికి కొంచెం వైన్‌ తాగి ‘ఎంత మధురంగా వుంది!’ అంటూండేవాడు. ఎలా అనేవాడో నీకు గుర్తుంది కదూ?

‘‘నాలో ద్వేషం... ద్వేషాగ్ని ప్రజ్వరిల్ల సాగింది. నీ వివాహం దగ్గర పడుతోంది; ఇంకా రెండు వారాలే వుంది. నాకు పిచ్చెక్కినట్లయింది. అతను నిన్ను ఎప్పటికీ పెళ్లాడకుండా చేయాలని శపథం చేశాను. నేను పెద్దదాన్నయాక అతను నన్నే పెళ్లాడాలి.‘‘ఒకనాటి రాత్రి ఇంటిముందు అతనితో నీవు వెన్నెల్లో పచార్లు చేస్తున్నావు... దూరంగావున్న పైన్‌ చెట్టు కింద అతను నిన్ను తన చేతుల్లోకి లాక్కున్నాడు. నీవు అదంతా మరిచిపోలేదనుకుంటాను. ఆ సంఘటన అయాక, నీవు వెలవెలబోతూ గదిలోకి వొచ్చావు. నేను చాటుగా చూస్తూనే వున్నాను. నేను కోపంతో వొణికి పోతున్నాను. ఆ కోపజ్వాలలో మీరిద్దరూ మసి కావలసింది. అతను నన్ను తప్ప ఇంకెవర్ని వివాహమాడినా భరించలేను... కాని యీ క్షణంలో అతనంటే నాకు పరమ అసహ్యం కలిగింది. ‘‘నేనేం చేశానో తెలుసా? విను. తోటమాలి పిచ్చికుక్కల్ని చంపేందుకు మాంసంలో విషం కలపటం చూశాను. యీ విధానం నాకు నచ్చింది. ఒక సీసాను పగలగొట్టి మెత్తగా నూరివుంచాను. ఆ పొట్లం విప్పితే గాజుపొడి తళతళా మెరిసేది. మర్నాడు నీవు కేకుల్ని చేశాక, వాటిని జాగర్తగా కత్తితో చీల్చి యీ గాజుపొడి వేసి, మళ్లీ అతికించాను. అతడు మూడు కేకుల్ని తిన్నాడు. నేను ఒకటి తిన్నాను. ఇంకా మిగిలిన ఆరింటిని కొలనులో పారేశాను. మూడు రోజుల తర్వాత, కొలనులో యీదే రెండుబాతులూ చచ్చినవి...

‘‘నన్ను చెప్పనీ. ఆ కేకుల్ని తిన్నవాళ్లందరూ చచ్చారు; నేనుమాత్రం చావలేదు. మోతాదు సరిపోయివుండదు. ఆనాటినుంచే నా ఆరోగ్యం చెడింది. చచ్చిన హెన్రీ విషయం కాదు. కాని ఆనాటినుంచీ పిశాచునివలె అతను వెన్నాడుతూనే వున్నాడు.‘‘నా మనస్సులో యీ దుర్మార్గమంతా కరుడుకట్టి నన్ను జీవితమంతా బాధిస్తూనేవుంది. అక్కా! అది ఎంత ఘోరమో, ఎంత విషాదమో, ఎంత బాధో చెప్పలేను. మేల్కొనివున్న ప్రతి నిమిషంలోనూ చావబొయ్యే ముందు నీకీ సంగతులన్నీ చెప్పాలనే మాట జ్ఞాపకం చేసుకుంటూ వుండేదాన్ని. ఇప్పుడు నా హృదయం తేలికయింది. అక్కా! నేను నైతికంగా భయపడిపొయ్యాను. చనిపొయ్యాక అతణ్ని చూడటం తటస్థ పడుతుందనుకో... అతణ్ని చూడగలగటం అంటే– దాన్ని నీవు వూహించుకోగలవా? నాకు ముఖం చెల్లదు. నేను చనిపోబోతున్నాను. అక్కా! నాకు క్షమాభిక్ష ఇవ్వు. నీ క్షమ లేనిదే నేను అతణ్ని చూడలేను. ఫాదర్‌! మా అక్క చేత నాకు క్షమ ఇప్పించమని వేడుకుంటున్నాను. ఆమె క్షమించనిదే నేను చావలేను.’’భరించలేని నిశ్శబ్దం గదిని ఆవరించింది. మార్గరెట్‌ వూపిరి కోసం పెనుగులాడుతూ దుప్పటిని మెలి పెడుతోంది.

సుజన్నీ తన ముఖాన్ని అరచేతుల్లో దాచుకొని కదలక మెదలక ఉండిపోయింది. ఆ వివాహమే ఐనట్లయితే తనెంత సుఖపడి ఉండేది! కాలంలోకి ఆమె మనస్సు వేగంగా వెనక్కు పరుగెత్తుతోంది. అతని నుంచి ఆమె పొందిన ఆ ముద్దు! ఆ ఒక్క ముద్దు తాలూకు మాధుర్యమే ఇన్నేళ్లపాటూ తనను బతికించగలిగింది. దాని తాలూకు జ్ఞాపకాన్నే ఆమె హృదయాంతరాళంలో దాచుకొంది. ఆ తరువాత– ఏం లేదు. మరెన్నడూ ఏం లేదు. అంతే! మతబోధకుడు లేచి నిలబడి, ఆజ్ఞాపూరిత స్వరంతో ‘సుజన్నీ! నీ చెల్లెలు చావబోతోంది’ అన్నాడు. సుజన్నీ కన్నీటితో తడిసిన తన ముఖం నుంచి చేతుల్ని తీసేసింది. చెల్లెల్ని ఆదరణతో, అభిమానంతో, అనురాగంతో కావలించుకొని ముద్దు పెట్టుకుంది.‘తల్లీ! నిన్ను క్షమించాను; హృదయపూర్వకంగా క్షమిస్తున్నాను’ అందా అక్క.

ఒక ముద్దు అక్కను జీవితకాలం బతికించగలిగినప్పుడు, అదే ముద్దు పాపభీతితో మృత్యుముఖంలోవున్న చెల్లి మనసును తేలిక చేయలేదా? ప్రేమ గొప్పతనాన్నీ, ప్రేమ రూపంలోని క్షమ గొప్పతనాన్నీ తెలియజేసే కథ ఇది. రచయిత మొపాసా (1850–1893). ఈ ఫ్రెంచ్‌ కథను ‘చేసిన పాపం’గా, ఇంద్రజిత్‌ కలంపేరుతో తెలుగులోకి అనువదించింది ధనికొండ హనుమంతరావు. సంక్షిప్తం: సాహిత్యం డెస్క్‌.
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top