మార్పు రేపు

women empowerment   special on madhumitha - Sakshi

ఏ పచారీ దుకాణంలో అయినా ‘అప్పు రేపు’ అని రాస్తారు.  తీహార్‌ జైలు గోడల మీద కూడా  ఇలాగే రాసి ఉన్నట్లనిపించింది మధుమితకు.. ‘మార్పు రేపు’ అని! రేప్‌కు శిక్ష అనుభవిస్తున్న వందమంది ఖైదీలను కదిపితే... 96 మందిలో మార్పే కనిపించలేదు! రేప్‌ అయింది మనిషి కాదు.. ‘మార్పు’ అని.. మధుమితకు అర్థమైంది!

2012. ఢిల్లీలో జరిగిన నిర్భయ దుర్ఘటన దేశాన్నంతా షాక్‌కి గురిచేసింది. ఢిల్లీలో మహిళలు పార్లమెంట్‌ మీదకు దండెత్తారు. ఆ నిరసన దేశమంతా ప్రతిధ్వనించింది. ఆ గ్యాంగ్‌ రేప్‌ గురించి, భారతదేశంలో.. మరీ ముఖ్యంగా రాజధాని ఢిల్లీలో స్త్రీలకున్న భద్రత, గౌరవం ఎంత ఘోరమైన స్థితిలో ఉందో పాశ్చాత్య మీడియా కోడైకూసింది. ఇదంతా యు.కె.లోని ఆంగ్లియా రస్కిన్‌ యూనివర్సిటీలో క్రిమినాలజీలో పీహెచ్‌డీ చేస్తున్న మధుమిత పాండేను కలచివేసింది. తన దేశంలోని మగవాళ్లు ఎందుకింత క్రూరంగా, విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారు? ఏ పరిస్థితులు వాళ్లనిలాంటి సిగ్గుమాలిన చర్యకు ఉసిగొల్పుతున్నాయి? అన్న ఆలోచనలు  రేకెత్తాయి. అధ్యయనం చేయాల్సిందే అనుకొని ఢిల్లీ బయలుదేరింది. 

ఇంటర్వ్యూల కోసం తీహార్‌కు
మధుమిత పుట్టి పెరిగింది ఢిల్లీలోనే. సాంకేతిక ప్రగతి, సనాతన సంప్రదాయ ఆలోచనలు కలిసి కాపురం చేసే నగరం అది. నిర్భయ తర్వాత వెల్లువెత్తిన మహిళా చైతన్యం ఆ నగరాన్ని కొత్త వెలుగుల వైపు  నడిపిస్తుందేమో అనుకుంటూ.. ఢిల్లీలో ల్యాండ్‌ అయింది. తీహార్‌ జైలు అధికారుల అనుమతి తీసుకుంది. శిక్ష పడిన వంద మంది రేపిస్ట్‌లను ఇంటర్వ్యూ చేయడానికి సంసిద్ధురాలైంది.. భూమ్మీది అత్యంత క్రూరమైన మగవాళ్లను కలవడానికి వెళ్తున్నా అనుకుంటూ.

ఒకటి.. రెండు.. మూడు.. నాలుగు.. ఐదు.. తను మాట్లాడుతున్న రేపిస్టుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రోజులూ గడుస్తున్నాయి. వందమందిని కలిసేసరికి కొన్ని వారాలు గడిచాయి. వెళ్లడానికి ముందు, వాళ్లను కలిసి మాట్లాడాక.. ఆమె ఆలోచనలు, దృక్పథం అన్నీ మారిపోయాయి. రేప్‌ చేసిన వాళ్లంతా అతి మామూలు మగవాళ్లు. అందులో చాలామంది  మధ్యలో బడి మానేసినవాళ్లే. వాళ్లంతా రేపిస్ట్స్‌గా మారడానికి  ఒకే ఒక్క కారణం.. పెంపకం, దాని ద్వారా వచ్చిన ఆలోచనా ధోరణి! భారతీయ ఇళ్లల్లో.. చదువుకున్న కుటుంబాల్లో కూడా ఆడవాళ్లు ఇంటి పనులకే పరిమితం కావడం, ఉత్తర భారతదేశంలోనైతే చాలామంది గృహిణులు తమ భర్తల పేరు పలకడాన్ని కూడా తప్పుగా భావించడం, అదో అమర్యాద చర్యగా జమకట్టడం.. ఇవన్నీ కూడా మగవాళ్లలో తాము అధికులమనే అభిప్రాయాన్ని స్థిరపర్చినట్టు మధుమిత అధ్యయనంలో తేలింది. ఆడవాళ్ల మనసు, శరీరాల మీద ఆడవాళ్లకు పూర్తి హక్కుంటుందన్న విషయాన్ని ఇటు మగవాళ్లే కాదు, ఆడవాళ్లు కూడా అంగీకరించకపోవడం, అసలు దాని పట్ల వీళ్లెవరికీ కనీస అవగాహన లేకపోవడం మధుమిత పాండేను విస్మయపరిచిన నిజం. ‘‘ఎంత చదువుకున్నా ఆడవాళ్లు అణిగిమణిగే ఉండాలి’’ అని ఇటు రేపిస్ట్స్‌లే కాదు.. బయట ఆడవాళ్లూ  వెలిబుచ్చారట. దోషులుగా నిర్ధారణ అయిన వంద మందిలో దాదాపు ముప్పావు వంతు మంది తమని తాము సమర్థించుకునే ప్రయత్నమే చేశారట. అంతేకాదు, కొంతమంది తామసలు రేప్‌ చేయనే లేదని వాదించారు. ఇంకొంత మంది..‘‘తప్పంతా ఆడవాళ్లదే’’ అని చెప్పారు. వాళ్లు మర్యాదగా, ఒద్దిగ్గా పొందిగ్గా ఇంట్లోనే ఉంటే మేం ఎందుకు వాళ్ల వైపు చూస్తాం’’ అన్నారు. ఒక నలుగురైదుగురు మాత్రమే.. ‘‘రేప్‌ చేశాం. మా వల్ల తప్పే జరిగింది’’ అని పశ్చాత్తాపపడ్డారు.  

రేప్‌ను మించిన అత్యాచారం!
49 ఏళ్ల ఒక వ్యక్తి మధుమిత ముందు ఘోరమైన అపరాధ భావంతో కుంగిపోయాడు. ‘‘నేను ఓ అయిదేళ్ల పాపను రేప్‌ చేసి ఆ పిల్ల జీవితాన్ని నాశనం చేశాను. ఆ పాప తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో.. నా పాపానికి పరిహారం చేసుకోవాలనుంది’’ అంటూ ఏడ్చాడు. ఆ అమ్మాయి తల్లిదండ్రుల వివరాలనూ మధుమితకు ఇచ్చాడు. ఆమె వాకబు చేస్తే తమ బిడ్డ మీద అఘాయిత్యం చేసిన వాడికి శిక్ష పడ్డ విషయం కూడా వాళ్లకు తెలియదని చెప్పారు ఆ పాప తల్లిదండ్రులు. 

ఇంకా దారుణం ఏంటంటే.. ‘‘ఆ పాప జీవితాన్ని పాడు చేశా కాబట్టి సంరక్షించే బాధ్యత కూడా నేనే తీసుకుంటా. శిక్ష అయిపోయి బయటకు వచ్చాక ఆ పిల్లను పెళ్లి చేసుకుంటా’’ అని  ఆ రేపిస్ట్‌ అనడం! ఆ జవాబుకు మధుమిత షాక్‌ అయ్యారు. ‘‘ఇలాంటి జవాబులు, అభిప్రాయాలు విన్నాక మనం ఎలాంటి సమాజంలో ఉన్నాం, ఎటు వెళ్తున్నాం అనిపించింది. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ వల్ల జీవనశైలి మారింది తప్ప మనం అక్షరాస్యులం అవలేదు. ఈ ఇంటర్వ్యూ తర్వాత ఢిల్లీ లాంటి మెట్రో నగరాల్లోని చాలా పాఠశాలల్లో సిలబస్‌ను పరిశీలించాను. అందులో లైంగిక విద్య లేకపోగా అమ్మాయిల, అబ్బాయిల దేహనిర్మాణం, వారి దేహధర్మాల గురించి చెప్పడాన్ని పెద్ద తప్పుగా అనుకుంటున్నారు. టీచర్లే కాదు.. యాజమాన్యాలు, ఆఖరికి గవర్నమెంట్‌ కూడా. పిల్లలకు వాటిని నేర్పించడం వల్ల పిల్లలు తప్పు దారి పట్టే ప్రమాదం ఉందని వాదించారు. స్కూళ్లల్లో ఇలా ఉంటే ఇళ్లల్లో అంతకంటే ఘోరం. లైంగిక అవయవాల గురించి మాట్లాడ్డం పాపం. ఇంత మూఢవిశ్వాసాలు ఉంటే పిల్లలు ఎలా జాగృతం అవుతారు. వాళ్లే పెదై్ద ఇలాంటి పనులు చేస్తారు. అమ్మాయిలను గౌరవించాలని ఇళ్లల్లో చెప్పకపోతే రేపిస్ట్‌ల సంఖ్య పెరుగుతుంది. నా ఈ అబ్జర్వేషన్స్‌ అన్నిటినీ ఓ పుస్తకం రూపంలో తేవాలనుకున్నాను. కానీ నన్ను నమ్మి వాళ్ల మనోభావాలను బయటపెట్టిన రేపిస్ట్‌లు రేపొద్దున ఇంకెవరినీ నమ్మరేమోనని ఆగిపోయా. కానీ ఇంకో రూపంలో ఇలాంటివన్నీ బయటకు తెస్తా. మన సమాజం చైతన్యం కావాల్సిన అవసరం చాలా ఉంది’’ అని వివరించారు.  మధుమితా పాండే.

సైకాలజీ స్టూడెంట్‌
మధుమిత ఢిల్లీ యూనివర్సిటీలో బీఏ సైకాలజీ చేశారు. బాంగోర్‌ యూనివర్శిటీ (ఆమ్‌స్టర్‌డ్యామ్‌)లో ఎమ్మెస్సీ క్లినికల్‌ సైకాలజీ చేసి యూకేలోని ఆంగ్లీ రస్కిన్‌ యూనివర్సిటీలో క్రిమినాలజీలో పీహెచ్‌డీ చేశారు. మన దేశంలోని లైంగిక బానిసత్వం మీద, బాలికల అక్రమ రవాణా మీద కథనాలు రాశారు. 
– శరాది

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top