నేను శక్తి... నేనే సాక్షి

women empowerment : sakshi success meet - Sakshi

నిలవాలి.. గెలవాలి
అంతరాలు దాటుకుని స్వశక్తితో నిలదొక్కుకుంటూ సమాజానికే ఓ శక్తిగా నిలుస్తోంది స్త్రీ. ప్రతి సామాజిక అంశంలోనూ స్త్రీ తన ముద్రను వేసుకుంటూనే వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ’సాక్షి’ చేపట్టిన ’నేను శక్తి’ క్యాంపెయిన్‌  ముగింపు వేడుకల్లో వక్తలు సాక్షి ప్రయత్నంపై ప్రశంసల జల్లును కురిపించారు. స్త్రీ నిలవాలి.. స్త్రీ గెలవాలి అంటూ వీరంతా పిలుపునిచ్చారు. 

వేధింపులకు గురయ్యేది అమ్మే!
ఎక్కడెక్కడో ఎవరెవరో వేధింపులకు గురౌవుతున్నారని మనం జాలి పడుతున్నాం. కానీ మన కుటుంబంలో మన అమ్మ వేధింపులకు గురౌవుతున్న విషయాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. ఇలా మనం గుర్తించలేని, అమ్మ తనంతట తను బయటికి చెప్పుకోలేని ఎన్నో సంఘటనలను, కేస్‌ స్టడీలను ‘సాక్షి’ ‘నేను శక్తి’ క్యాంపెయిన్‌ ద్వారా ప్రజల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. దీనిద్వారా ప్రజల్లో ఓ అవగాహనకలిగి వారు వేధింపులను అడ్డుకోవాలి అనే విధంగా ముందుకు వెళ్లడం స్ఫూర్తిదాయకం. అంతకన్నా ముందు కుటుంబ సభ్యులంతా అమ్మ కష్టాన్ని గుర్తించాలి. అమ్మ కష్టాన్ని పంచుకోవాలి. అమ్మను గౌరవించాలి.      
- మణిపవిత్ర, మిలియన్‌ మామ్స్‌ డైరెక్టర్‌

‘నేనుశక్తి’ ద్వారా స్త్రీశక్తిని గుర్తుచేశారు
‘సాక్షి’ నిర్వహించిన ‘నేను శక్తి’ క్యాంపెయిన్‌ ద్వారా యావత్‌ స్త్రీకి తన శక్తిని గుర్తుచేశారు. నా చిన్నతనంలో మా ఊరిలో జరిగిన పరిణామాలే నాలో మార్పురావడానికి దోహదపడ్డాయి. మా ఊరిలో, సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న వేధింపులపై నేను ఓ పాటను రాశాను. ఆ పాట ద్వారా నాకు సినిమా అవకాశాలు వచ్చాయి. కానీ సినిమా రంగంలో నిలదొక్కుకోవడం అంత తేలికేం కాదు. సినిమా రంగంలో రాణించాలంటే మన వెనక ఒక గాడ్‌ఫాదర్‌ ఉండాల్సిందే. నేను నేరుగా ఎన్నో వేధింపులకు ఎదుర్కున్నాను. మనపై జరుగుతున్న వేధింపులకు అడ్డుకట్ట పడాలి అంటే మనం బయటికి చెప్పుకోవాల్సిందే.
– శ్రేష్ట, రచయిత్రి

జనాభాలో సగం ఉన్నా స్త్రీకి గౌరవం దక్కట్లేదు
మహిళా శక్తి మీద ఇంతగా క్యాంపెయిన్‌ని నడపడం అనేది అంత సులువు కాదు. జనాభాలో సగం ఉన్నా స్త్రీకి గౌరవం దక్కట్లేదని నిరూపించే సజీవ కథనాలను సాక్షి ప్రచురించింది. నన్ను ఈ క్యాంపెయిన్‌లో భాగస్వామ్యం చేశారు కాబట్టి నేను కూడా ప్రతి వార్తని ఫాలో అయ్యాను. దళితులు, మహిళలు, ఆదివాసీలు ఎవరైనా కావొచ్చు, వారికి సంబంధించిన రాజకీయాలు నడపడం ద్వారా మేం అధికారంలోకి వస్తాము అనుకుంటే నడపడంలో తప్పు లేదు. దీనిని మనం ఆహ్వానించాలి. అంతేకానీ ప్రోత్సహించకుండా ఉండటం అనేది కరెక్ట్‌కాదు అనే చక్కటి కోణాన్ని క్యాంపెయిన్‌ ఆవిష్కరించింది. 
– దేవి, సామాజిక కార్యకర్త

ఆడపిల్లలు ఎవ్వరిపైనా ఆధారపడకూడదు
వైజాగ్‌ దగ్గర ఉన్న చిన్న ఊరు నుంచి హైదరాబాద్‌ వచ్చి లీగల్‌ ప్రాక్టీస్‌ స్టార్ట్‌ చేశాను. ఎందరో సామాజిక కార్యకర్తలను చూసి మాట్లాడటం నేర్చుకుని, సమాజంపై అవగాహనను తెచ్చుకున్నాను. నా ఎదుగుదలకు ‘సాక్షి’ ప్రోత్సాహాన్ని ఇచ్చింది. సమాజం, వ్యవస్థ బాగుండాలి అంటే కుటుంబ వ్యవస్థ బాగుండాలి. కుటుంబాలు రకరకాల కారణాలతో విచ్ఛిన్నం కావడం గుర్తించాను. భార్యాభర్తల మధ్యలో పిల్లలు కష్టపడటం  గమనించాను. వారి జీవితాలు బాగుపడేలా నా వంతుగా కృషి చేస్తున్నా. నేను చెప్పడం ఏంటంటే మహిళలు స్వయంకృషితో ఆర్థికంగా పైకి ఎదగాలి తప్ప ఎవరిపైనా ఆధారపడకూడదు. 
– నిశ్చల సిద్ధారెడ్డి, ఫ్యామిలీ కౌన్సెలర్‌

సినిమాల్లో మహిళలను కొట్టడం అనేది ఫ్యాషన్‌ అయ్యింది
ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. కానీ ఇప్పటికీ ఎంతమంది మహిళలకు వేధింపుల నుంచి విముక్తి కలిగిందంటే సమాధానం లేదు. రోజూ ప్రసారమయ్యే టీవీ సీరియల్స్, సినిమాల్లో మహిళలను కొట్టడం అనేది ఒక ఫ్యాషన్‌గా మారింది. ఈ రెండూ సమాజంపై ఎంతటి ప్రభావం చూపిస్తాయనేది ఎవ్వరూ గ్రహించట్లేదు. గృహæహింస, లైంగిక వేధింపులు రెండూ ఎక్కువగానే ఉన్నాయి. సినిమాల్లో వస్తున్న లైంగిక వేధింపులను లైంగిక వేధింపుల్లా గుర్తించకపోవడం కూడా విచారకరం. దీనిపై దర్శకులు, హీరోలు కూడా మాట్లాడకపోవడం బాధాకరం. 
– సజయ, యాక్టివిస్ట్‌

నాలుగు వారాలుగా సాక్షి నిర్వహించిన ‘నేను శక్తి’ కార్యక్రమ సక్సెస్‌ మీట్‌లో చైర్‌పర్సన్‌తో ‘సాక్షి’ మహిళా శక్తి ప్రతీకలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒక రోజు ముందుగా హైదరాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో జరిగిన ముగింపు వేడుకల్లో వీరంతా పాల్గొన్నారు.   

(మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top