గుడ్డీగా ఫాలో అవుదామా!

Women Activist Sonal Rochani Shakthi Foundation - Sakshi

గుడ్‌ టచ్‌... బ్యాడ్‌ టచ్‌.. గుడ్‌ పీపుల్‌... బ్యాడ్‌ పీపుల్‌.. గుడ్‌ రిలేషన్‌... బ్యాడ్‌ రిలేషన్‌. ఇవన్నీ మన అమ్మాయిలకు కొంత ఉజ్జాయింపుగా తెలుసు. మనలో చైతన్యం ఉంది... కాబట్టి... మన ఆడపిల్లలకు ఈవిషయాలు చెప్పి జాగ్రత్త పడుతున్నాం. ఆదివాసీ ఆడపిల్లలకు ఈ విషయాలు ఎవరు చెబుతారు? మన ప్రపంచంలోనే మగవాడిఆటవిక రాజ్యం ఏవగింపు కలిగిస్తోంది. మరి... అడవిలో మగాడి పంజా నుంచి ఆడపిల్లలను ఎవరు కాపాడతారు? అందుకే... వాళ్లు గుడ్డీని ఫాలో అవుతున్నారు.

ఓ పన్నెండేళ్ల అమ్మాయి, పేరు గుడ్డీ. ఆమెకో గ్యాంగ్‌ ఉంటుంది. ఆ గ్యాంగ్‌లో అందరూ అమ్మాయిలే. వాళ్లు సమాజంలో ఎదురయ్యే అరాచకాలను ఎదిరిస్తుంటారు. ఆడవాళ్ల మీద దాష్టీకానికి పాల్పడిన మగవాళ్ల పీచమణుస్తుంటారు. గుడ్‌ టచ్, బ్యాడ్‌ టచ్‌ గురించి చైతన్యపరుస్తుంటారు. మగవాళ్ల నుంచి ఊహించని విపత్తులు సంభవించినప్పుడు బెంబేలు పడకుండా ధైర్యంగా నిలబడి వాటిని ఎదుర్కోవడమెలాగో తోటి ఆడ పిల్లలకు, మహిళలకు చెప్తారు. వేధింపులు, అత్యాచారాల ప్రమాదాన్ని ఊహించి జాగ్రత్తపడడమెలాగో కూడా నేర్పిస్తారు. ఈ గడుగ్గాయిల బృందానికి నాయిక గుడ్డీ. ఓ ప్రవక్త మాదిరిగా మహిళలకు ఎన్నో కబుర్లు చెప్తుంటుంది. మహిళలను, బాలికలను ఇంతగా ఆకట్టుకున్న గుడ్డీ... ఒక కల్పిత పాత్ర. ఆ పాత్ర ఆధారంగా అల్లిన అనేక కథనాలతో ఆదివాసీ సమాజాన్ని చైతన్యపరుస్తోంది సోనల్‌ రోచానీ.

ఆ గర్భిణి... కళ్లలో మెదిలేది
సోనాల్‌ రోచానీది గుజరాత్, జునాఘడ్‌ పట్టణంలో స్థిరపడిన సింథీ కుటుంబం. ఆమె స్థానిక వార్తాపత్రికలో జర్నలిస్టుగా క్రైమ్‌ న్యూస్‌ రిపోర్ట్‌ చేసేది. ప్రతి నేరం వెనుక ఒక కాఠిన్యం ఉంటుంది, నేర పరిశోధన లోతుల్లోకి వెళ్లే కొద్దీ మనసును కదిలించే అగాధాలు బయటపడేవి. సూరత్‌లో 2005లో ఒక మహిళ కిరోసిన్‌తో తడిసిన దుస్తులతో రక్షించమని కేకలు పెడుతూ పరుగెత్తుకొచ్చింది. ఆ వార్త పూర్వాపరాల్లోకి వెళ్లే కొద్దీ మనసును పిండేసే నిజాలు బయటపడ్డాయి. కిరోసిన్‌తో తడిసిన ఆ మహిళ గర్భిణి, ‘ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆడశిశువు’ అని తెలుసుకున్న ఆమె అత్త, బంధువులు ఆ గర్భిణిని చంపేయడానికి ప్రయత్నించారు. ఆమె నిద్రలో ఉండగా ఆమె ధరించిన దుస్తులను కిరోసిన్‌తో తడిపేశారు. ఒంటికి తేమ తగలడంతో మెలకువ వచ్చిందామెకు. తనకు ఎదురైన ప్రమాదాన్ని క్షణాల్లోనే గ్రహించి కాపాడమని ఇంటి బయటకు పరుగెత్తుకొచ్చింది. ఈ సంఘటన సోనాల్‌ను విపరీతంగా కదిలించి వేసింది. అప్పటి వరకు సోనాల్‌ రిపోర్ట్‌ చేసిన క్రైమ్‌ న్యూస్‌ ఒక ఎత్తు. ఈ గర్భిణికి ఎదురైన పరిస్థితి ఒక ఎత్తు. ఈ ఘటన ఆమెను నిద్రలో కూడా వదిలేది కాదు. ఇలాంటి మహిళల కోసం తాను ఏమైనా చేయగలనా అని ఆలోచించడానికి దారి తీసిన సంఘటన అది.

‘శక్తి’ పుట్టింది
సోనాల్‌ జర్నలిజాన్ని వదిలేసి ఆదివాసీల జీవితాలను ఉద్ధరించడానికి పూనుకునేటట్లు దారి తీసిన పరిస్థితి మరొకటుంది. సెంట్రల్‌ గవర్నమెంట్‌ అధికారిక డాక్యుమెంట్‌లను స్థానిక భాషలోకి అనువదించే ప్రాజెక్టులో పని చేస్తున్నప్పటి సంగతి ఇది. నిరుపేదలకు ప్రభుత్వం రూపొందించిన పథకాలు, వాటి అమలుకు సంబంధించిన డాక్యుమెంట్లను చదువుతుంటే ప్రభుత్వ ధనం అర్హులకు చేరకుండా మధ్యలో ఎంత దుర్వినియోగమవుతోందో తెలిసింది. ఆదివాసీల కోసం రూపొందిన పథకాల గురించి వాళ్లకు కనీసంగా కూడా తెలియకపోవడం దారుణం అని కూడా అనిపించింది. ‘ఈ పరిస్థితిని సరిదిద్దడానికి ఏదో ఒకటి చేయాలి. తమ జీవితాలను బాగుచేసుకోవాలనే ఆలోచన ఆదివాసీల్లో రేకెత్తించగలిగితే చాలు. ఆ తర్వాత ప్రభుత్వ పథకాలను తమ ముంగిట్లోకి తెచ్చుకునే పని వాళ్లే చేసుకుంటారు’ అనుకున్నది సోనాల్‌. ఉద్యోగం చేస్తూ ఇవన్నీ చేయాలంటే కుదిరేపని కాదు. జర్నలిస్ట్‌గా తన వృత్తి ఎలా ఉంటుందంటే... ఒక న్యూస్‌ కవర్‌ చేసినప్పుడు కదిలిపోయిన మనసు, పరిష్కారం కోసం వెతుకుతూనే ఉంటుంది. అయితే మరునాడు మరో సంఘటనను రిపోర్ట్‌ చేసినప్పుడు మొదటిది పక్కకు పోయి మరొక అంశం వచ్చి చేరుతుంటుంది. ఆ రెండవది కూడా ఆ మరుసటి రోజు వరకే. మూడవ రోజు మరొక అంశం చుట్టూ తిరుగుతుంటుంది తన ఉద్యోగం. ఇందులో కొనసాగుతూ పూర్తి చేయగలిగిన ప్రాజెక్టు కాదు ఆమె చేపట్టబోతున్నది. ఈ పనిని విజయవంతం చేయాలంటే పూర్తి సమయాన్ని కేటాయించాలి, పూర్తిగా ఆ ప్రాజెక్టు కోసమే పని చేయాలనుకుంది. నిర్ణయానికి వచ్చిన తర్వాత జర్నలిస్టు ఉద్యోగాన్ని వదిలేసింది. 2011 ఆగస్టులో ‘శక్తి ఫౌండేషన్‌’ స్థాపించింది.

బడికి బాట వేసింది
గుజరాత్‌ తూర్పు తీరాన ఎనిమిది జిల్లాల్లో ఆదివాసీలు ఎక్కువ. వారిలో నిరక్షరాస్యత, నిరుద్యోగం, పోషకాహార లోపం, మద్యసేవనం, బాల్య వివాహాలు, స్త్రీల పట్ల వివక్ష... అడుగడుగునా కనిపిస్తుండేవి. ప్రభుత్వం అనేది ఒకటి ఉంటుందని కూడా వాళ్లకు తెలియదు. ముఖ్యంగా హర్పతి, కోత్‌వాలియా ఆదివాసీ తెగల జీవనశైలి అయితే మరీ విచిత్రంగా ఉంటుంది. మగవాళ్లు సారా తాగి తాగి 35–40 ఏళ్లకే చనిపోతుంటారు. ఆడవాళ్లు పిల్లలను పెంచుకుంటూ కుటుంబాలను పోషించుకోవడానికి తంటాలు పడుతుంటారు. బతుకు తెరువు కోసం సంచార జీవనం సాగిస్తుంటారు. ఎంత కష్టపడినా రోజుకు వంద రూపాయలకు మించి సంపాదించే మార్గాల్లేవక్కడ. ఆ తల్లుల శక్తి బిడ్డలకు కడుపు నిండా తిండి పెట్టడానికే సరిపోదు, ఇక వాళ్లకు చదువు చెప్పించాలనే తలంపు ఎక్కడ నుంచి వస్తుంది? సోనాల్‌ తన పనిని అక్కడే మొదలు పెట్టింది. ఆ ఎనిమిది జిల్లాల్లో కలిపి 44 ఆశ్రమ పాఠశాలలను పెట్టించింది. ఇవన్నీ ప్రభుత్వ నిధుల ద్వారానే. నిర్వహణ మాత్రం శక్తి ఫౌండేషన్‌ చూసుకుంటుంది. ఆశ్రమ పాఠశాలల్లో మంచి భోజనం పెట్టిస్తూ ఆదివాసీ పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించగలిగింది సోనాల్‌. పిల్లలకు భోజనం పెట్టి చదువు చెప్పే పని ప్రభుత్వం చూసుకుంటోంది. కాబట్టి తల్లులకు ఒక బరువు తగ్గినట్లయింది. సోనాల్‌ ప్రోగ్రామ్‌ షీట్‌లో రెండవ స్థానంలో ఉన్న అంశం... ఆడపిల్లలకు వ్యక్తిగత పరిశుభ్రత నేర్పించడం.

అదే సమయంలో ఆడవాళ్లకు బతుకుదెరువుకు భరోసా కల్పించాల్సిన అవసరమూ ఉంది. ఈ రెండింటికీ కలిపి సానిటరీ నాప్‌కిన్‌లు తయారు చేసే యూనిట్‌లను పెట్టించింది సోనాల్‌. స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేసి చిన్న చిన్న యూనిట్‌లు పెట్టించి, వాటి వాడకం గురించి వారి చేతనే ప్రచారం చేయించింది. ఇక చివరగా చేయాల్సింది వారిలో సామాజిక చైతన్యం తీసుకురావడం. గుడ్డీ పాత్రతో ఆ పని చేస్తోంది సోనాల్‌. కామిక్‌ పాత్రతో రూపొందించిన షార్ట్‌ ఫిల్మ్‌ స్క్రీనింగ్, అదే గుడ్డీ పాత్ర కథనాలను బొమ్మలతో ప్రచురించి, ఆ పుస్తకాలను స్కూళ్లలో పంచుతోంది. అలా గుడ్డీ పాత్ర గుజరాత్‌ గ్రామాల్లో చదువుకుంటున్న బాలికలతోపాటు నిరక్షరాస్యులకు కూడా దగ్గరైంది. ఇంగ్లిష్‌లో పీహెచ్‌డీ, మాస్‌ మీడియాలో ఎనిమిదేళ్లు ఉద్యోగం చేసిన సోనాల్‌ గుజరాత్‌ రాష్ట్రమంతటా పర్యటించింది. కొండల్లో ఆదివాసీ సంచార జీవితాలను అధ్యయనం చేసింది. మైదానాల్లో నివసించే ఆధునిక మానవుడి జీవితాన్నీ గమనించింది. మహిళలు తాము మహిళలుగా పుట్టిన కారణంగా ఎదుర్కొంటున్న కష్టాలకు మైదానానికీ పర్వత ప్రాంతాలకు పెద్దగా తేడాలేదని గ్రహించిందామె. కారణాలు వేరుగా ఉంటున్నప్పటికీ మహిళ భుజాల మీదకు వచ్చి పడుతున్న భారంలో తేడా లేదు. ఆ పరిస్థితి నుంచి మహిళలను చైతన్యవంతం చేయడానికి ఆమె చేస్తున్న ప్రయత్నాలివి. సోనాల్‌ ప్రయత్నాలతో గుజరాత్‌లోని ఆదివాసీ మహిళలు సొంతంగా సంపాదించుకుంటున్నారు. వారిలో ఆరోగ్య స్పృహ పెరిగింది. తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెంచుకుంటున్నారు.

కారణాలే వేరు... కష్టాలొకటే
ఒకరోజు డ్యూటీలో భాగంగా గవర్నమెంట్‌ హాస్పిటల్‌కెళ్లాను. ఓ గర్భిణి నా దగ్గరకు వచ్చి సహాయం చేయమని కోరింది. కడుపులో ఉన్నది ఆడశిశువు అని తెలిసి అత్తింటి వారు అబార్షన్‌ చేయిస్తున్నారని చెప్పి ఏడ్చింది. తాను అబార్షన్‌ చేయించుకోనని, బిడ్డను కని తానే పెంచుకుంటానని, అత్తింటి మీద ఆధారపడకుండా బతకడానికి దారి చూపించమని వేడుకుంది. ఇలా ఏ ఒక్కరో కాదు, సమాజంలో ఇలాంటి దుస్థితిలో ఎంతోమంది ఉన్నారు. మైదాన ప్రాంతాల్లో మహిళ పరిస్థితి ఇలా ఉంటే, ఆదివాసీలది మరొక రకమైన దురవస్థ. భర్త సారాకు బానిసై మరణించడంతో ఆడవాళ్ల జీవితం అగమ్యగోచరమవుతోంది. కారణాలు ఏవైనా మహిళల కష్టాలన్నీ దాదాపుగా ఒకేరకంగా ఉంటున్నాయి. పెళ్లి పేరుతో ఒక మగవాడు వాళ్ల జీవితాల్లోకి వస్తున్నాడు కానీ, ఆ మహిళలకు భర్త ఉన్నాడనే భరోసా ఉండడం లేదు. దాంతో ఆడవాళ్లు తమను తాము పోషించుకోవడంతోపాటు పిల్లల పోషణ బాధ్యతను కూడా మోయాల్సి వస్తోంది. వాళ్లకు ఒక వేదిక కల్పించాలనే ఉద్దేశంతో శక్తి ఫౌండేషన్‌ స్థాపించాను. కష్టాల కూడలిలో నిలబడి జీవిత పయనానికి ఎటు వైపు సాగాలో తెలియక చేష్టలుడిగి నిస్సహాయంగా నిలబడిన ఆడవాళ్లకు ధైర్యం చెప్పడానికి, మహిళలు శక్తిహీనులు కాదని, మనసును ఆవరించిన నిస్సహాయతను తొలగించుకుని ముందుకు సాగాలని  చెప్పడానికే నా ఫౌండేషన్‌కి శక్తి ఫౌండేషన్‌ అని పేరు పెట్టాను.
– సోనాల్‌ రోచానీ, శక్తి ఫౌండేషన్‌ నిర్వహకురాలు

                                                                                                                                                                                                                                     – మంజీర

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top