స్త్రీలోక సంచారం

Woman's Wandering - Sakshi

ఎక్కడ మిస్‌ అయినా.. ఇక్కడ మిస్‌ అవరు!

ఈ ఏడాది చివర్లో జరుగనున్న రాజస్తాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బి.జె.పి. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రస్తుత ముఖ్యమంత్రి వసుంధర రాజే పేరే మళ్లీ ఖరారు అయింది. మోదీజీకి, రాజేకు విభేదాలు ఉన్నాయని, ఈసారి ముఖ్యమంత్రి అభ్యర్థిగా రాజేకు బదులుగా కేంద్ర మంత్రి రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోర్‌ పేరును పార్టీ ప్రకటించవచ్చునని రాజకీయ పరిశీలకులు వేస్తున్న అంచనాలు ఇక్కడితో ఆగిపోయినట్లే
 మోదీ ప్రభుత్వానికి చావు గంటలు మోగించేందుకు ‘ఫెడరల్‌ ఫ్రంట్‌’ నాయకులంతా జనవరి 19న కోల్‌కతాలోని బ్రిగేడ్‌ గ్రౌండ్‌లో భారీ ర్యాలీ తియ్యబోతున్నారని శనివారం జరిగిన అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. అయితే ఈ ఫెడరల్‌ ఫ్రంట్‌ ర్యాలీకి యు.పి.ఎ. చైర్‌పర్సన్‌ సోనియా గాంధీని కూడా మమత ఆహ్వానించబోతున్నందున ఇది కాంగ్రెసును కలుపుకుంటూ కూటమిగా ఏర్పడే యాంటీ–బి.జె.పి ఫ్రంట్‌ అని స్పష్టం అవుతోంది
 ప్రేమ గుడ్డిది కనుక, ప్రేమించుకుంటున్న కారణంగా కాలేజీ నుంచి తొలగించిన అమ్మాయిని, అబ్బాయిని తిరిగి చేర్చుకోవాలని కేరళ హైకోర్టు కేరళ విశ్వవిద్యాలయాన్ని ఆదేశించింది. త్రివేండ్రంలోని సి.హెచ్‌.ఎం.ఎం. కళాశాలలో చదువుతున్న మాళవిక, అదే కళాశాలలో చదువుతున్న ఆమె సీనియర్‌ వైశాఖ్‌ల ప్రేమకు వారిద్దరి తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పిన మీదట జరిగిన పరిణామాలతో కాలేజీ ప్రతిష్ట దెబ్బతింటుందని భావించిన కళాశాల యాజమాన్యం గత ఏడాది ఈ ప్రేమికులిద్దరినీ కాలేజీ నుంచి తొలగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులపై ప్రేమికుల తరఫు న్యాయవాది శ్యామ్‌ జె శామ్‌ కోర్టును ఆశ్రయించి, పునఃప్రవేశ ఆదేశాలను తెప్పించారు
 ఉప్పు నిప్పులా ఉన్న ఒకప్పటి ప్రేమికులు కంగనా రనౌత్, హృతిక్‌ రోషన్‌ల మధ్య మళ్లీ ఇప్పుడొక ముఖాముఖి యుద్ధానికి రంగం సిద్ధమౌతోంది. విడుదల వాయిదా పడుతూ వస్తున్న కంగనా మూవీ ‘మణికర్ణిక : ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’, ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త అనంద్‌ కుమార్‌ బయోపిక్‌గా వస్తున్న హృతిక్‌ చిత్రం ‘సూపర్‌ 30’.. ఈ రెండూ కూడా వచ్చే ఏడాది జనవరిలో యాదృచ్ఛికంగానే అయినా ఒకే డేట్‌లో విడుదల అయ్యే అవకాశాలు ఉండ డంతో బాక్సాఫీస్‌ వద్ద ఎవరిది పై చేయి అవుతుందనే ఆసక్తి బాలీవుడ్‌లో మొదలైంది
చివరిసారిగా బెంగాలీ చిత్రం ‘ఆత్మజ’లో కనిపించిన మన తెలుగు నటి జయప్రద త్వరలో ‘పర్‌ఫెక్ట్‌ పతి’ అనే హిందీ  సీరియల్‌లో ‘ప్రమీలా రాథోడ్‌’ అనే తల్లి పాత్రలో టీవీ వీక్షకులను అలరించబోతున్నారు. కొడుక్కి తల్లిగా, కోడలికి అత్తగారిగా జయప్రద పోషించబోయే ప్రమీల పాత్ర.. రెగ్యులర్‌గా బుసలు కక్కుతుండే క్యారెక్టర్‌లకు భిన్నంగా, హుందాగా, ఆదర్శప్రాయంగా ఉండబోతోంది
ఇంగ్లండ్‌ రాజ వంశస్తుల ఆలనలో, లాలనలో, పాలనలో ఎన్ని బాతులు ఉన్నాయో లెక్కించే 800 ఏళ్ల నాటి సంప్రదాయం ఈ ఏడాది కూడా ఒక వేడుకగా మొదలైంది. దక్షిణ ఇంగ్లండ్‌లోని థేమ్స్‌ నదిలో ఉన్న బాతులను పట్టి, వాటికి చిన్న ఐడెంటిటీ దారం కట్టి, మళ్లీ వాటిని వాటి కుటుంబ సభ్యులకు మధ్య వదిలిపెట్టే ఈ భారీ కార్యక్రమంలో బాతుల సంఖ్యను తేల్చి, వాటి సంతతిని మరింతగా పెంచేందుకు అవసరమైన పోషణ, సంరక్షణ చర్యలు తీసుకుంటారు
కెనడా మాస్‌ మీడియా, లండన్‌లోని థామ్సన్‌ రాయిటర్స్‌ కలిసి ఇటీవల ఒక సర్వే నిర్వహించి.. మహిళలకు భారతదేశం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనదని ప్రకటించడంతో మన దేశం ఒక అవాంఛనీయమైన ప్రదేశం అన్న భావన ప్రపంచ జనాభాలో ఏర్పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి! ప్రస్తుతం చెన్నైలో జరుగుతున్న వరల్డ్‌ జూనియర్‌ స్క్వాష్‌ చాంపియన్‌షిప్‌ 2018 పోటీలకు స్విస్‌ జూనియర్‌ నం.1 ర్యాంక్‌ క్రీడాకారిణి అయిన పదహారేళ్ల ఆంబర్‌ ఆలింక్స్‌ను ఈ పోటీలో పాల్గొనడం కోసం పంపేందుకు ఆమె తల్లిదండ్రులు నిరాకరించడం మన దేశానికి పెద్ద అవమానంగా పరిణమించింది
‘శీలవతి’ అనే వివాదాస్పద టైటిల్‌తో  షకీలా జీవిత చరిత్రపై వస్తున్న బయోపిక్‌లో ఆమె పాత్రను డైనమిక్‌ లేడీ రీచా చద్ధా పోషిస్తుండటంతో ‘మహానటి’తో సమానంగా ఈ చిత్రం ప్రేక్షకులలో ఆసక్తి రేకెత్తిస్తోంది. ‘బాలీవుడ్‌లో కాస్టింగ్‌ కౌచ్‌ లేదని ఎవరు చెప్పారు?’ అనే స్టేట్‌మెంట్‌తో ఇటీవలే సంచలనం సృష్టించిన రీచా.. తన నటనతో షకీలాకు గౌరవప్రదమైన గుర్తింపును తెచ్చిపెడతారనే అనిపిస్తోంది

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top