స్త్రీలోక సంచారం

Woman's Wandering - Sakshi

ఎక్కడ మిస్‌ అయినా.. ఇక్కడ మిస్‌ అవరు!

మలయాళీ నటుడు దిలీప్‌ను ‘అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాళం మూవీ ఆర్టిస్ట్‌’ (అమ్మ) సభ్యుడిగా మళ్లీ చేర్చుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ‘అమ్మ’ తక్షణం అతడికి సభ్యత్వం ఇస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీపీఐ(ఎం) సీనియర్‌ లీడర్‌ బృందాకారత్‌ డిమాండ్‌ చేశారు. సాటి నటిని అపహరించి, ఆమెను లైంగికంగా వేధించి, అత్యాచారయత్నం చేసిన కేసులో అరెస్టయి, బెయిల్‌ మీద తిరుగుతున్న నిందితుడికి మళ్లీ సభ్యత్వం ఇవ్వడం అంటే మహిళల మనోభావాలను తేలికపరచడమేనని అంటూ, మలయాళీ నటీమణులు కొందరు ‘అమ్మ’ కు రాజీనామా చేయడాన్ని కారత్‌ సమర్థించారు
కేరళలోని మలంకర ఆర్థడాక్స్‌ సిరియన్‌  ర్చి మత ప్రబోధకులు ఐదుగురు ఒక మహిళను లైంగికంగా వేధించారని వచ్చిన ఆరోపణలపై కేరళ క్రైమ్‌ బ్రాంచ్‌ దర్యాప్తును ప్రారంభించింది. తన భార్యను ఆ ఐదుగురూ లైంగికంగా వేధించారని ఆమె భర్త చర్చి అధికారులకు ఫిర్యాదు చేస్తున్నప్పుడు తీసిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది
అమెరికా సరిహద్దులోకి మెక్సికో నుంచి అక్రమంగా ప్రవేశించిందన్న ఆరోపణపై భారతీయ సంతతికి చెందిన భవాన్‌ పటేల్‌ను అదుపులోకి తీసుకుని ట్రంప్‌ ‘జీరో టాలరెన్స్‌’ పాలసీలో భాగంగా ఆమె నుంచి ఆమె కుమారుడిని అధికారులు వేరు చేసి నిర్బంధ శిబిరానికి తరలించారు. వికలాంగుడైన ఆ ఐదేళ్ల బిడ్డను తల్లి నుంచి వేరు చెయ్యడంపై అక్కడి మానవహక్కుల సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది
అంతర్యుద్ధంతో అల్లకల్లోల పరిస్థితుల్లో ఉన్న దక్షిణ సూడాన్‌లో తొలిసారిగా పర్యటించిన హాలీవుడ్‌ నటి, ‘మీటూ’ ఉద్యమ కార్యకర్త యాష్లీ జడ్‌ అక్కడి ఓ ప్రసూతి ఆసుపత్రిలో తన చుట్టూ ఆత్మీయంగా గుమిగూడిన అత్యాచార బాధితుల చేతిని ముద్దాడి సాంత్వన వచనాలు పలికారు. ఐక్యరాజ్యసమితి జనాభా నిధి అంతర్జాతీయ రాయబారి కూడా అయిన యాష్లీ.. యుద్ధహింస పర్యవసానంగా అవాంఛిత గర్భాలను దాల్చిన తల్లులను కలిసి, ‘మనమంతా మహిళలం.. మనమంతా ఒక్కటే’ అని ధైర్యం చెప్పారు
సమస్థాయి పురుష ఉద్యోగులతో సమానంగా తనకు జీతం ఇవ్వడం లేదన్న ఆవేదనతో ఈ ఏడాది జనవరిలో రాజీనామా చేసి వెళ్లిపోయిన సీనియర్‌ మహిళా జర్నలిస్టు క్యారీ గ్రేసీకి బీబీసీ క్షమాపణ చెప్పడమే కాకుండా, వేతనంలోని అసమానతల కారణంగా అంతవరకు ఆమె కోల్పోయిన జీతాన్ని కూడా చెల్లించేందుకు అంగీకరించింది. దీనిపై క్యారీ ‘మేము కొంత (మహిళా ఉద్యోగులు) పురోగతిని సాధించినట్లే కనిపిస్తోంది’ అని స్పందిస్తూ ఆ మొత్తాన్ని ఏదైనా ధార్మిక సంస్థకు విరాళంగా అందించమని బీబీసీ యాజమాన్యాన్ని కోరారు
♦  గాయని, నటి జెన్నిఫర్‌ లోపెజ్‌ లోని సృజనాత్మకతను, దక్షతను ఆమె పదేళ్ల కూతురు ఎమ్మీ పుణికిపుచ్చుకున్నట్లు కనిపిస్తోంది! ‘ఎమ్మీకి వచ్చిన ఒక ఆలోచనను పుస్తకంగా తెచ్చేందుకు ఇవాళ నేను, ఎమ్మీ.. పబ్లిషర్స్‌ని కలిసి వచ్చాం’ అని జెన్నిఫర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వాళ్లద్దరూ కలిసి ప్రయాణిస్తున్న వీడియోను అప్‌లోడ్‌ చే యడంతో ఎమ్మీలో ఒక రచయిత్రి ఉందన్న సంగతి లోకానికి తెలిసింది
సంజయ్‌గార్గ్‌ తన డిజైన్‌ను కాపీకొట్టారని ప్రముఖ డిజైనర్‌ వైశాలీ ఆరోపించారు. 2013లో శారీస్‌ కోసం తను కనిపెట్టిన డిజైన్‌ను అచ్చుగుద్దినట్లు కాపీ కొట్టాడని వైశాలీ అంటుంటే, ‘పైపైన చూస్తే రెండూ ఒకే డిజైన్‌లా అనిపించవచ్చు కానీ, సూక్ష్మంగా చూస్తే నేను వైశాలీని కాపీ కొట్టలేదని అర్థమౌతుంది’ అని సంజయ్‌గార్గ్‌ అంటున్నారు
ప్రియాంక చోప్రా ఎంతో ఇష్టపడి నటించబోతున్న ‘నళిని’ చిత్రాన్ని తమ క్యాంపస్‌ లో షూట్‌ చెయ్యనివ్వబోమని శాంతినికేతన్‌లో విశ్వభారతి విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్‌ సబుజ్‌ కాళీ సేన్‌ ప్రకటించారు. రవీంద్రనాథ్‌ టాగోర్‌ జీవిత కథ ఆధారంగా ఉజ్వల్‌ చటర్జీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో టాగోర్‌కీ, నళిని (అన్నా టర్కుడ్‌)కి మధ్య ఉన్న ప్రేమను మాత్రమే చూపిస్తారేమోనన్న అనుమానంతో సబుజ్‌ అనుమతి నిరాకరించారు
 

Tags: 
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top