ఆరోగ్యంగా ఉన్నవారికీ క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ ఎందుకు అవసరమంటే..?

Why do people who are healthy have cancer screening? - Sakshi

ఒక్కోసారి హెల్దీగా ఉన్నవారికి సైతం క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ అవసరం. ఎందుకంటే... కొందరిలో వ్యాధి లక్షణాలు బయటపడకపోయినా లోపల క్యాన్సర్‌ ఉండవచ్చు. క్యాన్సర్‌ను ఎంత త్వరగా గుర్తిస్తే వ్యాధిని నయం చేయడం అంత సులువు. అందుకే  లక్షణాలింకా బయటపడకముందే, వ్యాధిని తొలి దశలో గుర్తించి చికిత్స చేయిస్తే... నూరు శాతం ఫలితాలు రాబట్టవచ్చు.  క్యాన్సర్‌ను త్వరగా గుర్తించడానికి రెండు అంశాలు మనకు సహాయం చేస్తాయి. మొదటి అంశం... ముందస్తు లక్షణాలు; రెండో అంశం... స్క్రీనింగ్‌. 

1. ముందస్తు లక్షణాలు : సాధారణ ప్రజలకు సైతం క్యాన్సర్‌ ముందస్తు లక్షణాలకు సంబంధించిన పరిజ్ఞానం ఉంటే దాన్ని ముందుగానే గుర్తించడానికి వీలవుతుంది. గడ్డలు, అసాధారణ రక్తస్రావం, చాలాకాలం పాటు అన్నం సరిగా జీర్ణం కాకపోవడం మొదలైన అంశాలు క్యాన్సర్‌ ముందస్తు లక్షణాల్లో కొన్ని. రొమ్ముక్యాన్సర్, గర్భాశయ ముఖద్వార, నోటి, పెద్దపేగులు, చర్మ క్యాన్సర్ల వంటి వాటిల్లో పైన పేర్కొన్న అంశాల ద్వారా క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించవచ్చు. 

2. స్క్రీనింగ్‌ : అన్ని విధాలా ఆరోగ్యంగా కనిపించే వ్యక్తుల్లోనూ నిగూఢంగా దాగి ఉన్న క్యాన్సర్‌ను గుర్తించడానికి చేసే సాధారణమైన, సులభమైన పరీక్షనే స్క్రీనింగ్‌ అంటారు. ముందుజాగ్రత్తతో ఈ పరీక్షలను చేయించుకోవడం వల్ల ఎంతో లాభమే తప్ప నష్టం ఉండదు. 
క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉన్న వ్యక్తులు : 

►పొగతాగే అలవాటు ఉన్నవారు n పొగాకు... అంటే గుట్కా, పాన్‌మసాలా, జర్దా మొదలైనవి నమిలే అలవాటు ఉన్నవారు n మద్యానికి బానిసలైనవారు nసిర్రోసిస్‌ వంటి కాలేయ వ్యాధులున్నవారు ►వ్యాయామం చేయనివారు n ఊబకాయం ఉన్నవారు n ఆహారంలో కొవ్వుపదార్థాలు ఎక్కువగా తీసుకునేవారు n పీచు పదార్థాలు తక్కువగా ఉండే ఆహారం తీసుకునేవారు, ఆహారంలో మసాలాలు ఎక్కువ తినేవారు. 

మహిళలకు నిర్వహించాల్సిన స్క్రీనింగ్‌ పరీక్షలు : 
​​​​​​​►రొమ్ముక్యాన్సర్‌ : నలభై ఏళ్లు నిండిన మహిళలు ప్రతి ఏడాదీ డిజిటల్‌ మామోగ్రామ్‌ పరీక్ష చేయించుకోవడం మంచిది. 
​​​​​​​►20 నుంచి 30 ఏళ్లు నిండిన మహిళలు ప్రతి మూడేళ్లకొకసారి వైద్యులను కలిసి రొమ్ము పరీక్షలు చేయించుకోవడం మంచిది. 
​​​​​​​►50 ఏళ్లు నిండిన మహిళలు ప్రతి ఏడాదీ వైద్యులతో రొమ్ము పరీక్షలు చేయించుకోవాలి. 
​​​​​​​►20 ఏళ్లు నిండిన ప్రతి మహిళా క్రమం తప్పకుండా ఇంటివద్దనే స్వయంగా రొమ్ము పరీక్ష చేసుకుంటూ ఉండాలి. రొమ్ముల్లో కణుతులు, గడ్డలు ఏమైనా ఉన్నాయేమోనని ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఈ స్వయం పరీక్షలతో సమస్యను ఎంతో ముందుగానే పసిగట్టవచ్చు. 

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌: 
​​​​​​​►లైంగికంగా కలవడం మొదలుపెట్టిన మూడేళ్ల తర్వాతి నుంచి ప్రతి మహిళా గర్భాశయ ముఖద్వారానికి స్క్రీనింగ్‌ పరీక్ష చేయించుకుంటూ ఉండాలి. 
​​​​​​​►సాధారణ పీఏపీ పరీక్ష పద్ధతిలో ఏడాదికొకసారి స్క్రీనింగ్‌ పరీక్ష చేయించుకోవాలి. అదే అత్యాధునిక లిక్విడ్‌–బేస్డ్‌ పీఏపీ పద్ధతిలో అయితే రెండేళ్లకోసారి పరీక్ష చేయించుకుంటే సరిపోతుంది. 
​​​​​​​► 30 ఏళ్లు పైబడిన వయసుగల ప్రతి మహిళా ప్రతి మూడేళ్లకోసారి పీఏపీతో పాటు హెచ్‌పీవీ డీఎన్‌ఏ పరీక్ష చేయించుకుంటే మంచిది. 
కానీ... హెచ్‌ఐవీ ఉన్నవారు, అవయవమార్పిడి చేయించుకున్నవారు, కీమోథెరపీ తీసుకునేవారు, మత్తుపదార్థాలకు బానిసలైనవారు... ఈ కారణాలతో తగినంత రోగనిరోధకశక్తి కోల్పోయినవారంతా ప్రతి ఏడాదీ పైన చెప్పిన పరీక్ష చేయించుకోవాలి. 
​​​​​​​► 70 ఏళ్లు... ఆ పైబడిన మహిళతో పాటు గత పదేళ్లుగా పీఏపీ పరీక్షలో నార్మల్‌ ఫలితాలు వచ్చినవారు స్క్రీనింగ్‌ పరీక్షలు ఆపేయవచ్చు. 
​​​​​​​►హిస్టరెక్టమీ ద్వారా గర్భాశయంతో పాటు గర్భాశయ ముఖద్వారాన్ని కూడా తొలగించిన వారిలో స్క్రీనింగ్‌ టెస్ట్‌లు చేయించాల్సిన అవసరం లేదు. అయితే కేవలం గర్భాశయాన్ని మాత్రమే తొలగించి, ముఖద్వారాన్ని తొలగించని సందర్భాల్లో మాత్రం స్క్రీనింగ్‌ పరీక్షలను కొనసాగించాలి. 
​​​​​​​► పదేళ్లు నిండిన ఆడపిల్లలకు, 46 ఏళ్లలోపు మహిళలకు సర్వైకల్‌ క్యాన్సర్‌ వ్యాక్సిన్‌ ఇప్పించడం వల్ల 90 శాతం వరకు సర్వైకల్‌ క్యాన్సర్‌ని నివారించవచ్చు. 
పురుషుల్లో నిర్వహించాల్సిన స్క్రీనింగ్‌ పరీక్షలు : 
​​​​​​​► ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ : పురుషుల్లో వచ్చే క్యాన్సర్లలో ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ ఒకటి. భారతదేశంలో ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ అరుదేమీ కాదు. కానీ దీనిపై చాలామందికి సరైన అవగాహన లేదు. 
పురుషులు తప్పకుండా ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు చేయించుకోవాలని అనేక అంతర్జాతీయ సంస్థలు సూచిస్తున్నాయి. 50 ఏళ్లు నిండిన పురుషులు ప్రతి ఏడాదీ ప్రోస్టేట్‌ స్పెసిఫిక్‌ యాంటీజన్‌ (పీఎస్‌ఏ) రక్తపరీక్ష, డిజిటల్‌ రెక్టల్‌ పరీక్ష చేయించుకోవాలి. కుటుంబంలో ఎవరికైనా (నాన్న, సోదరుడు, కొడుకు) ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ ఉన్నట్లయితే కుటుంబంలోని మిగతా పురుషులు 40 ఏళ్ల వయసు నుంచే ప్రోస్టేట్‌ స్క్రీనింగ్‌ చేయించుకుంటూ ఉండాలి. 

Dr. Ch. Mohana Vamsy
Chief Surgical Oncologist
Omega Hospitals, Hyderabad
Ph: 98480 11421, 
Kurnool 08518273001

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top