సగోత్రీకులు ఎందుకని వివాహం చేసుకోరాదు?

Why do not  marry same gotra people! - Sakshi

గోత్రమంటే ‘గోశాల’ అని అర్థం. సనాతన కాలంలో ఒకే వంశానికి చెందిన వారంతా వారి వారి గోవులను ఒకేచోట ఉంచి కాపాడుకొనేవారు. ఆ ప్రదేశాన్ని ‘గోత్రము’ అని పిలిచేవారు. కాలక్రమేణా ఆ పదానికి అర్థం మారి, ఒక వంశం వారి పూర్వీకులు పరంపరగా సంభవించిన మూలపురుషుడి (ఋషి) పేరునే వారి గోత్రంగా పిలవడం మొదలైంది.

ఒక గోత్రం వారంతా ఒకే వంశానికి చెందిన వారు కాకపోవచ్చు. ఒకే గోత్రపు వారు వివిధ వంశాలలో, వివిధ వర్ణాలలో కూడా ఉన్నారు. ఇవి బ్రాహ్మణ గోత్రాలు, ఇవి క్షత్రియ గోత్రాలు, ఇవి వైశ్య గోత్రాలు... ఇలా ఉన్నప్పటికీ, కొన్ని గోత్రాలు పరిపాటిగా అన్ని వంశాలలోనూ ఉన్నాయి. ఎందుకంటే, సనాతనంగా వచ్చిన గోత్రాల మూల ఋషుల వివరాలు పరిశీలిస్తే, ఆ ఋషులు అచ్చంగా ఎనిమిది మందే! విశ్వామిత్రుడు, జమదగ్ని, భారద్వాజుడు, గౌతమ, అత్రి, వశిష్ఠుడు, కశ్యపుడు, అగస్త్యుడు.

ఇలా ఆయా ఋషుల పేర్లమీద ఆయా గోత్రాలు ఏర్పడ్డాయి. ఆ గోత్రజుల సంతానానికి, అదే గోత్రం ఉంటుంది. నాది పలానా ఋషి గోత్రం అని చెబితే దానర్థం, పరంపరగా వచ్చిన ఆ ఋషి సంతానంలో ఎక్కడా వంశం ఆగిపోకుండా అఖండంగా వచ్చిన మగ సంతానంలో ఒకణ్ణి అని చెప్పడం అన్నమాట. ఆడపిల్లలు పుట్టితే, పెళ్ళయ్యాక, భర్త గోత్రమే వారి గోత్రమవుతుంది. సగోత్రులు అంటే, అబ్బాయి, అమ్మాయి ఒకే గోత్రం వారైతే, వారు ఒకే ఇంటి వారవుతారు. కాబట్టి అన్నా చెల్లెళ్ళో, అక్కా తమ్ముళ్ళో, తండ్రీ కూతుళ్ళో , తల్లీ కొడుకుల వరస కలవారో అవుతారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top