'నిర్మల' వైద్యుడు

Warangal Doctor Trust Special Story - Sakshi

ఆయనొక వైద్యుడు. మంచి హస్తవాసి గల వాడని పేరు తెచ్చుకున్నాడు. నామమాత్రం రుసుముతోనే నాణ్యమైన వైద్యం చేసేవాడు. మందులు కొనలేని పేదలకు ఉచితంగా మందులు కూడా ఇచ్చేవాడు. అయితే, దురదృష్టం... నాలుగు పదుల వయసు కూడా లేకుండానే క్యాన్సర్‌ వ్యాధి వచ్చింది. ఆ వైద్యుడు తన సేవాకార్యక్రమాలను ముమ్మరం చేశాడు. తాను ఎలాగూ జీవించేది లేదు కాబట్టి, తన వాటాను అమ్మగా వచ్చిన డబ్బును తన తర్వాత ఒక ట్రస్టుకు చెందేటట్లు కుటుంబ సభ్యుల దగ్గర మాట తీసుకున్నాడు. ఆ తర్వాత నిశ్చింతగా కన్నుమూశాడు. ఇప్పుడు ఆ ట్రస్టు వారు ఆ వైద్యుడి పేరు మీద ఎంతోమంది పేదలకు, వృద్ధులకు సేవలందిస్తున్నారు. ఆ విధంగా ఆ డాక్టరు, అందరి హృదయాలలో నిలిచిపోయాడు. వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం మరియపురం గ్రామానికి చెందిన డాక్టర్‌ అల్లం ప్రవీణ్‌రెడ్డి.

వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుకొండ మండలం మరియపురం గ్రామానికి చెందిన ఆ డాక్టరు కుటుంబం నుంచి అందిన విరాళంతో నిర్మల చారిటబుల్‌ ట్రస్ట్, వినూత్న రీతిలో గ్రామప్రజలకు సేవలు అందిస్తోంది. గ్రామ ప్రజలందరూ ఆరోగ్యంగా... ఆనందంగా... జీవించాలనే ఉద్దేశ్యంతో యోగ శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. అయితే, గ్రామస్తుల నుంచి ఆశించినంత స్పందన కనిపించకపోవడంతో ట్రస్టు వాళ్లు ఒక ఆలోచన చేశారు. యోగ తరగతులలో హాజరు శాతం ఎక్కువ ఉన్నవారికి వడ్డీలేని రుణాలిస్తామని ప్రకటించారు. దీంతో మహిళలు ఆసక్తి చూపారు. రోజు ఉదయం 11 గంటల నుంచి  12 గంటల వరకు యోగా, 12 నుంచి మధ్యాన్నం 1 గంట వరకు చెస్, క్యారం బోర్డ్‌ తదితర ఆటలు ఆడిస్తున్నారు. స్నాక్స్‌ సైతం అందిస్తున్నారు. ఈ కేంద్రం గత మూడు సంవత్సరాలుగా కొనసాగుతోంది.

ఈ యోగ కేంద్రానికి 250 రోజులు హాజరైన  వారికి లక్ష రూపాయల రుణం వడ్డీ లేకుండా; 200 రోజులు వచ్చిన వారికి లక్ష రూపాయలు పావలా వడ్డీకి రుణం;150 రోజులు వచ్చిన వారికి రూ75 వేల రుణం 50 పైసలకు;100 రోజులు వచ్చిన వారికి రూ 75 వేల రుణం 75పైసలు; 50 రోజులు వచ్చిన వారికి రూ 60 వేలు ఒక రూపాయి చొప్పున రుణం ఇస్తున్నారు. వివిధ కారణాల రీత్యా అసలు తరగతులకు హాజరు కాలేని వారికి కూడా రూపాయి వడ్డీకే యాభైవేల రుణసాయం అందిస్తున్నారు.

వడ్డీ సొమ్ముతో మరిన్ని సేవలు
వృద్ధుల వికాస కేంద్రం ఏర్పాటు చేసి గ్రామంలోని 60 ఏళ్ళు పైబడిన వృద్ధులను చేరదీసి వారికి రోజూ ఆటపాటలు, వ్యాయామం, వైద్యసేవలందిస్తున్నారు. ప్రతినెల 20 మందికి రూ. 500 విలువ చేసే నిత్యావసర సరుకులను అందిస్తున్నారు. వారిని ఇంటినుంచి వికాస కేంద్రానికి తీసుకుని రావడం, తీసుకెళ్ళడానికి ప్రత్యేకంగా వాహనంతోపాటు శిక్షకురాలు, డ్రైవర్‌ను ఏర్పాటు చేశారు.

ఉచిత ఆరోగ్య కేంద్రం ఏర్పాటు..
గ్రామంలోని వృద్ధులు, వ్యాధిపీడితులతోపాటు గ్రామస్తులు అనారోగ్యానికి గురికాకుండా ఉండటానికి స్వంతఖర్చుతో నిర్మలమాతా ఉచిత ఆరోగ్యకేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి శనివారం ఇక్కడ అవసరమైన వారికి వైద్యపరీక్షలు చేసి ఉచితంగా మందులను అందిస్తున్నారు.  – గజవెల్లి రాజు, సాక్షి, వరంగల్‌ రూరల్‌ ఫొటోలు: పెద్దపల్లి వరప్రసాద్‌

అటు ఆరోగ్యం..ఇటు ఆర్థికం...
ప్రతిరోజు యోగాకు, ఆటలకు రావడం వలన ఆరోగ్యంగా ఉంటూ ఆర్థికంగా బలపడ్డాను. సంఘంలో రుణం తీసుకుని రెండు గేదెలను కోనుగోలు చేశాను. సంవత్సరానికి 260 నుంచి 300 రోజులు రావడంతో మిత్తి లేకుండా డబ్బులు లక్ష రూపాయలు సహాయం చేశారు. గేదెల ద్వారా ఆదాయం వస్తోంది. రోజు యోగా చేస్తూ, ఆటలు కూడా ఆడుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉంటున్నాను.– బి.ఇన్నమ్మ, స్థానికురాలు

గతంలో ఇంటికే పరిమితం అయ్యే వాళ్ళం
మహిళ సంఘం ఏర్పాటు చేసుకోకముందు ఇంటికే పరిమితం అయ్యే వాళ్ళం. సంఘం ఏర్పాటు చేశాక రోజు యోగా తరగతులు, ఆటలు ఆడటం ప్రారంభమయ్యాక మాలో ఐక్యత పెరిగింది. గతంలో ఇంట్లో ఉంటే ఏదో కోల్పోయిన వాళ్ళ మాదిరిగా ఉండేది. ఇప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటున్నాం. కాళ్ల నొప్పులు కూడా ఉండేవి. ఇప్పుడు అవి లేకుండా పోయాయి. చాలా సంతోషంగా ఉంటున్నా.– డి.రాణి, స్థానికురాలు

సంఘం ఇచ్చే సరుకులే తింటున్న...
నాకు పెళ్ళి కాలేదు. అమ్మ నాన్న ఉన్నన్ని రోజులు వాళ్లే సాదారు. తరువాత మా తమ్ముడి ఇంటి దగ్గర ఉంటున్నాను. సంఘం తరుపున ఇచ్చే సరుకుల ద్వారా నేను జీవనం కొనసాగిస్తున్నాను. ఈ సంఘం నన్ను అన్ని రకాలు అదుకుంటున్నది. ఈ సంఘానికి ఎంతో రుణ పడి ఉంటాను.– మరియమ్మ

నా కుమారుడి చివరి కోరికతోనే...
నాకు ముగ్గురు కుమారులున్నారు. వారిలో డాక్టర్‌ ప్రవీణ్‌రెడ్డి (34) వయస్సులో క్యాన్సర్‌ వ్యాధితో మరణించాడు. తను చనిపోయే ముందు తన వాటాకు వచ్చే ఆస్తిని రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు. ఆస్తులకు తల్లిని సంరక్షకురాలిగా పెట్టాడు.   పేదలకు ఉచిత వైద్యసేవలు, నిరుపేదలకు సహాయం, అనాథలకు ఉచిత విద్యా బోధన చేయాలని హామీ తీసుకున్నాడు. మరణించిన తర్వాత కూడా తాను ప్రశాంతంగా ఉండాలంటే సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరాడు. ప్రవీణ్‌రెడ్డి ఆస్తులకు సంబంధించి వచ్చిన సుమారు యాభైలక్షలకు పైగా మొత్తాన్ని నిర్మల చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా మహిళ సంఘానికి అందించాము. అలాగే నా వ్యాపారంలో వచ్చే లాభాలను సైతం సేవాకార్యక్రమాలకు కేటాయిస్తున్నా. నా కుమారుడి కోరిక మేరకు ఇలా సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రశాంతంగా ఉంటున్నాను.– అల్లం బాలిరెడ్డి,నిర్మల చారిటబుల్‌ ట్రస్ట్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Tags: 
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top