ఒరేయ్‌.. చ్చు చ్చు చ్చూ..!

 unother name for  Animals - Sakshi

నామకరణం

ప్రతి మనిషికీ ఒక పేరు ఉన్నట్లే.. మనుషులు మచ్చిక చేసుకునే ప్రతి జంతువుకూ ఒక పేరు ఉంటుంది. పేరు లేకపోతే మనిషిని కానీ, జంతువుని కానీ పిలవలేం. జంతువుని అసలే మచ్చిక చేసుకోలేం. ‘ఒరేయ్‌’ అని పిలిస్తే, గుంపులోంచి పది తలలు వెనక్కి తిరిగి చూడకూడదంటే మనిషికి పేరుండాలి. ‘చ్చు చ్చు చ్చు..’ అన్నప్పుడు ఒకేసారి కుక్కలన్నీ మనల్ని ఫాలో కాకూడదంటే మన కుక్కకూ ఒక పేరుండాలి. కుక్క అనేముందీ.. పులికైనా, సింహానికైనా, మరొక జంతువుకైనా పేరు పెట్టుకుంటేనే వాటితో ఇంటరాక్ట్‌ కాగలం! ఈ పేర్ల సంగతి అలా ఉంచితే, మనిషి జాతికి ‘మనిషి’ అని పేరు పెట్టినవాళ్లు, జంతుజాతికి ‘జంతువు’ అని నామకరణం చేసినవాళ్లు చాలా గ్రేట్‌ అనిపిస్తుంది. ఇటీవలే అక్టోబర్‌ 4న మనం  ‘వరల్డ్‌ యానిమల్‌ డే’ జరుపుకున్నాం. ఈ సందర్భంగా కొన్ని జంతుజాతులకు ఆ పేరెలా వచ్చిందో చూద్దాం.

టైగర్, లయన్, రైనో, హిప్పో.. ఇలా జంతుజాతి పేర్లన్నీ ఇంగ్లిష్‌లోనే బాగా పాపులర్‌ అయ్యాయి. అంతగా అవి పాపులర్‌ అవడానికి ఆ పేర్లు ఎంతో అర్థవంతంగా ఉండడమే కారణం. అసలు ‘యానిమల్‌’ అనే మాట పుట్టుకే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. లాటిన్‌లోని ‘యానిమా’ అనే మాట నుంచి యానిమల్‌ అనే మాట వచ్చింది. యానిమా అంటే లాటిన్‌లో ఊపిరి, ఆత్మ అనే అర్థాలు ఉన్నాయి. యానిమల్‌ అనే మాట 14వ శతాబ్దం చివరిలో మాత్రమే ఇంగ్లిషులోకి వచ్చి చేరింది. మరి అప్పటి వరకు ఇంగ్లిష్‌ వాళ్లు ఏ మాట వాడుతున్నారు? ‘బీస్ట్‌’ అనే మాట! బీస్ట్‌ అంటే మృగం.  నిజానికి బీస్ట్‌ అనే మాట కూడా ఇంగ్లిష్‌ వాళ్లది కాదు. ఫ్రెంచి పదం. అప్పటికి బీస్ట్‌ బదులుగా ఓల్డ్‌ ఇంగ్లిష్‌లో ‘డీర్‌’ అనేవాళ్లు. యానిమల్‌ వచ్చాక ‘డీర్‌’ జింకకే పరిమితమైంది.

టైగర్‌
‘టైగర్‌’ అనే మాట ప్రాచీన గ్రీకులది! ఆ మాటను వాళ్లు ఆసియా నుంచి తెచ్చుకున్నారని తెలిస్తే వండర్‌ అయిపోతాం. ఎలా తెచ్చుకున్నారనేదానికే ఆధారాల్లేవు. ఒక థియరీ ఏంటంటే.. ‘అవెస్తాన్‌’ అనే ప్రాచీన ఇరానీ భాషా పదం అయిన ‘టైఘ్రీ’ నుంచి ఇది వచ్చిందని. టైఘ్రీ అంటే బాణం అని అర్థం. లేదా పదునైన వస్తువు అని అర్థం. మళ్లీ సింహానికి ఇంత సీన్‌ లేదు. సింపుల్‌గా లాటిన్‌లోని ‘లియో’ అనే పదం లోంచి వచ్చింది. నక్షత్ర మండలం అని అర్థం. ఆ మండలంలోని ఏ దైవాకృతితోనో గ్రీకులు సింహం పోలికలు తెచ్చుకుని ‘లియో’ను కాయిన్‌ చేస్తే, దానిని లాంటిన్‌ వాళ్లు ఖాయం చేసుకున్నారు.

పెంగ్విన్‌
ఒకప్పుడు పెంగ్విన్‌ని ఆస్‌ఫీట్‌ (్చటట్ఛజ్ఛ్ఛ్ట) అనేవాళ్లు. ఆస్‌ అంటే కూర్చొనే భాగం. ఆ భాగంతో నడిచినట్లుగా ఉంటుందని అలాగన్నారు. వెల్ష్‌ (వేల్స్‌)లో ‘పెన్‌ గ్విన్‌’ అనే మాట ఉంది. దానర్థం వైట్‌హెడ్‌. ఉత్తర అట్లాంటిక్‌లో ఆక్‌ అనే పక్షి ఉంది. దాని ఒంటి తీరు, బ్లాక్‌ అండ్‌ వైట్‌ రంగులు ఉన్న విధంగానే పెంగ్విన్‌ కూడా ఉండేది. ఆ పక్షి పోలికను తీసుకుని పెన్‌ గ్విన్‌నే వైట్‌హెడ్‌ అన్నారు. అలా పెంగ్విన్‌కి కాలక్రమేనా ఆ పేరు స్థిరపడి ఉంటుందని ఒక థియరీ. అర్థం కాలేదు కదా. మళ్లీ ఒకసారి చదవండి.

రైనోసరస్‌
తెలుగులో ఖడ్గమృగం. ‘రైనో’ అంటే ముక్కు, ‘సరస్‌’ అంటే  కొమ్ము అని అర్థం. దీని ముక్కు కొమ్ములా ఉంటుందని ఆ పేరు.  

ఆస్ట్రిచ్‌
ఇది ఉష్ట్రపక్షి. లాటిన్‌లోని అవిస్‌ స్ట్రుథియో అనే పదబంధం నుంచి ఈ మాట వచ్చింది. అవిస్‌ అంటే పక్షి. స్ట్రుథియో అంటే పెద్ద బాణం. ఈ స్ట్రుథియో అనే పదాన్ని గ్రీకు నుంచి తెచ్చుకున్నారు!   

హిప్పోపోటమస్‌
గ్రీకులో ఈ మాటకు రివర్‌–హార్స్‌ అని అర్థం. అంటే.. నీటి గుర్రం. దీని మూతి గుర్రంలా ఉండి, ఇది నీటిలో ఉంటుంది కాబట్టి ఆ పేరు పెట్టారట.

పైథాన్‌
డ్రాగన్‌లా ఉండే పాము ఒకటి గ్రీకు పురాణాల్లో ఉండేది. దాని పేరు పైథాన్‌. దానికి మనం పెట్టుకున్న పేరు కొండ చిలువ. అపోలో అనే హీరో ఆ పైథాన్‌ని చంపేస్తాడు. చంపేటప్పుడు దీనికి పైథాన్‌ అనే పేరు లేదు. చంపి, పైథో అనే గ్రీకు ప్రాచీన దేవకన్య నివసించే ప్రదేశంలో సూర్యుడి కింద ఆ పాము మృత దేహాన్ని ఎండబెడతాడు. అప్పట్నుంచీ అది పైథాన్‌ అయింది.

పాండా
ఈ మాట 1800లో ఇంగ్లిష్‌లోకి వచ్చింది. పాండా అంటే మొదట్లో రెండ్‌ పాండా అని మాత్రమే అర్థం. తర్వాత్తర్వాత అన్నిటికీ ఇదే వాడుతున్నారు. పాండా అనే మాట నేపాలీలోని నిగల్యా పాన్యా అనే పదం నుంచి పుట్టి ఉండొచ్చని అంటారు. చెరకు గడను తింటున్న పిల్లిలాంటి ఎలుగు అని ఆ మాటకు అర్థం అట. ఏమిటో!

టార్టాయిస్‌
లాటిన్‌లో ‘టర్టారుచుస్‌’ అనే మాట ఉంది. దాన్నర్థం ‘అండర్‌వరల్డ్‌కి చెందిన’ అని. సో, అదీ ఇదీ ఒకటి కాదు. లాటిన్‌లోనే ఇంకో మాట ఉంది ‘టెస్టుడో’ అని. దానర్థం ‘కప్పబడిన’ అని. ఇది కాస్త దగ్గరగా ఉన్నట్లుంది.. తాబేలు పైన పెంకులాంటి కప్పు ఉంటుంది కాబట్టి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top