సాహిత్యంలో సతి

Tirumala Rao Suggest To His Wife On Literature - Sakshi

 కథాసారం

‘‘కథ పేరు మారిస్తే బావుంటుందేమో’’ అన్నాడు తిరుమలరావు భార్య కొత్తగా రాసిన కథ చదివి. పెళ్లికి ముందు సత్యవతి రాసిన కథలు అతను చదవలేదు. పెళ్లిచూపులకి వెళ్లినప్పుడు సత్యవతి అన్నగారు– ‘‘మా చెల్లెలు కథలు బాగా రాస్తుందండీ’’ అన్నప్పుడు ‘‘ఓహో’’ అని నవ్వి ఊరుకున్నాడు. అతనికి కాకమ్మ కబుర్లూ కల్లబొల్లి కథలూ అంటే ఇష్టం లేదు. చుట్టుపక్కల ఏదైనా సంఘటన జరిగితే మాత్రం దాని పూర్వాపరాలు తెలుసుకోవాలని కుతూహలం కనబరచేవాడు. ఈ ప్రవృత్తి అతని పోలీసు ఉద్యోగానికి బాగా పనికొచ్చింది. సత్యవతి కథలు రాస్తుందని విన్నాక, ‘‘పోనీలే తన కాలక్షేపం తనకుంటుంది నన్ను వేధించకుండా’’ అనుకున్నాడు. పెళ్లయ్యాక, తన కథలు– పాతవి చదవమని సత్యవతి ఎప్పుడూ అడగలేదు భర్తని. తీరికలేని ‘డ్యూటీ’ అతనిది. ఏ క్షణాన అయినా యూనిఫామ్‌ తగిలించుకోవడానికి సిద్ధంగా ఉండాల్సివ చ్చేది. ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు తన కథల గురించి ప్రస్తావించకుండా, అతని ఉద్యోగం కబుర్లు అడిగి తెలుసుకుంటూ ఉండేది. తన కథలకన్నా ఎంతో ఆసక్తికరంగా అనిపించేవి కొన్ని కేసుల వివరాలు. అతను చెప్పిన ఒక కేసు ఆధారంగా కొంత కల్పన జోడించి ఒక కథ రాసింది. అది మాత్రం చదవమని భర్తని కోరింది. కొత్త పెళ్లాంమీద మోజు కొద్దీనో, కుతూహలం కొద్దీనో ఒప్పుకున్నాడు. బావుందని మెచ్చుకుంటూనే కొన్ని సంభాషణలు సరిదిద్ది, ‘‘పేరు మారిస్తే బావుంటుందేమో’’ అన్నాడు.

‘‘ఆ మనిషిలో ఉన్న బలహీనతను కనిపెట్టి దానిమీద దెబ్బకొట్టాడు ప్రత్యర్థి. అదే కదా ముఖ్యాంశం. అందుకే బలహీనత అని పెట్టాను’’ అని సమర్థించుకుంది సత్యవతి. ‘‘ఆ పాయింట్‌ ఒప్పుకుంటాను. కానీ పేలవంగా అనిపిస్తోందా శీర్షిక’’ అన్నాడు తిరుమలరావు చేయి తిరిగిన విమర్శకుడిలా. ‘‘మీరు ఏదైనా చెప్పండి ప్లీజ్‌’’ అంది సత్యవతి.‘‘వీక్‌ పాయింట్‌ అని పెట్టు ఆకర్షణీయంగా ఉంటుంది’’ అన్నాడు. ‘‘తెలుగు కథకి ఇంగ్లీషు పేరేం బావుంటుందండీ? తెలుగులో మాటలే లేవన్నట్లు?’’ అంది. ‘‘తెలుగు మాట లేకనేనా ప్లీజ్‌ అన్నావ్‌’’అన్నాడతను వేళాకోళంగా. సత్యవతి మారు వాదించలేక ఒప్పేసుకుంది. ‘‘కానీ ఒక రిక్వెస్ట్‌. ఈ కథకి ఆధారం మీరు చెప్పిన కేసే. శీర్షిక కూడా మీరే పెట్టారు. సరదాగా మనిద్దరి పేర్లతో పంపిద్దాం’’ అంది. ‘‘మీ పేరు కూడా జోడిస్తే నాకెంత గర్వకారణమో తెలుసా? వివాహానికి అంతకన్న సార్థక్యం ఏముంటుంది?’’ ‘‘ఓ, నో! నేను రాశానంటే నా సంగతి తెలిసినవాళ్లంతా నవ్వుతారు’’ అన్నాడతను. గత్యంతరం లేక, తన పేరు మీదే పంపించింది. ఒక మాసపత్రిక వాళ్లు ప్రత్యేకంగా ప్రచురించారు. రెండు పేజీల బొమ్మ వేశారు. బోలెడు లేఖలొచ్చాయి. తిరుమలరావుకి సంభ్రమం కలిగింది.

ఈసారి ఏదైనా వస్తువు తీసుకోవాలని సత్యవతి ఆలోచిస్తుంటే తిరుమలరావు– డాక్టర్లకీ, మెడికల్‌ రిప్రజెంటేటివ్స్‌కీ, మందులషాపుల వాళ్లకీ, పోలీసులకీ ఉండే అవినీతికర సంబంధం గురించి రాయమని సూచించాడు. ‘‘నాకు వివరంగా తెలియదు, కథ వాస్తవికంగా అనిపించదు’’ అని ఇబ్బందిగా పెట్టింది మొహం. ‘‘నువ్వు స్థూలంగా రాయి, తక్కిన వివరాలు నేను చెబుతాను’’ అన్నాడు. అతను చెప్పిన వివరాలూ, సూక్షా్మంశాలూ రాసుకుని కథ పూర్తి చేసింది. ఈసారి కూడా కథకు పేరు అతనే సూచించాడు. అదీ ఇంగ్లీషులోనే కుదిరింది. ఈసారి సత్యవతి గట్టిగా పట్టుపట్టింది అతని పేరు కూడా ఉండాలని. పైకి వద్దన్నా తిరుమలరావు కొంత మెత్తబడకపోలేదు. క్రిందటిసారి కథకు వచ్చిన ప్రశంసల్లో తనకీ కొంత భాగం లేకపోలేదనిపించింది. ఉద్యోగరీత్యా తన పేరుండటం మంచిది కాదేమోనని తటపటాయించాడు. మధ్యేమార్గంగా కలంపేరు పెట్టుకుందామన్నాడు.తనపేరు ఉండదని బాధ కలిగినా అతని సలహా బావుందనేసింది. పిల్లలకి పేరు పెట్టడానికి చేసినంత యోచన చేశారు. ‘‘సతి’’ అని పెట్టుకుందామంది.

తన పేరులో మొదటి అక్షరం, అతని పేరులో మొదటి అక్షరం కలిపితే ‘‘సతి’’. సత్యవతి పేరున్న రచయిత్రే కాబట్టి సంపాదకులు వెంటనే ప్రచురించారు. పైగా రచయిత పేరు చెప్పబోవడం లేదంటూ ‘సస్పెన్స్‌’లో పెట్టారు. ఈ సతి ఎవరు? రచయితా, రచయిత్రా? అంత పదునుగా సంభాషణలు రాయడం రచయిత్రికి సాధ్యమా? అంతసున్నితమైన అనుభూతుల్ని రచయిత్రే రాయగలుగుతుందనీ అభినందనలు తెలపండి అంటూ సంపాదకుడికి చాలా ఉత్తరాలొచ్చాయి. ఆ విజయోత్సాహంలో అయిదారు కథలు రాసి పంపారు. సతి రచనలు విశిష్టంగా ఉంటాయన్న పేరు పడిపోయింది. పోలీస్‌ సర్కిల్స్‌లో సాహిత్యాభిరుచి ఉన్నవాళ్లు తన కథల గురించి చర్చించుకుంటూంటే మొదట్లో తిరుమలరావు ముసిముసి నవ్వులు నవ్వుకునేవాడు. క్రమంగా చర్చల్లో పాల్గొనడం మొదలుపెట్టాడు. ‘‘కొంపదీసి మీరే రాయలేదుకదా, అంతగా సమర్థిస్తున్నారు’’ అనేశారు ఒకళ్లిద్దరు. సతి నవల ఒకటి సీరియల్‌గా మొదలయేసరికి ఆ పత్రిక అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయాయి. సీరియల్‌ పూర్తికాకుండానే ఒక ప్రచురణకర్త నవలనీ, మరొకరు కథలనూ అచ్చువేస్తామని ముందుకొచ్చారు. రచయిత గురించి చెబుతామంటూ మూడు సంచికల్లో ఊరించి చివరికి పేర్లు వెల్లడించారు. మరో పత్రిక ఉగాది సంచికలో సతి కథతోబాటుగా సత్యవతి, తిరుమలరావు ఫొటోలు కూడా వేశారు. కథనంలో ఎవరి వంతు ఎంత అని పాఠకుల్లో చర్చ మొదలైంది. పత్రికలు ముఖాముఖీలు ఏర్పాటు చేశాయి. ఇద్దరూ ఏ విధంగా కథారచన చేస్తుంటారో కొంత గంభీరంగానూ, కొంత చమత్కారంగానూ వివరించారు. 

పుస్తకాలు అచ్చయ్యాయి. మంచి సమీక్ష లొచ్చాయి. ఇక సన్మానాల వాళ్లు ముందుకొచ్చారు. వేదిక మీదికి బహిరంగంగా రాక తప్పలేదు.సత్యవతి గర్భవతి అయింది. కొడుకు పుట్టాడు. తీరిక లేక బొత్తిగా రాయడం తగ్గించేసింది. తిరుమలరావుకి ఉద్యోగంలోనూ, రచనలోనూ అనుభవం పెరగడంతో రాయాలనే తపన ఎక్కువైంది. ఇప్పుడు కథంతా అతనే రాస్తున్నాడు. దస్తూరి మాత్రం బ్రహ్మరాతలా ఉంటుంది. అందుకని సత్యవతిని తిరిగి రాయమనేవాడు. రాసేటప్పుడు అక్కడక్కడ మార్పులూ చేర్పులూ చేసేది. సత్యవతి మళ్లీ గర్భవతి అయింది. ఈసారి ఆడపిల్ల. ఆ పిల్లే ఇక లోకం అయిపోయింది. కథలు కాపీ చెయ్యడానికి కూడా పగలు తీరిక దొరకడం లేదు. రాత్రిళ్లు నిద్ర ఆపుకుని, పిల్లలు పడుకున్నాక, ఫెయిర్‌ చేసి పెడుతోంది. తిరుమలరావు తండ్రి పోయాక, తల్లి కొడుకు దగ్గర ఉండటానికి వచ్చేసింది. ఆవిడకి బి.పి. ఆవిడ ఆలనాపాలనా చూసుకోవలసి వస్తోంది. మీటింగులకీ, సభలకీ వెళ్లడం మానేసింది. ఇద్దరి తరఫునా తిరుమలరావే వెళ్లొస్తున్నాడు.

సత్యవతికి మొహమాటంగా ఉంటోంది– తను రాయకుండా తన పేరు పెట్టడం. తను ఎదుర్కొంటున్న సమస్యల ఆధారంగా ఒక కథ రాయాలనిపించింది. ‘‘మరీ సిల్లీగా ఉంటుంది’’ అని తిరుమలరావు కొట్టిపారేశాడు. పెళ్లికాకముందు తనకున్న అనుభవంతో చిన్న చిన్న కథలెన్నో రాసింది. అటువంటివి రాయడం తమపేరుకి తగవన్నట్లు మాట్లాడాడు. పెళ్లయాక మొదటిసారి తన స్వేచ్ఛ పోయినట్లనిపించింది. సత్యవతి అత్తగారు పోయారు. తిరుమలరావుని ప్రమోషన్‌ మీద రాజధానికి బదిలీ చేసింది ప్రభుత్వం. సంవత్సరం మధ్యలో మారిస్తే పిల్లల చదువు పాడవుతుందని సత్యవతి ఉన్నచోటే ఉండిపోయింది. ఇప్పుడు సత్యవతికి బోలెడంత తీరిక. ఏమీ తోచక పత్రికలన్నీ చదువుతోంది. హఠాత్తుగా తమ కలంపేరు చూసి తెల్లబోయింది. కథ రాస్తున్నట్లు చెప్పలేదు తిరుమలరావు. కాపీ చెయ్యమని ఇవ్వలేదు. ఒకళ్లిద్దరు స్నేహితులు ఫోన్‌ చేసి మెచ్చుకున్నారు. సత్యవతి మనస్ఫూర్తిగా సంతోషించలేకపోయింది. భర్త ఇక్కడికి వచ్చినప్పుడు నిలదీసి అడగొచ్చునులే అనుకుంది.

తానొకటి తలిస్తే దైవమొకటి తలచినట్లయింది. రాజధానిలో మతకలహాలు చెలరేగాయి. తిరుమలరావుకి స్పెషల్‌ డ్యూటీ వేశారు. బాంబు పేలింది. తిరుమలరావుకీ మరో కానిస్టేబుల్‌కీ తీవ్రగాయాలు తగిలి స్పృహ కోల్పోయారు. హాస్పిటల్‌కు తరలిస్తుంటే దారిలోనే తిరుమలరావు మరణించాడు. సత్యవతి గుండెలు బ్రద్దలవుతున్నా ఏడుపు బిగపెట్టుకుంది పిల్లలు బెంబేలు పడతారని. చుట్టుపక్కలవాళ్లూ, స్నేహితులూ వచ్చేశారు పరామర్శించడానికి. అప్పుడిక ఆపుకోలేకపోయింది. తలబాదుకుంటూ ఏడ్చింది. దినపత్రికలన్నిటిలోనూ ‘‘సతి’’ అకాల దుర్మరణం గురించిన వార్తతోబాటు ప్రముఖుల సందేశాలు కూడా ప్రచురించటం జరిగింది. పదవరోజున సతి సంతాపసభ ఏర్పాటయింది. సత్యవతిని రమ్మని పిలవలేదు– బొత్తిగా పదవ రోజున బయటికి ఎలా వస్తుందని. సతి హఠాన్మరణం వల్ల సాహితీ లోకానికి ఎంత లోటు కలిగిందన్నది అందరూ ఉద్ఘాటించిన విషయం. అందరూ పట్టించుకోని విషయం ఒక్కటే– సతిలో అర్ధభాగం ఇంకా బ్రతికే ఉన్నదన్న సత్యం. సత్యవతి ఇంకా బ్రతికే ఉన్నది కనుక సతి పేరుతో రచనలు కొనసాగగలవన్న ఆశాభావాన్ని ఎవ్వరూ ప్రస్తావించలేదు. ‘‘సతి’’ పేరుతోగానీ, సత్యవతి పేరుతోగానీ మళ్లీ కథ రాలేదు ఇంతవరకు.

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top