అబ్బాయి మారాడు

అబ్బాయి మారాడు


‘సమాజంలో మార్పు రావాలంటే మహిళల జీవన ప్రమాణాల్లో మార్పు రావాలి. సమాజంలో మార్పు రావాలంటే.. సింపుల్‌గా... అబ్బాయిలు మారాలి’ అని చెబుతూ  ‘ఈక్వల్ కమ్యూనిటీ ఫౌండేషన్’ వలంటీర్లు దేశవ్యాప్తంగా చైతన్యం కలిగిస్తున్నారు. అబ్బాయిలలో పరివర్తన తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

 

పుటలు పుటలు రాశారు.

పుస్తకాలు, గ్రంథాలు ప్రచురించారు.

ఉద్యమాలు చేశారు.

ఆపసోపాలు పడ్డారు.

బ్యానర్లు కట్టారు.

నినాదాలు చేశారు.

సీన్లు రాశారు.

సినిమాలు తీశారు.

స్టేజీలు ఎక్కారు. మైకులు మింగారు.

సభలకు వెళ్లారు. చట్టాలు తెచ్చారు.

అయినా... ‘అబ్బాయి’ మారలేదు.

లేదు... లేదు... మారాడు!

 

‘నీ పేరు?’

‘అనికేత్’

 ‘ఏం చదువుతున్నావ్?

‘ నైన్త్ క్లాస్’

‘వీళ్లంతా ఎవరు?’

‘మా ఫ్రెండ్స్!’

‘ఎందుకలా ఆ ఆడపిల్లల్ని ఆట పట్టిస్తున్నారు?’

‘ఆడపిల్లలు ఇంటి పట్టున ఉండకుండా అట్లా సైకిళ్లేసుకొని తిరగడమేంటి?’

‘ఏ! ఎందుకు ఆడుకోవద్దు.. వాళ్లూ మీ వయసువాళ్లేగా?’

‘కానీ వాళ్లు ఆడపిల్లలు.. ఆడపిల్లలు రోడ్లమీదకు రావడమేంటి?’

‘రావద్దని ఎవరు చెప్పారు?’

‘మా అమ్మా, నాన్న. మా ఇంట్లో అయితే అంతే. అమ్మాయిలు బయటకు రారు. మగపిల్లలతో మాట్లాడరు, మాట్లాడొద్దు కూడా!’ కరాఖండిగా చెప్పాడు అనికేత్.

‘నీకు అక్క, చెల్లెళ్లు ఉన్నారా?’

‘ఊ.. ఒక అక్క, చెల్లెలు’

‘చదువుకుంటున్నారా?’

‘చదువా? హె.. హె (వెటకారంగా నవ్వుతూ)’

‘ఎందుకలా నవ్వుతున్నావ్?’

‘మరి? మా అక్క ఇంట్లోనే ఉంటుంది.. మాకు వండిపెడుతూ. చెల్లెలు స్కూల్‌కి వెళ్తుంది. కాని పెద్దమనిషి కాగానే మాన్పించేస్తామని అమ్మ చెప్పింది’.

‘ఇంట్లో నువ్వు సాయం చేస్తావా?’

‘నేనా? ఛీఛీ...’

‘ఎందుకు ఛీ?’‘నేను అబ్బాయిని. అలాంటి పనులు చేయకూడదు. నేనే కాదు మా గల్లీలో, మా ఫ్రెండ్స్ ఇళ్లల్లో, మా చుట్టాల్లో అబ్బాయిలెవరూ ఇలాంటి పనులు చేయరు.. చేయకూడదు. మేం మగవాళ్లం. బయట పనులు చేస్తాం. బోర్ కొడితే సినిమాలకెళ్తాం. ఆడుకుంటాం.. సైకిల్ రేస్ పెట్టుకుంటాం..’  అనికేత్ చెప్తుంటే.. పక్కనే ఉన్న గుంపులో ఒక అబ్బాయి ‘ఆడపిల్లల్ని చిడాయిస్తాం కూడా’  అన్నాడు వెకిలిగా నవ్వుతూ. అతను ఆ మాట అనగానే గుంపు గుంపంతా హై ఫైవ్ ఇచ్చుకున్నారు అదే వెకిలి నవ్వుతో!

   

మూడు నెలల కిందట జరిగిన సంభాషణ ఇది. పుణెలోని ఎగువ, దిగువ మధ్యతరగతి కలగలసి ఉండే ప్రాంతంలోని ఓ మార్కెట్‌లో! ఒక్క అనికేతే కాదు ఆ మార్కెట్‌లోని పద్నాలుగు, పదిహేడేళ్ల మధ్య వయసున్న  అబ్బాయిలంతా  వాళ్లింటి ఆడపిల్లల గురించి దాదాపు ఇలాంటి అభిప్రాయాలే వెలిబుచ్చారు.ఇప్పుడు... అనికేత్ వాళ్లింట్లో...

వాళ్లక్క ప్రశాంతి నీళ్ల బిందె మోస్తుంటే ఎదురెళ్లి బిందెను తన భుజం మీదకు తీసుకుంటూ కనిపించాడు అనికేత్. ఆమె చపాతి పిండి తడుపుతుంటే కూరగాయలు తరిగిపెట్టాడు. ఆశ్చర్యపోయి.. ‘అనికేత్ నువ్వేంటి? అమ్మాయిల పని చేస్తున్నావ్? నీ ప్రెస్టేజ్ ఏం కాను?’ అని అడిగితే.. ‘ప్రెస్టేజ్ గిస్టేజ్ జాన్తా నహీ మేడమ్.. లడ్‌కా యా లడ్‌కీ దోనో బరాబర్ హై.. సబ్‌కో సబ్ కామ్ కర్నా చాహియే’ అంటూ  అక్కకు హిస్టరీ పుస్తకంలోని పాఠాన్ని వివరించసాగాడు. చపాతీలు చేస్తూనే తమ్ముడు చెప్తున్న పాఠాన్ని శ్రద్ధగా వింటోంది ప్రశాంతి.

 

‘ఏంటీ అక్కకు చదువు చెప్తున్నావా?’ ..

‘అవును మేడం.. ఈ యేడాది టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతోంది ప్రైవేట్‌గానే’- సమాధానమిచ్చాడు. చెల్లెల్నీ మంచిగా చదివించాలని, అందుకు వాళ్ల నాన్న ఒప్పుకోకుంటే తను చదివిస్తానని చెప్పాడు. అక్క, చెల్లెలు ఇంటి పనికే పరిమితం కావాలని, సల్వార్‌కమీజ్ తప్ప ఇంకెలాంటి మోడర్న్ డ్రెస్‌లు వేసుకోకూడదని, మగపిల్లల వంక కన్నెత్తి చూడకూడదనే బలమైన భావాలతో ఉన్న అనికేత్‌లో ఇంతటి మార్పేంటి? కారణం ఎవరు? ఎవరంటే.. ‘ఈక్వల్ కమ్యూనిటీ ఫౌండేషన్’ అనే స్వచ్చంద సంస్థ! దీనిని స్థాపించింది.. రుజుతా తెర్‌దేశాయి.అసలు ఆమెకు ఈ ఆలోచన ఎలా వచ్చింది?

‘స్కూల్, కాలేజ్, సినిమా, షాపింగ్ ఇలా ఎక్కడికి వెళ్లినా అల్లరిమూకల పిచ్చి మాటలు వింటూనే పెరిగాను. ఇప్పటికీ భరిస్తూనే ఉన్నాను. స్కూల్‌డేస్‌లో, కాలేజ్ డేస్‌లో అబ్బాయిలు ఇలా మాట్లాడుతున్నారు అని ఇంట్లో చెబితే ఒళ్లు కనపడని బట్టలు వేసుకో, అమ్మాయిలంతా గుంపుగా వెళ్లండి, అల్లరిమూకలున్న రూట్‌లో కాక వేరే రూట్‌లో రా, చీకటి పడకముందే ఇంటికి వచ్చేయ్ అంటూ నాకే సలహాలు ఇచ్చారు తప్ప ఇబ్బంది పెడ్తున్న వాళ్లతో  మీ ప్రవర్తన మార్చుకొండని అనలేదు. అవతల అబ్బాయిలు తప్పుగా మాట్లాడుతుంటే నేనెందుకు నా అలవాట్లను మార్చుకోవాలి అని ఇంట్లో వాదించేదాన్ని. మా అన్నయ్యలూ నన్నే కంట్రోల్‌లో పెట్టాలని చూశారు. సో.. అసలు తప్పు అక్కడుందన్నమాట. అబ్బాయిలను ఒకరకంగా.. అమ్మాయిలను ఒకరకంగా పెంచడంలో! అబ్బాయిల్లో మార్పువస్తేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. స్త్రీల మీద హింసా తగ్గుతుంది అనుకున్నా. అందుకే అబ్బాయిలను సెన్సిటైజ్ చేసే ప్రయత్నం స్టార్ట్ చేశా. ముందసలు ఒక సంస్థ పెట్టాలనే ఆలోచనే లేదు. నాకు టైమ్ ఉన్నప్పుడల్లా మిడిల్‌క్లాస్, లోయర్ మిడిల్‌క్లాస్, స్లమ్స్ ఏరియాల్లోకి వెళ్లి అక్కడి మగపిల్లలతో మాట్లాడేదాన్ని. మొదట్లో చాలా రఫ్‌గా, ఏమాత్రం మర్యాద లేకుండా మాట్లాడేవాళ్లు. ఒకానొక దశలో ఆత్మాభిమానం దెబ్బతిని నాకెందుకొచ్చిన గోల వదిలేస్తే పోలా అనీ అనుకున్నా. కానీ నా ప్రయత్నం గురించి తెలిసిన నలుగురైదుగురు ఫ్రెండ్స్ ధైర్యం చెప్పి సపోర్ట్ చేశారు. తర్వాత నాతోపాటూ వాళ్లూ రావడం మొదలుపెట్టారు. అప్పుడే దీనికి సంబంధించి ఓ సంస్థను స్టార్ట్ చేస్తే పకడ్బందీగా పనిచేయొచ్చు అని ‘ఈక్వల్ కమ్యునిటీ ఫౌండేషన్’ను స్థాపించాం’ అని చెప్తారు రుజుతా తెర్‌దేశాయి.

 

యునిసెఫ్ సర్వే

 మొన్నీమధ్యనే యునిసెఫ్ సహాయంతో ఎన్‌పీఆర్ అనే వెబ్‌జర్నల్ లింగ వివక్ష మీద ఆసియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికాలలోని పదిహేను దేశాల్లో ఒక సర్వే నిర్వహించింది. ఇప్పటికీ బాల్యవివాహాలు, రుతు సమయంలో ఆడపిల్లలను ఆరుబయట ఉంచడం, పెద్దమనిషి కాగానే చదువు  మాన్పించేయడం, కూతుళ్లకు తిండిపెట్టకుండా కొడుకులకు మంచి ఆహారాన్నివ్వడం, అసలు అమ్మాయిని పెంచడమంటేనే ‘పక్కింటి తోటకు నీళ్లు పట్టడం’... అన్న ముతక భావాలతో ఆడకూతురి పట్ల తీవ్ర విక్షను చూపుతున్న దేశంగా ఆ సర్వేలో తలవంచుకున్నాం. ఇలాంటి నేపథ్యంలో ఈక్వల్ కమ్యూనిటీ ఫౌండేషన్ చేస్తున్న కృషి ప్రశంసనీయమైనది, అనుసరణీయమైనది కూడా.

 

మూడు నెలల ప్రోగ్రామ్

టీనేజ్  అబ్బాయిలకు వాళ్లుండే ప్రాంతాల్లోనే స్త్రీ, పురుష సమానత్వం మీద తరగతులు నిర్వహిస్తుంటుంది ‘ఈక్వల్ కమ్యూనిటీ ఫౌండేషన్’ సంస్థ. అమ్మాయిల పట్ల గౌరవంగా లేకపోతే సమాజంలో ఎదురయ్యే దుష్పరిణామాలను వీడియో క్లిప్పింగ్స్‌ద్వారా చూపిస్తుంది. నాన్న.. అమ్మను గౌరవించడం మంచి కుటుంబానికి చిహ్నం అని షార్ట్ ఫిలిమ్స్‌తో చెప్పిస్తుంది. థియరీ, ప్రాక్టికల్స్‌తో రెండంచెలుగా ఒక్కో బ్యాచ్‌కి మూడునెలల ప్రోగ్రామ్ ఉంటుంది. ‘ముందు ఎవరూ ఇష్టంగా రారు. మేమే వాళ్ల దగ్గరకు వెళ్తాం. బలవంతంగా కూర్చోబెడ్తాం. ఫస్ట్ బాలీవుడ్ సినిమాలు చూపిస్తూ.. నెమ్మదిగా వాళ్ల అటెన్షన్‌ను గైన్ చేసి తర్వాత జెండర్ ఈక్వలిటీ గురించి చెప్తాం. మారిన వాళ్లకు సర్టిఫికెట్ కూడా ఇస్తాం’ అని చెప్పారు రుజుత. పుణెలో కనిపిస్తున్న ఈ మార్పు, అందుతున్న ప్రోత్సాహంతో ఈ మధ్యే పశ్చిమబెంగాల్‌లో కూడా జెండర్ ఈక్వాలిటీ తరగతులు ప్రారంభించిందీ సంస్థ. స్థానికంగా ఉన్న ఎనిమిది స్వచ్ఛంద సంస్థలు దీనికి సహకారాన్ని అందిస్తున్నాయి. ‘ఈక్వల్ కమ్యునిటీ ఫౌండేషన్’కు వంద బ్రాంచ్‌లను స్టార్ట్ చేసి దేశమంతటా విస్తరించాలనేదే  తమ సంస్థ భవిష్యత్ లక్ష్యం అంటారు రుజుత.

 

ఇ.సి.ఎఫ్.

వ్యవస్థాపకురాలు

రుజుతా తెర్‌దేశాయి

 

 

 

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top