ప్రకృతి బంధం తీజ్‌

ప్రకృతి బంధం తీజ్‌


తెలంగాణలోని, అన్ని రాష్ట్రాలలోని బంజారాల ముఖ్య పండుగల్లో ‘తీజ్‌’ ప్రత్యేకమైన పండుగ. తరతరాలుగా వస్తున్న సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా ఈ తీజ్‌ పండుగను లంబాడీలు ఘనంగా జరుపుతారు. ఈ నాలుగవ తేదీన ప్రారంభమైన తీజ్‌ ఉత్సవాలు నేడు జరిగే నిమజ్జనంతో ముగియనున్నాయి. తీజ్‌ ఉత్సవాలను తండాల్లోని పెళ్లికాని ఆడపిల్లలే నిర్వహిస్తారు. వర్షాకాలం ప్రారంభంలో కనిపించే ఆరుద్ర పురుగును తీజ్‌ అంటారు. అలాగే గోధుమ మొలకలను కూడా తీజ్‌గా పిలుస్తారు. బతుకమ్మను పూలతో అలంకరించినట్లే తీజ్‌లో గోధుమ మొలకలను పూజిస్తారు.  వర్షాకాలం ప్రారంభమై నాట్లు పూర్తయిన అనంతరం తీజ్‌ను జరుపుతారు.పండుగ విధానం... తండాల్లోని పెళ్లికాని ఆడపిల్లలంతా కలిసి పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు తీసుకున్న తరువాత ఇంటింటికి తిరిగి వేడుకల కోసం విరాళాలు సేకరిస్తారు. ఆ డబ్బుతో గోధుమలు, శనగలు ఇతర సామాగ్రి తెచ్చుకుంటారు. సాయంత్రానికి గోధుమలను నానబెడతారు. మరుసటి రోజు వారి సోదరులు దుసేరు తీగతో అల్లిన చిన్న బుట్టలలో పుట్టమట్టిని తెచ్చి అందులో లంబాడీల దేవతలు దండియాడి, సేవాభయా పేర్లతో మొదటగా తండా నాయకునిచేత ఎరువు కలిపిన మట్టిని పూయిస్తారు. ఈ ఉత్సవంలో ప్రతి కార్యం పాటతోనే సాగుతుంది. ఈ బుట్టలన్నింటినీ ఒక పందిరి కింద ఉంచి, పందిరి వద్ద రోజు ఆడపిల్లలందరూ నీరు పోసి పాట పాడతారు.బోరడి ఝప్కేరో... గోధుమలను బుట్టలో చల్లేరోజు సాయంత్రం బోరడి ఝప్కేరో నిర్వహిస్తారు. పెళ్లికాని ఆడపిల్లలు రేగుముళ్లకు శనగలు గుచ్చేటప్పుడు వరుస అయిన వారు ముళ్లను కదిలిస్తారు. అయినా సహనంతో ఆడపిల్లలు శనగల్ని ముళ్లకు గుచ్చాల్సిందే. చెల్లెల్ని ఏడిపించే అన్నలూ ఉంటారు.ఢమోళి...  ఇక ఏడోరోజు జరిపే కార్యక్రమమే ‘ఢమోళి’(చుర్మో). రొట్టెలు, బెల్లం కలిపిన ముద్దను మేరామాకి సమర్పించడాన్నే ఢమోళి అంటారు. ప్రతి ఇంటినుంచి బియ్యం సేకరించి కడావో (పాయసం) వండుతారు.ఎనిమిదవరోజు తమ బంజారా ఆరాధ్య దేవతల ప్రతిరూపాలను మట్టితో చేసి వారికి పెళ్లి చేస్తారు. నిమజ్జనం... తొమ్మిదోరోజున తీజ్‌ నిమజ్జనానికి బంధుమిత్రులందరినీ ఆహ్వానిస్తారు. కొత్తబట్టలు ధరించి మేరామా భవాని, సేవాభయా (సేవాలాల్‌)కు పూజలు చేస్తారు. తొమ్మిది రోజులపాటు పెంచిన గోధుమ నారు బుట్టలను, తండా నాయకుడిని పిలిచి, కొబ్బరికాయలు కొట్టి, మొదటి తీజ్‌ను నాయక్‌ రుమాలులో పెట్టిన తరువాత ఆపదల నుంచి తమను రక్షించాలని అన్నదమ్ములకు నారు ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకుంటారు.

తీజ్‌ బుట్టలను పట్టుకుని వరుసగా ఆడపిల్లలు నిమజ్జనానికి డప్పు చప్పుళ్లు, పాటలు, నృత్యాలు, కేరింతలతో  నిమజ్జనం సాగుతుంది. 

చెరువు దగ్గర తీజ్‌ తమను వదిలివేసి వెళ్లిపోతుందనే దుఃఖంతో ఆడపిల్లలు ఏడుస్తుంటే పెద్దలు, సోదరులు వారిని ఊరడిస్తుంటారు. ఆ తరువాత తీజ్‌ను చెరువులో నిమజ్జనం చేస్తారు. – బోనగిరి శ్రీనివాస్‌ సాక్షి మహబూబాబాద్‌ రూరల్‌

Back to Top