పాపా..! చెప్పేది నీక్కాదూ?

Taking Care Of First Child Before Giving Birth To Another - Sakshi

మళ్లీ గర్భం దాల్చినప్పుడు తల్లి మొదట ఆ వార్త చెప్పాల్సింది భర్తకు కాదు. మొదటగా పుట్టిన సంతానానికి. ఇంట్లోకి కొత్త సభ్యుడు వస్తున్నాడంటే ఉన్నవాళ్లను మైనస్‌ చేయడానికి కాదు. ఉన్నవాళ్లతో ప్లస్‌ కావడానికి. అందుకు ప్రిపేర్‌ కాని పిల్లలు, ప్రిపేర్‌ చేయని తల్లిదండ్రులు ఇంట్లో అశాంతిని ఆహ్వానిస్తారు. డెలివరీ డేట్‌ తెలియడానికంటే ముందు తెలియాల్సింది పిల్లల మనసు ఎలా ఉందనే. ఊయలలో పాప కేరింతలు కొడుతోంది. మరి కాసేపటికి పాల కోసం ఏడ్వొచ్చు. పాలు పట్టి రెండు గంటలు అయ్యింది. మళ్లీ పట్టాలి. ఆ పనిలో ఉంది సునంద. కాని పెద్ద పాప వచ్చి ఒకటే డౌట్లు...

‘అమ్మా...  టీవీలో ఆ సినిమా పేరేమిటి?’
‘అమ్మా.. పుస్తకంలో ఈ కథ చెప్పవా?’
‘అమ్మా... నాన్న ఎప్పుడొస్తాడు’...
‘అమ్మా... నాకు పాలు కావాలి’...
తల్లికి ఆ ఐదేళ్ల పెద్ద పాప సంగతి తర్వాత చూద్దాం ముందు చిన్న పాప సంగతి చూద్దాం అనే తొందర ఉంది.
‘అబ్బా... అడ్డం పడకు పాపా. చిన్నికి పాలు పట్టనీ’
‘అది తర్వాత. ముందు నాకు పాలు కావాలి’
‘ఏయ్‌.. చెప్తే నీక్కాదూ’
పెద్ద పాప సైలెంట్‌ అయిపోయింది. బొమ్మ తీసుకెళ్లి మూల కూచుంది. పెద్ద పాప మనసులో ఏముందో ఎవరికి తెలుసు?

                                        .             .                   .
పెద్ద పాపకు ఇప్పుడు ఎనిమిదేళ్లు వచ్చాయి. చిన్న పాపకు మూడేళ్లు వచ్చాయి.
‘అమ్మా... బాత్‌రూమ్‌లో నీళ్లు రావడం లేదు’
‘వస్తాయి చూడు’ చిన్న పాపను ఒళ్లో కూచోబెట్టుకున్న తల్లి అంది.
‘లేదు రావడం లేదు’
‘వస్తాయి చూడు’
‘రాలేదంటున్నానా’
తల్లి చిన్నపాపను కింద కార్పెట్‌మీద బోర్లా వేసి వచ్చి బాత్‌రూమ్‌లో ట్యాప్‌ తిప్పింది. నీళ్లు వస్తున్నాయ్‌. తల్లికి చాలా కోపం వచ్చింది.
‘కొట్టానంటే చూడు’ చిన్నగా మొట్టి ‘స్నానం చేసి త్వరగా రా’ అని వచ్చేసింది.
ట్యాప్‌లో నుంచి నీళ్లు ధారగా కారుతున్నాయి. పాప కంట్లో నుంచి కూడా.

                                                                 .             .                   .
పక్కింటి వాళ్లు తల్లికి ఫోన్‌ చేశాడు.
‘మీ అమ్మాయి మా కుక్క దగ్గరకు వెళ్లిపోయిందండీ. అది గీరేసింది’ కంగారుగా చెప్పారు.
తల్లి పరిగెత్తింది.
పక్కింట్లో పెద్ద ఆల్సేషియన్‌ కుక్క ఉంది. దానిని ఎప్పుడూ కట్టేసే ఉంటారు. పెద్ద పాప అక్కడకు వెళ్లినా ఎప్పుడూ కుక్క దగ్గరకు పోదు. కాసేపు ఆడుకుని వచ్చేసేది. కాని ఆ రోజు ఎందుకు వెళ్లిందో వెళ్లింది. ఆల్సేషియన్‌ కుక్క కరవాలని లేదుకానీ ఆటగా పైన కాళ్లు వేసింది. ఒళ్లు గీరుకుపోయింది.
తల్లి కంగారుగా వచ్చి ఏడుస్తూ పాపను చుట్టేసింది. తల్లి అలా ఏడుస్తూ తనను చుట్టుకోవడాన్ని పాప చాలా సంతృప్తిగా చూస్తూ ఉంది.

                                                                 .             .                   .
‘పెద్ద పాప బిహేవియర్‌లో చాలా మార్పు ఉందండీ. మనం ఒకసారి సైకియాట్రిస్ట్‌ దగ్గరకు తీసుకెళదాం’ అంది తల్లి.
తండ్రి కూడా ఆ మార్పు గమనించాడు.
‘అదే చాలా చిత్రంగా ఉంది. తప్పకుండా తీసుకెళదాం’ అన్నాడు.
ఆ మరుసటి రోజే వారు పాపను సైకియాట్రిస్ట్‌ దగ్గరకు తీసుకెళ్లారు.
సైకియాట్రిస్ట్‌ పాప బిహేవియర్‌ కంటే ముందు ఇంటి నేపథ్యం తెలుసుకుంది.

                                                                                    .             .                   .
ఇదీ నేపథ్యం:
సునంద, శ్రీరామ్‌లకు పెళ్లయ్యింది కాని పిల్లలు పుట్టలేదు. శ్రీరామ్‌ ఆ ఇంట్లో పెద్ద కొడుకు. సునంద తన ఇంట్లో ఒక్కతే కూతురు. కనుక వారిద్దరికీ పుట్టే సంతానం కోసం ఇరు కుటుంబాల వారూ ఎదురు చూస్తున్నారు. కాని వాళ్లకు పుట్టలేదు. దాదాపు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు దాటిపోయాయి. కాని పుట్టలేదు. అందరూ ఎంతో నిరాశ, నిస్పృహల్లో మునిగిపోయారు. ఇక పుట్టరేమో అనుకున్నారు. చివరకు తొమ్మిదో ఏట చివరలో సునంద గర్భం దాల్చింది. ఆ తర్వాత పాపను కంది. ఇక ఇరు వర్గాల వారి సంతోషానికి అవధులు లేవు. పాపను కాలు కందకుండా పెంచారు. గారాబం చేశారు. అసలు ఆ అమ్మాయికి దక్కనిదంటూ లేదు. ప్రేమ.. ప్రేమ.. అందరి ప్రేమా ఆ అమ్మాయికే. ఇంకో బిడ్డ మరి పుట్టకపోవచ్చు అని పెద్ద పాపనే ప్రాణంగా చేసుకున్నారు. అయిదేళ్లు గడిచిపోయాయి. సునంద మళ్లీ గర్భం దాల్చింది. రెండోసారి కూడా ఆడపిల్లనే కంది. ఒక పాపే పెన్నిధి అనుకుంటే దైవం మరో పాపను ఇచ్చినందుకు సునంద, శ్రీరామ్‌లు ఎంతో సంతోషించారు. రెండోపాప ముద్దు మురిపాలలో మునిగారు. కాని వారు పెద్ద పాపను నిర్లక్ష్యం చేయలేదు. ఎప్పటిలానే చూశారు. కాని ఆమె సమయంలో సగం చిన్నపాపకు ఇచ్చారు. అంతవరకూ తాను చూసిన తల్లిదండ్రులకు, అమ్మమ్మ తాతయ్యలకు, నానమ్మ తాతయ్యలకు చిన్న పాప పుట్టిన తర్వాత చూస్తున్న అదే మనుషులకు ఎంతో తేడా ఉన్నట్టు పెద్ద పాప భావించింది. ఇక ఆ ఇంటికి తన అవసరం తీరిపోయిందేమో అని భయపడింది. అన్నింటి కంటే ముఖ్యం తనని ఎవరికైనా ఇచ్చేస్తారమో అని ఆందోళన చెందింది. తల్లిప్రేమ కోసం, అటెన్షన్‌ కోసం ప్రయత్నించింది. కాలికి చేతికి అడ్డం పడింది. పదే పదే పిలిచింది. తన వైపు చూడమని కోరింది. అవన్నీ జరగడం లేదని సందేహించి రిస్క్‌ చేయడానికి కూడా వెనుకాడక కుక్క దగ్గరకు పరిగెత్తింది. ఇవన్నీ చేస్తున్నది కేవలం ప్రేమ కోసం, భద్రత కోసం, తాను ఎక్స్‌క్లూడ్‌ కాలేదన్న భరోసా కోసం.
                                                    .             .                   .
సైకియాట్రిస్ట్‌ సునందను, శ్రీరామ్‌ను కూచోబెట్టుకుని చెప్పింది.
‘చూడండి... మళ్లీ ప్రెగ్నెన్సీ వచ్చిందని తెలియగానే డాక్టర్‌ చెకప్‌కు వెళ్లడం గురించి, తీసుకోవాల్సిన ఆహారం గురించి, వేసుకోవాల్సిన మందుల గురించి ఆలోచించే దాని కంటే ముందు అప్పటికే పుట్టి ఉన్న అబ్బాయికి అమ్మాయికి ఆ విషయం అర్థమయ్యేలా చెబుతున్నామా లేదా అనేది చూసుకోవాలి. ఇంటికి కొత్త సభ్యుడు వస్తున్నాడని బాబో పాపో వచ్చి నీతో ఆడుకోబోతున్నారని చెప్పాలి. గర్భంలో ఉన్న బిడ్డను ఆ పిల్లలు పై నుంచి తాకేలా చేసి అనుభూతి చెందనివ్వాలి. పుట్టబోయే చెల్లాయి/తమ్ముడి గురించి కబుర్లు చెప్తూ వారిని మానసికంగా సిద్ధం చేయాలి. ‘పాప పుట్టినా బాబు పుట్టినా చూసుకోవాల్సింది నువ్వే’ అని వారికి బాధ్యత అప్పజెప్తున్నట్టుగా చేయాలి. అంతే కాదు పుట్టాక వారితో ఎలా మాట్లాడాలి, ఎలా ఆడుకోవాలి ఇవన్నీ దగ్గరుండి నేర్పించాలి. ఇద్దరికీ ఒకరి మీద మరొకరి ప్రేమ పుట్టేలా మాట్లాడాలి. ఒకరికోసమే మరొకరు భూమ్మీదకు వచ్చారని చెప్పాలి. అవన్నీ చేయకుండా చిన్నవారి పెంపకంలో మునిగిపోతే పెద్దవారు నిస్పృహ చెందుతారు. ఇక మీదట మీ తప్పును సరిదిద్దుకోండి. పెద్ద పాపను చిన్న పాపను కలిపి ఉంచండి. వారిని అన్ని సమయాల్లో ఒకేలా ట్రీట్‌ చేయండి. చిన్నపాప నిద్రపోతున్న సందర్భాల్లో పెద్ద పాపతో మాట్లాడటం దగ్గర తీసుకోవడం, కోరింది తినిపించి ఇక ఆడుకో పాప పనులు చూసుకోవాలి అని అర్థమయ్యేలా చెప్పడం చేస్తే అన్నీ సర్దుకుంటాయి’ అని చెప్పింది.
సునంద, శ్రీరామ్‌లకు తమ బాధ్యత తెలిసి వచ్చింది.
అల్లారుముద్దుగా పెంచుకున్న పెద్ద పాప లోపల ఇంత ఆందోళన ఉందా అని బాధపడ్డారు.
కొన్నాళ్లకు ఆ ఇంట్లో నాలుగు పాదాల పట్టీలు చాలా ఉత్సాహవంతంగా సందడి చేయడం అందరూ విన్నారు.

‘పాప పుట్టినా బాబు పుట్టినా చూసుకోవాల్సింది నువ్వే’ అని వారికి బాధ్యత అప్పజెప్తున్నట్టుగా చేయాలి. అంతేకాదు, పుట్టాక వారితో ఎలా మాట్లాడాలి, ఎలా ఆడుకోవాలి ఇవన్నీ దగ్గరుండి నేర్పించాలి. ఇద్దరికీ ఒకరి మీద మరొకరి ప్రేమ పుట్టేలా మాట్లాడాలి. ఒకరికోసమే మరొకరు భూమ్మీదకు వచ్చారని చెప్పాలి. అవన్నీ చేయకుండా చిన్నవారి పెంపకంలో మునిగిపోతే పెద్దవారు
నిస్పృహ చెందుతారు. ఇక మీదట మీ తప్పును సరిదిద్దుకోండి.

– కథనం: సాక్షి ఫ్యామిలీ
ఇన్‌పుట్స్‌: డా. పద్మ పాల్వాయి, సైకియాట్రిస్ట్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top