ఆడపిల్ల చేతిని పిడికిలిగా మార్చాలి

Syeda falak Giving Training To Girls In Karate - Sakshi

ఆడపిల్లకు పాఠశాల విద్యతో పాటు ఆత్మరక్షణ విద్య కూడా తెలిసి ఉండాలి. ఇబ్బంది పెట్టే పురుషుణ్ణి ముఖాన్ని ఈడ్చి తన్నే టెక్నిక్‌ తెలిసి ఉండాలి. హైదరాబాద్‌కు చెందిన కరాటే ఫైటర్‌ సాయెదా ఫలక్‌ తనకొచ్చిన విద్యను విద్యార్థినులకు నేర్పిస్తున్నారు. వారి చేతులకు బలాన్నిస్తున్నారు.

సాయెదా ఫలక్‌ హైదరాబాద్‌ పాతబస్తీలో స్కూల్లో చదువుతున్నప్పుడు ఆమె అక్క కూడా అదే స్కూల్‌లో అథ్లెట్‌గా ప్రాక్టీసు చేసేది. స్కూల్‌ అయ్యాక అక్క కోసం గ్రౌండ్‌లో గంట సేపు కూచోవాల్సి వచ్చేది సాయెదాకు. ఆ టైమ్‌లోనే ఆమెకు అదే గ్రౌండ్‌లో కొంత మంది అబ్బాయిలు ప్రాక్టీసు చేస్తున్న కరాటే మీదకు దృష్టి పోయింది. ఊరికే కూచుని టైమ్‌ వేస్ట్‌ చేసే బదులు కరాటే నేర్చుకోవచ్చు కదా అనుకుంది. అప్పుడు సాయెదా ఏడవ క్లాసు. ఇంటికొచ్చి ఆ సంగతి చెప్తే ‘కరాటేనా?’ అని తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. అయితే ఇంట్లో నానమ్మ కరాటే గురించి విని, దానికై ధరించే దుస్తులు నిండుగా ఉంటాయని తెలుసుకుని అనుమతి ఇచ్చింది. తల్లిదండ్రులు కూడా సరే అన్నారు. అలా సాయెదా కరాటే నేర్చుకోవడం మొదలెట్టింది.

కాని కొద్ది రోజుల్లోనే స్కూల్‌ ఛాంపియన్‌ అయ్యింది. ఆ తర్వాత హైదరాబాద్‌ ఛాంపియన్‌ అయ్యింది. మెల్లగా జాతీయ అంతర్జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్‌ అయ్యింది. అమెరికాలో 36 దేశాలు పాల్గొనే యు.ఎస్‌.ఓపెన్‌ కరాటే ఛాంపియన్‌షిప్‌లో 56 కేజీల విభాగంలో సాయెదా గోల్డ్‌ మెడల్‌ సాధించి మన దేశపతకాన్ని అక్కడ రెపరెపలాడించింది. దాదాపు 18 అంతర్జాతీయ, 21 దేశీయ ఛాంపియన్‌ షిప్‌లలో పాల్గొన్న సాయెదా తెచ్చిన గోల్డ్‌ మెడల్స్‌ వల్ల ‘గోల్డెన్‌గర్ల్‌’ అని స్థానికుల చేత బిరుదు పొందింది. అయితే తనకొచ్చిన విద్యను తన ఖ్యాతి కోసం కీర్తి కోసం తన వద్దే ఉంచుకోదలుచుకోలేదు సాయెదా. ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతున్న నేటి పరిస్థితుల్లో ఆడపిల్లలకు ఆత్మరక్షణ విద్యగా కరాటే టెక్నిక్స్‌ నేర్పించడానికి ప్రయత్నిస్తోంది. ఈ వేసవిలో ఆమె హైదరాబాద్, తెలంగాణలో ఉన్న ప్రభుత్వ మైనారిటీ రెసిడెన్షియల్‌ స్కూళ్లలోని బాలికలకు కరాటే టెక్నిక్స్‌ నేర్పించింది. అంతే కాదు తెలంగాణ పోలీస్‌ శాఖ షీ టీమ్‌ విభాగం కోసం స్త్రీ ఆత్మరక్షణ కోసం పాటించాల్సిన ఆత్మరక్షణ విధానాలను వీడియో చేసి విడుదల చేసింది.

దారిన వెళుతున్నప్పుడు ఆకతాయిలే కాదు అయినవారు కూడా ఒక్కోసారి దాడికి తెగబడవచ్చు. కర్రతో కొట్టడానికి వచ్చినప్పుడు, జుట్టు పట్టుకొని కొట్టాలని చూసినప్పుడు, వెనుక నుంచి పట్టుకున్నప్పుడు, ముందు నుంచి పట్టుకోవాలనుకున్నప్పుడు, కత్తి పట్టుకొని వచ్చినప్పుడు, చేతిలో ఉన్న బ్యాగ్‌ను లాక్కుని వెళ్లిపోవాలనుకున్నప్పుడు ఎటువంటి టెక్నిక్స్‌ వాడాలో సాయెదా తన ట్రైనింగ్‌లో విద్యార్థినులకు నేర్పుతోంది.

తెలంగాణ రాష్ట్రం నుంచే కాదు, ముస్లిం సమాజం నుంచి కూడా ఒక అమ్మాయి ఇలా పోరాట విద్యలో ఈ స్థాయికి ఎదగడం ఇదే మొదటిసారి. అందుకే సాయెదాకు ప్రశంస లభిస్తోంది. ఆమె చేయాలనుకుంటున్న సమాజ సేవకు మద్దతు దొరుకుతోంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top