నిలుపరా నీ జాతి నిండుగౌరవము

నిలుపరా నీ జాతి నిండుగౌరవము


ఆధునిక ఇంగ్లిష్ విద్య వివిధ ప్రాంతాలూ మతాలుగా విడిపోయిన భారతీయులని ఒకే తాటిమీదకి తెచ్చింది. పత్రికలు పుట్టాయి. వ్యక్తి స్వాతంత్య్రం అనే పునాదిపై నిర్మించబడ్డ బ్రిటిష్ ప్రజాస్వామ్య వ్యవస్థ పరతంత్ర దేశమైన ఇండియాలో కూడా పత్రికలలో భావవ్యక్తీకరణ స్వేచ్ఛ కలిగించింది. అయితే పాలకులకి స్వతంత్రాభిలాషులైన ప్రజల వల్లా నాయకులవల్లా బెదురు ఇక్కడే కాదు ప్రపంచమంతా ఉండేదే. భారతీయ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సి.ఆర్.పి.సి) ఇంగ్లాండులో ఆచరణలో ఉన్న న్యాయవ్యవస్థని అనుసరించిందే. అప్పుడప్పుడూ విజృంభించే ప్రభుత్వ వ్యతిరేకతను అణచడానికి అధికారుల హస్తంలో ఉన్న ప్రత్యేకమైన ఆయుధమే సెక్షన్ 144. ఈ చట్టం ప్రకారం ప్రభుత్వంచే నియమించబడ్డ మెజిస్ట్రేట్ ఎవరికైనా సరే ప్రజలకి న్యూసెన్స్‌గానీ సమాజంలో వ్యక్తులకి ప్రమాదం కలగవచ్చనిగానీ తోస్తే చాలు పౌరహక్కులపై ఎలాంటి ఆంక్షలన్నా విధించవచ్చు.



1905లో బెంగాల్ విభజనతో దేశంలో అక్కడక్కడా వినిపించిన ‘స్వరాజ్యమే జన్మహక్కు’ అనే నినాదం గాంధీజీ స్వదేశాగమనంతో ఊపందుకుంది. భారతమాతని స్తుతిస్తూ బెంగాల్లో గానం చేసిన వందేమాతరం గీతం స్వతంత్రం కాంక్షించే ప్రతి భారతీయుడికి ఊపిరి అయింది. ప్రతి కవీ ఒక వైతాళికుడైయ్యాడు. స్వాతంత్య్ర సముపార్జనే ఆశయంగా ప్రజలనీ యువకులనీ పురిగొల్పుతూ గానం చేశాడు. సామాన్యుడికి సైతం అర్థమయ్యే వాడుక భాషల్లో సాహిత్యం వెలువడింది. దేశ సంస్కృతి చరిత్రలపై అభిమానం కట్టలు తెంచుకుంది.



ఏ దేశమేగినా ఎందుకాలిడినా -

ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనిన

పొగడరా నీ తల్లి భూమిభారతిని

నిలుపరా నీ జాతి నిండుగౌరవము

అంటూ రాయప్రోలు సుబ్బారావుగారు గానంచేసిన ‘జన్మభూమి’ గేయం తెలుగువారికి జాతీయగీతమైంది.

 కానీ బ్రిటిష్‌వారి ‘విభజించూ పాలించూ’ అనే విధానం వల్ల కులాలుగా, మతాలుగా విడిపోయి కొట్టుకు చచ్చే వారికి వాళ్లూ, వాళ్లవాళ్ల ప్రయోజనాలే ముందు. మద్రాసు రాష్ట్రంలో  శతాబ్దాలుగా వేళ్లూనిన బ్రాహ్మణుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా బ్రాహ్మణేతరులు నడుం కట్టారు. అప్పటి చరిత్రకారులు ప్రతిపాదించిన ‘ఆర్యుల దండయాత్ర’ అనే సిద్ధాంతం బ్రాహ్మణేతరులకి ఊతమైంది. శతాబ్దాలుగా చదువుసంధ్యలను స్వంతం చేసుకొని మిగిలిన వారిని విద్యకి దూరం చేసిన వ్యవస్థ వల్ల ఆధునిక యుగంలో కూడా బ్రాహ్మణులకి దక్కిన ప్రాముఖ్యత నిర్ద్వంద్వంగా నిజమే. నూటికి ముగ్గురు లేని బ్రాహ్మణులు అధికారయంత్రాంగంలో అధికశాతం అంటే దాదాపు 70 శాతం ఉద్యోగాలు స్వంతం చేసుకున్నారు.



బ్రాహ్మణేతరుల ఎదుగుదలే ధ్యేయంగా ప్రారంభించబడిన జస్టిస్ పార్టీ 1920లో మద్రాసులో ప్రభుత్వాన్ని చేపట్టింది. కాంగ్రెస్ విధానాలు బ్రాహ్మణులకి అనుకూలమని, బ్రిటిష్ ప్రభుత్వం ఉంటేనే బ్రాహ్మణేతరుల అభివృద్ధి సాధ్యమనే అభిప్రాయం కొంత ప్రబలమైంది.1921 డిసెంబర్ నెలలో మహాత్మాగాంధీ స్వాతంత్య్ర సమరానికి సారథ్యం స్వీకరించాడు. స్వరాజ్యమే ఆశయమంటూ సమరశంఖం పూరించాడు. భారతీయులలో ఐక్యమత్యంలేనిదే ఎటువంటి ఉద్యమమూ విజయవంతం కాదని ఆయనకి తెలుసు. శతాబ్దాలుగా పీట వేసుకు కూర్చున్న సాంఘిక అసమానతలూ, మతద్వేషాల పునాదులపై దాడి చేశాడు.



డ్రెయిన్ థీరీ- అంటే పరప్రభుత్వం వల్ల తరలిపోతున్న దేశసంపద వల్ల ఆర్థిక వ్యవస్థకి కలుగుతున్న నష్టం గురించి అప్పటికే విద్యావంతులు గ్రహించారు. దానిని అరికట్టడానికి గాంధీజీ చేపట్టిన విధానం విదేశీవస్తువుల బహిష్కరణ, చేనేత వస్త్రధారణ, ప్రభుత్వంతో సహాయనిరాకరణ. జాతీయతా భావానికి ‘అస్తిపంజరములను సైతమూ ఆడించు శక్తియున్నదని’ దువ్వూరి రామిరెడ్డి వంటి కవుల సాహిత్యం ఆనాటి చైతన్యానికి అద్దం పట్టింది. ‘కొల్లాయి కట్టితేనేమీ...’ అంటూ గాంధీజీ వెంట భారత ప్రజలు ఆలమందల్లా ఆయన చూపిన సత్యాగ్రహమనే బాటలో అనుసరించారు.

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top