లిప్‌స్టిక్‌ ఎరుపు

story world

వర్క్‌షాప్‌ సైరన్‌ మోగగానే సుందరం అతని భార్య నిద్రలేస్తారు. వంటింట్లో పని ఇద్దరూ పంచుకొని పూర్తిచేస్తారు. సుందరం నీళ్లు తెస్తే శోభ పొయ్యి వెలిగిస్తుంది. సుందరం పాలకోసం పోతే శోభ చపాతీలు చేస్తుంది. రెండో సైరన్‌ మోగడానికి కొంత ముందుగానే ఇద్దరూ ఫ్యాక్టరీవైపు బయలుదేరి వెళ్తారు. మూడోసారి సైరన్‌ మోగే సరికి ఫ్యాక్టరీ గేటు దగ్గరికి చేరుకుంటారు.హాజరు వేసుకుంటారు. వర్క్‌ టికెట్లు తీసుకుంటారు. చెప్పులు వదిలిపెడతారు. వచ్చే పోయే అధికారులకు నమస్కారం పెడతారు.

 నాలుగోసారి సైరన్‌ మోగేసరికి పనిలోకి వెళ్తారు.సుందరం మగ్గం నేస్తాడు. శోభ, ఆమెతో వచ్చినవాళ్లు బట్టలమీద వచ్చింది పొయ్యింది సరిచేస్తారు. వేలాడే నూలుపోగుల్ని లాగేస్తారు. డామేజ్‌ ఉంటే సరిదిద్దుతారు. షిఫ్ట్‌కు బ్రేక్‌ ఇస్తూ సైరన్‌ మోగగానే భార్యాభర్తలు మల్బరీ చెట్టు కింద భోంచేస్తారు. నేతితో చేసిన చపాతీలు, వాటిలోకి బంగాళదుంపల కూర గాని, వంకాయ చట్నీ గాని వేసుకుంటారు. సుందరం పిడికిలితో ఒక ఎర్రగడ్డను నలుపుతాడు. దానిని ఇద్దరూ నంజుకుంటారు. వాళ్లకు నీళ్లుతాగే వంతు వచ్చే లోపల సైరన్‌ మోగుతుంది. మళ్లీ పనిలోకి వెళ్లిపోతారు.

షిఫ్ట్‌ ముగిసేసరికి సుందరం అలసిపోతాడు. ‘‘ఈ కష్టమైన పనిలో నువ్వెప్పుడూ నిలబడుకొని ఉండాలి. జాగ్రత్తగా పనిచెయ్యాలి. కళ్లను మిషన్‌కు అంకితం చేయాలి’’. సుందరం ప్రతిరోజూ చెబుతాడు. ఆయన భార్య నిరంతరం సూదితో పనిచెయ్యడం వల్ల కాసిన కాయలు చూపిస్తుంది. అంతలో ఇద్దరూ ‘‘బతకడం అంత సులభం కాదు’’ అనుకొని తమను తాము సముదాయించుకుంటారు.
ఇంటికి తిరిగి రాగానే శోభ వంటగదిలో బిజీ అయిపోతుంది. సుందరం కూరగాయలు కొనుక్కొస్తాడు. లాంతరు శుభ్రపరుస్తాడు. ఇంటి ముందున్న తులసిచెట్టుకు నీళ్లు పోస్తాడు. రాత్రవుతుంది. పడుకొనే వేళవుతుంది.

బహుశా సుందరం ఈపాటికి పాకిస్తాన్‌లో తనకున్న ఆస్తిని మరచిపోయి ఉంటాడు. పాత కాలంలో అయితే తను భార్యను ఫ్యాక్టరీలో పనిచేయించడాన్ని ఊహించనైనా వీలుకాదు. అక్కడ మనుషులు మాటలెక్కువ చెబుతారు. శోభ వాళ్ల అవ్వ అమ్మల్లాగా ముఖాన తలకు ముసుగు వేసుకొనిగాని బయటికి వచ్చుండేది కాదు.ఇక్కడ భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తున్నారు. సుందరం తమ మిత్రుల భార్యల్ని ఎప్పుడూ విమర్శిస్తూ ఉంటాడు. రోజంతా వాళ్లు ఏ పనీ లేకుండా ఒంటరిగా ఊరికే కూర్చుని ఉంటారు. జీతం వచ్చీ రాగానే ఖర్చు పెట్టేస్తారు. అప్పుల మీద కొనుగోళ్లు మొదలౌతాయి.

సుందరం అతని భార్య ప్రతి పైసాకు లెక్క చెప్పుకుంటారు. ప్రతి నెలా ఒకటో తేది తన సంపాదనంతా భార్య చేతికిస్తాడు. దానికామె తన సంపాదన కలుపుతుంది. మొత్తంలోంచి ఇంటి ఖర్చులకు సరిపడేంత తీసుకుంటారు. మిగిలింది ఫ్యాక్టరీ ఆవరణలో ఉన్న పోస్టాఫీసులో డిపాజిట్‌ చేస్తారు. దానికెంత వడ్డీ వస్తుందో శోభకు బాగా తెలుసు. సుందరానికి ఆశ్చర్యం కలిగించేదల్లా తన తోటి కార్మికులు ఫ్యాక్టరీ క్యాంటీన్‌ నుండి లడ్లు, జిలేబీలు, పేడాలు కొనే పద్ధతే. ఆ లగ్జరీలకు వీళ్లు ఎలా ప్రయత్నిస్తారో అని ఆయనకాశ్చర్యం. చాలామంది సాయంకాలం టౌన్‌కు వెళ్తుంటారు. టౌను ఆరు మైళ్ల దూరంలో ఉంది. కొందరు సైకిళ్ల మీద, మరికొందరు బస్సులో పోతుంటారు. ఆ టౌను తీరే వేరు. మనుషుల గుంపులు, శబ్దాలు, పాటలు మోహం కలిగించి కలలు కలిగిస్తాయి.

ఇలా ఆలోచిస్తూ సుందరం కలవరపడతాడు. అప్పుడు తన భార్య చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.నేతశాలలో జరిగేవన్నీ సుందరం భార్యకు చెబుతాడు. బయటి వరండాలో జరిగేవన్నీ శోభ భర్తకు చెబుతుంది. చాలాసేపు బట్టల చారలు, గీతలు మొదలైనవాటిని గురించి మాట్లాడుకుంటారు. ఫ్యాక్టరీలో నేసే వస్తువులను గురించి అదేదో అందరికీ స్నేహితుడైనట్లు చర్చించుకుంటారు.శోభ, ఆమెతో పాటు పనిచేసేవాళ్లు బట్టను చూసీ చూడగానే అది సుందరం మగ్గం మీద నేసిందని చెప్పేస్తారు. తన భర్త నైపుణ్యం ఉత్తమమైందిగా గుర్తింపబడటం శోభకు గర్వకారణం. ఆమెతో పాటు పనిచేసేవాళ్లు సుందరం నేసిన బట్టను కళ్లు పెద్దవి చేసుకొని చూస్తారు. సుందరం మగ్గం మీద నేసిన బట్టను సరిచేయడం చాలా సులభంగా ఉంటుంది. గనక అందరూ దానికోసం ఎదురుచూస్తుంటారు. అది ఎవరికి పోతే వారు దానిని గురించి ఎక్కువ చెప్పుకుంటారు. ఆమె ఇటు సూది పెట్టి అటు తీసేస్తుంది.శోభ, సుందరం ఆనందంగా ఉన్నారు. రెండు పటాల ముందు ఒక మైనం వత్తి. బండికి రెండు చక్రాలు సమానంగా నడుస్తుంటాయి.

అప్పుడొక సంఘటన జరిగింది. ఒకరోజు సుందరం ఆఫీసుకు వెళ్లాడు. వాళ్లూరి వ్యక్తి ఆఫీసులో క్లర్క్‌గా పనిచేస్తున్నాడు. అతని పేరు సుజ్జన్‌. అతడు కొన్నాళ్ల క్రితమే ఫ్యాక్టరీలో చేరాడు. సుందరానికి కొత్త వెలుగు ప్రసరించినట్లైంది. చాలాసేపు తన ఊరి వ్యక్తితో మాట్లాడుతూ కూర్చున్నాడు. ఇంటికి తీసుకొచ్చాడు. సుజ్జన్‌ భార్య, సుందరం భార్య కలుసుకున్నారు. తాము దూరపు బంధువులని గుర్తించారు. ఆహ్వానాలు ఇచ్చి పుచ్చుకున్నారు. మగవాళ్లు సోదరులు, ఆడవాళ్లు అక్కాచెల్లెళ్లు అయ్యారు. సుజ్జన్‌ క్లర్క్‌గా పనిచేస్తున్నాడు. గనుక అతను అన్న అయ్యాడు. సుందరం కార్మికుడు గనక తమ్ముడిగా సరిపెట్టుకోవలసి వచ్చింది. క్లర్కు భార్య గనక శ్రీమతి సుజ్జన్‌ అక్క అయ్యింది. ఆమె కొప్పులో పువ్వులు ధరిస్తుంది. బట్టలెప్పుడూ మడత నలగవు. సుందరం భార్య మామూలు దుస్తులు ధరిస్తుంది. నిరాడంబరంగా ఉంటుంది. మెల్లగా మాట్లాడుతుంది, చెల్లెలయింది.ప్రతి సెలవు రోజున వాళ్లు కలుసుకుంటారు. ఆడవాళ్లు పరస్పరం గుసగుసలాడతారు. మగవాళ్లు తమ పాత గ్రామాన్ని గురించి అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ కబుర్లలో వాళ్లు అలసిపోరు.
సుందరం ఆనందంగా ఉన్నాడు. శోభ కూడా అంతే.

ఒకరోజు సుజ్జన్‌ భార్యకు సుస్తి చేసింది. ఆరోజు సాయంకాలం సుందరం, శోభ ఆమెను చూడ్డానికి వెళ్లారు. వాళ్లు అక్కడుండగానే ఆమెకు బాధ ఎక్కువైంది. శోభ ఆ రాత్రి అక్కడే ఉంది. మర్నాడు ఉదయానికి కూడా ఆమె కోలుకోలేదు. శోభ తాను ఫ్యాక్టరీకి వెళ్లడం మంచిది కాదనుకొంది. సుజ్జన్‌ వెంటనే ఆమెకోసం శెలవు కోరుతూ లేఖ రాశాడు.క్లర్క్‌ భార్యకు వచ్చింది కొంచెం కడుపునొప్పి మాత్రమే. ఆమె లేచి కోలుకోగా పనిలోకి అందరూ వెళ్లారు. కొత్త స్నేహితులు రోజంతా పిచ్చాపాటి మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ గడిపారు. క్లర్క్‌ భార్యకు శోభ తలదువ్వింది. ఆమె తల వెంట్రుకల్ని అందమైన చుట్టగా మలచుకోవడం ఎలాగో శోభకు నేర్పింది.

శోభ సాయంకాలం రాగానే ఆమె తలలోంచి మెల్లగా వాసన వస్తున్నట్లు గ్రహించాడు సుందరం. సుందరం ఆమెనే చూస్తున్నాడు. అతని దృష్టి మాటిమాటికీ ఆమె తలకొప్పులోని పిన్ను మీదికి పోతోంది. వంటగదిలో పనిచేస్తున్నప్పుడు ఆమె చున్నీ మాటిమాటికీ జారిపోతోంది.ఆరోజు సాయంకాలం ఆమె తాలింపు, పప్పు, కొన్ని స్వీట్లు తయారుచేసింది.పనిలోంచి తిరిగి వచ్చిన తర్వాత ఏదైనా కూర లేకపోతే పప్పు చేయడానికి పూనుకొనేది. కాని ఆ రోజు ఆమె అలసిపోలేదు. ఆమె శుభ్రంగా శుచిగా ఉంది. చిరునవ్వు చిందిస్తూ ఉంది.ఆ రాత్రి భార్యాభర్తలు చాలాసేపు మాట్లాడుకొన్నారు. ఆమె తలవాసన అతని అలసటను పోగొట్టింది. రోజంతా ఇంట్లోనే ఉండిన శోభకు నిద్రరాలేదు.

కొన్ని రోజులకు శోభకు సుస్తి చేసింది. విశ్రాంతి కావాలంది. సుందరం ఒప్పుకొన్నాడు. ఆమె పనిలోకి పోలేదు. పగలు క్లర్క్‌ భార్య వచ్చి సాయంకాలం దాకా కాలక్షేపం చేసింది. ఇద్దరూ హాయిగా గడిపారు.క్లర్క్‌ భార్యతో శోభ స్నేహం గాఢమౌతుంది.శోభకు క్లర్క్‌ భార్య చాలా ఆకర్షణీయంగా ఉంది. ఆమె ప్రతి కదలికా నాజూకుగా కనిపిస్తూంది. క్లర్క్‌ భార్య పేదరికాన్ని గురించి, కోరికల్ని గురించి ఎప్పుడూ మాట్లాడదు. ఆకలిగా ఉందని గాని, దప్పికవుతుందని గాని ఎప్పుడూ అనదు. గోళ్లకు రంగులు వేస్తుంది. ముఖానికి పౌడరు రాస్తుంది. ఆమె జుట్టు చిన్నదైనా శోభ కొప్పు కన్నా పెద్దదిగా చేసుకుంటుంది కృత్రిమ పద్ధతిలో.శోభ ఆమెను చూస్తూ ఆశ్చర్యపోతుంటుంది.ఒకరోజు ఫ్యాక్టరీ నుండి తిరిగి వస్తున్నప్పుడు శోభ ‘సుజ్జన్‌ జీతమెంత?’ అని అడిగింది భర్తను.అతని జీతం సుందరం జీతం కన్నా తక్కువ.‘‘అలాంటప్పుడు ఎలా?’’

ఏదో చెప్పాలనుకుంది కాని మాటలు రాలేదు.కొంత కాలం గడిచింది.శోభ మాటిమాటికీ పని ఎగ్గొట్టడం ప్రారంభించింది. తోటి పనివాళ్లకు ఆమె దూరమౌతున్నట్లనిపించింది. మాటిమాటికీ ఆమె అడిగే సెలవును మంజూరు చెయ్యడానికి ఆఫీసర్లు ఒప్పుకోవడం లేదు. తోటి పనివాళ్లకు ఆమె పట్ల ఇదివరకున్న గౌరవం తగ్గనారంభించింది.శోభకు ఆశ్చర్యం. క్లర్క్‌ భార్య పనిచెయ్యకపోయినా వాళ్ల బ్రతుకు చెడిపోలేదు. పైగా వాళ్లు మంచి తిండి తింటున్నారు. మంచి బట్టలు వేసుకుంటున్నారు. స్త్రీ ఇంట్లో ఉంటే వేయి రకాలుగా లాభం. బాగా మడత నలగని బట్టలు ఆమెకు గొప్పగా కనిపించాయి. పైగా అది ఖర్చుతో కూడుకున్న పనికాదు. ఒక ఇస్త్రీపెట్టె పెద్ద ఖరీదేమీ కాదు. కొంచెం బొగ్గు వేస్తే కావలసినన్ని బట్టలు ఇస్త్రీ చేసుకోవచ్చు. ఇస్త్రీ బట్టలు వేసుకొని ఎవరన్నా ఫ్యాక్టరీలో ఎలా పనిచేయగలరు? శోభ కొప్పు అప్పటికే ఆమె తోటి పనివాళ్లలో చర్చనీయాంశమైంది.

దారిన పోయే ప్రతి ఆఫీసరూ, ఇంజనీరు తప్పనిసరిగా ఆమెను ఒకసారి చూసే వెళ్తారు. అది కొన్నిసార్లు ఆమెకు బాగుందనిపించినా కొన్నిసార్లు ఇబ్బందిగా కూడా అనిపించింది.శోభ కండ్లు మూసుకొని తాను ఇంట్లో ఉండిపోతే తాను కోరుకున్న విధంగా కాలం వెళ్లబుచ్చవచ్చు. తనివి తీరేదాకా తలదువ్వుకోవచ్చు. బట్టలు సర్దుకోవచ్చు. పెదాలకు రంగు వేసుకోవచ్చు. జుట్టును రకరకాలుగా అలంకరించుకోవచ్చు. అప్పుడు క్లర్క్‌ భార్య కాదు కాలనీలోని ప్రతి స్త్రీ తనవైపే ఆసక్తిగా చూస్తుంటుంది. ఇలా ఆలోచించి ఆలోచించి శోభకు మత్తెక్కుతుంది.ఒకరోజు ఉన్నట్టుండి తానిక పనిలోకి వెళ్లనని శోభ భర్తతో చెప్పింది.సుందరం భార్య మాటల్ని కాదనలేదు. ఆమె అతనికి చాలా ముద్దుగా కనిపించింది. శోభ ఇంట్లో కూర్చొని క్లర్క్‌ భార్యను తు.చ. తప్పకుండా అనుకరిస్తూంది. తన భర్త చదువుకొన్న వ్యక్తిగా భావిస్తుంది. క్లర్క్‌ జీతం తక్కువైతే ఏమిటంట?

ఆ నెలకు ఒక జీతమే ఇంటికొచ్చింది. అయినా శోభ ఆనందంగానే ఉంది.ఆ రోజుల్లో సుందరం స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ విందులకు వెళ్తూ కాలం గడిపాడు. సగం పనిరోజుల్లో అతని స్నేహితులు ఏదో ఒక ఆశజూపి బయటికి తీసుకెళ్లేవాళ్లు. స్నేహితుల్లాగే సుందరం కూడా క్యాంటీన్‌లో స్వీట్లు తినేవాడు, ఇంటి నుంచి తీసుకొచ్చిన టిఫిన్‌ చాలనట్లు. తర్వాతి నెల్లో సుందరం ఇంటికి తీసుకుపోవాల్సిన జీతంలో ఏడు రూపాయలు తగ్గింది.
శోభ ఇందుకు ఏమాత్రం చింతించలేదు. మనుషులు అలా ఉన్నారు. మగ స్నేహం ఎప్పుడూ ఖర్చుతో కూడుకున్నదే కదా.

సుందరం జీతం తర్వాతి నెల్లో పది రూపాయలు తగ్గింది. పోయినసారి సుందరం క్యాంటీన్‌ రశీదును భార్యకు చూపించాడు. ఈసారి అలా చూపించాల్సిన అవసరం లేదనుకున్నాడు.అయినా శోభ పట్టించుకోలేదు. తనకు కొత్తగా వచ్చిన స్వేచ్ఛలో ఆమె ఆనందంగా ఉంది. రోజంతా ఒంటరిగా గడుపుతూ తను ఎప్పుడు ఏది చెయ్యదలచుకున్నది అప్పుడు చేసేస్తూంది. ఎంతో మంది స్నేహితులు తయారయ్యారు. నిరంతరం కొనుగోళ్ల కోలాహలం. ఇప్పుడామె ఎక్కువ కాలం గుడిలో గడుపుతూంది. ఇతరులు తన చుట్టూ ఉండేట్టు చూసుకుంది. ఆమె చెప్పలేనంత ఆనందంగా ఉంది.కొత్త వ్యాపకాల్లో మునిగిపోయిన శోభ సుందరం ఇంటికి ఆలస్యంగా వచ్చినా గుర్తించడం లేదు.శోభ భర్త సంపాదిస్తున్నాడు.

ఆమె ఖర్చుపెడుతూంది. శోభ ఆనందంగా, పరమానందంగా ఉంది.మరో నెల గడిచింది. జీతాలిచ్చే రోజుకు ముందురోజు భోజన సమయంలో మిత్రులంతా కలుసుకొని ఒకటో తేదీన జల్సా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. సుందరం విన్నాడు. అలాంటి జల్సాలు తన మిత్రులు అదివరకు చాలాసార్లు ఏర్పాటు చేశారు. తనిప్పుడు సరేనన్నాడు.‘‘అయితే శోభ?’’ ఆ రోజు సాయంకాలం దాకా సుందరం మనసులో ఇదే స్వరం పలుకుతూంది.ఇంటికి తిరిగి వచ్చి తన సందేహాలను ఒక సహచరునికి చెప్పాడు. అతడు నవ్వాడు. పకాలున నవ్వాడు.సంకోచిస్తూనే మర్నాడు సాయంకాలం సుందరం స్నేహితులతో కలిసి వెళ్లాడు. ఎవరి జీతాలు వాళ్ల జేబుల్లో ఉన్నాయి.ఆరుమైళ్లకవతల నగరం. సుందరానికి తెలిసిన నగరం విభిన్నమైంది. మనుషుల గుంపులు, శబ్దాలు, పాటలు ఆ దృశ్యం అతని కళ్లముందు విచిత్రంగా నాట్యం చేసింది. బస్సు సుందరంతో పాటు వేగంగా పోతోంది.
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top