నీ చల్లని దయ వల్లే..!

A story of a tree - Sakshi

పూర్వం ఒక అడవిలో ఒక ఎర్రచందనం చెట్టు ఉండేది. అది వందల ఏళ్ళగా పెరిగి పెరిగి ఒక మహావృక్షంగా తయారయ్యింది. శాఖోపశాఖలతో సువిశాల ప్రాంతంలో విస్తరించింది.
దాని దగ్గరలోనే ఒక మంచినీటి తటాకం ఉంది. అడవిలోని జంతువులు మేత మేసి ఈ తటాకంలో కడుపారా నీళ్లు తాగి వచ్చి ఈ చెట్టునీడనే సేద తీరేవి. చెట్ల కొమ్మల మీద నివసించే పక్షుల కిల కిల రావాలు వాటికి జోల పాడేవి. కాలం గడుస్తున్న కొద్దీ ఈ మహావృక్షానికి దిగులు పట్టుకుంది. తరచూ తనలో తాను ఇలా అనుకునేది.

‘రెండు వందల ఏళ్ళుగా ఈ అడవిలో చెట్టుగా –ఎవ్వరికీ ఉపయోగపడకుండా నిస్సారమైన జీవితాన్ని సాగిస్తున్నాను. ఎవరైనా అడవిలో చెట్టు కొట్టే వారు వచ్చి, నన్ను నరికి, నా కలపతో దూలాలు, కిటికీలు, తలుపులు, దర్వాజాలు చేయించితే ఎంత బాగుండును. నా జన్మధన్యం అవుతుంది’ అని ఆలోచించుకుని బాధ పడేది. ఆ మహావృక్షం పడే మనోవేదన గూటిలో ఉండే ఒక పాలపిట్ట  కనిపెట్టింది అది ఆ మహావృక్షంతో..    ‘‘ఓ మహావృక్షమా! ఎందుకు బాధపడతావు.

నీవు ఈ అడవిలో నిస్సారంగా బతుకుతున్నావని ఎందుకు అనుకుంటున్నావు ? నీవు అనుకున్నట్లు వడ్రంగులు నీ కలపని కేవలం çకొన్ని ఇళ్ళకు మాత్రమే ఉపయోగించగలరు. కానీ, ఇప్పుడు చూడు రెండువందల పక్షి కుటుంబాలు నీ కొమ్మల మీద నివసిస్తున్నాయి. కొన్నివందల జంతువులు నీ నీడలో సేద తీరుతున్నాయి. ఇన్ని వందల మందిని నిరాశ్రయుల్ని చేసి కేవలం కొద్దిమంది కోసం ప్రాణత్యాగం చేయాలను కుంటున్నావు.

నిజానికి నీ చల్లని దయవల్లే మాలాంటి వందల జీవులు హాయిగా బతుకుతున్నాయి. మాలాంటి అల్పజీవులను నీడలేకుండా చేయకు...’’ అని విన్నవించుకుంది. పాలపిట్ట పలుకులు ఆ మహావృక్షం మనస్సును తాకాయి. నిజంగా తాను చేయాలనుకునే పనికంటే చేస్తున్న పనే గొప్పగా కన్పించింది. తన ఆలోచన విరమించుకుంది. తృప్తిగా ఆనందంగా బతకసాగింది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top