పదిలం మా పొదరిల్లు

Story On Coronavirus Lockdown Effect On Family In Sakshi Family

మనం విశ్రాంతి తీసుకోకపోతే ప్రకృతి బలవంతంగా  దానిని కల్పిస్తుంది. ఉరుకుల పరుగుల జీవితం పైపైకి ఎదగాలన్న ఆరాటం ఖండాంతరాలకు  ఎగిరిపోవాలనే ఆకాంక్ష అస్వాదించడం ఎలా?కు బదులుగా గెలవడం ఎలా అని నిరంతం  తపన పడే సమయంలో కరోనా వచ్చి ‘స్లో డౌన్‌’ అని చెప్పింది. ఇల్లు దాటవద్దని చెప్పింది. 21 రోజులు కుటుంబంతో గడపమని నిర్బంధ వరం ప్రసాదించింది. ఇంటిని అందమైన పొదరిల్లుగా  మార్చుకునే అవకాశం  ఇంతకుమించి ఏముంటుంది?

‘నా దగ్గర కూచుని ఎప్పుడైనా నేను చెప్పేది వింటేగా?’ అని భార్య ఫిర్యాదు. ‘డాడీ ఎప్పుడూ మాతో ఆడుకోవడానికి రాడు’ అని పిల్లల పితూరి. ‘ఇంట్లో ఏం జరుగుతోందో వాళ్లు ఏం చేస్తున్నారో కూడా పట్టించుకునే వీలు లేదు’ అని భర్త గిల్ట్‌. ‘వర్క్‌ ప్లేస్‌లో శాటిస్‌ఫ్యాక్షన్‌ ఉందిగాని పిల్లలతో స్పెండ్‌ చేయలేకపోతున్నాను’ అని వర్కింగ్‌ ఉమన్‌ అసంతృప్తి. కొన్ని మనం బతకడానికి చేస్తాం. కొన్ని మన పొరుగువారి పోటీ కోసం చేస్తాం. ఎవరి కోసం చేసినా ఎందుకు చేస్తున్నా ఆ చేసేదానిలో సంతోషం ఉందా అనేది ప్రశ్న.
∙∙ 
‘బాల్కనీలో నాలుగు పూలకుండీలు తెచ్చుకుని పెట్టుకుందామండీ’ అని భార్య అడుగుతూ ఉంటుంది కాని భర్తకు టైమ్‌ ఇవ్వడు. ‘వనస్థలిపురంలోని మా చెల్లెలి ఇంటికి ఒకసారి వెళ్లివద్దాం’ అని భర్త అంటుంటాడుగాని భార్యకు పని తెమలదు. పిల్లలకు నైట్‌డ్రస్సులు కొనాలని ఇద్దరికీ ఉంటుందిగాని ఆ కొనేరోజు ఎప్పటికీ రాదు. గత రెండు మూడేళ్లలో కొన్నబట్టలు ఎన్నో, వాటిలో నిత్యం వేసుకుంటున్న బట్టలు ఎన్నో, లాండ్రీలోనో ఇస్త్రీలోనో వాటిలో మిస్సయిపోయినవి ఎన్నో ఇద్దరికీ గుర్తుండదు. ‘ఆ షర్ట్‌ ఉండాలి కదా’ అని అతనంటే ‘ఆ బ్లౌజ్‌ ఏమైందని’ ఆమె తత్తరపడుతుంది. తెల్లరారుతుంది. బ్రేక్‌ఫాస్ట్‌ అవుతుంది. పిల్లల స్కూళ్లు. ఆఫీసులు. తిరిగి రావడాలు. నిద్రపోవడాలు... ఇవి మాత్రమే ఇల్లా? ఇది ఇల్లు కావచ్చు. కాని పొదరిల్లు మాత్రం కాదు.
∙∙ 
ఇప్పుడు 21 రోజులు సమయం చిక్కింది. ఇది కుటుంబాన్ని ప్రతి ఒక్క ఇంటి సభ్యుడు అర్థం చేసుకోవడానికి వచ్చిన అవకాశం. అసలు భర్త భార్యను తెరిపార చూసి ఎంత కాలం అయి ఉంటుంది? ఆమె సన్నబడిందా? నల్లబడిందా? బరువు పెరిగిందా? కనీసం ఆమెకు డై చేసుకోవడానికి కూడా సమయం చిక్కుతూ ఉందా? ఏదైనా నలతను సమయం లేక దాచిపెడుతోందా? ఆమె ఆఫీస్‌లో ఇబ్బందులేమిటి? పిల్లలతో అవస్థలు ఏమిటి? గృహిణి అయితే గనుక దొరుకుతున్న విశ్రాంతి ఎంత? తనతో ప్రత్యేకంగా ఏదైనా షేర్‌ చేసుకోవాలనుకుంటోందా? ఫ్యామిలీతో కలిసి ఎక్కడికైనా వెళ్లాలనుకుంటోందా? తనలో ఏదైనా మార్పు ఆశిస్తూ ఉందా? తన ధోరణి వల్ల ఎప్పుడైనా గాయపడి ఉందా?

ఇప్పుడు మాట్లాడండి.
ఈ కోరికలను ఇప్పుడు తీర్చే వీలు లేకపోవచ్చు. ఎందుకంటే బయటకు అడుగు పెట్టకూడదు. కాని ఆమెను అర్థం చేసుకోవడానికి ఇది సమయం. ఆ అర్థం చేసుకున్నదానిని ఆ తర్వాత ఆచరణలో పెట్టండి.
ఇదే పని భార్య కూడా చేయాలి. భర్తకు ఆఫీస్‌లో ఉన్న సమస్యలేమిటి? ఇంటి బడ్జెట్‌ గురించి అతని ఆలోచనలు ఏమిటి? స్ట్రెస్‌ ఇచ్చే శతృవులెవరైనా ఉన్నారా? ఇంట దాచిపెట్టిన సమస్యలేవైనా ఉన్నాయా? ఆమెలో అతడు ఆశిస్తున్న మార్పు ఏమిటి? ఆమె మాటల వల్ల ఎప్పుడైనా నొచ్చుకున్నాడా? ఇవన్నీ మాట్లాడుకోవడానికి ఇది అదునైన సమయం. అయితే ఈ సందర్భంలో ఇరుపక్షాల్లో కావాలసింది పాజిటివ్‌ అప్రోచ్‌. అసంతృప్తులను దూరం చేసుకోవాలనే భావన తప్ప తగాదా పెంచుకోవాలన్న పట్టుదల ఉండకూడదు. చైనాలో ఇలాంటి నిర్బంధంలో ఉన్న జంటలు తగూలాడుకొని విడాకులకు వెళ్లిన ఉదంతాలు ఉన్నాయి. బ్యాడ్‌ ఎగ్జాంపుల్‌. మనం గుడ్‌ ఎగ్జాంపుల్‌ కావాలి. ఇంటిని పొదరిల్లుగా మార్చుకోవాలి.
∙∙ 
ఇద్దరు కలిసి ఇప్పుడు చేయాల్సిన పని ముఖ్యంగా పిల్లలపై శ్రద్ధ పెట్టడం. వాళ్లను అర్థం చేసుకోవడం. వాళ్ల గుండె గూటిలో తల్లిదండ్రుల పట్ల ఉన్న ప్రేమను, అభ్యంతరాలను కూడా అర్థం చేసుకోవడం. పిల్లలు తల్లిదండ్రులను క్లోజ్‌గా అబ్జర్వ్‌ చేస్తుంటారు. కాని వారిపై ఉన్న అభ్యంతరాలను చెప్పరు. తల్లిదండ్రుల పరస్పర అనుబంధంలో వారికి స్ట్రెస్‌ ఇస్తున్న అంశాలేమిటో ఇప్పుడు మాట్లాడి తెలుసుకోవాలి. వారు ఏం చదవాలనుకుంటున్నారో ఏం చదువుతున్నారో వారి ఎంపికలో స్వేచ్ఛ ఉందో లేదో ఇపుడు హాయిగా చర్చించుకోవచ్చు. గైడ్‌ చేయవచ్చు. వారి అభిప్రాయాలకు విలువ ఇచ్చి మనం మారవచ్చు. గోడలు ఇంటిని నిర్మిస్తాయి. అనుబంధాలు ఆ ఇంటిని నివాసంగా మారుస్తాయి.
∙∙ 
ఈ 21 రోజులు క్రియేటివ్‌గా ఉండండి. పిల్లలతో కలిసి క్యారమ్స్‌ ఆడండి. చెస్‌ ఆడండి. కంప్యూటర్‌లో గేమ్స్‌ ఆడండి. గ్లోబ్‌లో ఏ దేశం ఎక్కడ ఉందో వెతికి పట్టండి. దేశంలో ఏ ప్రాంతం ఏ మూలనో టప్పున చెప్పే ఆట ఆడండి. పాత ఆల్బమ్స్‌ తీసి అందులో ఉన్న ఘటనలు పిల్లలకు చెప్పండి. ఆ జ్ఞాపకాలను పంచుకోండి. అందులో ఉన్న వ్యక్తులు ఎంత ముఖ్యమైన వారో ఫ్యామిలీ ట్రీ గీసి అర్థం చేయించండి. వారి చేత ఇల్లు సర్దించండి. కాస్త పెద్ద పిల్లలైతే కిచెన్‌ను అర్థం చేయించండి. ఏ పదార్థం ఏ డబ్బాలో ఉంటుందో తెలియచేయండి. పెద్ద పిల్లలైతే వంట పనిలో వారిని ఇన్‌వాల్వ్‌ చేయండి. ఏదైనా మంచి ఫ్యామిలీ మూవీ కలిసి చూడండి. దూరంగా ఉన్న బంధువులతో మాట్లాడించండి. ఈ అవకాశాన్ని ఎంత అర్థవంతం చేసుకోవచ్చో అంత అర్థవంతం చేసుకోండి.
∙∙ 
అదే సమయంలో ఈ కరోనా వైరస్‌ పట్ల కుటుంబం మొత్తం ఎంత జాగ్రత్తగా ఉండాలో పరస్పరం అవగాహన చేసుకోండి. ఎటువంటి సంరక్షణ చర్యలు తీసుకోవాలో చర్చించుకోండి. అందరూ కలిసి చిన్న చిన్న వ్యాయామాలు చేయండి. శరీరాన్ని మనసును ఉత్సాహంగా ఉంచుకోండి. కష్టకాలంలో మన కుటుంబమే మన తోడు. ఈ తోడును మరింత దృఢతరం చేసుకోండి.
 

ఈ 21 రోజులు క్రియేటివ్‌గా ఉండండి. పిల్లలతో కలిసి క్యారమ్స్‌ ఆడండి. చెస్‌ ఆడండి. కంప్యూటర్‌లో గేమ్స్‌ ఆడండి. గ్లోబ్‌లో ఏ దేశం ఎక్కడ ఉందో వెతికి పట్టండి. దేశంలో ఏ ప్రాంతం ఏ మూలనో టప్పున చెప్పే ఆట ఆడండి. పాత ఆల్బమ్స్‌ తీసి అందులో ఉన్న ఘటనలు పిల్లలకు చెప్పండి. ఆ జ్ఞాపకాలను పంచుకోండి. అందులో ఉన్న వ్యక్తులు ఎంత ముఖ్యమైన వారో ఫ్యామిలీ ట్రీ గీసి అర్థం చేయించండి.  – సాక్షి ఫ్యామిలీ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top