కొడుకును దిద్దిన తండ్రి

Story On Ballari Raghava In Sakshi Sahityam

సాహిత్య మరమరాలు

బళ్లారి రాఘవది గొప్ప సమయస్ఫూర్తి. ఒకసారి బళ్లారిలో ధర్మవరం కృష్ణమాచార్యుల గురించి సభ జరిగింది. శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి, విశ్వనాథ సత్యనారాయణ మాట్లాడిన తరువాత ప్రహ్లాద నాటకం ప్రదర్శించారు. రాఘవ కుమారుడు శ్రీనివాస కుమార్‌ ప్రహ్లాదుని పాత్ర పోషించారు. హిరణ్యకశ్యపుడి పాత్ర రాఘవ పోషించారు. తండ్రి హరినామ స్మరణ మానుకోమని చెప్పినా వినని ప్రహ్లాదుడు, ‘కంజాక్షునకు గాని కాయంబు కాయమే/ పవన కుంభిత చర్మ భస్త్రి గాక/ వైకుంఠు బొగడని వక్త్రంబు వక్త్రమే/ ఢమఢమ ధ్వనితోడి ఢక్కగాక...’ అనే పోతన భాగవతంలోని పద్యం చదువుతాడు. అయితే చివరి పంక్తులు మరిచిపోతాడు. రాఘవ సంకేతమిచ్చినా అందుకోలేక పోతాడు. నాటకం తరువాత విశ్వనాథ ‘‘ప్రహ్లాద పాత్రకు ఇంకెవరూ దొరకలేదా? పద్యాలు మరిచిపోయే కుర్రవాణ్ణి పెట్టారేమిటి?’’ అని అడిగారు. రాఘవ ‘‘వాడు మా అబ్బాయే. ఎన్నో నాటకాల్లో బాగానే చేశాడు. ఈరోజు గ్రహచారం బాగాలేదు’’ అంటూనే, ప్రేక్షకులను ఉద్దేశించి, ‘‘మహాశయులారా, పద్యాలు చెప్పి మిమ్మల్ని ముగ్ధుల్ని గావించిన మా శ్రీనివాస్‌ పోతనగారి చివరిపాదం మర్చిపోలేదు. ఆ చివరి పాదం ‘విష్ణుచింత లేని విబుధుండు విబుధుడే/ పాదయుగము తోడి పశువుగాక’ అని ఉంటుంది. తండ్రిని ఏ కుమారుడైనా ద్విపాద పశువు అనగలడా? అందులోనూ గొప్ప తçపస్సంపన్నుడు, దేవేంద్రుని సైతం గడగడలాడించిన ప్రహ్లాదుడు అనగలడా? అందుకే మావాడు ఆ పాదం చెప్పలేదు’’ అని సమర్థించగానే పెద్దలు, ప్రేక్షకులు హర్షధ్వానాలు చేశారట.
చందన రవీంద్ర

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top