దేహం మనదే... దేశం మనదే

Story About Positively Shameless Dramatic Act - Sakshi

చైల్డ్‌ అబ్యూజ్‌

‘ఇప్పుడు ప్రేక్షకులు ఏమి ఆలోచిస్తూండొచ్చు?’ ‘నేరస్తులను తుపాకితో కాల్చి పడేయ్యాలని అనుకుంటున్నారు’ ‘ఇలాంటి వాళ్లను ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో విచారించి ఉరి తీసి పారేయాలని భావిస్తున్నట్టున్నారు’ ‘ఆడవాళ్ల మీద జరుగుతున్న ఈ హింసకు సమాజం బాధ్యత వహించాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించుకుంటున్నారు’

ఇది ‘పాజిటివ్‌లీ షేమ్‌లెస్‌’ అనే నాటకంలోని ఒక సన్నివేశం. ప్రేక్షకులనూ ఈ నాటకంలో భాగస్వామ్యం చేయడానికి నటీమణులు వాళ్లలో వాళ్లే ప్రశ్నలు అడుగుతూ ప్రేక్షకులను సమాధానం వెతుక్కునేలా చేయడం ఇది. బెంగళూరుకు చెందిన శబరి రావు, మైత్రి గోపాలకృష్ణ, శరణ్య అయ్యర్, శిల్పా వాఘ్మేర్, ఏపీ సత్యం అనే అయిదుగురు మహిళలు ఈ నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు. నా శరీరం.. నా సొంతం.. దీనిమీద పూర్తి హక్కు నాదే.. తరుణ్‌తేజ్‌ పాల్‌ కేసులో బాధితురాలు ఈ పాయింట్‌ మీదే పోరాడింది. సాహిత్యంలో చలం, సినిమాల్లో బాలచందర్‌ కూడా దీనిమీదే అవగాహన కలిగించే ప్రయత్నం చేశారు. ‘పాజిటివ్‌లీ షేమ్‌లెస్‌’ కాన్సెప్ట్‌ కూడా అదే. దేశంలో పిల్లలు, మహిళల మీద జరుగుతున్న లైంగిక హింసకు వ్యతిరేకంగా 2016లో ఈ నాటక ప్రదర్శనను మొదలు పెట్టారు ఆ అయిదుగురు యువతులు. ‘నా శరీరాన్ని తిరిగి నా స్వాధీనంలోకి తెచ్చుకునే ప్రయాణం’గా దీన్ని వర్ణిస్తారు ఈ నాటకానికి దర్శకత్వం వహిస్తున్న శబరీ రావు.

ఈ ఐదుగురు నిజ జీవితంలో ‘చైల్డ్‌ అబ్యూజ్‌’కి గురైనవాళ్లే. ఈ నాటకంలో వీరు రంగస్థలం మీదకు వచ్చి ఎవరికివారే చిన్నప్పుడు తాము అనుభవించిన లైంగిక హింసను వర్ణిస్తూ.. వ్యాఖ్యానమూ చేస్తూ నాటకాన్ని అభినయిస్తూంటారు. ‘మన శరీరంతో మనకున్న సంబంధాన్ని చెప్పడమే పాజిటివ్‌లీ షేమ్‌లెస్‌లోని కీలకాంశం. మన మీద దాడి జరిగినప్పుడు ఈ బాడీ హింసకు స్థావరం. దాన్నలాగే వదిలేస్తే మెదడు మనల్ని మొద్దు ్దబారుస్తుంది. ఆ దాష్టీకం నుంచి త్వరగా కోలుకోవాలన్నా.. తిరిగి దాని బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవాలన్నా మన శరీరం మీద మన హక్కును గుర్తించాలి. హింసకు గురైన ఈ దేహాన్ని త్వరగా మన అధీనంలోకి తెచ్చుకోవాలి. అప్పుడే ఆత్మవిశ్వాసం, మనపట్ల మనకు గౌరవం పెరుగుతాయి. మా అనుభవాలను నాటకంగా మలిచి మేం చెప్తున్నది ఇదే. దీన్ని ఒకరకంగా మేమిచ్చే థెరపి అనుకోవచ్చు.. సమాజాన్ని అప్రమత్తం చేసే బాధ్యతగానూ భావించొచ్చు’ అంటారు శబరీ రావు.

ఇప్పటి వరకు ఈ నాటకాన్ని మూడుసార్లు ప్రదర్శించారు. కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ ఉంటారు. ‘ఒకట్రెండు ప్రదర్శనలు పూర్తయ్యాక ఇంక మనం కొత్తగా చెప్పేదేమీ లేదని ఈ జర్నీని ఇంతటితో ముగిస్తే మంచిదని భావించాం మేము. పాత విషయాన్నే పదేపదే చెప్పడంలో అర్థంలేదని మా అభిప్రాయం. కాని ప్రతి ప్రదర్శనతో కొత్త జీవితం పొందినట్టు ఫీలయ్యేవాళ్లం. ప్రదర్శనకు ప్రదర్శనకు మార్పులు చేయడం స్టార్ట్‌ చేశాం. అలా నిర్భయ ఘటనను, ఈ మధ్య జరిగిన దిశ సంఘటననూ ‘పాజిటివ్‌లీ షేమ్‌లెస్‌’ స్క్రిప్ట్‌లో చేర్చుకున్నాం. భూమికలూ మార్చుకోవడం మొదలుపెట్టాం.. కేవలం నటనకు సంబంధించే కాకుండా బ్యాక్‌స్టేజ్‌ బాధ్యతలనూ మార్చుకుంటున్నాం’ అన్నారు శబరీ రావు.

ఇంటర్నేషనల్‌ కమ్యూనిటీ ఆర్ట్స్‌ ఫెస్టివల్‌
ఈ నాటకాన్ని మార్చి 27, 28 తేదీల్లో అమెరికాలోని రోటర్‌ డ్యామ్‌లో జరగబోయే ఇంటర్నేషనల్‌ కమ్యూనిటీ ఆర్ట్స్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శన ఇవ్వాల్సిందిగా వీరికి ఆహ్వానం అందింది. ఆ తర్వాత న్యూయార్క్‌ యూనివర్శిటీ నుంచీ ఇన్విటేషన్‌ వచ్చింది తమ దగ్గరా ‘పాజిటివ్‌లీ షేమ్‌లెస్‌’ ప్లేను పెర్‌ఫార్మ్‌ చేయమని. ప్రస్తుతం ఈ బృందం అమెరికా ప్రదర్శనకు రిహార్సల్స్‌ పూర్తి చేసుకొని ప్రయాణానికి సన్నద్ధం అవుతోంది.

‘పాజిటివ్‌లీ షేమ్‌లెస్‌’ నాటకంలోని దృశ్యాలు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top