శీతాకాలపు కథ

special story on Winter - Sakshi

అనగనగా ఓ అడవి సమీపాన ఉన్న ఒక ఊరిలో ముసలి దంపతులు నివసిస్తూ వుండేవారు. వారి కొడుకు పట్టణంలో ఉద్యోగం చేస్తుండేవాడు. ఆ దంపతులకి ఇద్దరు మునిమనుమలు ఉండేవారు. వారి ఉద్యానవనంలో రకరకాల పూలచెట్లు, పండ్లచెట్లు ఉండేవి. వాళ్లు బోల్డన్ని కోళ్లను పెంచేవారు. ప్రతిరోజూ ఉదయం కోళ్లకు గింజలు వేయడం, తోటపని చేసుకోవడం చేసేవారు. రాత్రుళ్లు కోళ్లను గంపల కిందపెట్టి భద్రంగా కాపాడేవారు. అది వేసవి కాలం. ఓ రోజు పోస్ట్‌మేన్‌ కార్డుముక్క తెచ్చిచ్చాడు. అందులో విషయమేమిటంటే, తన కొడుకు కుటుంబం, మనవలతో కలిసి, త్వరలో ఆ ఊరు వస్తున్నారని. 

మునిమనవలు ప్రతి వేసవి సెలవుల్లో జేజయ్య, జేజమ్మ వద్ద ఆడుకుంటూ, కథలు వింటూ హాయిగా గడిపేవారు. ప్రతిరోజు ముసలయ్య రైల్వేస్టేషన్‌కు వెళ్లి ఎదురు చూసేవాడు. రెండు రోజుల తర్వాత కొడుకు, కోడలు, మునిమనుమలు వచ్చారు. ఎంతో సంతోషించారు ముసలి దంపతులు. రాత్రి అన్నం తిన్న తరువాత కథలు చెప్పమని అడిగేవారు పిల్లలు. బోల్డన్ని రాజుల కథలు, మాయమంత్రాల కథలు, జానపద కథలు చెప్పేవాడు తాతయ్య. ఏదైనా నిజంగా జరిగిన కథ చెప్పమని అడిగారు పిల్లలు. కథ చెప్పడం మొదలుపెట్టాడు తాతయ్య. అది పోయిన సంవత్సరం శీతాకాలం. ఊరంతా మంచు దుప్పటి కప్పుకుని ఉంది. 

ఓ రోజు హఠాత్తుగా ఓ కోడి మాయమైంది. ఎంత వెతికినా దొరకలేదు. తరువాత రోజు మరో కోడి మాయమైంది. ఇలా చాలా కోళ్లు మాయమయ్యాయి. తీరా చూస్తే కోళ్ల గది వెనుక క్రింద భాగంలో ఓ గుంత కనిపించింది. అది ఓ గుంటనక్క పనే అని అర్థమయ్యింది. దానికి గుణపాఠం చెప్పాలనుకున్నాడు తాత. ఇరుగు పొరుగు వారికి గుంటనక్క సంగతి, తమ కోళ్లను కాజేసిన సంగతి చెప్పాడు తాత. వాళ్లు రకరకాల సలహాలు ఇచ్చారు. వాటిలో మొదటి సలహా, ‘తుపాకితో నక్కను వేటాడటం’. కానీ, తాత ముసలివాడు. రాత్రంతా తుపాకి పట్టుకుని గురి చూస్తూ కూర్చోటం సాధ్యం కాదు. ఈ సలహా వల్ల ప్రయోజనం లేదు. రెండవ సలహా, ‘ఓ మేలుజాతి కుక్కను పెంచుకోవటం’. కానీ అది బుజ్జి కోడి పిల్లల్ని తినదన్న భరోసా ఏమీ లేదు. కాబట్టి ఈ సలహా కూడా తాతకి నచ్చలేదు. ఇక మూడవ సలహా, ‘నక్కను బంధించడానికి ఓ మూడు ఉచ్చులను ఏర్పాటు చెయ్యడం’. ఈ సలహా బాగా నచ్చింది తాతకు.     

నక్కను బంధించడానికి ఇరుగుపొరుగు వారి సాయంతో మూడు ఉచ్చులను ఏర్పాటు చేశారు. మొదటి ఉచ్చును కోళ్లగూడు వెనకాల వున్న గుంత వద్ద ఏర్పాటు చేశాడు. రెండవ ఉచ్చును ఇంటి చుట్టూ ఉన్న, తెగిన ముళ్ల కంచె వద్ద ఏర్పాటు చేశాడు. ఇక మూడవది ఇంటి నుండి అడవికి ప్రవేశించే దారి వద్ద ఏర్పాటు చేశాడు. మూడు ఉచ్చులు కనబడకుండా మంచుతో కప్పాడు. రాత్రి చాలాసేపు మేలుకొని వున్నాడు తాత. గుంట నక్కను బంధించాలని, గట్టి పట్టుదలతో వున్నాడు. అర్ధరాత్రి తర్వాత, గట్టి కర్రనొకదాన్ని పట్టుకుని, ఉచ్చులను పరిశీలించడానికి బయలుదేరాడు.

మొదటి ఉచ్చు చూశాడు. ఖాళీగా ఉంది. రెండవ ఉచ్చు చూశాడు. అదీ ఖాళీగా ఉంది. ఇక మూడవ ఉచ్చు వద్దకు వెళ్లాడు. గుంటనక్క ఆ ఉచ్చులో చిక్కుకుని ఉంది. మొదట ఇరుగు పొరుగు వాళ్లను పిలుద్దామనుకున్నాడు తాత. కానీ వెంటనే తన మనసు మార్చుకున్నాడు. ఎలా ఉన్నావు? అడిగాడు తాత.జవాబివ్వలేదు నక్క. ఎందుకు నిశ్శబ్దంగా వున్నావు. నాతో మాట్లాడు. నీకు సిగ్గుగా లేదా? మా కోళ్లను ఏం చేశావు?’’ గట్టిగా అడిగాడు తాత. నక్క మౌనంగా సిగ్గుతో తలవంచుకుంది. నా కళ్లలోకి చూడు’’ అని నక్క కళ్లలోకి సూటిగా చూశాడు తాత. కానీ నక్క తాత కళ్లలోకి సూటిగా చూడలేక తలదించుకుంది. తన దగ్గరున్న దుడ్డుకర్రతో నక్క తల మీద కొడదామనుకున్నాడు. 

కాని తాత దయార్ద్ర హృదయుడు. హఠాత్తుగా ఏం చెయ్యాలో తాతకు అర్థమైంది. తన చలికోటును విప్పి, నక్కకు కప్పాడు. ఉచ్చులో నుంచి దాన్ని జాగ్రత్తగా విడిపించాడు. అది కృతజ్ఞతగా తాత కళ్లలోకి చూసింది. దాని కళ్ల నుండి రెండు కన్నీటి బొట్లు రాలాయి. మెల్లగా అడవిదారి పట్టింది నక్క.‘‘ఇదీ పిల్లలూ.. నా శీతాకాలపు కథ అన్నాడు తాత.మునిమనవళ్లు తాతపై ముద్దుల వర్షం కురిపించారు. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top