దెబ్బ తగిలింది

దెబ్బ తగిలింది - Sakshi


ఎన్ని దెబ్బలు తగిలితే అంత పదును తేలుతుంది ఇనుము!

చేయని తప్పుకు నింద, శిక్ష .. ఇనుము మీద పడే దెబ్బలకంటే బలమైనవి!

ఆ దెబ్బ మనకి తగిలితే ఓర్చుకోగలమేమో కాని... మన గౌరవానికి తగిలితే తిరగబడమా?

ఇక్కడే ఓర్పు, సహనం, సంస్కారం.. కంచెలాగా కాపాడాలి!

లేకపోతే దెబ్బ తగిలిన పిల్లలు దెబ్బతింటారు కూడా!!




‘ఒరేయ్‌.. వాడిని ఎందుకు కొట్టావ్‌రా? తోటిపిల్లలతో ఫ్రెండ్లీగా ఉండలేవా?పొద్దస్తమానం ఎవరితోనో ఒకరితో తగాదా పడుతుంటావ్‌? చేయి చాపు...?’ అసహనం, కోపం కలగలిసిన భావంతో గద్దించాడు భాస్కర్‌ .. పదిహేనేళ్ల సందీప్‌ను. చేయిచాపాడు సందీప్‌. కొట్టడం తప్పని తెలుస్తున్నా.. వాడి మీద వస్తున్న కంప్లయింట్స్‌కు బ్రేక్‌ వేయాలని, తోటి పిల్లల పట్ల వాడు ప్రవర్తిస్తున్న తీరులో మార్పు తేవాలని చెక్క స్కేల్‌తో సందీప్‌ అరచేతి మీద కాస్త గట్టిగానే కొట్టాడు భాస్కర్‌. కొడ్తున్నప్పుడు చేతిని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయలేదు.



కొట్టాక కూడా ఆ మొహంలో బాధ లేదు. ఆశ్చర్యపోయాడు ఆ క్లాస్‌ టీచర్‌ భాస్కర్‌.   లంచ్‌ టైమ్‌లో సందీప్‌ క్లాస్‌మేట్స్‌ను నలుగురైదుగురిని  వాకబు చేశాడు. మిగతా పిల్లలతో వాడు  నిజంగానే  తగాదా పడ్తున్నాడా? లేక కావాలని కంప్లయింట్‌ చేస్తున్నారా అని తెలుసుకోవడానికి.  ‘సరదాగా కామెంట్‌ చేసినా చాలా కోపంగా  రియాక్ట్‌ అవుతున్నాడు సర్‌ సందీప్‌! కొట్టే మాట్లాడుతున్నాడు.వాడితో మాట్లాడాలన్నా భయమేస్తోంది మా అందరికీ!’చెప్పారు క్లాస్‌మేట్స్‌. ఆలోచనలో పడ్డాడు భాస్కర్‌. ‘ఈ రెండు రోజుల్లో సందీప్‌ వాళ్ల నాన్నను పిలిచి మాట్లాడాలి’ అనుకున్నాడు.



రెండు రోజుల తర్వాత..

త్రీ... వన్‌... ఫైవ్‌... సిక్స్‌.. టూ.. ఎయిట్‌.. టెన్‌... ప్లే గ్రౌండ్‌లో క్రికెట్‌ ఆడ్డం కోసం బ్యాటింగ్‌ ఆర్డర్‌ వేసుకుంటున్నారు. సందీప్‌కి «థర్డ్‌ పొజిషన్‌ వచ్చింది. ఆట స్టార్ట్‌ అయింది.  ఫస్ట్‌ బ్యాటింగ్‌కి వచ్చిన టీమ్‌ మెంబర్‌ రెండు రౌండ్లకే అవుటయ్యాడు. తన వంతేనని ఉత్సాహంగా బరిలోకి దిగబోయాడు సందీప్‌. ‘ఒరేయ్‌ నీకెందుకురా తొందర.. నువ్వాగు. నేనెళ్తా.. పిరికోడి కొడుకు పిరికోలాగే ఉండాల్రా.. కూర్చో..’ అంటూ సందీప్‌ను తోసుకుంటూ గ్రౌండ్‌లోకి వెళ్లిపోసాగాడు.  ఫోర్త్‌ పొజిషన్‌ వచ్చిన ప్రభాత్‌. సందీప్‌కి కోపం ముంచుకొచ్చింది. దవడలు, పిడికిలి ఒకేసారి బిగుసుకున్నాయి. తన తర్వాత నంబర్‌ ఉన్నవాడు తనకన్నా ముందుకు పోతున్నాడు అనేదాని కన్నా ‘‘పిరికివాడి కొడుకు పిరికివాడిలాగే ఉండాలి’’ అన్న మాటకు ఉడికిపోయాడు సందీప్‌.



అంతే... ముందుకు వెళ్తున్న ప్రభాత్‌ దగ్గరకు పరుగున వెళ్లి అంతే వడిగా అతని చేతిలోంచి బ్యాట్‌ లాక్కున్నాడు.. ఈ చర్యకు అసంకల్పితంగా.  వెనక్కి తిరిగిన ప్రభాత్‌  తలమీద బ్యాట్‌తో ఒక్క దెబ్బ వేశాడు బలంగా. ‘ఏం జరుగుతోందో అర్థం చేసుకునే లోపే రెండు చేతులతో తలను పట్టుకుంటూ.. ‘అమ్మా...’ అని బాధగా అరిచి నేలమీద పడిపోయాడు ప్రభాత్‌. ఆ కేకకు ఆడుతున్నవాళ్లు, అక్కడున్న వాళ్లు ఒక్క ఉదుటున వీళ్ల దగ్గరకు వచ్చారు. ప్రభాత్‌ తల నుంచి రక్తం కారుతోంది. అంతా అవాక్కయ్యారు. ‘ఇప్పుడు చెప్పరా.. ఎవడు పిరికో’ అన్నాడు ప్రభాత్‌ మీదకు వంగి పళ్లు కొరుకుతూ!



‘ఒరేయ్‌.. ప్రభాత్‌ను కొట్టింది సందీపేరా.. ’ అన్నాడు ఆ గుంపులోంచి ఒకడు. ఆ మాటతో ఈ లోకంలోకి వచ్చినట్టయింది సందీప్‌కి. తమిద్దరి చుట్టూ ఉన్న గుంపును చూశాడు. ఇక్కడ ఉండడం క్షేమం కాదనుకున్నాడో ఏమో.. పారిపోయే ప్రయత్నం చేశాడు. కాని మిగతా వాళ్లు పట్టుకున్నారు. కొందరేమో ప్రభాత్‌ తలకు కర్చీఫ్‌  కట్టి.. వాడి మొహం మీద కాస్త నీళ్లు చల్లి లేపారు. ఈ ఇద్దరినీ ప్రభాత్‌ వాళ్లింటికి పట్టుకెళ్లారు. తల కట్టుతో కొడుకును చూసిన ప్రభాత్‌ వాళ్లమ్మ లబోదిబోమంది. సందీప్‌ను చూపిస్తూ విషయాన్ని వివరించారు వచ్చినవాళ్లు. ‘అయ్యో నా కొడుకును కొట్టి చంపబోయాడ్రో’  వీధంతా వినిపించేలా ఏడుపు మొదలుపెట్టింది ప్రభాత్‌ వాళ్లమ్మ. క్షణాల్లో ఇరుగుపొరుగు జమయ్యారు. పోలీస్‌ల దగ్గరకు తీసుకెళ్లమ్మని సలహా ఇచ్చారు. ఇద్దరినీ స్టేషన్‌కి తీసుకెళ్లారు.



నాన్న వల్లే...

‘ఎందుకు.. వాడి తల పగలకొట్టావ్‌?’ గద్దించాడు ఎస్‌ఐ. సమాధానం చెప్పకుండా ఎస్‌ఐని కళ్లకింది నుంచి చూడసాగాడు. ‘రేయ్‌.. ఆ చూపేంట్రా.. కళ్లు కిందికి దించు’ కోపంగా అన్నాడు ఎస్‌ఐ. ఆ మాటలకు తల పక్కకు తిప్పుకున్నాడు కాని ఎస్‌ఐ చెప్పినట్టు మాత్రం చేయలేదు సందీప్‌. ‘ఎంత పొగర్రా నీకు’ అని సీట్‌ లోంచి లేచాడు ఎస్‌ఐ. ఆయన ఆగ్రహం చూసిన హెడ్‌కానిస్టేబుల్‌ ఎస్‌ఐ పక్కకు వచ్చి ఆయన చెవిలో ఏదో చెప్పాడు. ‘అచ్ఛా... ప్రశాంత్‌ సర్‌ కొడుకువా నువ్వు?’ హెడ్‌ చెప్పిన మాటతో తన హెడ్‌ను సందీప్‌ మీదకు వంచుతూ అన్నాడు ఎస్‌ఐ.



జవాబివ్వలేదు సందీప్‌. ‘అంత మంచి తండ్రి కడుపున నువ్వెట్లా పుట్టావురా..?’ మళ్లీ ఎస్‌ఐ.. సందీప్‌ తండ్రితో తనకున్న పరిచయాన్ని దృష్టిలో పెట్టుకుని. ‘ఎంత మంచి తండ్రి? మా నాన్న మంచితనం అంతబాగా తెలుసేంటి మీకు?’ వెటకారంగా అన్నాడు సందీప్‌.‘ఏయ్‌.. మాటలు తిన్నగా రానియ్‌’ గదమాయించాడు హెడ్‌కానిస్టేబుల్‌. ‘ఆగు... వెంకటేశ్వర్లు’ చైర్‌లో కూర్చుంటూ హెడ్‌ను వారించాడు ఎస్‌ఐ. ‘అసలు మా నాన్నవల్లే ఇదంతా జరిగింది’ ఉక్రోషంతో అన్నాడు సందీప్‌. ‘మీ నాన్న కొట్టమన్నాడా వీడిని?’ ఎస్‌ఐ. ‘మా నాన్న పిరికితనం చూసి వీళ్లంతా నన్ను ఆటపట్టిస్తున్నారు.. ఎగతాళి చేస్తున్నారు. నన్ను ఓ దద్దమ్మలా ట్రీట్‌ చేస్తున్నారు. నా దమ్మేంటో చూపిస్తా.. నేను మా నాన్నలాగా కాదు’ అరిచేశాడు ఏడుస్తూ!



విస్తుపోయాడు ఎస్‌ఐ. ‘ఏంటి సర్‌ వాడితో మెల్లగా మాట్లాడుతున్నారు.. బొక్కలో వేసి తోమండి సర్‌.. కాస్తయితే నా కొడుకు ప్రాణం పోయేది’ అంటూ గోల చేసింది ప్రభాత్‌ వాళ్లమ్మ. ‘ఏం చేయాలో మాకు తెలుసులే అమ్మా’ అని అంటూనే ‘ప్రసాద్‌.. ఈ అబ్బాయిని ముందు హాస్పిటల్‌కి తీసుకెళ్లండి’  ఇంకో కానిస్టేబుల్‌ని పురమాయించాడు. ‘రా.. అమ్మా..’ అంటూ ప్రభాత్‌ను, వాళ్లమ్మను తీసుకెళ్లాడు ప్రసాద్‌.

వాళ్లు అటు వెళ్లగానే ‘వెంకటేశ్వర్లూ.. ప్రశాంత్‌సర్‌కి కాల్‌ చేసి పిలిపించు’ ఆర్డరేశాడు ఎస్‌ఐ.



‘చెయ్యెత్తి ఇంకొకరిని కొట్టడం కాదురా  ధైర్యం అంటే.. ఇంకొకరికి నష్టం జరక్కుండా గుండె మీద చెయ్యి వేసుకొని పక్కకు తప్పుకోవడంరా ధైర్యమంటే’ కొడుకు వీపును తడుతూ చెప్పింది ఆ అమ్మ.



రాత్రి 9 గంటలు..

అప్పుడే భోజనం ముగించుకొని హాల్లోకి వచ్చాడు ప్రశాంత్‌. అప్పటికే తినేసి టీవీలో చానల్స్‌ను తిప్పేస్తున్నాడు సందీప్‌. పోలీస్‌స్టేషన్, పోలీస్‌ కౌన్సెలింగ్‌.. వీటన్నిటి ప్రభావంతో సందీప్‌ తన తండ్రి మీద ఎక్కడ అక్కసు చూపిస్తాడోనని.. ఆదరాబాదరాగా వంటిల్లు సర్దేసి తనూ హాల్లోకి వచ్చింది లీల. భార్య ఆందోళనను గమనించి ప్రశాంత్‌ .. ‘ఏంకాదులే సర్దుకుంటాడు’ అన్నట్టు కళ్లతోనే భరోసా ఇస్తూ సోఫాలో కూర్చున్నాడు. లీల.. సందీప్‌ పక్కన చేరి భుజమ్మీద చేయి వేసింది. దృష్టి టీవీ మీదనుంచి మరల్చకుండానే తల్లి చేతిని తోసేశాడు విసురుగా. లేచి.. సందీప్‌కి ఆ వైపు కూర్చుంది. అయినా, వాడు ఆమె వైపు చూడలేదు.



నెమ్మదిగా వాడి చేతిలోంచి రిమోట్‌ లాక్కుని టీవీ కట్టేసింది. ‘చూడు నాన్న..అ..’ అని ఆమె ఏదో చెప్పబోతుండగానే.. ‘అంతా ఈయన వల్లే జరిగింది, ఈయన వల్లే జరుగుతోంది.. ఈయన పిరికితనంతో నేనూ అందరికీ పిరికివాడిగానే కనిపిస్తున్నా.. పిరికివాడి కొడుకు పిరికివాడిలాగే ఉండాలట.. మీ నాన్న గర్ల్‌ ఫ్రెండ్‌కోసం జాబ్‌ వదిలేసుకున్నాడట కదా..  పక్కవాడు వచ్చి బైక్‌తో డాష్‌ ఇచ్చినా  తప్పు నాదే అంటాడట కదా మీ నాన్న..’ అంటూ ఈ వీధిలో ఫ్రెండ్స్, స్కూల్లో ఫ్రెండ్స్‌ అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారమ్మా.. నేను పిరికి వాడిని కాదు.. నాకు ధైర్యం ఉందని ఒక్కోక్క నా కొడుక్కి ఉతికి చెప్తా’ అంటూ ఏడ్చేశాడు సందీప్‌. నివ్వెర పోయారు తల్లిదండ్రులిద్దరూ! వాడిని కాసేపు అలాగే ఏడ్వనిచ్చారు. ‘మీరు లోపలికి వెళ్లి పడుకోండి’ సంజ్ఞతో చెప్పింది భర్తకు లీల. బరువెక్కిన మనసుతో ఆయన లోపలికి వెళ్లిపోయాడు.



గర్ల్‌ ఫ్రెండ్‌ కాదు..

అప్పుడు కొడుకు తల నిమురుతూ.. ‘సందీప్‌.. నాన్న ఒక అమ్మాయి కోసం ఆ ఉద్యోగంలోంచి ఇంకో ఉద్యోగంలోకి మారాడు నిజమే. కాని ఆ అమ్మాయి తన గర్ల్‌ ఫ్రెండ్‌ కాదు. నువ్వు చిన్నవాడివి.. పెద్ద విషయాలు ఎందుకులే అనుకున్నా.. కాని చెప్పాలి.. అర్థం చేసుకో. నాన్నకు ఇదివరకటి ఆఫీస్‌లో ప్రమోషన్‌ వచ్చింది. అది కిట్టని కొందరు కొన్ని రాజకీయాలు చేసి ఆ అమ్మాయిని నాన్న ఏతో అన్నట్టు ఆ అమ్మాయితోనే చెప్పించారు. ఆ అమ్మాయి కుటుంబ సభ్యులతో కలిసి ఆ గొడవను ఇంటివరకూ తీసుకొచ్చారు. నాన్న కాదు అని సాక్ష్యాలు చూపిస్తే ఆ అమ్మాయి ఉద్యోగం, పరువు, కాపురమూ పాడైపోతుందని తన తప్పు కాకపోయినా.. లేకపోయినా సారీ చెప్పి పక్కకు తప్పుకున్నాడు. నీకు తెలుసో లేదో.. నాన్న ఉద్యోగం రిజైన్‌ చేశాక ఆ అమ్మాయి పశ్చాత్తాపపడి వాళ్లాయనతో ఇంటికొచ్చి సారీ చెప్పి వెళ్లింది.



అది నాన్న పిరికితనం కాదురా.. గొప్పతనం’ అని ఆమె చెప్తుంటే మోకాళ్ల మధ్య తల పెట్టుకొని ఏడుస్తున్న సందీప్‌ ఒక్కసారిగా పైకి లేచి ‘సర్లే.. నా కళ్లముందే .. నేను స్కూటర్‌ మీద వెనక కూర్చున్నప్పుడే మా వెనకాల వాడు వచ్చి మాకు డాష్‌ ఇస్తే.. ట్రాఫిక్‌ పోలీసులకు కూడా వెనకాల వాడిదే తప్పని తెలిసినా ఈయనే ఆ తప్పు తన నెత్తిమీద వేసుకొని వాడిని పంపించేశాడు. ఆ ట్రాఫిక్‌లో మా పక్కనే ఉన్న మా ఫ్రెండ్, వాళ్ల నాన్న మమ్మల్ని చూసి ఒకటే నవ్వడం. వాడు స్కూల్‌కి వెళ్లి అందరితో చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నన్ను ఏడిపిస్తూనే ఉన్నాడు.. ఇదేం గొప్పతనం మరి?’ ఎకసెక్కంతో సందీప్‌.



‘మిమ్మల్ని వెనకాల నుంచి ఢీ కొట్టినవాడు కాలేజ్‌ స్టూడెంట్‌ కదా..?’అడిగింది లీల. ‘అయితే ఏంటి? అందుకే గొడవ పెట్టుకుంటే వాడు గ్యాంగ్‌నేసుకొచ్చి కొడతాడని భయపడ్డాడా?’ మళ్లీ ఎకసెక్కం వాడి గొంతులో. ఈసారి లీలలో సహనం నశించింది. అయినా ఓపికను తెచ్చిపెట్టుకొని ‘కాదు.. పోలీస్‌కేస్‌ పెడితే ఆ కుర్రాడి జీవితం నాశనం అవుతుందని.. తప్పు వాడిది కాదు అని పంపించేశాడు’ ఫుల్‌స్టాప్, కామాల్లేకుండా చెప్పి టీవీ ఆన్‌ చేసింది లీల.. ఇక చెప్పేది ఏమీ లేదన్నట్టుగా.   వాడి దగ్గరా మౌనమే! కొన్ని క్షణాలు గడిచాయి.



ఆమె టీవీలో లీనమైంది.‘ అమ్మా... ’అన్నాడు ఆర్తిగా. ‘ఏంటీ?’ అన్నట్టుగా చూసింది. ‘సారీ.. అమ్మా..’అన్నాడు అదే ఆర్తితో. ‘నాక్కాదు మీ నాన్నకు చెప్పు సారీ!’అంది లీల. ‘చెయ్యెత్తి ఇంకొకరిని కొట్టడం కాదురా  ధైర్యం అంటే.. ఇంకొకరికి నష్టం జరక్కుండా గుండె మీద చెయ్యి వేసుకొని పక్కకు తప్పుకోవడంరా ధైర్యమంటే’ కొడుకు వీపును తడుతూ చెప్పింది ఆ అమ్మ. వాడి కళ్ల నుంచి నీళ్లు జలజలా చెంపలమీదికి కారిపోయాయి.



హింసకు హింస సమాధానం కాదు

ఒక్కొక్కరిదీ ఒక్కో తత్వం.. ఒక్కో వ్యక్తిత్వం. ఎవరమూ ఎవరినీ మార్చలేం. పైన కేస్‌స్టడీలో కూడా తల్లిదండ్రులు పిల్లాడికి అదే విషయం చెప్పాలి. ఇక్కడ పిల్లాడు తండ్రి ప్రవర్తన వల్ల తన చుట్టుపక్కల వాళ్లు, స్కూల్లో స్నేహితులు తనను ఎగతాళి చేయడంతో హింసాత్మకంగా రివెంజ్‌ తీసుకోవాలనుకున్నాడు. తనను హేళన చేయడం అంటే తనను మానసిక హింసకు గురిచేయడమే.  వాళ్లను శారీరకంగా హింసించి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. అలా తన ధైర్యాన్ని ప్రదర్శించాలనుకున్నాడు. ఇది ప్రాక్టికల్‌గా తప్పు. హింసకు హింసే సమాధానమైతే నష్టపోయేది తనే అన్న విషయాన్ని పిల్లాడికి అర్థమయ్యేలా చెప్పాలి. తోటివాడిని కొడితే  పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది సందీపేకాని అవతలివాడు కాదుకదా. ఈ సత్యాన్ని అతనికి అర్థం చేయించాలి.



నిజానికి సందీప్‌ పదిహేనేళ్ల కుర్రాడు. కాబట్టి వాడు పడుతున్న అవస్థను గమనించి అతని తండ్రే వాడికి కౌన్సెలింగ్‌ ఇవ్వచ్చు.  తను ఎలాంటి పరిస్థితుల్లో ఆలా చేయాల్సి వచ్చింది, గొడవలు పడని, పడలేని తన మనస్తత్వాన్ని గురించీ  కొడుకుతో తండ్రి ఓపెన్‌గా మాట్లాడాలి. లేదంటే అతని తల్లి కూడా చెప్పొచ్చు. ‘‘ప్రతి మనిషిలో మంచి, చెడులు ఉంటాయి. వీటికి తల్లిదండ్రులు కూడా అతీతులు కాదు. వ్యక్తిని ఆ మంచిచెడులు రెండిటితో యాక్సెప్ట్‌ చేయాలి. మంచితో ఇన్‌స్పైర్‌ అవ్వాలి. చెడును ఇగ్నోర్‌ చేయాలి’’ అన్న విషయాన్ని తల్లిదండ్రులు చెప్పాలి. ఏ సమస్యనైనా అగ్రెసివ్‌గా రిసాల్వ్‌ చేసుకోవడం ఎప్పటికైనా ప్రమాదమే.. మంచిది కాదు అని స్పష్టంగా కన్వే చేయాలి పిల్లలకు.  

– డాక్టర్‌ పద్మ పాల్వాయి, చైల్డ్‌ సైకియాట్రిస్ట్, రేయిన్‌బో చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌.

–శరాది

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top