టీ సైంటిస్ట్‌!

special story to tea kavitha madhuri - Sakshi

టీ చేయడం కూడా టీ గుటక వేసినంత తేలిక అనుకునేవాళ్లుంటారు. అయితే అందంత ఆషామాషీ కాదంటారు కవితా మాధుర్‌. ప్రపంచంలో అనేక దేశాల్లో పర్యటించారామె. దేశంలో అనేక రాష్ట్రాలను చూశారు. టీ ఆకులను అధ్యయనం చేశారు. టీ చేసే పద్ధతులను కాచి వడపోశారు. ఇదంతా ఎందుకు చేశారంటే... ‘అసలు టీ తాగడం ఎలాగో నేర్పించాలి’ అంటారామె! గతంలో ప్రఖ్యాత ‘యూరోకిడ్స్‌’ విద్యాసంస్థల్లో.. పాఠ్యప్రణాళికలను రూపొందించిన కవితా మాధుర్‌లో నేర్పించాలనే కాంక్ష ఇంకా తీరినట్లు లేదు. ఈ యాభై ఐదేళ్ల వయసులో అందరికీ టీ అంటే ఏమిటో చెప్తున్నారామె! 

కప్పు టీ కి ఇంత చదువా!
పిల్లల చేత అక్షరాలు దిద్దించినంత శ్రద్ధగా నిరంతరం టీ ఆకులను సేకరిస్తుంటారు కవితా మాధుర్‌. అంతే ఓపికగా ఆకుతో టీ చేయడం ఎలాగో తన స్టాఫ్‌కి నేర్పిస్తున్నారు. ముంౖ»ñ లో ఉంటుంది కవిత ప్రధాన కార్యాలయం. ‘టీ ట్రయల్స్‌’ ఆమె కంపెనీ పేరు. ఏ రకం టీకి ఎంత ఆకు వేయాలి? ఎంత సేపు నీటిలో ఆకును మగ్గనివ్వాలి? అల్లం, ఏలకుల వంటి రుచిని పెంచే ఆధరువులు ఎంత మోతాదులో వేయాలి.. ఇలా తన స్టాఫ్‌తో ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాల నోట్స్‌ రాయిస్తారు. ‘కప్పు టీకి ఇంత చదువా!’ అని ఎవరైనా ఆశ్చర్యపోతే.. తన అనుభవాలను పాఠంలా చెప్తారు కవిత. 

తేనీటితో తన్మయ బంధం
‘‘నాకు టీ గురించి అసలైన అవగాహన కలిగింది జపాన్‌లోని ఓ రెస్టారెంట్‌లో. ‘యూరోకిడ్స్‌’తో ఉన్నప్పుడు జపనీస్‌ టీ సెరెమనీకి ఆహ్వానం  వచ్చింది. టీ ప్రిపరేషన్‌ మీద ప్రెజెంటేషన్‌ చూడటం, ఆ టీని చప్పరించడంతో అప్పటి వరకు నాకు టీ మీద ఉన్న అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. రోజూ దైనందిన జీవితంలో ఒక కప్పు తాగి పనిలో పడటం కాదు, టీ తాగడం అనేది మనిషికి ఒక ఎమోషనల్‌ బాండింగ్‌ అనిపించింది. అప్పటి నుంచి తేయాకులో ఉండే ఔషధాల గురించి విస్తృతంగా అధ్యయనం చేశాను. రెండేళ్లపాటు టీ కోసమే ఇండియాలో, విదేశాల్లోనూ పర్యటించాను. 

రుచుల వెనుక రహస్యం
‘‘ఊలాంగ్‌ టీ, డార్జిలింగ్‌ టీ, ఎర్ల్‌గ్రే, అల్లం టీ, ఇలాచీ టీ, వైట్‌ టీ, గ్రీన్‌ టీ, హెర్బల్‌ టీ, పుదీనా టీ, ఫైవ్‌ స్పైస్‌ టీ, మసాలా టీ, లెమన్‌ గ్రాస్‌టీ లను పెట్టడం నేర్చుకున్నాను. ఇందుకోసం పెద్ద పెద్ద టీ హౌస్‌ల నుంచి రోడ్డు పక్కన టీ కొట్టుల వరకు వందల టీలు తాగాను. టీలో కొత్త రుచిని ఫీలయితే ఆ కొత్త రుచికి కారణం ఏంటో అడిగి తెలుసుకునేదాన్ని. ఏ యే కాంబినేషన్‌లతో టీ చేస్తే వాటిలోని ఔషధగుణాలు ఏయే అనారోగ్యాలను తగ్గిస్తాయో అర్థంచేసుకున్నాను. నేను తయారు చేసుకున్న నోట్స్‌ని క్లుప్తంగా నా టీ కేఫ్‌లలో కూడా డిస్‌ప్లే చేస్తున్నాను. బర్మీస్‌ టీ సలాడ్, టీ మార్బుల్‌డ్‌ ఎగ్స్‌ వంటి థాయ్‌లాండ్‌ కాంబినేషన్స్‌తో తాగే టీ తోపాటు తినే టీ కూడా ఉంటుంది. ఇదొక ప్రపంచం. టీ ప్రపంచం. ఇవన్నీ చూస్తే టీ చేయడం ఆర్ట్‌ అనిపిస్తుంది, కానీ ఇది కేవలం ఆర్ట్‌ మాత్రమే కాదు సైన్స్‌తో కూడిన ఆర్ట్‌.

టీ పెట్టడంలో ట్రైనింగ్‌
‘‘ప్రతి టీకి హెల్త్‌ బెనిఫిట్స్‌ మేము డిస్‌ప్లే చేసే బోర్డులో ఉంటాయి. ఇప్పుడు మావి 31 కేఫ్‌లున్నాయి. ఆ నంబర్‌ని మరో రెండేళ్లలో 500కి చేర్చాలి. ఫ్రాంచైసీ ఇవ్వడమంటే మా బ్రాండ్‌ పేరు అమ్మి డబ్బు చేసుకోవడం కాదు. ఆ టీలు ఎలా చేయాలో మా దగ్గర నేర్చుకుని, వాటిని యథాతథంగా చేయగలగడం. అన్ని సెంటర్‌లలోనూ నేను స్వయంగా టీ చేయడం నేర్పించిన ‘తీస్తా’ (టీ తయారు చేయడంలో నిపుణులు)లే ఉన్నారు. వారంతా పాతిక నుంచి ముప్పయ్‌ ఐదేళ్ల లోపు వారే. నేను అధ్యయనం చేసి తయారు చేసిన ఈ విషయపరిజ్ఞానం ఇప్పట్లో అంతరించి పోకూడదు. ఈ ఫస్ట్‌ జనరేషన్‌ పీపుల్‌ మరో యాభై ఏళ్లపాటు సర్వీస్‌ ఇవ్వగలగాలి. అందుకే యువతకు పని గట్టుకుని నేర్పిస్తున్నాను’’ అని  కూర్చోబెట్టి టీ ఇచ్చి మరీ చెప్తారు కవితా మాధుర్‌’’

తేనీటి ఆవిర్ల కూడళ్లు
‘‘ఆరోగ్యకరమైన టీ తాగడం ఎలాగో ప్రతి ఇంటికీ వెళ్లి నేర్పించలేను. క్లాసులు తీసుకోవాలంటే వినడానికి ఎంత మంది వస్తారు? తక్కువ టైమ్‌లో ఎక్కువమందికి చేరాలంటే.. జనం గుమిగూడే ప్రదేశాలే అయి ఉండాలి. పైగా ఇప్పుడంతా మీటింగ్‌ పాయింట్‌లుగా కాఫీ షాప్‌లు, టీ కేఫ్‌లను ఎంచుకుంటున్నారు. అందుకే ‘టీ ట్రయల్స్‌’ పేరుతో నేనూ ఓ కేఫ్‌ పెట్టాను. మొదటి కేఫ్‌ ముంబైలోని థానేలో పెట్టాను. మా కేఫ్‌లలో వంద రకాల టీలు చేస్తాం. నేను దేశాలు తిరిగి నేర్చుకున్న వాటితోపాటు కొత్త కాంబినేషన్‌లతో కొత్త ఫ్లేవర్‌లను కనిపెట్టాను
– కవితామాధుర్, ‘టీ ట్రయల్స్‌’ నిర్వహకురాలు 
– మంజీర

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top