పంటలను కాపాడే పక్షిరాజు

పంటలను కాపాడే పక్షిరాజు


పుణ్య తీర్థం



పచ్చని పొలాలు, చుట్టూ ఎర్రకాలువ జలాశయ నీటి ప్రవాహం, ఆహ్లాదభరితమైన వాతావరణం నడుమ కొలువై ఉన్న గరుత్మంతుడి ఆలయం దర్శించాలంటే పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం చక్రదేవరపల్లి గ్రామం వెళ్లాల్సిందే.  ఏరువాక పనుల ప్రారంభంలో రైతులు ఆ దైవానికి దణ్ణం పెట్టుకుంటారు. ఆ దైవాన్ని మొక్కితే కోరిన కోర్కెలు తీరుతాయని ఇక్కడ ప్రాంత ప్రజల నమ్మకం. ఎక్కడా లేని విధంగా ఈ పల్లెలో ఆయనకు గుడి కట్టి పూజలు చేయడం విశేషం...



గరుత్మంతుడు అంటే తెలియనివారుండరు. హిందూపురాణాల్లో శ్రీ మహావిష్ణువు వాహనంగా గరుత్మంతుడు ప్రసిద్ధి. శ్రీ మహావిష్ణువు ఎక్కడికి వెళ్లాలన్నా గరుత్మంతుడు సిద్ధంగా ఉంటాడు. విష్ణుమూర్తి గరుడారూఢుడై వెళ్లి ఆపన్నులను రక్షిస్తూ ఉంటారని పురాణాల గాథ. విష్ణ్వాలయాల్లో స్వామివారి ఎదురుగా నమస్కరిస్తున్నట్లు గరుత్మంతుడి విగ్రహాలు దర్శనమిస్తుంటాయి. గరుత్మంతుడికి ప్రత్యేకంగా ఆలయాలు వంటివి ఎక్కడా ఉండవు. కానీ గరుత్మంతుడి ఆలయాన్ని చూడాలంటే పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం చక్రదేవరపల్లి రావాల్సిందే. ఈ ఆలయం నిర్మాణంతో ఎక్కడా లేని ఆలయం ఇక్కడ ఉండటంతో ఈ గ్రామం ఒక ప్రత్యేక సంతరించుకుంది.



ఆలయ చరిత్ర

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం చక్రదేవరపల్లిలో ఎర్రకాలువ జలాశయం ఒడ్డున పచ్చనిపొలాల నడుమ గరుత్మంతుడి ఆలయం దర్శనమిస్తుంది. ఎంతో ప్రత్యేకంగా నిలుస్తున్న ఈ ఆలయ చరిత్ర గురించి తెలుసుకోవాలంటే 50 సంవత్సరాలు వెనక్కి వెళ్లాల్సిందే. ఒకప్పుడు ప్రస్తుతం ఎర్రకాలువ జలాశయం ఉన్న ప్రాంతమంతా అటవీప్రాంతాలుగా ఉండేవి. ఈ ప్రాంతంలో భూపతిరాజు కృష్ణంరాజుకు చెందిన పొలాలు ఉండేవి. ఒకనాడు పొలంలో వ్యవసాయ కూలీలు దుక్కి చేస్తున్న సమయంలో నాగలికి ఒక విగ్రహం తగిలింది. ఈ విగ్రహం గరుత్మంతుడి విగ్రహం కావడంతో స్థానికుల సూచన మేరకు భూపతిరాజు కృష్ణంరాజు ఎంతో భక్తిశ్రద్ధలతో తన పొలంలోనే విగ్రహాన్ని ఒక చెట్టుకింద ప్రతిష్టించారు. ఈ విగ్రహం బయల్పడిన సమయానికి ఎర్రకాలువ జలాశయం డ్యామ్‌ నిర్మాణం కాలేదు. కొన్నాళ్లు చెట్టుకింద ఉన్న గరుత్మంతుడిని చక్రదేవరపల్లి ఊరికి రోడ్డు పక్కకు తీసుకొచ్చి గుడినిర్మించి ఆ ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్టించారు. 1994లో భూపతిరాజు కృష్ణంరాజు కుమార్తె, అల్లుడు లక్ష్మి, వెంకటరాజులు ఆలయాన్ని నిర్మించారు. 2003లో ఆలయానికి మండపాన్ని ఏర్పాటు చేశారు. స్వామిని çపూజించి, పొలంలోకి అడుగుపెట్టిన వారికి సర్పభయం ఉండకపోవడంతోపాటు తలపెట్టిన పనులన్నీ శీఘ్రంగా జరుగుతుండంతో ఆలయానికి వచ్చే భక్తులు పెరిగారు.



గరుత్మంతుడికి మొక్కిన తర్వాతే ఏరువాక పనులు

ఈ ప్రాంత రైతులు ఏరువాక (వ్యవసాయ) పనులు ప్రారంభించే ముందు గరుత్మంతుడికి మొక్కుకుని పనులు ప్రారంభిస్తుంటారు. ఒకప్పుడు పశువులకు జబ్బులు చేస్తే స్వామివారికి పూజలు చేయిస్తామని మొక్కుకునేవారని ఈ ప్రాంతౖ రెతులు చెబుతున్నారు. కార్తీకమాసంలో ఈ ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తే అనుకున్న కోర్కెలు నెరవేరుతాయని భక్తులు విశ్వాసం.

                       

ఎలా వెళ్లాలి?

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం చక్రదేవరపల్లిలో కొలువై ఉన్న గరుత్మంతుడి ఆలయానికి వెళ్లాలంటే హైదరాబాద్‌ నుంచి జంగారెడ్డిగూడెం బస్సు ద్వారా చేరుకోవచ్చు. విజయవాడ, ఏలూరు, రాజమండ్రి నుంచి జంగారెడ్డిగూడెం బస్సు సర్వీసులు ఉన్నాయి. రైలు ద్వారా చేరాలనుకునేవారు ఏలూరు రైల్వేస్టేషన్‌ నుంచి జంగారెడ్డిగూడేనికి రావాలి. అక్కడినుంచి జంగారెడ్డిగూడెం నుంచి చక్రదేవరపల్లి గ్రామానికి 6 కిలోమీటర్లు దూరం. ఈ గ్రామానికి వెళ్లడానికి ప్రైవేటు వాహనాలు కూడా ఉన్నాయి.



ఆలయానికి చేరువలో అనేక ఆధ్మాత్మిక, పర్యాటక కేంద్రాలు

చక్రదేవరపల్లిలో ఉన్న గరుత్మంతుడి ఆలయానికి చేరువలో పలు ఆధ్యాత్మిక క్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. చక్రదేవరపల్లి గ్రామానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుర్వాయిగూడెం గ్రామంలో శ్రీమద్ది ఆంజనేయస్వామి వారి ఆలయం ఉంది. అలాగే ఆలయం పక్కనే ఎర్రకాలువ జలాశయంలో బోటింగ్‌ షికారు ఉంది. ప్రకృతి అందాల నడుమ ఈ జలాశయం పర్యాటకులకు ఎంతో ఆహ్లాదాన్ని కల్గిస్తుంది. అలాగే 7 కిలోమీటర్ల దూరంలో జంగారెడ్డిగూడెంలో  కొలువై ఉన్న శ్రీ గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయం ఉంది.

– అచ్యుత రాము సాక్షి, జంగారెడ్డిగూడెం



ఆ గ్రామానికే ఈ  ఆలయం ఒక ప్రత్యేకం

శ్రీ మహావిష్ణువు వాహనంగా పేరున్న గరుత్మంతుడికి ప్రత్యేకంగా ఆలయాలు అంటూ ఎక్కడా ఉండవు. విష్ణ్వాలయాల్లో స్వామి వారు ఎదుట గరుత్మంతుడు నమస్కరిస్తూ మాత్రమే దర్శనమిస్తుంటాడు. చక్రదేవరపల్లిలో  ఈ ఆలయం ఉండటం ఒక ప్రత్యేకతే అని చెప్పాలి

– నల్లూరి రవికుమారాచార్యులు, అర్చకులు  

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top