అతి పెద్ద సంతోషం

Special Story on Happiness Yamijala Jagadish - Sakshi

అదొక ఆస్పత్రి. అందులో ఒకే గదిలో ఇద్దరు రోగులున్నారు. ఇద్దరికీ అంతకుముందు పరిచయం లేదు. ఇద్దరి మధ్య ఓ అడ్డుగోడ. ఒకరి పడక కిటికీ పక్కన. మరొకరి పడక పక్కన కిటికీ కూడా లేదు. నర్సో డాక్టరో వచ్చి మాట్లాడితే తప్ప అతనికి మరో ప్రపంచం లేదు. ఎప్పుడూ అతనికి ఏకాంతమే. కిటికీ పక్కనే ఉన్న రోగికి క్యాన్సర్‌. మరొకరికి ఎముకల జబ్బు. కొన్ని రోజులకు వీరిద్దరూ మిత్రులయ్యారు.ఎముకల జబ్బుతో బాధ పడుతున్న రోగి క్యాన్సర్‌ రోగితో ‘‘నీకైనా కాలక్షేపానికి ఓ కిటికీ ఉంది. నాకు అది కూడా లేదు...’’ అన్నాడు..

కిటికీ పక్కనే ఉన్న రోగి ‘‘దిగులు పడకు... నేను కిటికీ నుంచి చూసేవన్నీ నీకు ఎప్పటికప్పుడు చెప్తాను... సరేనా’’ అంటూ మరుక్షణం నుంచే తాను చూసినవన్నీ చెప్తూ వచ్చాడు.
కిటికీ బయట ఓ పెద్ద కొలనుంది. ఆ కొలను మధ్యలో ఓ చిన్న దీవి. కొలనులో చిన్న చిన్న పడవలు తేలియాడుతున్నాయి. కొలను తీరాన ఓ అందమైన పార్కు ఉంది. అక్కడ ప్రేమికులు తమను మరచిపోయి కథలు చెప్పుకుంటున్నారు.. ఇలా..

అతను చెప్పేవన్నీ ఎముకల జబ్బుతో బాధ పడుతున్న రోగికి కళ్లముందు చూస్తున్నట్లే అనిపించింది.
కిటికీ దగ్గరున్న రోగి మరుసటి రోజు మరికొన్ని విషయాలు చెప్పాడు.
అతని మనసు ఎంతో ఆనందంగా ఉంది.
ఓ రోజు కిటికీ పక్కనున్న రోగి చనిపోతాడు.
దాంతో ఎముకల జబ్బుతో బాధ పడుతున్న వ్యక్తికి మళ్లీ ఒంటరితనం తప్పలేదు. తనను చూడడానికి వచ్చిన నర్సుతో తన పడక కిటికీ పక్కకు మార్పించుకుంటాడు. ఇక తను నేరుగా కిటికీలోంచి అన్నీ చూడవచ్చు అనుకుని కిటికీ లోంచి చూస్తాడు. అక్కడ ఓ పెద్ద గోడ కనిపిస్తుంది. మరేదీ లేదు.

మరి అటువంటప్పుడు చనిపోయిన రోగి చెప్పిన విషయాలన్నీ ఏమిటీ!
మరుసటి రోజు నర్సు రావడంతోనే జరిగినదంతా చెప్పాడు ఆ రోగి.
అతనికి ఇంజక్షన్‌ ఇస్తూ నర్స్‌ చెప్పింది..
మీరు చూసే గోడ కూడా అతను చూసుండడు. ఎందుకంటే క్యాన్సర్‌ తో బాధ పడిన రోగికి చూపు ఎప్పుడో పోయింది అని.
సంతోషంలోనే అతి పెద్ద సంతోషం ఎదుటివారిని సంతోషపెట్టడమే.– యామిజాల జగదీశ్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top