అమాస

Special Story In Funday On 22/12/2019 - Sakshi

అమాస అన్నది అమాసుడి పేరు. అతను నల్లగా ఉన్నందు వల్లనో, అమావాస్య రోజున పుట్టినందు వల్లనో అతనికి ఆ పేరే నిలిచిపోయింది. అమాస అనే పేరు ఎందుకు వచ్చిందని అతని అమ్మ, నాన్న బతికి ఉంటే అడగడానికి వీలుండేది. కానీ అతను పుట్టాకే, నడక వచ్చే వేళకే కన్న తల్లి, పుట్టించిన వాడు రకరకాల కారణాల వల్ల దైవాధీనులయ్యారు. ఇంక అమాస పని ఏమయిందంటే, మారెమ్మగుడి, అమాసుడు ఒకటే అన్నట్టుగా అయిపోయింది. మారెమ్మ గుడి అన్నంత మాత్రాన దిక్కూ దివాణం లేదని అర్థం కాదు. అమాసలాంటి ఎంతోమందికి మారెమ్మ గుడి ఆశ్రయమిస్తూ వచ్చింది. వేసవిలో మరీను. ఎండని భరించలేని జనం జాతరలా ఉంటారక్కడ. అదలా ఉంచి అక్కడ అమాస కాకుండా మరో పాత తలకాయ నివాసమేర్పరచుకుంది. పాత తలకాయ అంటే అతని వేళ్లు చేతులు, అని కాకుండా జుట్టున్నంత మేరా తెల్లగా పండిపోయాయి. అతని దేహమూ జీర్ణించిపోయింది. ఇంతవరకు అతను కూర్చున్న చోటి నుంచి లేవడాన్ని ఎవరూ చూడలేదు.

మారెమ్మ గుళ్లో ఒక మూల, పాతకాలపు నల్లకంబళి ఒక దాన్ని పరచుకుని, దాని మీద కాళ్లు జాపుకునో, పక్క స్తంభాన్నానుకునో, లేదా చేతులు వెనక్కి కట్టుకునో కూర్చునే ఉంటాడు. అతనికి ఇలాంటి మూడు నాలుగు భంగిమలు తప్పించి వేరే ఏదీ ఉన్నట్టు లేదు. అతనలా కూర్చున్నప్పుడల్లా సగం కళ్లు మూసుకుని కూర్చోవడం మొదట్నుంచి ఎలాగో అలవాటయిపోయింది. అలా కాకుండా మరోరకంగా అతనెప్పుడూ కూర్చోడు. అతడినా స్థితిలో చూస్తే దేని గురించో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు అనిపిస్తుంది. ముడతలు పడ్డ అతని మొహం కూడా అతనలా కనబడ్డానికి కారణం కావచ్చు. లేదా ఆ ముడతల మొహానికి నప్పేలాగ మెడ దాకా దిగజారిన ఇంతలావు తెల్లటి మీసమూ కారణం కావచ్చు. మొత్తం మీద అతనేదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టే కనిపిస్తుంది. అక్కడతని పక్కగా అనుకుని మనిషెత్తు వెదురు కర్ర ఎప్పుడూ ఉండనే ఉంటుంది. అతడటూ ఇటూ తిరగవలసి వచ్చినప్పుడల్లా అమాస చేతి ఆసరా ఉండటం వల్ల ఆ వెదురు కర్ర అంతగా వాడబడటం లేదు.

కాని కోడి, గొర్రె, మేక– ఏమన్నా దగ్గరకొస్తే వాటిని అదిలించడానికి అది అప్పుడప్పుడు అవసరం వస్తుంది. ఇన్ని విషయాలూ చెప్పి అతని పేరే చెప్పలేదు. చిన్న వాళ్ల నుంచి పెద్దవాళ్ల దాకా అతన్ని కురియయ్య (కురి=గొర్రె) కురియయ్య అనే పిలుస్తారు. అదేమన్నా అతని అసలు పేరా? ఆ ప్రశ్న మాకూ వద్దు, మీకూ వద్దు. ఈ మాత్రం అందరికీ తెలిసినదే. అతనికి జ్ఞాపకం వచ్చినప్పటి నుంచి అతని తొడలు నడక కోల్పోయే వరకు ఆ ఊరి గౌడుగారి పాకలో గొర్రెల్ని మేపుతూ ఉండేవాడు. ఇప్పుడు కూడా అతనలా సగం కళ్లు మూసుకుని కూర్చున్నప్పుడు వేలితో ఒక్కో గొర్రెనీ లెక్కపెడుతున్నట్లుగా అల్లాడిస్తూ తనలో తనే ఏదో గొణుక్కుంటూ ఉంటాడు. రోజు ఆరేడుసార్లు ఇది తప్పదు. అంతేకాదు, ఏ రోజూ ఈ పద్ధతి తప్పదు. అమాస కురియయ్య ఆశ్రయంలో పెరగసాగాడు. ఇప్పుడతనికి పదేళ్లో పదకొండేళ్లో ఉంటాయి. కురియయ్య ‘అమాసా’ అనగానే ‘ఆ..’ అని బదులు పలకడం అతని పగటి డ్యూటీ అయింది.

ఊరిని చీకటి అలుముకోవడం మొదలెట్టగానే అమాస, కురియయ్య మఠం గంట ఎప్పుడు మోగుతుందా అని ఎదురు చూస్తూ ఉండేవారు. మఠం గంట మోగగానే అమాస కురియయ్య పక్కనున్న కంచం, గ్లాసు తీసుకుని పరిగెత్తేవాడు. అప్పుడు పరిగెత్తడం కనిపించేది కాదు. కళ్లు చించుకుని చూస్తే అతని పరుగు వేగానికి చీకటి అల్లాడుతున్నట్లు తోస్తుంది. అలా వెళ్లిన వాడు ఎప్పుడొచ్చాడన్నదీ తెలియదు. వచ్చిన వాడు ‘అయ్యా’ అనడం చీకటిని చీలుస్తూ వినిపించినప్పుడే తెలిసేది. అప్పుడు గనుక కురియయ్య పడుకునుంటే లేచి కూర్చుంటాడు. అలవాటు చొప్పున ఆ చీకట్లోనే మఠం వాళ్ల సంగటి ముద్ద, చారు తిని తర్వాత అమాస పడుకునేవాడు. ఆపాటికి అలముకున్న చీకటితో పాటు ఊరంతా మాటుమణిగి పడుకున్నా అక్కడక్కడా కుక్కల మొరుగుళ్లు, గుడ్లగూబల ‘గుక్కూ’ ధ్వని వినిపిస్తూనే ఉంటుంది. ముసలతనికి నిద్ర రాకపోవడంతో కళ్లు తెరిచి కంటికానినంత మేరా చూస్తూనే, మెలకువగా ఉన్నంతసేపూ తనలో తనే మాట్లాడుకుంటూ ఉండి ‘అమాసా’ అని రెండుసార్లు పిలిచి బదులు రాక తనూ పడుకునేవాడు.

ఆ చుట్టుపక్కల అన్ని ఊళ్లలో ప్రతి సంవత్సరం వచ్చేలాగే ఈ ఊరిక్కూడా మారెమ్మ పండుగ వస్తుంది. అప్పుడు మాత్రం కురియయ్య తన నివాసాన్ని రెండు వేర్వేరు చోట్లకి మార్చాల్సి ఉంటుంది. అప్పుడు గుడికి దుమ్ము, ధూళి దులిపి, తుడిచి, సున్నం కొట్టి, ఎర్రమట్టి రంగు గీతలు తీర్చి, కళ్లకు నదురుగా కనిపించేలా అలంకరిస్తారు. ఇప్పుడు సున్నం, ఎర్రమన్ను పట్టీలు తీర్చడం పూర్తయి, లేత ఎండలోంచి పట్టీలు మెరుస్తున్నాయి. కురియయ్య చుట్టుపక్కల మాత్రం అలాగే ఉండిపోయి, మిగతా చోట్లంతా సున్నం కొట్టి తెల్లగా మెరుస్తూ ఉండటం వల్ల అక్కడ మరీ నల్లగా కనిపిస్తోంది. అక్కడ మండువాలో చాలామంది అటూ ఇటూ తిరుగుతూ కాగడాలు సిద్ధం చెయ్యడం, రంగు రంగుల కాగితాలు కత్తిరించి ముంగిట్లో అలంకరించడం మొదలైన పనులు చేస్తున్నారు. అక్కడందరూ ఇంచుమించు తెల్లటి కొత్త గుడ్డలు కట్టుకోవడంతో మారెమ్మ గుడి నిండా మొత్తానికి తెలుపు మెరుపుతో నిండిపోయింది. అక్కడున్న బసణ్ణ అన్నతను ఒకడు ఫ్రెంచి మీసం పెంచి, నల్లగా పొట్టిగా ఉన్నాడు.

అతడూ తెల్లగుడ్డలు కట్టుకోవడంతో మరింత నల్లగా మెరుస్తున్నాడు. అతను నోరు తెరవకపోయినా అతని పాచిపట్టిన పళ్లు తెల్లగుడ్డల కారణంగా మెరుస్తూ బయటే ఉన్నాయి. అతని చేతిలో ఒక చీపురు ఉంది. బసణ్ణ దడ దడ అడుగులు వేస్తూ కురియయ్య ఉన్న మూలకి వచ్చి ‘అయ్యా’ అని గట్టిగా అరిచాడు. ఎవరైనా సరే కురియయ్యని రెండుసార్లు పిలిస్తే తప్ప అతను ‘ఆ’ అనేవాడు కాదు గనుక అందరూ మొదటే గట్టిగా అరుస్తూ మాట్లాడేవారు. బసణ్ణ పిలుపుకి కురియయ్య మెల్లగా కళ్లు తెరిచి అతని వైపు చూశాడు. అతను తన ఎదుట తెల్లగా తిరుగుతున్న ఆకారాల్ని చూస్తూనే ఉన్నాడు. అలా చూస్తుంటే అతనికి వెనుకటి జ్ఞాపకాలు కళ్ల ముందు తిరుగుతున్నట్టుగా ఉన్నాయి. మారెమ్మ పండుగ అంటే పులివేషం వెయ్యాలంటే అతనే. అతను వయసులో ఉన్నప్పుడు అతని పులివేషం లేకుండా సంబరమే లేదు. పులివేషం అతని కళ్లెదుట గంతులెయ్యసాగింది. డప్పుల చప్పుడు చెవిలో వినిపించసాగింది. అప్పుడు పెద్ద గౌడుగారు కురియయ్య పులివేషపు ధాటికి మెప్పుదలగా తలూపేవారు. చొక్కాగుడ్డ బహుమతిగా ఇస్తూ ‘‘నువ్వున్నంత కాలం మా ఇంట్లో ఉండు. భోజనం చెయ్యి. బట్టలు కట్టుకో. గొర్రెలు మేపు. అంతే చాలు.’’ అన్నారు.

అతని ముడతల మొహంలోని ప్రతి ముడతా మారెమ్మ గుడి తెల్లరంగు వల్లనో, అక్కడున్న గుంపు కట్టుకున్న తెల్ల గుడ్డల వల్లనో తెల్లగా వెడల్పుగా విచ్చుకోసాగింది. బసణ్ణ మరోసారిగా గట్టిగా ‘అయ్యా’ అన్నాడు. కురియయ్య తలెత్తి అతని వైపు చూశాడు. బసణ్ణ నుంచున్న ఠీవి చూడగానే అతనికి కారణం తెలిసిపోయింది. కురియయ్య కుడిచేత్తో వెదురు కర్ర పట్టుకుని మరో చెయ్యి ఆసరా కోసం పైకి చాపాడు. చాచిన చేతిని బసణ్ణ పట్టుకోగానే దాని మీద భారం మోపి లేచి నుంచుని, వెదురు కర్ర ఆసరాతో మరో మూలకి నడిచి అక్కడ కూర్చున్నాడు. అక్కడున్న కంబళిని బసణ్ణ బాగా దులిపి కురియయ్య కూర్చున్న మూలకి తెచ్చి పరిచాడు. కంబళిని బాగా ఝాడించి దులపడంతో దానిలో పేరుకున్న దుమ్ము, చెత్త అంతా ఎండలోకి ఎగిరి ఈదసాగాయి. కంబళి పరచి ఉన్న ఆ కాస్త మేరా అరచేతి మందం బూడిద రంగులో ఉన్న దుమ్మ, చెత్త– చెదారం నిండి ఉంది. దాని మీద కూడా అప్పుడు లేత ఎండ పడి దానిక్కూడా తెల్లరంగు వేసినట్టుగా ఉంది.

అటు ఆడుకోవడానికి ఎక్కడికో వెళ్లిన అమాస మధ్యాహ్నం తర్వాత మారెమ్మ గుడికి వచ్చాడు. వచ్చి చూస్తే కళ్లు చెదిరేలా ఏమోమో నిండి ఉందక్కడ. పచ్చి సున్నం, ఎర్రమన్ను, నేల అలికిన పేడ వాసన అన్నీ కలిసి ఒకదాని తర్వాత ఒకటి ముక్కుకి ముసురుకుంటూ మారెమ్మ గుడి వాసనే అదోరకంగా ఉంది. కురియయ్య ఈ మూల నుంచి ఆ మూలకి స్థానచలనం చేసి మొదటిలా కూర్చున్నాడు. వసారా మధ్యలో గుండ్రంగా కొందరు గుంపు కూడి దేన్నో నిక్కి నిక్కి చూస్తున్నారు. గుంపులో ఒకడేదో చేస్తున్నాడు. చటుక్కున అమాస అటు వెళ్లి తొంగి చూశాడు. చూస్తే రంగు రంగుల కాగితాల్లో గండభేరుండ కిరీటం మొదలైన అలంకారాలన్నీ చేస్తున్నాడు. అక్కడ చేసినవన్నీ కళ్లకింపుగా ఉన్నాయి. అక్కడ అతను బొమ్మ తయారు చేస్తుంటే చుట్టూ ఉన్న వాళ్లు ‘అలా ఉండాలి, ఇలా ఉండాలి, భేష్‌!’ అంటూ తలో రకంగా మాట్లాడుతున్నారు. వాటిని తృప్తిగా చూశాక అమాస అక్కడి నుంచి ఛెంగున దూకి కురియయ్య పక్కన చేరాడు.

ఎదుటి లోగిట్లో గోడకి ఆనుకున్నట్టుగా ఎరుపు, తెలుపు రంగుల్లో ఉన్న పెద్ద పెద్ద ఛత్ర చామరాలను బయటకు తీసి, ఎండలో వేసి వరుసగా నిలబెట్టారు. వాటి దగ్గరగా మూలన ఆకాశం అంటుతున్నట్టుగా కొబ్బరిచెట్టు తలెత్తి నించుని ఉంది. దాని వైపు కళ్లు తిప్పి అమాస చూపు ఆనినంత మేరా దృష్టి సారించాడు. ఆరేడు గెలల కాయల భారంతో చెట్టు వాలిపోతోంది. చెట్టు మొదట్లోకి చూస్తే అక్కడ దానిక్కూడా సున్నం, ఎర్రమన్ను రాశారు శుభ్రంగా. దాన్ని చూసి అమాస కురియయ్య పక్కకి మరింత దగ్గరగా జరుగుతూ ‘అయ్యా’ అన్నాడు. ‘ఏమిట’న్నట్టు చూశాడు కురియయ్య. ‘‘చూడయ్యా! చూడయ్యా! నీ కొబ్బరిచెట్టుకెవరో సున్నమూ రంగూ పూశారు’’ అన్నాడు. కురియయ్య చూడబోతే కాస్త దూరం కనిపించింది గాని, తర్వాత మసక మసగ్గా అలుక్కుపోయిందంతా అతనిక్కనిపించింది. చేతబడి చేసి ఎవరో శ్మశానంలో కొబ్బరికాయ పూడ్చిపెట్టడం, అది మొలకెత్తి భూమిని చీల్చుకుని రావడం, దాన్ని తెచ్చి ‘తనది’ అంటూ ఒకటుందని అనుకుంటూ మారెమ్మ గుడి మూల నాటడం, అది తన కళ్లెదుటే చిగురించి, పురి విప్పుకుంటూ, మట్టలు వేస్తూ, అవి రాలిన చోట్ల గుర్తులు మిగులుస్తూ, పెరిగి పెరిగి పైపైకి ఎదిగి నుంచుంది.

పండగ రోజు పొద్దెక్కే కొద్దీ పొరుగూళ్ల నుంచి చుట్టాలు, పక్కాలు ఒక్కొక్కరే వచ్చి ఊళ్లో దిగడం ఎక్కువైంది. వచ్చిన వాళ్లు ఆనవాయితీ ప్రకారం మారెమ్మ గుడికి వెళ్లొచ్చి తర్వాత మిగతా పనులు చేసేవారు. కొందరు అక్కడే కూర్చుని అన్నీ మరచిపోయి కబుర్లలో లీనమయ్యేవారు. వాళ్ల వాళ్ల ఊళ్లలో జరిగిన ఎప్పటివో పోట్లాటల గురించి అదెలా జరిగింది, ఎందుకు జరిగింది వివరాలన్నీ లాగి లాగి చర్చించడం మొదలెట్టారు. అప్పుడే బయట జొన్నగడ్డితో మంట చేసి బసణ్ణ డప్పు వేడి చేస్తూ దాని ధ్వని బిగిస్తున్నాడు. అతని చుట్టూ వానరసేనలా పిల్లా జెల్లా మూగి ఉన్నారు. వాళ్లలో అమాస కూడా ఉన్నాడు. బసణ్ణ డప్పు పట్టుకుని ‘‘చడ చడ నకనక’’ అంటూ పుల్లతో కొట్టగానే దాని ధ్వని కంచుమీద కొట్టినట్టుగా ఊళ్లో నాలుగు మూలలకీ వినిపించసాగింది. చుట్టూ ఉన్న కుర్రగుంపు ఊరుకోక గెంతడం మొదలుపెట్టారు. బసణ్ణకి కూడా ఉత్సాహం పొంగి అతనూ డంగుడండు డంగ్‌ డంగుమని పుల్లతో కొడుతూ తానూ గెంతసాగాడు.

అది కుర్రాళ్లకి అడుగులెయ్యడానికి అనువుగా ఉండటంతో బసణ్ణా, కుర్రాళ్లూ డప్పు చప్పుడుకు అనుగుణంగా అడుగులెయ్యసాగారు. అమాసకెవరు నేర్పారో గాని అందరికన్నా బాగా అడుగులేస్తున్నాడు. అందరూ ఆశ్చర్యంతో ‘అరెరె ఎంత బాగా చేస్తున్నాడో కదా’ అని చూడసాగారు. ఆపాటికి చూడ్డానికి ఆడవాళ్లు కూడా వచ్చి చేరారు. బంగారి అమాసుడి మీంచి కళ్లు తిప్పలేకపోయింది. అమాసని చూస్తూ చూస్తూ ఆమె మనసులో అలాంటి బుల్లిబాబు కావాలన్న తీవ్రమైన కోరిక కలిగింది. ఆమెకి పెళ్లయి ఆరేడేళ్లు గడిచినా ఇంతవరకు తల్లి కాలేదు. వాళ్లు వీళ్లు అనే మాటలు భరించలేక ఆ మంటతో నలుగురైదుగురితో సంబంధం పెట్టుకుంది. అయినా ఫలించలేదు. బాబాల దగ్గరకెళ్లడానికి బీదతనం అడ్డొచ్చింది. ఆమె తోటి వాళ్లు ముప్పయ్యేళ్లకే ముసలితనం తెచ్చుకున్నా బంగారి మాత్రం పెళ్లికూతుర్లా అలాగే ఉంది. ఆమెని చూసినవాళ్లు అరక్షణం అయినా ఆశపడేలాంటి లావణ్యం, వయ్యారం ఉందామెలో. అదలా ఉండనిద్దాం. అయినా ఫలితం కనిపించలేదు. కాని అలా కూడా చాలారోజులు జరగలేదు. రాత్రయిందంటే గుడిసె మీద రాళ్లు పడసాగాయి. ఆమె మొగుడు బంగారి వీపు సాపు చేసి తల బాదుకుని, బయట మొహం చూపించలేక లోపల కూర్చున్నాడు. ఆ తర్వాత రాళ్లు పడటం ఆగిపోయి, ఇప్పుడు మర్చిపోయేటంత కాలమైపోయింది. ఆమె కళ్లెదుట అమాస వేసే రకరకాల గంతులు కనిపిస్తున్నాయి.

ఆ సమయంలో ఇద్దరు పెద్దలు బాగా బలిసిన రెండు మేక పిల్లల్ని అక్కడికి లాక్కొచ్చారు. అప్పుడు అక్కడున్న గుంపు రెండుగా చీలింది. కుర్రమూక అటూ ఇటూ సర్దుకున్నారు. మేకలు డప్పుల చప్పుడికి ఎటు పడితే అటు లాగసాగాయి. అప్పుడు మరొక ఇద్దరు కలిసి వాటిని కదలకుండా పట్టుకుని మారెమ్మ గుడి ఎదుట తెచ్చి నిలబెట్టారు. బయట డప్పు జోరుగా మోగుతోంది. మేకలు కదలక మెదలక కళ్లని మాత్రం చుట్టూ తిప్పుతున్నాయి. ఎదుట గుడి తలుపులు తెరిచి ఉండి, లోపల వెండి ప్రతిమ మెరుస్తూ ఉంది. గుడి లోపలి నుంచి అగరువత్తుల పొగ దట్టంగా బయటకు తేలి వస్తోంది. మోకాలి పైకి పంచె కట్టుకున్న ఒకతను తీర్థమూ, చారెడు పూలూ తెచ్చి మేకల ముందు నుంచిని కళ్లు మూసుకుని, పెదవులను కదిలిస్తూ పటపటమని ప్రారంభించాడు. అతని దేహం నల్లగా ఉండి నరాలు పొంగి కనిపిస్తున్నాయి. పటపటమంటుంటే నరాలు పైకి కిందకి పొంగు కుంగుతున్నాయి. తర్వాత అతను పూల దండని రెండు ముక్కలు చేసి మేకల మెడలకి చుట్టాడు.

ఆ తర్వాత విడి పూలను వాటి తలల మీద పెట్టాడు. తీర్థాన్ని వాటి ఒంటి మీద జల్లి, చేతులు జోడించి, ‘‘ఏమైనా తప్పులుంటే కడుపులో దాచుకోవమ్మా, మమ్మల్ని చమించి ఆన ఇవ్వు తల్లీ’’ అన్నాడు. అతని కీచు గొంతు మారెమ్మ గుడిలో ప్రతిధ్వనించింది. దూరంగా గలభా తప్పించి, మారెమ్మ గుడిలో అందరూ ఊపిరి బిగపట్టి నుంచున్నారు. వాళ్లలా నుంచోవడం, మేకలు చుట్టూ కళ్లు తిప్పడం కాసేపు జరిగింది. ఆ తర్వాత మేకలు ఏకబిగిన ఒళ్లు, తల విదిలించడం మొదలుపెట్టాయి. ఆ తర్వాత మేకలను పట్టుకున్న వాళ్లు వాటిని బరబర బయటకు లాక్కెళ్లారు. డప్పు చప్పుడు అక్కడ మొదలవుతున్న గుసగుస చప్పుడును మించి వినిపించసాగింది. అలా బయటకు వెళుతున్న వాళ్లతో కుర్రమూక బయలుదేరింది. వాళ్లలో అమాస ఉన్నాడు. పెద్దవాళ్లు కోప్పడ్డా, వాళ్ల కన్నుగప్పి వెళ్లారు. అలా వెళ్లి పెరట్లోకి చేరుకున్నారు.

అక్కడ బలంగా ఉన్న ఒకతను కత్తిని అవలీలగా పట్టుకుని నుంచున్నాడు. అందరి ధ్యాసా ఒకేవైపు ఉండటంతో దూరంగా ఉన్న కుర్రమూక దగ్గరగా వచ్చి మూగడాన్ని గమనించలేదు. ఇద్దరు మేక వెనక కాళ్లు, ముందు కాళ్లు పట్టుకుని దాని మెడని దిమ్మ మీద పెట్టగానే దాని కోసమే కాచుకున్న కత్తి మనిషి చకమని మెడమీద కత్తితో ఒక దెబ్బవేసి, ‘చ..వ్‌’ అనిపించగానే తల, మొండెం రెండు భాగాలయ్యాయి. తెగి ఒకవైపు పడిన తల తాలూకు నోట్లో ఒకడు నీళ్లు పోశాడు. ఒకటి రెండుసార్లు నోరు పకపకమని మూసుకుంది. అటు మొండెం విలవిల్లాడుతోంది. తల మాత్రం కళ్లు పైకెత్తి బిగుసుకుంది. విలవిల్లాడుతున్న మొండెం నుంచి రక్తం సలసల చిమ్ముతూ తొణతొణమని నేల మీద పడి చుట్టూ రక్తసిక్తమయింది. ఎవరో కుర్రాడొకడు చప్పున పరిగెత్తి మేక మెడకి చుట్టిన రక్తం కారుతున్న పూలదండని తీసుకొచ్చాడు. తెచ్చినవాడు ఊరుకోక దాన్ని అమాస మెళ్లో వేసి ‘గెంతు’ అన్నాడు.

అమాస మెడ చుట్టూ చల్లగా అయి, అతని మెడ నుంచి కూడా రక్తంబొట్లు కారుతున్నట్లవడంతో వాడు బెదిరి అక్కడి నుంచి పారిపోయాడు. ఇంకా కొంతమంది అలాగే పారిపోయారు. పడుకున్నా కూడా ఆ దృశ్యమే అమాస కళ్లముందు మెదులుతోంది. చాలాసార్లు నిద్రలో బెదురుతూ లేచి కూర్చున్నాడు. ఆరోజు రాత్రంతా లైట్లు వెలుగుతున్నాయి. పొరుగూళ్ల వాళ్లు చాలామంది ఇంచు మించు తెల్ల దుప్పట్లు కప్పుకుని మారెమ్మ గుడి నిండా వరుసగా పడుకున్నారు. దాంతో మారెమ్మ గుడి గుడంతా తెల్లని తెలుపుగా కనిపిస్తోంది. ఆవాళ రాత్రి రైల్వే గ్యాంగ్‌మన్‌ సిద్ధప్ప ఓవర్‌గా కడుపునిండా సేవించి వచ్చాడు. అతని తప్పు కాకపోయినా అది ఆ రాత్రి అతన్ని చాలా ఇబ్బంది పెడుతోంది. కళ్లు మూసుకుంటే ప్రళయం కనిపిస్తోంది. అందుకే అతను కళ్లు మూసుకోకుండా అల్లల్లాడుతున్న వీధిలో, చేతిలో కర్ర ఆసరాతో అటూ ఇటూ ఊగుతూ నడుస్తున్నాడు. అలా నడుస్తున్నప్పుడు వెలిగే లైటు స్తంభం కనిపిస్తే రోషం ముంచుకొచ్చింది. దాన్ని ఝాడించి తన్ని కర్రతో కొట్టాడు.

ఆ చప్పుడు చుట్టుపక్కల ప్రదేశాలను వణికించింది. అప్పటికీ తృప్తిచెందక ‘హో హో’ అని అరుస్తూ ఒక కాంట్రాక్టర్నో, రైల్వే బాస్‌నో, వడ్డీకి అప్పులిచ్చే మాదప్పనో అన్నట్టుగా, ‘థూ!, తెల్లగుడ్డలేసుకుని దేశాలు తిరిగి పెద్దవాడివవుతావా? నన్ను చూసి ముక్కు మూసుకుంటావా? మేమంటే దిక్కులేని వాళ్లం. ఎక్కడో అక్కడ వీధిలో పడుంటాం’.. అని తిడుతూనే హఠాత్తుగా ‘వో’ అని గొంతెత్తి ఏడ్చాడు. మళ్లీ జోరుగా మాట్లాడసాగాడు. ‘మీ కారు మా మీదకి వదలకండయ్యా! నా మాటిని నవ్వుతూ చూడండయ్యా! నవ్వరా..! నవ్వు.. నవ్వు.. నీకు నవ్వే కాలం. ఏం చేస్తావు నవ్వక? నవ్వరా కొడకా! పేదోళ్లని ఉద్ధరించే వాడికి నువ్వు. నవ్వుకొడకా! కమ్యూనిసం రావాల, అప్పుడు నీ నవ్వు ఆగాల. అప్పటిదాకా నవ్వుతావ్‌.. నవ్వయ్యో.. నవ్వు’’ అల్లకల్లోలం రేపుతూ అతని మాటలూ నవ్వూ అన్నీ వీధి నిండా నిండిపోయి, ఆ చలి రాత్రిలో చీకట్లో విలవిల్లాడుతున్నాయి. ఆ మాటలు, నవ్వు నిద్రపట్టని అమాసుడిని చెదరగొడుతున్నాయి. ఇలా చాలాసేపు జరిగాక సిద్ధప్ప శరీరం ఎక్కడ పడిందో, ఎలా పడిందో ఏమోగాని అతని మాటలూ నవ్వూ ఆగిపోయాయి.

మరుసటిరోజు వచ్చింది కదా! ఆ రోజు ఊరు ఆవలిస్తూ గడిపింది. ఏ అరుగు మీద చూసినా జనమే. ఇంతకీ ఎంతోమంది ఇంకా నిద్ర లేవలేదు. ఉదా: సిద్ధప్ప. మధ్యాహ్నమవగానే పులివేషాల గుంపు మారెమ్మ గుడి దగ్గరకి వచ్చింది. గౌడుగారి నౌకరు వచ్చి గౌడుగారింటికి కొబ్బరికాయలు కావాలట అన్నాడు. కురియయ్య కోసుకో అనగానే వాడు నిమిషాల మీద చెట్టెక్కి కాయలను దులిపి పట్టుకుపోయాడు. అక్కడ ఇళ్లలో ఆడవాళ్లు లక్షణంగా తలలు దువ్వుకుని, పూలు పెట్టుకుని, బయటకీ లోపలకీ తిరుగుతున్నారు. వయసు కుర్రాళ్లు అప్పుడప్పుడు అమ్మాయిలనేడిపిస్తూ వాళ్లచేత తిట్లు తింటున్నారు.

మారెమ్మ గుళ్లో పులివేషం డప్పుల చప్పుడు అందర్నీ అటువైపు లాగుతోంది. అందరూ వచ్చే పులుల కోసమే కాచుకునున్నారు. ఒక్కసారిగా పులివేషాల వాళ్లున్న తలుపు తెరుచుకుంది. అందరి చూపులూ అటే మళ్లాయి. ఒక పెద్దపులి నిమ్మకాయను నోటితో కరుచుకుని లోపలి నుంచి ఒక్క గెంతుతో బయటకు వచ్చింది. రాగానే జనమంతా బెదిరి పక్కకు జరగడంతో అక్కడ గుండ్రంగా చోటు ఏర్పడింది. ఆ తర్వాత నాలుగైదు పెద్దపులులు, తోడేలు, కొంటె కోణంగి, ఒకటి తర్వాతొకటి బయటకొచ్చాయి. వచ్చిన వాటిలో ఒక పులిపిల్ల కూడా ఉంది. అంతా వచ్చాక వరుసగా నుంచుని దేవుడికి చేతులు జోడించి తీర్థం తీసుకున్నారు. తర్వాత అక్కడ్నుంచే ‘ఆట’ ప్రారంభమైంది. సివంగి అందరికన్నా జోరుగా ఉండి, భేషుగ్గా, అతని వేషం బలే భేషుగ్గా కుదిరింది. మేకపిల్లను అవలీలగా తెగ్గోసిన వాడే వాడు. అతను డప్పుల చప్పుడుకు అనుగుణంగా గెంతులేస్తూ వచ్చాడంటే జనం ఫర్లాంగు దూరం వెనక్కి గెంతేవారు.

పులివేషధారులు వీధిలోకి వచ్చాయంటే ఆడవాళ్లు, పిల్లలు అరుగు దిగకుండానే ప్రాణాలు ఉగ్గబట్టుకుని చూసేవారు. వేషాల వాళ్లు అడుగులేస్తూ వాళ్ల వైపు వచ్చారంటే చాలు ధడక్కన లోపలకెళ్లి తలుపులేసుకునే వాళ్లు. చిన్న పిల్లలు దూరదూరంగా ఉంటూనే పులివేషాలను వెంబడిస్తున్నారు. అలా గెంతులేసుకుంటూ కాపుల వాడకు వచ్చి అక్కడి చావిడి ముందు తమ వేషాన్ని ప్రదర్శించారు. పులివేషం చూడటానికి గౌడుగారు, కరణం మొదలైన వాళ్లంతా చేరారు. వాళ్లంతా పులివేషం వేసి ఆడిన వాళ్లకల్లా తమ స్థాయికి తగ్గట్టు కానుకలిచ్చి శభాష్‌గిరి పుచ్చుకున్నారు. చీకటిపడి ‘ఆట’ ముగిసినా ఊరి వాళ్ల కళ్లలో పులివేషమే. కళ్లు మూసుకున్నా పులివేషమే. ‘ఢంగు ఢంగు ఢంగు’ డప్పుల చప్పుడుతో సహా కనిపిస్తోంది.

గౌడుగారు పడుకున్నా నిద్ర పట్టకపోవడంతో బయటకు వచ్చి పచార్లు ప్రారంభించారు. వాళ్లింటి జీతగాడు మెలకువగానే ఉండటంతో గౌడుగారు బయటకు రాగానే లేచి కూర్చున్నాడు. ఆయన బీడీ నోట్లో పెట్టుకుని పుల్ల గియ్యగానే ఆ వెలుతు ఆ చీకటిలో వాళ్ల మొహం ఎర్రగా కనిపించి ఆరిపోయింది. గౌడుగారు పొగ పీలుస్తూ ఉండిపోయి, తర్వాత జీతగాడి వైపు తిరిగి ‘‘అరే పులిపిల్ల వేషం వేసిన కుర్రాడెవర్రా?’’ అన్నారు. జీతగాడు, ‘‘ఆడేనండి, అమాసుడు’’ అని అన్నాడు. ‘‘అమాసుడంటే?’’ అని మళ్లీ రెట్టించి అడిగారు. ‘‘అదేనండి ఆ కురియయ్యతో పాటు ఓ కుర్రాడు– తల్లీదండ్రీ లేని కుర్రాడు ఉన్నాడు కదా, వాడే’’ అన్నాడు. గౌడుగారు వినగానే ‘‘ఎంత ఆశ్చర్యం’’ అన్నారు. ‘‘అరె, వాడా? అంత పెద్ద కుర్రాడయ్యాడా అప్పుడే?’’ అన్నారు. గౌడుగారి కళ్ల ముందు అమాస పులివేషం వేసుకుని రకరకాలుగా గెంతుతూ కనిపించసాగాడు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top