డ్రాగన్‌ ప్రేమించిన మన డాక్టర్‌

Special Story of Dwarkanath Kotnis - Sakshi

‘ఇన్హువా’ అని పేరు పెట్టండి!’ అని చెప్పాడు అక్కడే ఉన్న పెద్దమనిషి. ఆయన పేరు నీ రోంగ్జెన్‌. చైనాలో ఎవాన్‌ అనేచోట, యుద్ధరంగానికి సమీపంలో అపురూపమైన రీతిలో ఈ నామకరణోత్సవం అనుకోకుండా జరిగింది. ఇవి మూడు అక్షరాలే కావచ్చు. కానీ అందులో  రెండు దేశాల పేర్లు ఉన్నాయి. భవిష్యత్తుకు సంబంధించిన గొప్ప స్వప్నం కూడా ఉంది. ‘ఇన్‌’ అంటే భారత్‌. ‘హువా’ అంటే చైనా. ఆసియా ఖండంలోని ఈ రెండు దిగ్గజాల అనుబంధం ఎంత గాఢంగా ఉండాలని నాటి తరం నాయకులు, ఆ కాలం, ఆనాటి పరిస్థితులు భావించడం జరిగిందో 1942 నాటి ఈ ఘటన  సాక్ష్యం పలుకుతుంది. ఆ స్వప్నం భగ్నమైందని చెప్పడం తొందరపాటు కాదు. కానీ ఇన్హువా వెనుక కథ ఇప్పటికీ ఈ రెండు దేశాలకూ గొప్ప జ్ఞాపకమే. గాయపడిన సైనికుల ప్రాణాల కాపాడేందుకు వైద్యులు కూడా యుద్ధరంగానికి వెళ్లాలి. తుపాకీ పట్టిన సైనికుడి ప్రాణానికి ఎంత ప్రమాదం పొంచి ఉంటుందో, స్టెతస్కోప్‌తో వెళ్లిన వైద్యుడి ప్రాణాలకీ అంతే ముప్పు ఉంటుంది. దీనికి తోడు నరాలు తెగిపోయే ఉత్కంఠ. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాలలో రణరంగంలో నిలబడి సేవలందించిన వైద్యుల జీవితగాథలు, అందులో వారు స్వచ్ఛంగా ఆహ్వానించిన విషాదం చరిత్ర పుటల నుంచి షెల్‌ పేలుళ్లలా వినిపిస్తాయి. 

రణరంగం కాని చోటు భూస్థలమంతా వెతికినా దొరకదు అంటాడు కవి. ఎన్నో యుద్ధాలు జరిగాయి. లక్షల మంది సైనికులు మరణించారు. కొన్ని కోట్లమంది క్షతగాత్రులయ్యారు. కానీ రెండు ప్రపంచ యుద్ధాలలో వైద్యుల త్యాగం గురించి వినిపించిన కథలూ, గాథలూ మరో యుద్ధం విషయంలో వినిపించవు. అంటే అలాంటి గాథలు లేవని కాదు.రెండో ప్రపంచ యుద్ధంతో సమాంతరంగానే ఆసియాలో ఒక భీకర యుద్ధం జరిగింది. అదే రెండో జపాన్‌–చైనా యుద్ధం (జూలై 7, 1937–సెప్టెంబర్‌ 9, 1945). ‘మార్కోపోలో వారథి ఉదంతం’ కారణం కేంద్రంగా మొదట ఆ రెండు దేశాల సైనికుల మధ్య చెలరేగిన వివాదం చినికి చినికి గాలివాన అయినట్టు పెద్ద యుద్ధంగా పరిణమించింది. 1931లో జపాన్‌ జరిపిన మంచూరియా దాడితో మొదలై, చల్లారకుండా కొనసాగుతున్న ఉద్రిక్తతలే ఈ యుద్ధం వెనుక అసలు కారణం. చైనా, బర్మా, భారత్‌ యుద్ధరంగంలో జరిగిన ఈ సమరం రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌ ఓడిపోయిన తరువాత మాత్రమే ముగిసింది. ఈ యుద్ధం సమయంలో చైనా సైనికులకీ, ఆ దేశ పౌరులకీ వైద్య సేవలు అందించిన ఒక వైద్యుడు కూడా కన్నుమూశాడు. ఆ డాక్టర్‌ గారి త్యాగాన్ని ఈ రోజుకీ ‘డ్రాగన్‌’ మనస్ఫూర్తిగా తలుచుకుంటుంది. ఆ వైద్యుడు భారతీయుడు కావడమే విశేషం. పేరు– డాక్టర్‌ ద్వారకానాథ్‌ శాంతారామ్‌ కోట్నీస్‌.  

డాక్టర్‌ కోట్నీస్‌ బొంబాయిలోనే సేథ్‌ జీఎస్‌ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసి, పోస్టు గ్రాడ్యుయేషన్‌లో చేరడానికి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. చాలా విలక్షణమైన వ్యక్తి ఆయన. తను వైద్యుడై ప్రపంచం నలుమూలలకూ వెళ్లి వైద్య సేవలు అందించాలని ఆయన కలలు కనేవారు. అప్పుడే చైనా రిపబ్లిక్‌ మీద జపాన్‌ చక్రవర్తి సేనలు దాడిచేశాయి. ఈ యుద్ధమే రెండో చైనా–జపాన్‌ యుద్ధం. ఆ సమయంలో, నవంబర్‌ 27, 1937న చైనా ఎనిమిదో రూట్‌ సైన్యాల ప్రధాన అధికారి ఝుడెకు ప్రముఖ అమెరికా పత్రికా రచయిత ఆగ్నెస్‌ స్మెడ్లీ ఒక సలహా ఇచ్చారు. జపాన్‌ సేనల దాడిలో విపరీతంగా నష్టపోతున్న చైనా సైన్యాలకు వైద్యసాయం అందించడానికి ఒక బృందాన్ని పంపవలసిందిగా కోరుతూ భారత జాతీయ కాంగ్రెస్‌ నాయకత్వానికి ఒక లేఖరాయమన్నదే ఆగ్నెస్‌ సలహా సారాంశం. అప్పుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షుడు. చైనా సేనలకు వైద్య సేవలందించేందుకు డాక్టర్లు ముందుకు రావాలని ఆయనే జూన్‌ 30, 1938న పత్రికల ద్వారా పిలుపు ఇచ్చారు. అంతేకాదు, ఒక అంబులెన్స్‌ను, 22,000 రూపాయల యుద్ధనిధిని కూడా బోస్‌ పంపించారు.

 అలాగే,  ‘మోడరన్‌ రివ్యూ’లో జపాన్‌ యుద్ధ కండూతిని విమర్శిస్తూ సుభాశ్‌ బోస్‌ ఒక వ్యాసం కూడా రాశారు. జాతీయ కాంగ్రెస్‌లో మరో ప్రముఖుడు జవహర్‌లాల్‌ నెహ్రూ కూడా వైద్య బృందాన్ని పంపించాలని ప్రతిపాదనలు ఇచ్చారు. జూన్‌ 29, 1938న ‘చైనా దినం’గా పాటించింది వలస భారతదేశం. ఆ సంవత్సరం సెప్టెంబర్‌ నాటికి డాక్టర్‌ అటల్‌ (అలహాబాద్‌), డాక్టర్‌ చోల్కర్‌ (నాగ్‌పూర్‌), డాక్టర్‌ కోట్నీస్‌ (షోలాపూర్‌), డాక్టర్‌ బీకే బసు (కలకత్తా), డాక్టర్‌ దేబేశ్‌ ముఖర్జీ (కలకత్తా)లతో కూడిన ఒక వైద్యబృందం చైనా వెళ్లేందుకు ముందుకు వచ్చింది. 
అటు ప్రపంచ యుద్ధం. ఇటు ఆ యుద్ధంలో యుద్ధం వంటి జపాన్‌–చైనా యుద్ధం. అలాంటి సంక్షుభిత సమయంలో దేశమే కాదు, ఇల్లు విడిచి వెళ్లడానికి కూడా ఏ కుటుంబమైనా సరే, ఒప్పుకోవడం సాధ్యం కాదు. పైగా డాక్టర్‌ కోట్నీస్‌ ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టారు (అక్టోబర్‌ 10, 1910). మొత్తం ఇద్దరు అబ్బాయిలు, ఐదుగురు అమ్మాయిలు. కోట్నీస్‌ ఆలోచనను తల్లి మొదటే వ్యతిరేకించారు. పైగా కోట్నీస్‌ అవివాహితుడు. అదొక భయం. చైనా అంటే పట్టుకు ప్రసిద్ధి. అక్కడ నుంచి వచ్చి పట్టుబట్టలు అమ్ముతారు. అంతవరకే తెలుసు, ఆ కుటుంబానికి. ‘నీ చదువు కోసం నాన్న బోలెడు అప్పు చేశారు. ఇప్పుడు అమ్మానాన్నా వృద్ధులు కూడా. వారికి చేదోడువాదోడుగా ఉండాలి!’ అన్నారు, అన్నయ్య మంగేశ్‌. తన నిర్ణయం మారదని చెప్పాక తండ్రి మాత్రం, ‘ద్వారక! నువ్వు వెళ్లడానికే నిశ్చయించుకున్నావన్నమాటే. సరే. నేనొక విషయం మాత్రం చెబుతాను. 

అక్కడ భారతీయులకి తలవంపులు తెచ్చే విధంగా ఉండకు. దేశానికీ, కుటుంబానికీ కూడా మంచి పేరు తీసుకురా!’ అన్నారు. ఐదుగురు డాక్టర్ల బృందం (వీరి నాయకుడు డాక్టర్‌ అటల్‌) సెప్టెంబర్‌ 5, 1938 అర్థరాత్రి పీ అండ్‌ ఓ లైనర్, ఎస్‌ఎస్‌ రాజ్‌పుటానా నౌక మీద చైనాకు బయలుదేరింది. కవయిత్రి, జాతీయ కాంగ్రెస్‌ నాయకురాలు సరోజినీ నాయుడు వారికి వీడ్కోలు పలికారు. మొదట హాంకాంగ్, తరువాత గువాంగ్‌ఝో ఆ బృందం చేరుకుంది. సాక్షాత్తు పీపుల్స్‌ రిపబ్లిక్‌ ప్రథమ ప్రధాని ఝొవొ ఎన్‌లై ఈ బృందానికి స్వాగతం పలికారు. ఇంకా మావో జెడాంగ్, ఝూ డె (సైనికాధిపతి) కూడా స్వాగతం చెప్పారు. ఇలా గాయపడిన సైనికులకు వైద్యం అందించడానికి విదేశాల నుంచి వచ్చిన తొలి బృందం ఇదే.‘‘మీ వయసెంత?’’ కోట్నీస్‌ను అడిగాడు ప్రధాని.‘‘ఇరవైఎనిమిదేళ్లు!’’ చెప్పారు కోట్నీస్‌.‘‘అద్భుతం! మీరు భారత్‌–చైనా మధ్య స్నేహసంబంధాల కోసం చిరకాలం కృషి చేయవచ్చు’’ అన్నారు ప్రధాని, ఆనందంగా. చాంగ్‌కై షేక్‌ నాయకత్వంలోని చైనా రాజధాని చోంగ్‌క్వింగ్‌కు వారంతా వెళ్లారు.ఇదంతా జరిగిన కొద్ది రోజులకే అన్నయ్య దగ్గర నుంచి కోట్నీస్‌కు టెలిగ్రామ్‌. డాక్టర్‌ చోల్కర్‌ పట్టుకొచ్చి ఇచ్చాడు. తండ్రి మరణవార్తను తెచ్చిందది. ‘నాన్న హఠాత్తుగా కన్నుమూశారు.’ దాదాపు పసిపిల్లవాడిలాగే తల్లడిల్లిపోయాడు కోట్నీస్, ఆ టెలిగ్రామ్‌ చదువుకుని.

ఇండియా వెళ్లిరమ్మని మిత్రులంతా గట్టిగా చెప్పారు. అయినా సరే, వెళ్లడానికి కోట్నీస్‌ అంగీకరించలేదు. తండ్రి చెప్పిన మాటే ఆయన గుర్తు చేసుకుని ఉంటారు. చోంగ్‌క్వింగ్‌ నుంచి ఎనాన్‌ అనే చోటికి వెళ్లారు. వీరు వైద్యసేవలు అందించవలసిన అసలు రణక్షేత్రం అక్కడే ఉంది.  గుహలలో నివాసముంటూ తమ సేవలు అందించారు వారంతా.  రెండో చైనా–జపాన్‌ యుద్ధం అంటే 20వ శతాబ్దంలో ఆసియాలో సుదీర్ఘకాలం సాగిన యుద్ధంగా చరిత్ర ప్రసిద్ధం. వైరిపక్షాలు జపాన్, చైనా సైనికులు, వారి సహాయక సిబ్బంది సహా నలభయ్‌ లక్షల మందిని ఈ యుద్ధం బలిగొన్నది. యుద్ధం కంటే యుద్ధానంతరం దృశ్యం ఎప్పుడూ మరింత ఘోరంగా ఉంటుంది. చైనాలోను అదే జరిగింది. యుద్ధం తెచ్చే కరువుతో, రోగాలతో, విధ్వంసంతో  జనం చావడం మొదలయింది. ప్లేగ్‌ సోకింది (వీటితో కోటి నుంచి 2.5 కోట్ల మంది సాధారణ పౌరులు కూడా కన్నుమూశారు). అలాంటిచోట ఆయన యుద్ధభూమిలో ఉండి తన సేవలు అందించారు. ఎనాన్‌లోని ఆ యుద్ధరంగానికి చాలా ప్రాముఖ్యం ఉంది. ఇక్కడ ఎనిమిదో రూట్‌ ఆర్మీ సైనిక పటాలం యుద్ధం చేసింది. దీని నాయకుడు మావో. 

భారత్‌తో బంధం ఆనాడు ఆయన ఎంతో అవసరంగా భావించారు. చరిత్రాత్మకమని అంచనా వేశారు.  భారత్‌కు స్వాతంత్య్రం రావడానికి ఏడేళ్లు ముందే, అంటే 1940లో జవహర్‌లాల్‌కు ఆయన ఒక లేఖ రాశారు. అందులో ‘మన విముక్తి, అంటే భారత ప్రజానీకం విముక్తి, చైనా ప్రజల విముక్తి అంటే– అణచివేతకు గురైనవారి, బడుగుల విముక్తి’ అని వ్యాఖ్యానించారు. రెండు దేశాల మధ్య ఉండవలసిన బాంధవ్యం గురించి ఆనాటి నేతలు కన్న కలలకు అనుగుణంగా కోట్నీస్‌ అక్కడ శ్రమించారు. నిజంగానే ఆయన పడిన శ్రమ అసాధారణమైనది. ఆయన సేవలతో ఉక్కిరిబిక్కిరైన స్థానికులు ఆయనను తమ భాషలో కె దిహియు అని పిలుచుకునేవారు. తరువాత డాక్టర్‌ కోట్నీస్‌ను అక్కడే డాక్టర్‌ నార్మన్‌ బెథూన్‌ అంతర్జాతీయ శాంతి వైద్యశాలకు సంచాలకుడిగా నియమించారు. డాక్టర్‌ బెథూన్‌ కెనడాకు చెందిన సర్జన్‌. ఆయన చైనాకు చేసిన సేవలకు గుర్తుగా ఈ ఆస్పత్రిని నెలకొల్పారు. అక్కడే వైద్యకళాశాలలో డాక్టర్‌ కోట్నీస్‌ పాఠాలు కూడా చెప్పేవారు. ఈ ఆస్పత్రిలోనే గ్యూయో క్వింగ్లాన్‌ నర్సుగా పనిచేసేవారు. డాక్టర్‌ కోట్నీస్‌ ఆమెతో ప్రేమలో పడ్డారు. ఆమెనే వివాహం కూడా చేసుకున్నారు. వారికి ఆగస్ట్‌ 23, 1942న ఒక అబ్బాయి పుట్టాడు. ఈ పసివాడే ‘ఇన్హువా’. 

యుద్ధంలో గాయపడిన 800 మంది సైనికుల ప్రాణాలను ఆయన కాపాడారు. ఒక సందర్భంలో 72 గంటలు అవిశ్రాంతంగా శస్త్రచికిత్సలు చేశారు. ఇలా విశ్రాంతి మాత్రమే కాదు, తగినంత ఆహారం కూడా ఆయనకు ఉండేది కాదు. దీనికి తోడు వాతావరణ పరిస్థితులు కోట్నీస్‌ ఆరోగ్యానికి అనుకూలించలేదు. అదే ఆయనను మూర్చ వ్యాధికి గురి చేసింది. డిసెంబర్‌ 7, 1942న ఆయన గాయపడిన ఐదుగురు సైనికులకు శస్త్ర చికిత్సలు చేశారు. మరునాడు ఆపరేషన్‌ థియేటర్‌లోనే 20 మంది విద్యార్థుల చేత ప్రాక్టికల్స్‌ కూడా చేయించారు. అప్పుడే హెర్నియాతో బాధపడుతున్న ఒక రోగికి ఆపరేషన్‌ చేయవలసి వచ్చింది. అది కొంచెం క్లిష్టంగా మారిపోయింది. టిష్యూస్‌ అంటుకుపోయాయి. ఈ ఆపరేషన్‌లో ఉండగానే ఆయనకు చెమటలు ప్రారంభమయ్యాయి. మూర్ఛ వచ్చేసింది. దీని నుంచి కొద్దిసేపటికి ఆయన కోలుకున్నారు. చిత్రంగా వెంటనే ఆ రోజు ఆస్పత్రిలో జరిగిన కార్యకలాపాలను సమీక్షించే సమావేశంలో కూడా పాల్గొన్నారు కోట్నీస్‌. రాత్రికి తన కుటుంబంతో ఉంటున్న ఇల్లు/ కార్యాలయానికి వచ్చారు. తాను రాస్తున్న ‘సర్జరీ ఇన్‌ డిటైల్‌’ పుస్తకం పని కొంతసేపు చూశారు. 

మూడు మాసాల ఇన్హువా పడుకుని ఉన్నాడు. అప్పుడే తనకు ఇల్లు ఇచ్చిన యజమాని బంధువుకు తాను వైద్యం చేస్తున్న సంగతి గుర్తుకు వచ్చింది. అంత నీరసంలోను అక్కడికి వెళ్లి ఆ రోగిని పరీక్షించి వచ్చారు కోట్నీస్‌. పడుకున్నారే గాని నిశిరేయిలో బాధకు మెలకువ వచ్చింది. భార్యను కొంచెం వేడినీళ్లు అడిగి తాగారు. కొద్దిసేపటికే కాళ్లూ చేతులూ వంకర్లు పోవడం మొదలయింది. మళ్లీ తీవ్ర స్థాయిలో మూర్ఛ వచ్చింది. తాను పనిచేస్తున్న వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ వచ్చి వైద్యం చేశారు. కొద్దిసేపటికే కోలుకున్నారు. కళ్లు తెరిచి కోట్నీస్‌ అన్నమాట, ‘క్షమించండి ప్రిన్సిపాల్‌! అర్థరాత్రి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను.’ మళ్లీ కొద్దిసేపటికి మూర్ఛ బారిన పడ్డారు. ఈసారి చాలా గట్టి వైద్యమే ఆ ప్రిన్సిపాల్‌ చేశారు. లాభం లేకపోయింది. డిసెంబర్‌ 9 వేకువనే కోట్నీస్‌ కన్నుమూశారు. అప్పటికి ఆయన వయసు 32 ఏళ్లు. ఇదంతా తాంగ్‌ కౌంటీలో జరిగింది. ఆ ప్రాంతంలో ఆయనకు తెలియని మనిషి లేరు. అందుకే కోట్నీస్‌ మరణవార్త తెలియగానే జనం వీధులలోకి వచ్చి, సొంత మనిషి చనిపోయిన రీతిలో దుఃఖించారు. సైనిక వాద్యఘోష మధ్య ఎంతో ఘనంగా అంత్యక్రియలు జరిపారు. డిసెంబర్‌ 17న అక్కడే జరిగిన సంస్మరణ సభకి వేలల్లో జనం హాజరై నివాళి ఘటించారు. 

అప్పుడే వినిపించిన కవిత ఇది– 
‘నులివెచ్చని అలల హిందూ మహా సముద్ర తీరం నుంచి/ గడ్డకట్టించే చలి మధ్య నీవు చైనా వచ్చావు ధైర్యంగా/ అదికూడా భవ్యమైన ప్రపంచ భవిష్యత్తు కోసమే వచ్చావు/ నీవు నాలుగు చైనా శీతకాలాలతో పోరాడావు/ ఆ ఆఖరి సుదీర్ఘరాత్రి మాత్రం నీ జీవిత జలపు ఊట ఎండిపోయింది/ ప్రియమైన కామ్రేడ్‌ కోట్నీస్‌/ నీ ప్రతిరూపం ఎప్పటికీ మాతోనే ఉంటుంది/ నీ జ్ఞాపకం మా గుండెలలో పదిలంగా ఉంటుంది’
మావో అన్నమాట కూడా ఉంది. ‘మా సైన్యం ఒక ఆపన్నహస్తాన్ని కోల్పోయింది. మా జాతి ఒక మిత్రుడిని కోల్పోయింది. ఆయన అంతర్జాతీయ స్ఫూర్తిని మనం ఎప్పటికీ స్మరించుకుంటూనే ఉందాం.’

చివరిగా: కోట్నీస్‌ భార్య ఏమైంది? ఆమె మరొక వివాహం చేసుకున్నారు. మరి,  ఇన్హువా ఏమయ్యాడు? అతడు తండ్రి అడుగుజాడలలో వైద్య కళాశాలలో చేరాడు. కానీ 24వ ఏట, 1967లో అకాల మరణం పాలయ్యాడు. కారణం– సరైన వైద్యం అందలేదు. 

ఇన్హువా మరణం ఇండో చైనా బంధం రూపురేఖలను సంకేతించిందేమోననిపిస్తుంది. 
 
రెండు దేశాల మధ్య ఉండవలసిన బాంధవ్యం గురించి ఆనాటి నేతలు కన్న కలలకు అనుగుణంగా కోట్నీస్‌ అక్కడ శ్రమించారు. 
నిజంగానే ఆయన పడిన శ్రమ అసాధారణమైనది. ఆయన సేవలతో ఉక్కిరిబిక్కిరైన స్థానికులు ఆయనను తమ భాషలో కె దిహియు అని పిలుచుకునేవారు.

∙డా. గోపరాజు నారాయణరావు 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top