మురిపెమైన ప్రేమ కానుక

Special Story About Valentine Week - Sakshi

వాలెంటైన్స్‌ డే– ప్రేమికుల దినోత్సవం దగ్గర పడింది. ప్రపంచమంతా ఫిబ్రవరి 7 నుంచి 14 వరకు వాలెంటైన్‌ వీక్‌ జరుపుకుంటోంది. ఫిబ్రవరి 7 రోజ్‌ డే, ఫిబ్రవరి 8 ప్రపోజ్‌ డే, ఫిబ్రవరి 9 చాక్‌లెట్‌ డే, ఫిబ్రవరి 10 టెడ్డీ డే, ఫిబ్రవరి 11 ప్రామిస్‌ డే, ఫిబ్రవరి 12 హగ్‌ డే, ఫిబ్రవరి 13 కిస్‌ డే చివరిగా ఫిబ్రవరి 14న వాలెంటైన్స్‌ డే జరుపుకోనున్నారు. నేడు ‘టెడ్డీ డే’ కనుక ప్రేమికులు టెడ్డీ బేర్‌లను  ఇచ్చి పుచ్చుకుంటారు.

ప్రేమ ఎంత ఉదాత్తభావన అయినా అది నిర్వచనాలకు హద్దులకు నిరిష్టతలకు లొంగేది కాకపోయినా ప్రేమ అనేసరికి అది ప్రధానంగా స్త్రీ, పురుషుల మధ్య సంభవించేదిగా ఎక్కువ మంది భావిస్తారు. స్త్రీ, పురుషుల మధ్య జనించే ప్రేమనే ఈ ప్రపంచం కుతూహలంగా చూస్తుంది. ఆ కథలు వింటుంది. ఆ ప్రేమను కంటుంది. ఆ ప్రేమలో ఆటంకం ఎదురైతే రోదిస్తుంది. భావ ప్రపంచంలో అందరూ ప్రేమికులు ఏకమవ్వాలనే కోరుకుంటారు. చిత్రమేమిటంటే వాస్తవ ప్రపంచంలో ప్రేమకు ఉండేన్ని అడ్డంకులు మరి దేనికీ ఉండవు.

అందరూ దాటి వచ్చే కేంద్రం
ప్రేమకు వయసు లేకపోయినా ప్రేమకు వయసు ఉందనే అందరూ అనుకుంటూ ఉంటారు. ప్రేమకు హక్కుదారులు యుక్తవయసులో ఉన్నవారే అని భావిస్తారు. యుక్తవయసులోకి అబ్బాయి, అమ్మాయి ప్రవేశించగానే వారు ఎక్కడ ప్రేమలో పడతారోనని పెద్దలు ఉలికులికి పడుతుంటారు. కనిపెట్టుకుని ఉంటారు. నిజానికి ఆ పెద్దలందరూ ‘ఆ వయసు’ను దాటి వచ్చినవారే. అప్రమేయంగా ఆ వయసులో ఏదో ఒక ప్రేమలో పడినవారే. అందుకు ఉన్న అడ్డంకులను తలుచుకుని, విఫలమయ్యి, ఒక్కోసారి విజయాలు సాధించి ప్రేమను ఎలాగోలా అనుభవించినవారే. అయినప్పటికీ తమ తర్వాతి తరం ప్రేమ గురించి వారికి గుబులు ఉంటుంది. చిత్రంగా వారసలు ప్రేమే పట్టనట్టు ఉంటే బెంగ కూడా ఉంటుంది. ఇన్ని విరోధమైన భావనలు కల్పించే శక్తి ప్రేమకే కదా ఉంది.

జీవించే క్షణాలు
డబ్బు సంపాదించిన రోజులని, ఉపాధి కోసం కష్టపడిన రోజులని, కుటుంబం కోసం పాటుపడిన రోజులని చాలామంది ‘జీవించే క్షణాలు’గా గుర్తిస్తారో లేదో కాని తాము ప్రేమించిన రోజులని, ప్రేమలో ఉన్న రోజులని మాత్రం ‘జీవించే క్షణాలు’గా గుర్తిస్తారు. దాటి పోయిన ఆ రోజులు వారిలో మధురంగా గూడు కట్టుకుని ఉంటాయి. సఫలమైన, విఫలమైన ఆ ప్రేమ క్షణాలను ఏ మనిషీ మర్చిపోడు. స్త్రీలు బహుశా వాటిని ఎన్నటికీ బయటపెట్టే సాంఘిక పరిస్థితులు మనకు లేవు. పురుషులు తమ ప్రయివేటు సందర్భాలలో సాటి మిత్రులకు వాటిని పంచుకుంటారు. కాని ప్రతి ఒక్కరూ వాటిని ఏదో ఒక సందర్భంలో తప్పక తలుచుకుంటారు. ఆ డబా ఇల్లు, కొమ్మలు దించిన కొబ్బరి చెట్లు, చల్లగాలి, పక్కింటి వసారాలో బట్టలు ఆరేస్తూ ఆ అమ్మాయి, ట్యూషన్‌కు పుస్తకాలను గుండెలకు ఆన్చుకుని వెళ్లే ఆ అమ్మాయి, రెండు జడల కాటుక కనుల ఆ అమ్మాయి, కళ్లెత్తి మూగగా చూసి మరేం మాట్లాడలేని ఆ అమ్మా యి... అంటూ ఎన్నో జ్ఞాపకాలు. రింగుల రింగుల జుట్టు ఆ అబ్బాయి, పూల చొక్కా ఫుల్‌హ్యాండ్స్‌ అబ్బాయి, నవ్వితే బిక్కచచ్చి బెంబేలెత్తిపోయే ఆ అబ్బాయి... ఇలా అమ్మాయిలు లిస్ట్‌ చదువుతారు.

అమాయక కానుకలు
కానుక లేనిదే ప్రేమ లేదు. ఓ.హెన్రీ రాసిన ఒక ప్రఖ్యాత కథలో ప్రేమికుడు తన వాచీ అమ్మి ప్రియురాలికి దువ్వెనలు కొంటాడు. ప్రియురాలు తన జుట్టు అమ్మి ప్రియుడి వాచికి బంగారు చెయిన్‌ కొంటుంది. ఆ కానుకలు వారికి ఉపయోగపడవు. కాని ఆ ప్రేమ వారి ప్రేమను మరింత పెంచింది. గులాబి పూలు, రిబ్బన్లు, గాజులు, ఉంగరాలు, దండలు, వాచీలు, పెన్నులు, యాష్‌ ట్రేలు ప్రేమికుల మధ్య నడిచే కానుకలు. ఇప్పుడు ఈ కొత్త యుగంలో టెడ్డీ బేర్లు ఇచ్చి పుచ్చుకోవడం ఒక ప్రేమ కానుకగా చలామణిలో ఉంది.

టెడ్డీ బేర్‌
వాలెంటైన్స్‌ డే సందర్భంగా ప్రేమికులు టెడ్డీ బేర్‌లు ఇచ్చిపుచ్చుకుంటారు. టెడ్డీ బేర్‌లు ప్రేమకు, స్నేహానికి, అమలినత్వానికి, ఎదుగుదలకు చిహ్నం. ఎదిగే వయసులో ఉండే ప్రేమికులు తమ ప్రేమ మరింత ఎదగాలని టెడ్డీ బేర్‌లను ఇచ్చి పుచ్చుకుంటారు. 1910ల నాటి నుంచి అమెరికాలో, జర్మనీలో ఒకేసారి తయారవుతూ వచ్చిన ఈ స్టఫ్డ్‌ బేర్‌లు నాటి అమెరికా ప్రెసిడెంట్‌ రూజ్‌వెల్ట్‌ ముద్దు పేరు ‘టెడ్డీ’ మీదుగా టెడ్డీ బేర్‌లు అయ్యాయి. వేటకు వెళ్లిన రూజ్‌వెల్ట్‌ బంధించిన ఒక ఎలుగును చంప నిరాకరించినందుకు ఆయనకు ‘టెడ్డీ’ అనే ముద్దు పేరు వచ్చింది. టెడ్డీ బేర్‌ కాలక్రమంలో పిల్లలు ఇష్టపడే ముఖ్యమైన ఆట బొమ్మగా మారింది. ఇంట్లో ఒక తప్పనిసరి అలంకరణగా కూడా మారింది.

ప్రేమకు సీజన్‌ లేదు
ప్రేమకు సంవత్సరంలో 365 రోజులూ సీజనే. ప్రేమలో ఉన్నవారికీ ప్రతి క్షణమూ ఉత్సవమే. కాని దేశాలకు, సంస్కృతులకు, మతాలకు పర్వదినాలు ఉన్నట్టుగా ప్రేమికులకు కూడా ఒక పర్వదినం ‘వేలెంటైన్స్‌ డే’. అది వారి రోజు. వారు ఈ ప్రపంచాన్ని ప్రేమమయం చేసే రోజు. గాఢంగా ప్రేమ ప్రదర్శించే రోజు.  ఈ ప్రేమను ఓడించడానికి ఎప్పటికప్పుడు ఎందరో ప్రయత్నిస్తూనే ఉన్నారు. కాని వారంతా గతించి ప్రేమ మాత్రం పదేపదే పునరుజ్జీవనం అవుతూనే ఉంటుంది. మనిషి ఉన్నంతకాలం ఉద్భవిస్తూనే ఉంటుంది. ఈ వాలెంటైన్‌ వీక్‌ సందర్భంగా ప్రపంచమంతా వినిపించే నినాదాలు ఇవే: ప్రేమా జిందాబాద్‌... ప్రేమికులూ వర్థిల్లాలి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top