చివరి నీడ

Special Story - Sakshi

సందెవేళకు చల్లపరెడ్డి భోంచేసి ఇంట్లోంచి బయటకు వచ్చేసరికి అరుగుమీద కూర్చున్న రామదాసు  ఏం మావా. ఏంటి కబుర్లు?’’ అని పలకరించాడు. చల్లపరెడ్డి వీథివాకిలి దాటుకుని బయటికి వచ్చి పొడవాటి చేతికర్ర అరుగుకు ఆనించి కూర్చుంటూ ‘‘ఏందీ ఎప్పుడూ రాక? అన్నాడు. రామదాసు వాళ్లు ఉండేది చల్లపరెడ్డి ఇంటికి రెండిళ్లకవతలే. వాళ్లది రేపో మాపో కూలిపోబోయే పెంకుటిల్లు. అందులో ఉండే ముసలమ్మ దాసుకు అమ్మమ్మ అవుతుంది. చల్లపరెడ్డికి దాసుని  చిన్నప్పటినుంచి చూసిన చనువు. అతడి వయసులో దాసుకి సగం ఉండవచ్చు.దాసు ఎక్కువగా ఊళ్లో ఉండడు.  ఎక్కడికి వెళ్తాడో ఎప్పుడు వస్తాడో తెలియదు. ఊరిజనానికి అతడు గాలోడు. తల్లి చిన్నప్పుడే చనిపోయింది. రెండోపెళ్లి చేసుకున్న  తండ్రి పట్నంలో ఎక్కడో ఉండి ఎప్పటికీరాడు. అతడు హరికథలూ చెప్పగలడు, నాటకాలూ వేయగలడు. ఒకసారి ఊరివారెవరో అతడిని బైరాగి వేషంలో  రైల్లో చూసామని చెప్పారు. ‘అది నేను గాదులే’ అంటాడుగాని అతడిది తిరుగుబోతు జీవితమే. అందిస్తే ఫస్టుక్లాసు మందు గ్లాసు దించడు. అప్పుడేకాసిన నాటుసారా అటిచ్చి ఇటుమల్లేకల్లా ఆఖరుచేస్తాడు. 

దాసు ఎవరినీ పట్టించుకోనట్టు ఉంటాడు. ఎవరన్నా లెక్కలేదు. ఊళ్లోవున్నంతకాలం జులాయిగా తిరిగాడు. అతడి అమ్మమ్మ  నానాబాధలు పడేది. ఎలక్షన్ల కొట్లాటలు జరిగి టౌనుకు పారిపోయాడు.  అక్కడే కిరాణా కొట్టలో, టళ్లలో పనిచేసాడు.  గంటలతరబడి ఒకేచోట కూర్చునే సెక్యూరిటీగార్డు ఉద్యోగం నుంచి క్షణం నిలవనీవయని లారీలమీద క్లీనరుగా దేశమంతా తిరిగాడు. వయసొచ్చినా పెళ్లిచేసుకోకుండా ముదురుగా ఉండిపోయాడు. ఇప్పుడు యాడుంటన్నా? అనడిగాడు రామదాసుని  చల్లపరెడ్డి.యాడుండేదేంది మావా. మనం యాడుండం. యాడుంటే ఆడే. ఎప్పుడి పని అప్పుడే. మొన్నే కలకత్తా లోడుకు పోయోచ్చినా. మల్లా చెన్నై  ఎళ్లాలి. తిరిగినసోటు తిరగాలంటే యిసుగొత్తాఉందనుకో’’‘‘ఇంకెన్నాళ్లు తిరగతావురా. ముసల్దానికి ఒళ్లొంగటంలేదు. ఎంతకాలమని కష్టపెడతా. ఊళ్లోనే ఏదోఒగటి సూసుకుని ఇంటికాడుండద్దా?’’ చల్లపరెడ్డి పంచెలో మడిచిపెట్టిన పొగాకు కాడలు బయటికి తీసాడు.రామదాసు మాట్లాడకుండా సైకిలుమీద  పోతున్న మనిషిని ఎవరా అని చూస్తూ ఉన్నాడు.

 సైకిలుమీద పోయే మనిషి ఆగకుండా ఏం దాసో.. ’’ అనుకుంటూ వెళ్లిపోయాడు. రోడ్డుమీద గొడ్లమంద ఊళ్లోకి పోతూ ఉంది. ముల్లుగర్ర పుచ్చుకున్న మనిషొకడు హె..హె..’’ అనుకుంటూ వాటి వెనకే కాళ్లీడ్చుకుంటూ పోతున్నాడు. గొడ్లచావిళ్లలోనూ, ఇళ్లముందర తిరిగే కోళ్లు గంపలకిందికి చేరుకుని చాలాసేపయింది.  దాసు ఊర్నుంచి వచ్చినప్పుడల్లా చల్లపరెడ్డికి కనపడకుండా పోడు. ఉన్న రెండురోజులూ సాయంకాలం చీకటిపడ్డాక ఇద్దరూ ఆ చల్లటి అరుగుమీద కూర్చుని ముచ్చట్లు చెప్పుకుంటారు. దాసు దేశంలో జరిగే విశేషాలు చెబుతా ఉంటాడు. ఒరిస్సాలో మనుషులు ఎలా ఉంటారో, కలకత్తాలో ఏంతింటారో, ఇక్కడనుంచి ఏమేమి లారీలలో అస్సాముకు సరఫరా అవుతుంటాయో, లారీలో వెళ్లేటప్పుడు హైవే మీద కనిపించే వింతలు విశేషాలు పొద్దుబోయేదాకా ఆ  గోడనానుకుని కూర్చుని మాట్లాడుతూనే ఉంటాడు.  

కాసేపు వాళ్లిద్దరి సంభాషణ గ్రామరాజకీయాలనుంచి దేశరాజకీయాలదాక పోయి తరవాత ఆ ఏడు పంటల దిగుబడి గురించి, మోతుబరి బ్రహ్మయ్య గారి పొలాల గురించి, నానాటికీ తరిగిపోతున్న గుళ్లకమ్మ నీటి మట్టం గురించి, సుబ్బరామయ్యగారి అమ్మాయి పెళ్లిలో వంటల గురించి నడిచింది.  ఉన్నట్టుండి రామదాసు చూపు దూరానికి సారించి యీర్రాగవులుగారి సావిట్లో లైటు ఎలగట్లేదేవిటి మావా?అన్నాడు. చీకట్లో బూడిదరంగులో మసగ్గా కనిపిస్తున్న మట్టిరోడ్డుకవతల కనుచూపుమేరలో దూరదూరంగా ఉన్న ఇళ్లలో గుడ్డిదీపాలు మిణుకుమంటున్నాయి.  కాలవకట్టకి కాస్త దూరంలో  తుమ్మచెట్ల గుబుర్ల మధ్య రాఘవులుగారింట్లో చీకటి ముసురుకుని ఉంది. నీకు తెలవదా దాసూ.. యీర్రాగవులుపోయి ఆర్నెల్లయిపోయినే! చల్లపరెడ్డి పంచ పైకిలాగి కుడితొడ మీద పొగాకు గుండ్రంగా చుడుతున్నాడు.అవునా !రామదాసు తన చూపును వీరరాఘవులు ఇంటికి, అటునుంచి ఆపైన చీకట్లోకి సారించాడు.  ఆపైన ఆకాశంలో నక్షత్రాలు మిణుక్కుమంటున్నాయి.చల్లపరెడ్డి అదేమీ గమనించకుండా చుట్టిన పొగాకు చుట్టను నోట్లో పెట్టుకుంటూ ఇంకా ఏదో చెప్పుకుపోతున్నాడు. రామదాసు చూపు ఇంకా వీరరాఘవులుగారింటి చీకట్లోనే ఉంది.

 మరి  యీర్రాగవులు గారు పోతే నారాయనమ్మగారు ఏమయ్యారు?చీకట్లో చుట్ట వెలిగింది. ఎర్రటి నిప్పు చివర తెల్లటి పొగ గుప్పుమంది. చల్లపరెడ్డి అగ్గిపుల్ల పారేస్తూ చెప్పాడు. ‘‘నారాయనమ్మగారు ఇప్పుడు కూతురు దగ్గరికు  ఎల్లి్లపోయింది. ఎప్పుడన్నా వాళ్ల అల్లుడొచ్చి కౌలు యవారాలు  సూసుకునెల్తున్నాడు.’’  ఓళ్లిద్దర్ని సిన్నప్పటినుండి  సూస్తండా మావా. ఈర్రాగవులుగారికి చాన్నాళ్లకిందట పచ్చాతం వచ్చిళ్లా. నా సిన్నతనాన్నుంచి, నాకు తెలిసినకాడ్నించి ఆయన మంచం మీదనే ఉండినే. నారాయనమ్మగారు పొద్దిన్నే లేసి ఆ ముసలోన్ని మంచంమీద కూర్చోపెట్టేది. మళ్లీ పొద్దుగూకి సీకటి పడినాక మంచం మీద పడుకునేదాక ఆయన ఆ పంచలోనే మంచంమీదనో లేక కుర్చీలోనో ఉండేవాడు.నారాయనమ్మగారు పొద్దున్నుంచి రాత్రి పొణుకునేదాక వాకిట్లోనుంచి ఇంట్లోకి, ఇంట్లోంచి వాకట్లోకి గిరగిరా తిరగతానే ఉండేది.

దాసు చెబుతూవుంటే చల్లపరెడ్డి కొంతసేపు ఆ పరిసరాల్లో సంచరించాడు. వీరరాఘవులు బతికుండగా తను వాళ్ల ఇంటికి వెళ్లిన రోజులు గుర్తుకువచ్చాయి.ఒకే ఊర్లో ఉన్నా చల్లపరెడ్డికి వీరరాఘవులుతో ప్రత్యేకమైన స్నేహం, దగ్గరతనం ఏమీలేదు. వీరరాఘవులుకూడా చల్లపరెడ్డిలాగే పక్షవాతం రాకముందు వ్యవసాయం చేసాడు. వయసుడిగి శరీరం సహకరించక చల్లపరెడ్డి ఇప్పుడు భూమి కౌలుకిచ్చి ఇంటిదగ్గరే ఉంటున్నాడుకానీ వ్యవసాయం చేసేటప్పుడు ఈ చివర్నుంచి ఆ చివరికి ఊరంతా తిరిగేవాడు. ఇద్దరూ వ్యవసాయదారులైనా ఎవరి పని వారిది. ఎవరి దారి వారిది. ఎప్పుడన్నా ఎదురొస్తే పలకరించడం, అంతే. వీరరాఘవులుకు కాలుచేయి పడిపోయాక అదీలేదు. 

ఎప్పుడన్నా వాళ్లింటిముందునుంచి వెళ్లినప్పుడు ఇంటికి వెళ్లి పలకరించేవాడు. వాకిలికి ఒకపక్క వేసిన బంతిచెట్లు, పేడతో అలికి ఉండే నేల. ఇంటినానుకుని కర్రలతో వేసిన  పందిరి పైకి పాకిన చిక్కుడుపాదు.. అంతా ఇప్పటికీ కళ్లకు కట్టినట్టు ఉంది.‘నిజమే దాసు చెప్పినట్లు  యీర్రాగవులు కుర్చీలో కూర్చుని కూర్చుని ఆయన కూర్చున్నంతమేర చెక్కంతా అరిగి పోయుండేది. ఆయన పొణుకునే మంచం గుంతపడి నేలని తాకతా ఉండేది చల్లపరెడ్డికి లీలగా పరిచయమున్న ఆ పరిసరాలన్నీ అక్కడ తిరుగుతున్నట్టే అనిపించసాగింది. రాఘవులుగారికి పడిపోయిన ఎడమచేయి పనిచేసేది కాదు. గుప్పిట మూసినట్లు చేతివేళ్లు ఎప్పుడూ ముడుచుకుని ఉండేవి.

వరండాలోనే ఎప్పుడూ టీవీ మోగుతూ ఉండేది. నారాయణమ్మగారు పనిలో ఉన్నంతసేపూ రాఘవులుగారికి టీవీనే కాలక్షేపం.  చూడటానికి వచ్చినవారు ఆయనకు ఎదురుగా వేసిన బల్లమీదనే కూర్చునేవారు. ఒక్కోసారి వచ్చినవారే రాఘవులుగార్ని మంచంమీదనుంచి లేపి కుర్చీలో కూర్చోపెట్లేవారు.కొన్ని సంవత్సరాలపాటు ఆ చెక్క కుర్చీ, దానికెదురుగా ఉండే వెడల్పాటి బల్ల అలానే ఉండేవి. ఎటూ కదలలేదు.ఎవరు పలకరించినా రాఘవులుగారు ఎఎఎఏఏ.. అని ఏదో చెప్పబోయేవాడుగాని ఎదుటివారికి ఏమీ అర్థమయ్యేదిగాదు. నారాయణమ్మగారు మధ్యలో కల్పించుకుని ఆయన ఏం చెబుతున్నాడో విడమర్చి చెప్పాల్సి వచ్చేది. 

అట్టాంటిది సివరికి ఓ నడిరేత్రి ఆయమ్మి  సేతుల్లోనే ఆయన  పేనమిడిసాడు’’ చల్లపరెడ్డి నిట్టూర్చాడు.‘‘ఆయన పోయాక కొన్నాళ్లు ఒక్కతే ఉండి చివరికి కూతురుకాడికి పోయింది. ఆయమ్మి ఒక్కతే ఉన్నన్లాళ్లూ ఆ ఇంట్లో ఎట్టుండిందో  ఎవురికీ తెలవదు.’’ఆ మాట వినగానే రామదాసు ఉలిక్కిపడి చల్లపరెడ్డికేసి చూసాడు. గోడమీద అతడి నీడ పొడవుగా ముందుకు సాగింది.  దాసు తనవంక అలా ఎందుకు చూసాడో చల్లపరెడ్డికి తెలియలేదు. చీకట్లో అతడి ఆకారం తెలియని జంతువు దగ్గరగా వచ్చి కళ్లలోకి కళ్లుపెట్టి చూసినట్లయింది. చల్లపరెడ్డి పక్కకి తిరిగి ఆ మొహంలోకి చూడలేదు. ‘‘ఒగపారి ఆళ్లింట్లో ఇనపబీరువా జరపాల్సి ఒస్తే ఆమె నన్ను పిలిసింది మావా!. పనయ్యాక తినడానికి ఏదోపెట్టబోతే మంచినీళ్లు సాల్లే అని తాగి వచ్చేసా. అప్పుడే నేను రాగవులుగారిని దగ్గర్నుండి సూట్టం!’’ అన్నాడు రామదాసు. ఎవరో పక్కనుంచి తనని చూస్తున్నారని చల్లపరెడ్డి అనుకుంటున్నా, అటుతిరిగి చీకట్లోకి చూస్తూ రామదాసు ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. 

ఇంగొగపారి  యీర్రాగవులుగార్ని నేనే మంచంమీంచి లేపి కూర్చీలో కూర్చోబెట్టా. పెద్దబరువుమనిషేంగాదు..చివరికి చల్లపరెడ్డి రామదాసు వంక తేరిపార చూసి చుట్టని గచ్చుమీద రుద్ది ఆర్పేసి చేతికర్ర అందుకున్నాడు.  రామదాసు చీకట్లోకి చూస్తున్నాడు. అతడి కళ్లు ఎక్కడో ఉన్నాయి. చల్లపరెడ్డి ఒక్కసారిగా నిట్టూర్చి లేచి నుంచున్నాడు. బరువైన తన శరీరాన్ని బలహీనమైన కాళ్లమీద ఉంచి, చేతికర్ర చేతిలోకి తీసుకుని పదడుగులు నడిచి కాలవదగ్గర గుబురుచెట్ల దగ్గర నుంచున్నాడు. చెట్లల్లో ఏదో కదిలింది. అరిటాకులో వెతుక్కుంటున్న కుక్క. హెయ్‌ అని అదిలించాడు. అది తత్తరపడి పొదల్లోకి పారిపోయింది.రామదాసు మాసిపోయిన లుంగీ దులుపుకుని మోకాళ్లదాకా పైకి మడిచి ఎక్కడికో బయల్దేరాడు. ‘‘పొద్దుగూగాక యాడికిరోయ్‌’’ అని దూరంనుంచే గదిమాడు చల్లపరెడ్డి.‘‘అడిదాకేలే..ఊరికే సెంటరుదాకా ఎల్లోత్తా’’ అన్నాడు రామదాసు వెనక్కి తిరిగి చూడకుండా.‘‘ఇయ్యాలప్పుడు సెంటరులో కిళ్లీబొంకులుండవురా’’ అని అవతలినుంచి సమాధానం కోసం చూడకుండా వాకిట్లోకి అడుగుపెట్టాడు చల్లపరెడ్డి. 

అతడి భార్య  ముసలమ్మ వసారాలో చాపమీద పడుకుని ఉంది. వాకిట్లో పొద్దున వేసిన ముగ్గుమీద నవారు మంచమేసుంది. గళ్లదుప్పటి, ఎత్తుదిండు కింద మంచినీళ్ల చెంబు.చేతికర్ర మంచానికానించి పక్కలో కూర్చున్నాడు చల్లపరెడ్డి. ‘‘ఎంతసేపయ్యా కబుర్లు. నిద్దర్రావట్లా..?’’ అన్నది ముసలమ్మ ఒక పట్టాన నిద్రపోదు. కోడి నిద్ర. ‘‘దాసోస్తే మాట్టాడతా కుర్చున్నాలేయే’’ అన్నాడు పక్కకి ఒత్తిగిల్లి. ముసలమ్మ లేచి కూర్చుని మంచినీళ్లు తాగి మళ్లీ పక్కమీదికి ఒత్తిగిల్లింది. వసారాలో  మాసిన గోడపైన బెడ్‌లైటు వాళ్లిద్దర్ని దిగులుగా చూస్తుంది. వాళ్దిద్దరికీ ఒకపట్టాన నిద్రపట్టదు. చీమ చిటుక్కుమన్నా ఎవరో ఒకరికి మెలకువ వస్తుంది. ఎవరు లేచినా అవతలి వారిని అదిలిస్తారు. వేసవి కాబట్టి చుట్టుపక్కల అందరూ ఆరుబైటే పడుకున్నారు. అన్నాలవేళ దాటి చాలాసేపయింది కాబట్టి అందరూ నిద్రలోకి వెళ్లిపోయారు. 

ఒంటికి చల్లటిగాలి తగులుతున్నా చల్లపరెడ్డికి నిద్రరావట్లేదు. కాళ్లూచేతులు బారచాపి వెల్లకిలా పడుకున్నాడు. అతడు బెదరగొట్టిన వీథికుక్క మళ్లీ ఎప్పుడు వెనక్కి వచ్చిందో ఇంటిముందు ముడుక్కుని పడుకుంది. రెండిళ్లకు అవతల ఉన్న తుంగచెరువులో కప్పలు చీకట్లో ఊరికే ఎందుకో బెకబెకమని బందగానం చేస్తున్నాయి. పెరట్లో  కూరగాయల పందిరి దుంగలమీద ముడుచుకుని కూర్చున్న కోళ్లు చిన్న అలికిడైనా ఉలిక్కిపడి కళ్లు తెరిచి చూస్తున్నాయి. కాసేపు ఊరికే అటూ ఇటూ మెసిలి చివరికి చల్లపరెడ్డి మంచం మీద మళ్లీ లేచికూర్చున్నాడు. నీళ్లచెంబు మంచం కిందనే ఉంది. యియ్యనా?అన్నది ముసలమ్మ కదలకుండా పడుకునే.వద్దులే.. నే తీసుకుంటాలే’’ అని కర్ర ఆసరాగా లేచి నుంచుని వాకిలి గుమ్మం బయటికి వచ్చాడు. ఇంటిముందు కూర్చున్న వీథికుక్క తలెత్తి చూసింది. పందిరిమీద కూర్చున్న కోళ్లగుంపులో కదలిక వచ్చింది. హుయ్‌ అని కుక్కని గట్టిగా అదిలించాడు. 

అది లేచి తుర్రుమని చీకట్లోకి పారిపోయింది.రోడ్డుమీద నడిచే మనుషులెవరూ లేరు. రోడ్డవతల కాలవెంబడి నిటారు తాటిచెట్లు చీకట్లో  దిగాలుగా చూస్తూ నుంచున్నాయి. చల్లపరెడ్డిది భారీ శరీరం. బానకడుపు. నడిచేటప్పుడు కుడికాలు ముందుకేస్తే శరీరం కుడివైపు వంగుతుంది. ఎడమ పాదం మోపినపుడు ఎడమవైపు ఒరుగుతుంది. అతడు వేగంగా నడవలేడు. రెండుకాళ్లమీద ఎక్కువసేపు శరీరభారం మోపలేడు. నీళ్లకుంటదాకా భారంగా నడిచి రోడ్డు అంచునే నుంచుని లుంగీ పైకెత్తాడు. సుయ్యిమనే శబ్దానికి కప్పల బెకబెకల కచేరి కాసేపు ఆగిపోయింది. కాసేపు అలానే నుంచున్నాడు. తుంగచెరువుకవతల నలుపురంగులోకి మారిన ముదురాకుపచ్చ మొక్కజొన్న చేను. ఆ పైన ఆకాశంలో మబ్బులు నల్లటి పర్వతాలను చుట్టుముడుతున్నాయి. ఆకాశం తుఫానులో చిక్కుకున్న దీవిలా ఉంది. అక్కడక్కడా చుక్కలు నల్లటి మబ్బులమధ్య దారితప్పిన దీపాల్లా వెలవెలబోతా ఉన్నాయి.

వెనక్కి తిరిగిన చల్లపరెడ్డికి దూరంగా చనిపోయిన వీరరాఘవులుగారిల్లు కనిపించింది. భారంగా అడుగులో అడుగు వేసుకుంటూ నిదానంగా ఆ ఇంటి దగ్గరకువెళ్లి నుంచున్నాడు. చీకట్లో ఆ ఇంటిని అలా చూస్తుంటే చల్లపరెడ్డికి ఏదో తెలియని దిగులు కలిగింది. ఆ ఇల్లు కేవలం జ్ఞాపకాలతో జీవిస్తున్న ముసలివాడు చీకట్లో ముణుక్కుని కూర్చున్నట్లు ప్రశాంతంగా ఉంది. పేడతో అలికిన వదిలేసిన వాకిలి, గోడ పక్కన ఎత్తైన రోలు, గోడకు ఆనించిన పాత మంచానికి నులకతాళ్లు ఊడొస్తున్నాయి.  ఇంకాస్త ముందుకెళ్లి వసారాలోకి తొంగిచూసాడు చల్లపరెడ్డి. ఇంతకు ముందులా ఎక్కడి వస్తువులక్కడ లేక కొత్తగా సర్దినట్లుంది.  మసక వెలుతురులో చెక్క కుర్చీ, బల్ల కనిసిస్తాయేమోనని చూడబోయి ‘అయినా ఎనకటిమాదిరి ఇప్పుడెందుకుంటాదీ’ అనుకుని వెనక్కితిరిగాడు.  కొంతసేపు చల్లపరెడ్డి రాఘవులుగారి ఉన్న నాటికీ, ఆయన లేని నాటికీ పోల్చి చూసుకున్నాడు. ఆ  కాలాల మధ్య అక్కడ పరిసరాలలో వచ్చిన మార్పు అతడిలో దిగులును ప్రవేశపెట్టింది.  

ఎవురాడ ? అన్న మాటతో చల్లపరెడ్డి అక్కడే నుంచుండిపోయాడు.చల్లపరెడ్డి మాట్లాడబోయేంతలోనే అవతలినుంచి ‘‘నువ్వా రెడ్డి.. ఇయ్యాలప్పుడేంది?’’ అన్నాడు ఏడుకొండలు మంచం మీంచి లేచి  కూర్చుని. నిద్దర్రాక రోడ్డుదాకా పోయోస్తన్నాలే... నువ్వు  పొణుకో కొండలా’’ అన్నాడు చల్లపరెడ్డి.మళ్లీ వెనక్కు వచ్చి మళ్లీ అరుగుమీద కూర్చుని చుట్ట ముట్టించాడు.  ఊళ్లోకి వెళ్లిన రామదాసు ఇంకా తిరిగి రాలేదు. వచ్చి ఇంట్లోకెళ్లి పడుకున్నాడేమో కూడా తెలీదు. సాధారణంగా బయటికి వెళ్తే తొందరగా ఇంటికి రాడు.  వేళకాని వేళల్లో ఊరుదాటి గుళ్లకమ్మలో ఈత కొడతాడు. రాత్రుళ్లు సారాకొట్లంబడి తిరుగుతుంటాడు. లేకుంటే హైవే వంతెన దగ్గర నుంచుని లారీవాళ్లతో మాట్లాడుతూ కూర్చుంటాడు. ఎక్కడెక్కడో తిరిగి ఏ తెల్లవారుజామునో ఇంటికి వస్తాడు.వింత మనిషి’’ అనుకున్నాడు చల్లపరెడ్డి.  

కొద్ది దూరంలో మోకాళ్లమీద తలపెట్టుకుని కూర్చున్న కుక్క  తల ఒకవైపుకి పెట్టి చూపుమాత్రం చల్లపరెడ్డి మీద ఉంచింది. చేతిలో చుట్ట మరి రెండు దమ్ములు పీల్చాక ఇక తాగాలనిపించలేదు. చీకట్లోకి పారేసి వాకిలి గుమ్మం నుంచి లోపలికి నడిచి మళ్లీ మంచంమీదకు వాలాడు.‘‘మల్లీ యాడికిబొయ్యా.. నిద్దర్రావట్లా? అని నేలమీద ముసలమ్మ మళ్లీ కదిలింది.‘‘రోడ్డుమీదకు పోయోచ్చాలే’’ అన్నాడు. రోడ్డుమీద మనిషి వెళ్లిన అలికిడి. కుక్క అరవలేదు. కొత్తవారు కాదు. రామదాసు కావచ్చు.  ఇంతకీ రామదాసు తనకి వీరరాఘవులు గురించి ఎందుకు చెప్పినట్టు? చెబుతున్నప్పుడు తనవంక అదోలా చూసాడు. 
దానికర్థం ఏమైఉంటుంది?’

నారాయణమ్మగారు గుర్తుకొచ్చారు. నేలమీద పడుకున్న  భార్యని చూసాడు.పంచలో స్విచ్‌బోర్డు పైనున్న బెడ్‌లాంపు వెలుతురు వరండాలో  గోడలమీద మసకమసగ్గా పడుతూ ఉంది. గోడకి ఒకవారగా కట్టిన దండెం మీద పేర్చిన నలిగిన బట్టలు బరువుగా వేలాడుతున్నాయి.  వేలాడే పాత కేలండరు, నేలమీద దుప్పటి మడతల్లో పడుకున్న ముసలమ్మ... చల్లపరెడ్డికి వీర్రాఘవగారిల్లు తలపుకు వచ్చింది. పగలంతా చెక్క కూర్చీలో ఎడమచేయి మడుచుకుని కూర్చున్న వీర్రాఘవులు... చనిపోయిన వీర్రాఘవులు...తనుకూడా వీర్రాఘవుల్లా చనిపోతాడేమో... కాసేపు తనులేని ఇల్లు ఊహించుకున్నాడు. చల్లపరెడ్డి. తనులేని ఇంట్లో తనే అటూ ఇటూ తిరిగాడు. ఈ కుర్చీ ఇక్కడుండదు. ఈ మంచం మూలపడుతుంది. ..ఈ కండువా.. ఈ బట్టలు ఇక్కడుండవు..‘ఈ నిశ్శబ్దం ఇలానే ఉంటుంది. ముసలమ్మ ఇక్కడే  ఇలానే పడుకుంటుంది. ఒకటే తేడా. ఇక్కడ తనొక్కడే ఉండడు...!! ఉలిక్కి పడ్డాడు చల్లపరెడ్డి. 

రామదాసు ఇదంతా ముందే ఊహించాడా...! అందుకే వీర్రఘవులు కథ చెప్పాడా? అందుకే తనవంక అలా చూసాడా..? జరగబోతున్నది ముందే కనిపెట్టేశాడా..? వీరరాఘవులు పేరుమీద తనకు జరగబోయేది చెప్పేశాడా? రామదాసు తెలివైనవాడు. దేశంలో వాడు తిరగని చోటులేదు.  వాడికి లోకజ్ఞానం తెలుసు. వాడు జరగబోయేది కనిపెడతాడు. వాడికి తెలవనిదంటూ ఏమీలేదు...! రోడ్డవతల తుంగచెరువులో కప్పల బెకబెకల కచేరీ ఇప్పట్లే అయ్యేటట్లులేదు. ఇంటిముందు ఊరికే ఇటూ అటూ మెసిలి విసిగించే వీథికుక్క జాడలేదు. ఆలోచిస్తూ ఆలోచిస్తూ చల్లపరెడ్డి చివరికి నిద్రలోకి జారుకున్నాడు. ఎదురుచూసి ఎదురుచూసి జారుకున్న గాఢనిద్రలో అతడు పడుకున్న భంగిమ వింతగా ఉంది. రాత్రివరకు కననపడని గడ్డం తెల్లారేసరికి మెరిసింది.ఎప్పుడు తెల్లారిందో తెలీదు. కళ్లలోకి చురుక్కుమని ఎండతగలడంతో చల్లపరెడ్డికి మెలకువ వచ్చింది. ఎండ వచ్చి చాలాసేపయింది. అప్పటికే ఇరుగుపొరుగు ఆడంగులు పనుల్లోపడ్డారు. కర్ర చేతిలోకి తీసుకుని లేచి వసారాలోకి నడిచాడు. నేలమీద పడుకున్న భార్య ఇంకా నిద్రలేవలేదు. 

 ప్రతిరోజూ ఆమే ముందులేచి తరువాత అతడిని నిద్రలేపుతుంది. ఈపాటికి ఇంటిపని సగం పూర్తయివుంటుంది.పెరట్లో గడ్డివాము దగ్గర కోళ్లు తిరుగుతూ ఉన్నాయి. పక్కింటి ఆడమనిషి అప్పటికే పేడకళాపు చల్లేసింది. వాకిలి గుమ్మం అవతల రోడ్డుమీద అటూ ఇటూ తిరిగేవాళ్ల హడావుడి ఎప్పుడో మొదలయింది.చల్లపరెడ్డి వసారాలోకి నడుస్తూ నీకింకా తెల్లార్లా... లేలే..ఏయ్‌’ అని భార్యని అదిలించాడు. నేలమీద దుప్పటిని తప్పించబోయిన అతడి చేతికర్ర పొరపాట్న గురితప్పి మంచినీళ్ల చెంబుని తాకింది. చెంబు పక్కకి దొర్లింది. మంచినీళ్లు కిందపడ్డాయి. అయినా ముసల్ది లేవలేదు. తెల్లటి ఆమెజుట్టు ముఖానికిరు వైపులా చెదిరిపోయి ఉంది. ఆమె కళ్లు తెరవలేదు. పై పలువరుస కొద్దిగా బయటకివచ్చి చూడటానికి నవ్వుతున్నట్లుగా ఉంది. ఆమెనలాచూసి నివ్వెర పోయి అలానే నుంచుండిపోయాడు చల్లపరెడ్డి.అతడి చుట్టూ ఉన్న పరిసరాల్లో ఏది ఎక్కడ ఎలా ఉండాలో అంతా అలానే యథాతధంగా ఉంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top